రజనీ ఎంట్రీపై అమిత్ షా ఆసక్తికర కామెంట్..!
తమిళనాడులో గత పదిరోజులుగా సాగుతున్న హైటెన్షన్ రాజకీయ డ్రామాకు తెరపడిన సంగతి తెలిసిందే. శశికళ వర్గానికి చెందిన పళనిస్వామితో గవర్నర్ విద్యాసాగర్‌రావు ప్రమాణం చేయించడంతో ప్రస్తుతానికి సంక్షోభం ముగిసింది. అయితే, తమిళనాడులో ఇప్పటికీ కొంత రాజకీయ అనిశ్చితి, శూన్యత నెలకొంది. ఇదే అదనుగా భావిస్తున్న బీజేపీ తమిళనాట పట్టు సాధించేందుకు తెరవెనుక ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇందులోభాగంగానే పన్నీర్ సెల్వానికి అండగా ఉంటూ.. శశికళకు వ్యతిరేకంగా బీజేపీ రాజకీయ చదరంగానికి తెరలేపిందన్న ఆరోపణలు లేకపోలేదు. అయితే, తాజాగా తమిళ రాజకీయాలపై పెదవి విప్పిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. పన్నీర్ సెల్వం వెనుక బీజేపీ ఉన్నదన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.
'తమిళనాడుకు సంబంధించినంతవరకు మాకు ఎలాంటి పాత్ర లేదు. ఇది అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారం. తమిళనాడులో అస్థిరత ఉందని నేను అనుకోవడం లేదు. పన్నీర్ సెల్వం వ్యవహారంతో బీజేపీకి సంబంధం లేదు' అని అమిత్ షా 'ఇండియాటుడే'తో పేర్కొన్నారు. తమిళనాట పట్టు కోసం సూపర్ స్టార్ రజనీకాంత్‌ను బీజేపీ బరిలోకి దింపే అవకాశముందా?, బీజేపీ ప్రోద్బలంతో ఆయన పార్టీ పెట్టబోతున్నారా? అని ప్రశ్నించగా.. 'మీరు హెడ్‌లైన్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ అవకాశం నేను ఇవ్వను. ఏం జరగనుందో వేచిచూడండి.. వెయిట్ అండ్ వాచ్' అంటూ ఆయన వ్యాఖ్యానించారు.