యంగ్ టైగర్ ముఖ్యమంత్రి అట?
అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తున్న ప్రముఖ సెర్చి ఇంజీన్ దిగ్గజం గూగుల్ మరోసారి తప్పులో కాలేసింది. టాలీవుడ్ హీర్ నందమూరి నటవారసుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేసింది. అవును..గూగుల్ ట్రాన్స్‌లేట్ ఆప్షన్ లో తారక్ (Tarak) అని టైప్ చేసినపుడు ముఖ్యమంత్రి అని తర్జుమా చేస్తోంది. దీంతో తెలుగు సినీలోకం గర్వించ దగ్గ నటుడు, మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు సినీ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న జూ. ఎన్టీఆర్ ఇపుడు ముఖ్యమంత్రిగా అవతరించారు.
వివిధ భాషలకు సంబంధించిన అర్ధాలను తెలుసుకోవడానికి ఉపయోగించే ఈ టూల్ తమ అభిమాన నటుడి పేరుకి ముఖ్యమంత్రి అర్థాన్ని చెబుతుడడంతో ఫ్యాన్స్ ఒకింత ఆశ్చర్యంతో పాటూ...మరింత సంతోషానికి లోనవుతున్నారట. తాత సినీ వారసత్వాన్ని అందిపుచ్చుకొన్న యంగ్ హీరో ఆయన రాజకీయ వారసత్వాన్ని కూడా అందుకోనున్నాడంటూ వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి తిరుగులేదని... గూగుల్ నిజం చేసిందంటూ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారట!
అయితే గూగుల్ ట్రాన్స్లేట్ పై గతంలో కూడా విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో లీగల్ నోటీసులు కూడా జారీ అయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రాంతీయ భాషలపై పట్టులేకపోవడం వలనే ఇది జరిగిందని, ఒక్క 'తారక్' విషయంలోనే కాదు, అనేక పదాల అనువాదం విషయంలోనూ నెటిజన్లు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయంటూ భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఏదైమైనా 'తారక్' అనే పదానికి 'ముఖ్యమంత్రి' అని తర్జుమా చేయడం విశేషమే. మరి దీనిపై గూగుల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
కాగా జూ. ఎన్టీఆర్ ని అభిమానుల ముద్దుగా తారక్ అని పిలుచుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న జనతా గ్యారేజ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. సెప్టెంబర్ 2న విడుదల కానున్న ఈ చిత్రంలో మోహన్ లాల్, సమంత, నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.