కార్పొరేట్‌ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలకు ముకుతాడు | AP Govt issued new GO revising the past Government GOs | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలకు ముకుతాడు

Published Thu, May 28 2020 4:00 AM | Last Updated on Thu, May 28 2020 4:00 AM

AP Govt issued new GO revising the past Government GOs - Sakshi

సాక్షి, అమరావతి: అనుమతులకు భిన్నంగా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్, ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీల అక్రమాలకు ఇక అడ్డుకట్ట పడనుంది. ఈ మేరకు ప్రభుత్వం కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యను పరిమితం చేయడంతో పాటు తగిన సదుపాయాలు ఉంటేనే అనుమతులు ఇచ్చేలా కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. అడ్మిషన్లను ఆన్‌లైన్‌లో నిర్వహించడం, ఫీజుల నియంత్రణ వంటి అనేక సంస్కరణలకు చర్యలు చేపట్టింది. అలాగే ప్రైవేట్‌ కార్పొరేట్‌ స్కూళ్లూ నిబంధనల ప్రకారం నడిచేలా చర్యలు తీసుకుంటోంది. మరోపక్క జూనియర్‌ కాలేజీల్లో అడ్మిషన్లను కూడా ఆన్‌లైన్లో ఇంటర్‌బోర్డు నిర్వహించేలా చర్యలు చేపడుతోంది. దీంతో కాలేజీల అడ్డగోలు అడ్మిషన్లకు అడ్డుకట్ట పడుతుంది.

ఒక్కో సెక్షన్లో 40 మందికి మాత్రమే
జూనియర్‌ కాలేజీల్లో ప్రతి సెక్షన్లో 40 మందినే పరిమితం చేస్తూ ప్రభుత్వం ఈ నెల 13న జీఓ 23ను విడుదల చేసింది. గతంలోని జీఓలను సవరిస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ ఈ ఉత్తర్వులను విడుదల చేశారు. దీని ప్రకారం కాలేజీలో సెక్షన్‌కు 40 మంది చొప్పున కనిష్టంగా 4, సదుపాయాలను అనుసరించి గరిష్టంగా 9 సెక్షన్లకు అనుమతిస్తారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా 2002 మే 13న జీఓ 12ని విడుదల చేసి ప్రతి సెక్షన్లో 88 మందిని చేర్చుకోవచ్చని అనుమతులిచ్చారు. దీంతో అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో సెక్షన్ల వారీగా విద్యార్థుల సంఖ్యను పరిమితం చేస్తూ పాత జీఓను సవరించి ప్రభుత్వం తాజాగా జీఓను విడుదల చేసింది. మాధ్యమిక శిక్షా అభియాన్, సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) నిబంధనల ప్రకారం కూడా తరగతికి 40 మంది మాత్రమే ఉండాలన్న నిబంధనల ప్రకారం ఈ మార్పులు చేపట్టింది.

– ప్రతి ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీకి సెక్షన్‌కు 40 మంది చొప్పున 4 సెక్షన్లను మంజూరు చేస్తారు. కనిష్టంగా 160 మంది విద్యార్థుల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది.
– భవనాలు, ఫ్యాకల్టీ, తరగతి గదులు, ల్యాబ్‌లు, ఇతర వసతి సదుపాయాలన్నీ కల్పిస్తే గరిష్టంగా సెక్షన్‌కు 40 మంది చొప్పున 9 సెక్షన్లకు అనుమతిస్తారు. 
– ఎంపీసీ, బైపీసీ మాత్రమే కాకుండా ఇక నుంచి తప్పనిసరిగా కామర్స్, ఆర్ట్స్‌ అండ్‌ హ్యూమానిటీస్‌ కోర్సులు కూడా నిర్వహించాలి. 
– నిబంధనల ప్రకారం అన్ని సదుపాయాలూ ఉంటేనే ఆన్‌లైన్‌ అనుమతి
– ఇప్పటికే దీనిపై బోర్డు నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసి దరఖాస్తులను ఆన్‌లైన్లో అందించాలని స్పష్టం చేసింది.
– ఇప్పటివరకు పలు కార్పొరేట్‌ జూనియర్‌ కాలేజీలు తమ ఇష్టానుసారం విద్యార్థులనుచేర్చుకోవడం, విద్యార్థులకు సరిపడ తరగతి గదులు లేకుండా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా లేకుండానే కొనసాగుతూ వచ్చాయి. ఇకనుంచి వీటికి కళ్లెం పడనుంది.
–నిబంధనల ప్రకారం అన్ని సదుపాయాలూ ఉంటేనే అన్‌లైన్‌ అనుమతి
– రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ కోర్సులు నిర్వహించే కాలేజీల యాజమాన్యాలు తప్పనిసరిగా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలన్నిటినీ పాటించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అప్పుడే వాటికి ఇంటర్మీడియెట్‌బోర్డు 2020–21  అనుమతులు మంజూరు చేయనుంది. ఇప్పటికే దీనిపై బోర్డు సవివరమైన నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసి దరఖాస్తులను ఆన్‌లైన్లో సమర్పించాలని కాలేజీలకు సూచించింది. కాలేజీల ఏర్పాటు, అదనపు సెక్షన్లను నెలకొల్పడానికి ఉండాల్సిన సదుపాయాల గురించి స్పష్టంచేసింది. అందుకు సంబంధించిన అధికారిక డాక్యుమెంట్లను కూడా ఆన్‌లైన్లో అప్‌లోడ్‌ చేయాలి.

ఈ సదుపాయాలుండాల్సిందే:
– ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారం ‘హెచ్‌టీటీపీఎస్‌://బీఐఈ.ఏపీ.జీఓఈ.ఐఎన్‌’లో పొందుపరిచిన ఇంటర్మీడియెట్‌బోర్డు దరఖాస్తుతో పాటు సదుపాయాలపై సంబంధిత డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాలని స్పష్టంచేసింది.
– కాలేజీ భవనం, తరగతి గదులు, ల్యాబ్‌లు, లైబ్రరీ, ఆటస్థలం తదితరాల ఫొటో ఇమేజ్‌లను జియో ట్యాగింగ్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయాలి.
–  బోర్డు వాటన్నిటినీ పరిశీలించనుంది. వీటిని ప్రజలకు తెలిసేలా పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచుతుంది. సదుపాయాలు లేనట్లుగా గుర్తిస్తే చర్యలు తీసుకుంటుంది.
– అదనపు సెక్షన్లకు వీలుగా ఆర్‌సీసీ భవన వసతి, అదనపు తరగతులకు గదులు ఉండాల్సిందే.
– భవనపు రిజిస్టర్డ్‌ లీజ్‌ డీడ్, సొంత భవనమైతే సంబంధిత రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లు, ఆటస్థలం కూడా ఉండాలి.
– అనుమతి ఉన్న భవన నిర్మాణ ప్లాన్, ఫైర్‌ సేఫ్టీ సర్టిఫికేట్, శానిటరీ, స్ట్రక్చరల్‌ సౌండ్‌నెస్‌ సర్టిఫికేట్‌లతో పాటు సంబంధిత అధికారవర్గాల నిరభ్యంతర పత్రాలను కాలేజీలు బోర్డు పరిశీలనకు సమర్పించాల్సి ఉంటుంది.
– పార్కింగ్‌ స్థలం, బోధన, బోధనేతర సిబ్బంది వివరాలు, వారి అర్హతలకు సంబంధించిన వివరాలనూ సమర్పించాలి
– బోర్డునుంచి ఎలాంటి అనుమతి లేకుండా యాజమాన్యాలు కొత్తగా ఎలాంటి సెక్షన్లను తెరిచేందుకు వీలులేకుండా చర్యలు చేపట్టారు.

అడ్డగోలు ఫీజులకూ అడ్డుకట్ట:
ప్రైవేట్‌ కాలేజీలు సాగిస్తున్న ఫీజుల దందాలకు కూడా ప్రభుత్వం అడ్డుకట్ట వేయనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జస్టిస్‌ ఆర్‌.కాంతారావు నేతృత్వంలోని ఈ కమిషన్‌ పాఠశాల విద్యలో ప్రమాణాల పెంపుతోపాటు, పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో నిబంధనల మేరకు సదుపాయాలుండేలా చర్యలు చేపట్టింది. స్కూళ్లు నిర్ణీత ఫీజులు మాత్రమే వసూలు చేసేలా కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకు సంబంధించి మంగళవారం నోటిఫికేషన్‌ కూడా ఇచ్చింది. 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఫీజులను నిర్ధారించనుంది. ఇందుకోసం యాజమాన్యాలు తప్పనిసరిగా తమ వివరాలను కమిషన్‌కు సమర్పించాలి. లేకపోతే ఆ సంస్థలకు ఫీజు వసూలుకు అనుమతి ఉండదు.

– అన్ని ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు ఫీజుల ప్రతిపాదనలకు సంబంధించిన సమాచారాన్ని కమిషన్‌ వెబ్‌సైట్‌‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎస్‌ఈఆర్‌ఎంసీ.ఏపీ.జీఓవీ.ఐఎన్‌’ కు ఆన్‌లైన్‌ ద్వారా నిర్ణీత ఫార్మాట్లో షెడ్యూళ్లలో సమర్పించాలి. ఇందుకు జూన్‌ 9 వరకు గడువిచ్చారు. యాజమాన్యాల ప్రతిపాదనలు, ఇతర వివరాల ఆధారంగా ఫీజులను నిర్ణయిస్తారు. 
–మొదటి త్రైమాసికానికి సంబంధించిన ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలి.
– అధిక ఫీజులు వసూలు చేసినా, కాలేజీలు, స్కూళ్లు తెరవకుండానే ఫీజులు వసూలు చేసినా చర్యలు తప్పవు.
– ప్రతి ప్రయివేటు అన్‌ ఎయిడెడ్‌ స్కూలు, కాలేజీ తమ సంస్థల భవనాలు, తరగతి గదులు, ల్యాబ్‌లు ఇతర సదుపాయాలను జియో ట్యాగింగ్‌ యాప్‌ ద్వారా కమిషన్‌ వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయాలి.
– కాలేజీ, పాఠశాల గుర్తింపు వివరాలు, సెక్షన్లు , బిల్డింగ్‌ వివరాలు , గత ఏడాది ఫీజుల వివరాలు , ఉద్యోగుల వివరాలు , కిచెన్‌ హాస్టల్‌ వివరాలు, వచ్చిన ఫీజులు. ఖర్చుల వివరాలు , ఇతర డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేసేలా నిబంధనలు విధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement