గూడూరు టౌన్ : రాష్ర్ట ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పాఠశాలల్లో వసతులు కల్పిస్తోంది. చదువుతో పాటు యూనిఫాం, పుస్తకాలు అందజేయడంతో పాటు భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకు భిన్నంగా ప్రైవేట్ పాఠశాలల్లో ఉంటోంది. అరకొర వసతులతో పాటు నైపుణ్యంలేని ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలల్లో బోధిస్తున్నారు. అయినప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లోనే చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీనికి కారణం ప్రభుత్వ ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేయకపోవడమే కారణమని పలువురు విమర్శిస్తున్నారు. తమ పిల్లలను ప్రయోజకులు చేయాలనే ఆకాంక్షను ఆసరాగా తీసుకున్న కార్పొరేట్ పాఠశాలలు ప్రత్యేకంగా పీఆర్‌ఓలను నియమించుకుని వారితో పాటు సిబ్బందిని ఇంటింటికి పంపుతున్నాయి. ‘మీ పిల్లలను మా పాఠశాలలో చేర్పించి తే మంచి భవిష్యత్ ఉంటుంది’ అని వారి తో తల్లిదండ్రులకు చెబుతూ ఒప్పిస్తూ పాఠశాలలో చేర్చుకుంటున్నారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు పోటీ పడకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కార్ బళ్లలో చేర్పిం చేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కాని అన్ని వసతులు ఉన్న ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అనే విషయాన్ని అనేక ఫలితాలు నిరూపిస్తున్నాయి.
ఉపాధ్యాయుల్లో సంకల్పం ఉంటే...
ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో సంకల్పం ఉంటే పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించుకోవడం పెద్ద కష్టం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమాజంలో ఉపాధ్యాయులకు గౌరవ మర్యాదలతో పాటు వారి మాటలకు విలువ ఇస్తారు. వీరు తల్లిదండ్రులతో మాట్లాడితే వారి పిల్లలను కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులున్నాయని అధికారులు, ఉపధ్యాయులు చెప్తున్నారే తప్ప ఆచరణలో మాత్రం ఎక్కువ మంది ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారు.
దీంతో సామాన్యులు కూడా అదే బాట పడుతున్నారు. ఉపాధ్యాయులే ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తుంటే ఇక తమ పిల్లలను ఆ పాఠశాలల్లో ఎలా చదివించాలని పలువురు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. గురువారం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. విద్యాశాఖాధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇప్పటికైనా విద్యార్థుల చేరికపై ప్రత్యేక దృష్టి సారించకపోతే ఈ ఏడాది కూడా మరిన్ని పాఠశాలలు మూతపడే అవకాశాలు ఉన్నాయి.
ప్రభుత్వ పాఠశాలలే ముద్దు
Published Thu, Jun 12 2014 2:55 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement