‘స్పాట్‌’ కేంద్రాల్లోకి మొబైల్‌ నో | Telangana Inter Board Takes Key Decision To spot valuation of intermediate answer sheets | Sakshi
Sakshi News home page

‘స్పాట్‌’ కేంద్రాల్లోకి మొబైల్‌ నో

Published Tue, Mar 26 2024 1:24 AM | Last Updated on Tue, Mar 26 2024 7:36 PM

Telangana Inter Board Takes Key Decision To spot valuation of intermediate answer sheets - Sakshi

ఇంటర్‌ బోర్డు తాజా నిర్ణయం.. మూల్యాంకనం జరిగే హాల్లో నిఘా పటిష్టం

అధ్యాపకుల రాకపోకలు రిజిస్టర్‌లో నమోదు

ఒక్కొక్కరికి రోజుకు 30 పేపర్లు మాత్రమే

ఏప్రిల్‌ ఆఖరులో ఫలితాల వెల్లడి!

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని (స్పాట్‌ వాల్యూయేషన్‌) ఇంటర్‌ బోర్డు మరింత కట్టుదిట్టంగా నిర్వహిస్తోంది. తాజాగా స్పాట్‌ కేంద్రాల్లోకి అధ్యాపకుల ఫోన్లను అనుమతించకూడదని ఆదేశించింది. గతంలో ఫోన్లను అనుమతించడం వల్ల సమస్యలు తలెత్తినట్టు ఇటీవల గుర్తించారు. ఈ నేపథ్యంలోనే స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రాల్లోకి ప్రవేశించే ముందు అధ్యాపకులు తమ ఫోన్లను డిపాజిట్‌ చేయాలని బోర్డు స్పష్టం చేసింది. దీంతో పాటే హాలులో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. మూల్యాంకనం చేసే సమయంలో బయటి వ్యక్తులతో ఎలాంటి సంబంధాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సమాధాన పత్రాలు తీసుకున్న దగ్గర్నుంచి, తిరిగి సంబంధిత అధికారికి ఇచ్చేవరకు హాలులోనే ఉండాలని, హాలు దాటి బయటకు వచ్చిన ప్రతిసారీ రిజిస్టర్‌లో నమోదు చేయాలని బోర్డు సూచించింది. విద్యార్థుల సమాధాన పత్రాల కోడింగ్‌ వ్యవస్థను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, కార్పొరేట్‌ కాలేజీల ప్రలోభాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని బోర్డు అధికారులు తెలిపారు. అధ్యాపకులు చేసే మూల్యాంకన పత్రాల వివరాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర కార్యాలయానికి అందేలా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. 

మూల్యాంకనంలో 20 వేల మంది
ఈ ఏడాది 10 లక్షలకు పైగా విద్యార్థులు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ పరీక్షలు రాశారు. మూల్యాంకనం కోసం రాష్ట్రవ్యాప్తంగా 16 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 60 లక్షల పేపర్లు ప్రస్తుతం మూల్యాంకన కేంద్రాలకు చేరగా..  సబ్జెక్టుల వారీగా దాదాపు 20 వేల మంది అధ్యాపకులు మూల్యాంకన ప్రక్రియలో నిమగ్నమయ్యారు. గతంలో ఎలాంటి ఆరోపణలు లేని ప్రభుత్వ అధ్యాపకులతో పాటు, ఇంటర్‌ బోర్డు గుర్తింపు పొందిన ప్రైవేటు కాలేజీల అధ్యాపకులను స్పాట్‌ కోసం ఎంపిక చేశామని అధికారులు చెబుతున్నారు. ఒక్కో అధ్యాపకుడికి ఉదయం 15 పేపర్లు, సాయంత్రం 15 పేపర్లు చొప్పున రోజుకు మొత్తం 30 పేపర్లు మాత్రమే మూల్యాంకనానికి ఇస్తున్నారు. దీనివల్ల నాణ్యమైన మూల్యాంకనం జరుగుతుందని పరీక్షల విభాగం అధికారులు చెబుతున్నారు. 

పది రకాల పరీక్షల తర్వాతే ఆన్‌లైన్‌లోకి..
సమాధాన పత్రాలు మూల్యాకనం చేసిన అనంతరం పది రకాలుగా పరీక్షించిన తర్వాతే మార్కులను ఆన్‌లైన్‌లో ఫీడ్‌ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌ మొదలుకొని, అన్ని స్థాయిల అధికారులు సమాధాన పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. సరైన సమాధానం గుర్తించే విషయంలో ఒకరు పొరపడ్డా, మరో ఎగ్జామినర్‌ దాన్ని పరిశీలించడం వల్ల విద్యార్థి మార్కులు కోల్పోయే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్‌ రెండో వారానికల్లా స్పాట్‌ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. సగటు పరిశీలన తర్వాత, రెండు పరీక్షలు నిర్వహించి, సాంకేతిక లోపాలుంటే మూడో వారంలో సరిచేసుకుని నాల్గవ వారంలో ఫలితాలు వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ ఆలస్యమైతే ఖచ్చితంగా మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement