
గురుకుల కాలేజీల్లో గందరగోళంగా ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ
ప్రవేశ పరీక్ష రద్దు చేసి టెన్త్ పాసైన వారికి నేరుగా అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయం
ఎంపీసీ, బైపీసీ కోర్సులవైపు ఎక్కువమంది ఆసక్తి
డిమాండ్‌తో సీట్ల పరిమితి దాటినా.. కాలేజీలో విద్యార్థి కోరుకున్న కోర్సులేకున్నా కేటాయింపు కష్టమే
కేటాయింపులపై దిక్కుతోచక అయోమయంలో ప్రిన్సిపాల్స్
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ అధ్యాపకులకు తలనొప్పిగా మారుతోంది. 2025–26 విద్యా సంవత్సరం నుంచి గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు అర్హత పరీక్షలను గురుకుల విద్యాసంస్థల సొసైటీలు రద్దు చేశాయి. గురుకుల పాఠశాలలో పదోతరగతి చదివి ఉత్తీర్ణత సాధించిన వారికి నేరుగా ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుత విద్యా సంవత్సరం వరకు సెట్ నిర్వహించి... మార్కుల ఆధారంగా ప్రవేశాలు ఇస్తుండగా.. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందులోభాగంగా ప్రస్తుతం పదోతరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ఇంటర్‌లో ఎంపిక చేసుకునే కోర్సుకు సంబంధించిన సమాచారాన్ని స్వీకరిస్తున్నారు. ఇందులోభాగంగా ప్రతి విద్యార్థిని వారి అభిరుచులు, తదుపరి కోర్సుకు సంబంధించిన సమాచారాన్ని రికార్డు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఎంపీసీ, బైపీసీ కోర్సులను ఎంపిక చేసుకునే వారికి అదే కాలేజీలో సీటుకు ఎంపిక చేసుకుంటుండగా... సీఈసీ, ఇతర కోర్సులు కోరుకుంటున్న వారిని సమీపంలోని కాలేజీలకు పంపేందుకు ప్రాథమిక జాబితాలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే మెజార్టీ విద్యార్థులు మాత్రం ప్రస్తుతమున్న కాలేజీలోనే చదువుతామనే డిమాండ్ వినిపిస్తుండగా... కొందరు నగరంలోని కాలేజీల్లో చదువుతామని, మరికొందరు గురుకులాల్లో అందుబాటులో లేని కోర్సులకు ప్రాధాన్యత ఇస్తుండటం గురుకులాల అధ్యాపకులను గందరగోళానికి గురిచేస్తోంది.
పరిమితంగా ఆర్ట్స్ గ్రూపులు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల కాలేజీల్లో ఎక్కువగా ఎంపీసీ, బైపీసీ గ్రూపులే ఉన్నాయి. పరిమిత కాలేజీల్లోనే ఆర్ట్స్ గ్రూపులున్నాయి. కొన్నింట్లో ఎంఈసీ ఉండగా... సీఈసీ, హెచ్‌ఈసీ కోర్సులు లేవు. ప్రస్తుతం విద్యార్థుల నుంచి తీసుకుంటున్న సమాచారం ప్రకారం ఎక్కువ మంది మ్యాథ్స్, సైన్స్ గ్రూపులు చెబుతున్నప్పటికీ... మరికొందరు ఆర్ట్స్ గ్రూపుల పేర్లు చెబుతున్నారు. దీంతో అందుబాటులో లేని కోర్సుల్లో ప్రవేశాలు ఎలా అనే ప్రశ్న అధ్యాపకుల్లో తలెత్తుతోంది. దీంతో పరిస్థితిని జిల్లా కోఆర్డినేటర్లకు నివేదిస్తున్నారు.
ఎంపీసీ, బైపీసీ కోర్సులను ఎక్కువ మంది ఎంపిక చేసుకుంటుండటంతో సీట్ల పరిమితికి మించితే ఆయా విద్యార్థులను పొరుగు కాలేజీలకు రిఫర్ చేయాలని భావిస్తున్నారు. అయితే అందుకు విద్యార్థి సమ్మతి కూడా తప్పనిసరి. కానీ విద్యార్థులకు అవగాహన కల్పించకుండా... కేవలం వివరాలు సేకరించి నేరుగా అడ్మిషన్లు ఇవ్వొద్దని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలావుండగా... గురుకులాల్లో మెరుగైన విద్యాసంస్థలుగా ఉన్న సీఓఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ) జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలను మెరిట్ ఆధారంగా కల్పించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పదోతరగతిలో జీపీఏ 10 పాయింట్లు వచ్చిన వారికే అవకాశం కల్పించనున్నారు. అందుకు పదోతరగతి ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
643 రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులస్కూళ్లు/కాలేజీలు
60,000 గురుకులాల్లో టెన్త్ చదువుతున్న విద్యార్థులు
60,000 ఆ కాలేజీల్లో ఇంటర్‌లో ఉండే మొత్తం సీట్లు
Comments
Please login to add a commentAdd a comment