14 వేల మంది అధ్యాపకులు.. 60 లక్షల పేపర్లు. | Evaluation of intermediate answer sheets to begin today | Sakshi
Sakshi News home page

14 వేల మంది అధ్యాపకులు.. 60 లక్షల పేపర్లు.

Published Sat, Mar 22 2025 5:51 AM | Last Updated on Sat, Mar 22 2025 5:51 AM

Evaluation of intermediate answer sheets to begin today

నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్‌ సమాధాన పత్రాల మూల్యాంకనం 

19 స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ కేంద్రాలు  

నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు 

ఏప్రిల్‌ చివరి వారంలో కంప్యూటరీకరణ.. మే మొదటి వారంలో ఫలితాలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ విద్యార్థుల భవితవ్యం తేల్చే.. జవాబుపత్రాల మూల్యాంకనం శనివారం నుంచి ప్రారంభమవుతోంది. దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ ప్రక్రియ కోసం ఇంటర్‌బోర్డు పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. క్షుణ్నంగా, ఎలాంటి లోపాలు లేకుండా, పలు స్థాయిల్లో పరిశీలనతో మూల్యాంకనం ప్రక్రియ చేపట్టనున్నారు. మార్కుల వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన తర్వాత ఫలితాలను విడుదల చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు.. సుమారు 60 లక్షల జవాబుపత్రాలను దిద్దాల్సి ఉంటుందని వెల్లడించారు. 

మూల్యాంకనంలో వివిధ స్థాయిలు.. 
సమాధాన పత్రాలను అనేక స్థాయిల్లో పరిశీలిస్తారు. తర్వాతే మార్కులను ఖరారు చేస్తారు. రోజు కు ఒక్కో అధ్యాపకుడు 40 సమాధాన పత్రాలను మాత్రమే మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. వారిని అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌ అంటారు. పరీక్షలో ఇచి్చన ప్రశ్నలకు తగిన     సమాధానాలను నిపుణులు మూల్యాంకన ప్రక్రియ కోసం పంపుతారు. వీటి ఆధారంగా అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌ జవాబుపత్రాలను పరిశీలించి మార్కులు వేస్తారు. కొన్ని పరిమితుల మేరకు విచక్షణాధికారంతో మార్కులు వేయవచ్చు. 

తర్వాత ఆ జవాబుపత్రం చీఫ్‌ ఎగ్జామినర్‌కు వెళ్తుంది. వారు మార్కులను, మూల్యాంకన తీరును పరిశీలిస్తారు. తర్వాతి దశలో జవాబుపత్రం సబ్జెక్టు నిపుణుల వద్దకు వెళ్తుంది. ఎక్కడైనా పొరపాటు ఉంటే నిపుణులు సరిచేస్తారు. ప్రతీ ప్రక్రియ, ప్రతీ మార్పును చీఫ్‌ ఎగ్జామినర్‌ రికార్డు చేస్తారు. ఇన్ని దశలు దాటిన తర్వాత మార్కులు బోర్డుకు చేరతాయి. మూల్యాంకన సమయంలో ఇచ్చిన కోడ్‌ను ఇంటర్‌ బోర్డ్‌లో డీకోడ్‌ చేస్తారు. 

ఆ విద్యార్థి మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తా రు. సాఫ్ట్‌వేర్‌పై ట్రయల్‌ రన్‌ కూడా చేస్తారు. కొందరు విద్యార్థుల మార్కులను నమోదు చేసి, సాంకేతిక లోపాలేమైనా ఉన్నాయా? అని మానవ వనరుల ద్వారా పరిశీలిస్తారు. ఇలా 4 రౌండ్లు ట్రయల్‌ జరుపుతారు. ఎలాంటి సమస్య లేనిపక్షంలో తుది దశ ఫలితాలను పొందుపరుస్తారు. 

నెలరోజులపాటు మూల్యాంకనం.. 
ఇంటర్‌ సమాధాన పత్రాల మూల్యాంకనం శనివారం మొదలై సుమారు నెల రోజుల పాటు కొనసాగుతుంది. మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని ఇంటర్‌ బోర్డ్‌ అధికారులు తెలిపారు. మూల్యాంకనం ప్రక్రియను ఈసారి ఆధునిక పద్ధతుల్లో చేపట్టబోతున్నారు. హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డ్‌ కార్యాలయానికి ప్రతీ కేంద్రాన్ని అనుసంధానం చేస్తున్నారు. 

ఈసారి ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. మూల్యాంకనం చేసే అధ్యాపకులు ఏ సమయంలో వస్తున్నారు? ఎప్పుడు కేంద్రం నుంచి వెళ్తున్నారనే వివరాలను రికార్డు చేస్తారు. ఎలాంటి ఆరోపణలు, ఫిర్యాదులు లేని అధ్యాపకులనే మూల్యాంకనం కోసం ఎంపిక చేయాలని జిల్లా అధికారులకు బోర్డ్‌ ఆదేశాలిచ్చింది.

మొత్తం60 లక్షల పేపర్లు 
ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 9,96,971 మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాశారు. వీరందరి అన్ని సబ్జెక్టులు కలిపి సుమారు 60 లక్షల సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాల్సిఉంది. ఈ ప్రక్రియ కోసం 14 వేల మంది లెక్చరర్లను ఎంపిక చేశారు.

శాస్త్రీయ విధానంలో మూల్యాంకనం 
స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ జరిగే19 కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. ఈసారి బయోమెట్రిక్‌ హాజరు అమలు చేస్తున్నాం. మరింత శాస్త్రీయ పద్ధతిలో ఈసారి మూల్యాంకనం ఉండబోతోంది. ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – జయప్రద బాయి, ఇంటర్‌ పరీక్షల విభాగం ముఖ్య అధికారి   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement