
చెన్నై: ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం,బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మధ్య తారా స్థాయికి చేరిన త్రీభాషా సూత్రం వివాదంపై ప్రముఖ హీరో, తమిళగ వెట్రి కళగం (టీవీకే)అధినేత విజయ్ విమర్శలు గుప్పించారు. తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదాన్ని చిన్న పిల్లల కొట్లాటతో పోల్చారు.
వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో అత్యధిక అసెంబ్లీ స్థానాల్ని కైవసం చేసుకునే దిశగా, వీలైతే అధికారంలోకి వచ్చేలా టీవీకే అధ్యక్షుడు విజయ్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం టీవీకే తొలి వార్షికోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా విజయ్ జాతీయ విద్యావిధానం – 2020 (NEP-2020) పై మాట్లాడారు. త్రిభాషా సూత్రం ప్రకారం.. రాష్ట్రాలు తప్పనిసరిగా త్రిభాషా (హిందీ, ఇంగ్లిష్, ప్రాంతీయ భాష) సూత్రాన్ని అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానం అమలు చేయకపోతే కేంద్రం రాష్ట్రాలకు నిధులు కేటాయించమని కేంద్రం ప్రకటించిందంటూ వస్తోన్న ఆరోపణలపై నవ్వారు. త్రిభాషను అమలు చేయాలని కేంద్రం అనడం.. హిందీ కారణంగానే ఉత్తరాదిలో ప్రాంతీయ భాషల పరిధి తగ్గుతుందని, దాన్ని అమలు చేయబోమని డీఎంకే అనడం ఎల్‌కేజీ, యూకేజీ పిల్లల గొడవలా ఉందని వ్యాఖ్యానించారు.
త్రిభాషా సూత్రంపై సోషల్ మీడియాలో డీఎంకే, బీజేపీ చేస్తున్నక్యాంపెయిన్‌ను తప్పుబట్టారు. వీళ్లు సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్‌తో కుటిల రాజకీయం చేస్తున్నారు. ఒకరు డ్యాన్స్ చేస్తుంటే.. మరొకరు పాటపాడుతున్నారు. వీళ్లిద్దరి గొడవ ఎల్‌కేజీ, యూకేజీ పిల్లల కొట్లాటలా ఉంది. సోషల్ మీడియాలో పోరాటం చేస్తూ మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి బ్రో .. ఇది.. చాలా తప్పు బ్రో అని ఎద్దేవా చేశారు.
అదే సమయంలో త్రిభాషా విధానాన్ని విజయ్ వ్యతిరేకించారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. తాము అన్ని భాషలను గౌరవిస్తామని, తమిళనాడు భాషా విధానాన్ని భంగపరిచే ఉద్దేశ్యంతో రాజకీయంగా ఏ భాషనైనా బలవంతంగా రుద్దేందుకు యత్నిస్తే మాత్రం వ్యతిరేకిస్తామన్నారు. త్రిభాష సూత్రం అమలును అంగీకరించకపోతే.. తమిళనాడుకు రావాల్సిన 2 వేల400 కోట్ల నిధులను కేంద్రం నిలిపివేస్తామనడం సరికాదన్నారు. కేంద్రం నుంచి ఆ నిధులను పొందడం తమ హక్కు అని ఆయన అన్నారు.
రెండు పార్టీలపై సెటైర్లు వేస్తూ బీజేపీ,డీఎంకేలు.. అవి ఫాసిజం, పాయసం లాంటివి.. వాళ్లు ఫాసిజం, ఫాసిజం, ఫాసిజం అని మాట్లాడుతారు. అవి ఏంటి? పాయసమా? అంటూ సెటైర్లు వేశారు విజయ్.
Comments
Please login to add a commentAdd a comment