చిన్న చిన్న డబ్బాల్లా స్కూళ్లు
► నారాయణ, చైతన్య స్కూళ్లే నిదర్శనం
► ఆత్మహత్యలకు వ్యాయామ విద్య లేకపోవడమే కారణం
► అరగంట సమయం ఇస్తే నిరూపిస్తా
► అసెంబ్లీలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ చాలెంజ్
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : ‘కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలలు చిన్న చిన్న డబ్బాలాంటి అపార్ట్‌మెంట్స్‌లో నిర్వహిస్తున్నారు. వ్యాయామ విద్యకు ప్రాధాన్యత ఇవ్వకపోవటంతో వి ద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అదే విధం గా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అరగంట సమయం ఇస్తే ఆధారాలతో నిరూపిస్తా. సీఎం చంద్రబాబు సొంత నియోజక వర్గం కుప్పంలోనే 40 పాఠశాలల ఫొటోలను సైతం తెప్పిస్తా’ అని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ సవాల్ చేశారు. అసెం బ్లీలో సోమవారం ఇంటర్మీడియట్ విద్యా సవరణ బిల్లుపై చర్చ జరిగింది.
ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌యాదవ్ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. నారాయణ, చైతన్య విద్యాసంస్థల నిర్వహణపై విరుచుకుపడ్డారు. ఇంటర్‌తో పాటు ప్రైవేటు స్కూళ్ల నిర్వహణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అన్ని పాఠశాలలకు మైదానాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని పాఠశాలలు చిన్న చిన్న బిల్డింగ్‌లలో విద్యార్థులను పెట్టి ఒత్తిడికి గురిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారనే మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి మాటలను తప్పుబట్టారు. ముఖ్యమంత్రి 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిద్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలు ఎంత అధ్వానంగా ఉన్నాయో పరిశీలించాలని డిమాండ్ చేశారు.
రెండు రోజుల క్రితం మంత్రి నారాయణ నెల్లూరులో ఓ స్కూలును విజిట్ చేశారని, అక్కడ ఓ విద్యార్థిని బేసిక్స్ లేకుండా కార్పొరేట్ విద్యను ఎలా అందిస్తామని మంత్రిని ప్రశ్నించారని గుర్తుచేశారు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ పాఠశాలల్లో వసతులకల్పనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.