spot valuation
-
‘స్పాట్’ కేంద్రాల్లోకి మొబైల్ నో
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని (స్పాట్ వాల్యూయేషన్) ఇంటర్ బోర్డు మరింత కట్టుదిట్టంగా నిర్వహిస్తోంది. తాజాగా స్పాట్ కేంద్రాల్లోకి అధ్యాపకుల ఫోన్లను అనుమతించకూడదని ఆదేశించింది. గతంలో ఫోన్లను అనుమతించడం వల్ల సమస్యలు తలెత్తినట్టు ఇటీవల గుర్తించారు. ఈ నేపథ్యంలోనే స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాల్లోకి ప్రవేశించే ముందు అధ్యాపకులు తమ ఫోన్లను డిపాజిట్ చేయాలని బోర్డు స్పష్టం చేసింది. దీంతో పాటే హాలులో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. మూల్యాంకనం చేసే సమయంలో బయటి వ్యక్తులతో ఎలాంటి సంబంధాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమాధాన పత్రాలు తీసుకున్న దగ్గర్నుంచి, తిరిగి సంబంధిత అధికారికి ఇచ్చేవరకు హాలులోనే ఉండాలని, హాలు దాటి బయటకు వచ్చిన ప్రతిసారీ రిజిస్టర్లో నమోదు చేయాలని బోర్డు సూచించింది. విద్యార్థుల సమాధాన పత్రాల కోడింగ్ వ్యవస్థను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, కార్పొరేట్ కాలేజీల ప్రలోభాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని బోర్డు అధికారులు తెలిపారు. అధ్యాపకులు చేసే మూల్యాంకన పత్రాల వివరాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర కార్యాలయానికి అందేలా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. మూల్యాంకనంలో 20 వేల మంది ఈ ఏడాది 10 లక్షలకు పైగా విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు రాశారు. మూల్యాంకనం కోసం రాష్ట్రవ్యాప్తంగా 16 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 60 లక్షల పేపర్లు ప్రస్తుతం మూల్యాంకన కేంద్రాలకు చేరగా.. సబ్జెక్టుల వారీగా దాదాపు 20 వేల మంది అధ్యాపకులు మూల్యాంకన ప్రక్రియలో నిమగ్నమయ్యారు. గతంలో ఎలాంటి ఆరోపణలు లేని ప్రభుత్వ అధ్యాపకులతో పాటు, ఇంటర్ బోర్డు గుర్తింపు పొందిన ప్రైవేటు కాలేజీల అధ్యాపకులను స్పాట్ కోసం ఎంపిక చేశామని అధికారులు చెబుతున్నారు. ఒక్కో అధ్యాపకుడికి ఉదయం 15 పేపర్లు, సాయంత్రం 15 పేపర్లు చొప్పున రోజుకు మొత్తం 30 పేపర్లు మాత్రమే మూల్యాంకనానికి ఇస్తున్నారు. దీనివల్ల నాణ్యమైన మూల్యాంకనం జరుగుతుందని పరీక్షల విభాగం అధికారులు చెబుతున్నారు. పది రకాల పరీక్షల తర్వాతే ఆన్‌లైన్‌లోకి.. సమాధాన పత్రాలు మూల్యాకనం చేసిన అనంతరం పది రకాలుగా పరీక్షించిన తర్వాతే మార్కులను ఆన్లైన్లో ఫీడ్ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో అసిస్టెంట్ ఎగ్జామినర్ మొదలుకొని, అన్ని స్థాయిల అధికారులు సమాధాన పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. సరైన సమాధానం గుర్తించే విషయంలో ఒకరు పొరపడ్డా, మరో ఎగ్జామినర్ దాన్ని పరిశీలించడం వల్ల విద్యార్థి మార్కులు కోల్పోయే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ రెండో వారానికల్లా స్పాట్ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. సగటు పరిశీలన తర్వాత, రెండు పరీక్షలు నిర్వహించి, సాంకేతిక లోపాలుంటే మూడో వారంలో సరిచేసుకుని నాల్గవ వారంలో ఫలితాలు వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ ఆలస్యమైతే ఖచ్చితంగా మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. -
ఇంటర్ స్పాట్ షురూ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ మొదలైంది. ఈ నెల 16 నుంచి ఈ ప్రక్రియ మరింత ఊపందు కుంటుందని అధికారులు తెలిపారు. నెల రోజు ల పాటు ఇది కొనసాగుతుందని, పరీక్ష ముగిసిన వెంటనే విద్యార్థుల సమాధాన పత్రాలను మూల్యాంకన కేంద్రాల (స్పాట్ వాల్యూయేషన్)కు తరలిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం కలిపి దాదాపు 10 లక్షల మంది వరకు పరీక్షలు రాస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మూల్యాంకన కేంద్రాలనూ పెంచారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి, భద్రాద్రి కొత్తగూడెంలో మరో కేంద్రం అదనంగా ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలు గు రువారం ముగియనున్న నేపథ్యంలో మూల్యాంకనం చేపట్టాల్సిన అధ్యాపకులు కొందరు ఇంకా ఇన్విజిలేషన్ విధుల్లోనే ఉన్నారు. పరీక్షలు ముగిసిన వెంటనే వీరు కూడా ‘స్పాట్’లో భాగస్వాములవుతారని ఇంటర్ పరీక్షల విభాగం తెలిపింది. ఈ ఏడాది నుంచి మూల్యాంకనాన్ని ఆన్లైన్లో పూర్తిస్థాయిలో చేపట్టాలని భావించారు. కానీ ప్రభు త్వం నుంచి ఆమోదం లభించకపోవడంతో ఎప్పటిలాగే సాధారణ పద్ధతిలో మూల్యాంకనం చేపడుతున్నారు. నిరంతర పర్యవేక్షణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల సమాధాన పత్రాలు 60 లక్షల వరకూ ఉంటాయి. ఇవి ఎప్పటికప్పుడు మూల్యాంకన కేంద్రానికి చేరుకోగానే ఓఎంఆర్ షీట్లో ఉన్న విద్యార్థి వ్యక్తిగత సమాచారం తొలగిస్తారు. దీని స్థానంలో కోడ్ నంబర్ ఇస్తారు. కోడింగ్ మొత్తం ఇంటర్ బోర్డుకు ఆన్లైన్ ద్వారా అనుసంధానమై ఉంటుంది. తద్వారా సమాధాన పత్రం ఎవరిది అనే విషయం మూల్యాంకనం చేసే వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడతారు. ఆయా కేంద్రాల్లో నిర్దేశిత సబ్జెక్టు అధ్యాపకులు సమాధాన పత్రాలను పరిశీలించి మార్కులేస్తారు. వీటిని మూడు దఫాలుగా అధికారులు పరిశీలిస్తారు. ఆ తర్వాత మార్కుల వివరాలు ఆన్లైన్ ద్వారా బోర్డుకు అందుతాయి. మార్కులు కంప్యూటరైజ్ చేసిన తర్వాత అధికారులు డీ కోడ్ చేస్తారు. అన్ని సబ్జెక్టు మార్కులను క్రోడీకరిస్తారు. ఆ తర్వాత ఉన్నతాధికారులు సగటున కొన్ని పేపర్లను మరోసారి పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ అంతటిపై ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ఆయా దశలను దాటిన తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు. వారం ముందుగానే ఫలితాలు? ఇంటర్ పరీక్ష ఫలితాలను వీలైనంత త్వరగా వెల్లడించాలని బోర్డు భావిస్తోంది. ప్రతి ఏటా ఏ ప్రిల్ నాలుగోవారంలో వెల్లడించడం ఆనవాయితీ. అయితే ఈసారి ఇంతకన్నా ముందే రిజల్ట్స్ ఇవ్వాలని అధికారులు అనుకుంటున్నారు. మూల్యాంకన ప్ర క్రియతో పాటు డీకోడింగ్ విధానాన్ని వేగంగా పూర్తి చేసి మూడో వారంలోనే ఫలితాలు ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. వీలైనంత త్వరగా ఫలితాలు ప్రకటించేందుకు కృషి చేస్తున్నామని ఇంటర్ పరీక్షల విభాగం అధికారిణి జయప్రదాభాయ్ తెలిపారు. -
ఏపీలో పదో తరగతి పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ వేతనం పెంపు
-
‘స్పాట్’ వ్యాల్యూయేషన్ ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు..
ఖమ్మం: పదో తరగతి స్పాట్ వ్యాల్యూయేషన్ కేంద్రంలో కనీస సౌకర్యాలు కల్పించాలని ఎస్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరకొండ సైదులు కోరారు. ఆదివారం స్పాట్ కేంద్రంలో డీఈఓ సోమశేఖర శర్మకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. స్పాట్ కేంద్రం సమీపంలో మిర్చి మార్కెట్ యార్డు ఉండడం వల్ల మూల్యాంకనం సమయంలో ఉపాధ్యాయులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని అన్నారు. కేంద్రంలో తాగునీరు అందించడంతో పాటు అవసరమైన వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలన్నారు. ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని కోరారు. అనారోగ్య కారణాలతో స్పాట్‌కు హాజరు కాలేని ఉపాధ్యాయులకు ఇచ్చిన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గతేడాది స్పాట్ విధులు నిర్వహించిన గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టుల ఉపాధ్యాయులకు తక్షణమే రెమ్యూనరేషన్ చెల్లించాలని కోరారు. కాగా, స్పాట్ సెంటర్లో ఇబ్బందులను గుర్తించిన డీఈఓ కేంద్రం మార్పునకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గండు యాదగిరి, షేక్ మన్సూర్, నాయకులు వెంకన్న, సుధాకర్‌రెడ్డి, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. -
టెన్త్ స్పాట్‌కు తిప్పలు!
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనానికి తిప్పలు తప్పడం లేదు. ఓవైపు ఇబ్బందులు, మరోవైపు టీచర్ల అనాసక్తి కారణంగా జవాబు పత్రాలను దిద్ది మార్కులు వేసే ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. కొందరు టీచర్లు అనారోగ్యమనో, మరో అత్యవసర కారణమో చూపుతూ స్పాట్ వ్యాల్యూయేషన్‌ను తప్పించుకుంటున్నారని.. మరికొందరు చెప్పకుండానే హాజరుకావడం లేదని అధికారులు చెప్తున్నారు. మరోవైపు స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి సౌకర్యాలూ ఉండటం లేదని, అసలే వేసవి కావడంతో తీవ్రంగా అవస్థలు పడుతున్నామని టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీ వేసినా కూడా.. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవలే టెన్త్ పరీక్షలు ముగిశాయి. స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియను గురువారం నుంచి మొదలు పెట్టారు. గతంలో మూల్యాంకన కేంద్రాలు 12 ఉంటే, ఈసారి 18కి పెంచారు. జిల్లా ల వారీగా సబ్జెక్టు, లాంగ్వేజ్ నిపుణులను మూ ల్యాంకన విధులకు తీసుకున్నారు. సాధారణంగా విద్యాశాఖ అధికారులు మూల్యాంకన ప్రక్రియ మొదలవడానికి కేవలం రెండు రోజుల ముందుగా టీచర్లకు విధులు వేస్తుంటారు. ఈసారి కూడా అలా గే చేశారు. అయితే డ్యూటీ వేశారని తెలియడంతోనే కొందరు టీచర్లు నేరుగా వైద్యులను సంప్రదించి, ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నట్టు మెడిక ల్ సర్టిఫికెట్ తీసుకొచ్చి.. మూల్యాంకనం విధుల నుంచి తప్పించాలని కోరారు. మరికొందరు తొలి రోజు విధులకు హాజరవ్వలేదు. కరీంనగర్, ఆదిలా బాద్ జిల్లాలో ఎక్కువ మంది ఇలా డుమ్మా కొట్టడంతో అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు. కఠినంగా వ్యవహరించాల్సిందే.. మూల్యాంకన విధులకు హాజరవని టీచర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. బలమైన కారణాలుంటే తప్ప, మెడికల్ సర్టిఫికెట్లను అనుమతించకూడదని స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే కొన్ని సంఘాల నేతలు తమ వారిని విధుల నుంచి తప్పించాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆన్లైన్ మూల్యాంకన విధానం చేపడితే ఈ తిప్పలు ఉండవని.. విద్యాశాఖ ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. మొత్తంగా 30 లక్షలకుపైగా సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉండగా.. వివిధ సమస్యలతో ఈ ఏడాది స్పాట్ వాల్యూయేషన్ ఆలస్యమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది టెన్త్ ఫలితాల వెల్లడిపైనా ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ విషయమై పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేనను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె స్పందించలేదు. టీచర్లు చెప్తున్న ఇబ్బందులేమిటి? ♦ మూల్యాంకనం చేసే జవాబుపత్రాలకు ఒక్కోదానికి రూ.10 చెప్పున టీచర్లకు చెల్లిస్తారు. ఒక్కో టీచర్ రోజుకు 36 కన్నా ఎక్కువ సమాధాన పత్రాలను దిద్దలేరు. దూరప్రాంతాల నుంచి వచ్చే టీచర్లకు టీఏ, డీఏలేమీ ఇవ్వడం లేదు. పైగా మూల్యాంకన కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉండాలి. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అని కొందరు టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ♦ మూల్యాంకన కేంద్రాలను ఎక్కువగా ప్రైవేటు స్కూళ్లలో ఏర్పాటు చేశారు. అక్కడ విద్యార్థు లు కూర్చునే చిన్న బల్లలు ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వాటిపై కూర్చుని పేపర్లు దిద్దడం కష్టంగా ఉంటోందని, వెన్నునొప్పి వస్తోందని టీచర్లు అంటున్నారు. ♦ ఈసారి ఆరు పేపర్లతోనే టెన్త్ పరీక్షలు నిర్వహించారు. గతంలో మొత్తంగా 11 పేపర్లు ఉండేవి. దీనితో ఎక్కువ పేపర్లు మూల్యాంకనం చేసే అవకాశం ఉండటం లేదని అంటున్నారు. ♦ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాలకు టీచర్లు కచ్చితంగా ఉదయం 8.30 గంటలకు చేరుకోవాలి. ఐదు నిమిషాలు ఆలస్యమైనా క్యాంపు ఆఫీసర్లు గేటు వద్దే ఆపేస్తున్నారు. దీన్ని టీచర్లు అవమానంగా భావిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న తమ కష్టాలు చూడకుండా నిలిపివేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. -
టెన్త్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ షురూ..
భానుగుడి (కాకినాడ సిటీ): పదో తరగతి పరీక్షల మూల్యాంకనానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో పరీక్షలు రాసి ఫలితాల కోసం వేచి చూడాల్సి వచ్చేది. ఆ పద్ధతికి స్వస్తి పలికి, పరీక్షలు ముగిసిన వెంటనే వీలైనంత త్వరగా ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా పరీక్షలు జరుగుతుండగానే మూల్యాంకనం ఏర్పాట్లు షురూ చేసింది. మూల్యాంకన ప్రక్రియ పలు దశల్లో జరగనుంది. తొలుత పరీక్ష కేంద్రాల నుంచి ప్రశ్నపత్రాలను మూల్యాంకనం జరిగే కేంద్రానికి 20 చొప్పున కట్టగా కట్టి తెస్తారు. వీటిని స్ట్రాంగ్ రూములో పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడి (ఆర్జేడీ) పర్యవేక్షణలో భద్రపరుస్తారు. స్ట్రాంగ్‌రూము జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డ్ (డీసీఈబీ) కార్యదర్శి, పరీక్షల విభాగం సహాయ సంచాలకుల పర్యవేక్షణలో ఉంటుంది. స్ట్రాంగ్ రూము నుంచి మూల్యాంకన పత్రాలను చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లకు వాల్యుయేషన్ నిమిత్తం అందిస్తారు. అసిస్టెంట్ ఎగ్జామినర్ రోజుకు 40 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాలి. ఒక్కో జవాబు పత్రానికి టీఏ, డీఏలు కాకుండా రూ.6 చొప్పున చెల్లిస్తారు. మూల్యాంకనంలో చీఫ్ ఎగ్జామినర్లదే కీలక పాత్ర. అసిస్టెంట్ ఎగ్జామినర్లు, చీఫ్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లు, ప్రత్యేక సిబ్బందిగా ప్రభుత్వ ఉపాధ్యాయులను మాత్రమే విధుల్లోకి తీసుకుంటారు. నేటి నుంచి కోడింగ్.. 12 నుంచి మూల్యాంకనం మూల్యాంకన ప్రక్రియలో భాగంగా ఆదివారం నుంచి కోడింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. జవాబు పత్రాలపై విద్యార్థుల వివరాలను తొలగించే విధానాన్ని కోడింగ్ అంటారు. కోడింగ్ అనంతరం మూల్యాంకనానికి 950 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లను, 160 మంది చీఫ్ ఎగ్జామినర్లను, మార్కులు, ఇతర వివరాలు నమోదు చేసేందుకు 320 మంది స్పెషల్ అసిస్టెంట్లను నియమించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ పీఆర్జీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో మూల్యాంకన ప్రక్రియకు ఏర్పాట్లు చేశారు. ఈ పాఠశాలలోని 36 తరగతి గదులను మూల్యాంకనానికి వినియోగించనున్నారు. మే 12 వరకూ కోడింగ్ ప్రక్రియ, అనంతరం 22వ తేదీ వరకూ మూల్యాంకనం జరగనున్నాయి. 4 లక్షల పరీక్ష పత్రాల మూల్యాంకనం రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లా కావడంతో 4 లక్షల ప్రశ్నపత్రాలను మూల్యాంకనం చేయనున్నాం. ఈ ప్రక్రియకు ఆదివారం నుంచి శ్రీకారం చుడుతున్నాం. అన్ని గదుల్లోనూ పక్కా ఏర్పాట్లు చేశాం. ఫ్యాన్లు, లైట్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాం. – డి.మధుసూదనరావు, ఆర్జేడీ, కాకినాడ ఏర్పాట్లు పూర్తి మూల్యాంకానికి విధుల్లోకి తీసుకునే ఉపాధ్యాయులకు ఇప్పటికే వాట్సాప్, మెయిల్ ద్వారా ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. వేసవి కారణంగా సిబ్బందికి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలూ తీసుకున్నాం. – దాట్ల సుభద్ర, జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ -
చిన్నారితో గది శుభ్రం చేయించడం దారుణం
సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని స్పాట్ వాల్యుయేషన్ గదిని చిన్నారితో శుభ్రం చేయించడం దారుణమని, బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. దీనిపై పూర్తి వివరాలను తెలుసుకుని, బాధ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ► గదిని శుభ్రం చేయాల్సిన తండ్రి తన 6 ఏళ్ల కుమార్తెతో గదిని ఊడిపించడం చాలా బాధాకరం. తండ్రి అయినప్పటికీ అతనిపై చట్టపరమైన చర్యలు తప్పవు. అక్కడే ఉన్న హెడ్ కానిస్టేబుళ్లు ప్రేక్షక పాత్ర వహించడం క్షమార్హం కాదు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఆ ఇద్దరిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా ఎస్పీని ఆదేశించాం. ► చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్–1986 ప్రకారం 14 ఏళ్లు నిండని బాల బాలికల చేత చాకిరీ చేయించడం నిషిద్ధం. సెక్షన్ 14 ప్రకారం శిక్షార్హం. పని చేయించిన వ్యక్తులకు కనీసం 3 నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష లేదా రూ. 10 వేల నుంచి 20 వేల వరకు జరిమానా విధించాల్సి ఉంటుంది. ► బాల బాలికలను ఇళ్లలో పని మనుషులుగా ఉపయోగించడం కూడా నేరమే అని తెలియచేసేలా రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. -
రోజుకు 45 పేపర్లు.. 36 స్పాట్ కేంద్రాలు!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ స్పాట్ వ్యాల్యుయేషన్‌కు రంగం సిద్ధమైంది. మొత్తం 36 కేంద్రాల్లో మూల్యాంకనం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, ఇంటర్మీడియట్ జిల్లా విద్యా శాఖ అధికారులు, పాఠశాల విద్యకు చెందిన డీఈవోలు పాల్గొన్నారు. రానున్న మూడు రోజుల్లో కోడింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ నెల 9 లేదా 10 నుంచి మూల్యాంకనం ప్రారంభించేలా చర్యలు చేపట్టనున్నారు. జవాబుపత్రాలను మూల్యాంకన కేంద్రాలకు పంపేందుకు సమయం పట్టినా, కోడింగ్ ఆలస్యమైనా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈనెల 12 నుంచి అసలైన మూల్యాంకనం ప్రారంభించాలని బోర్డు స్పష్టం చేసింది. చదవండి: 5 వేల కేంద్రాలు.. 60 వేల గదులు ఆ రోజు నుంచి ఒక్కో అధ్యాపకుడు రోజూ 45 జవాబు పత్రాలు మూల్యాంకనం చేసేలా కార్యాచరణను సిద్ధం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 6,200 మంది ప్రభుత్వ, కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్లు ఉండగా, ప్రభుత్వ మోడల్ స్కూళ్లు, గురుకులాల్లో మరో 5 వేల మంది పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు ఉన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో మరో 25 వేల మంది లెక్చరర్లు ఉన్నారు. మొత్తం 36,200 మంది వరకు లెక్చరర్లు ఉండగా.. దాదాపు 15 వేల మందితో మూల్యాంకనం చేపట్టాలని నిర్ణయించారు. నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయొచ్చని భావిస్తున్నారు. ముందు ఇంటర్ ద్వితీయ సంవత్సర జవాబు పత్రాల మూల్యాంకనం చేస్తారు. అవి పూర్తయిన తర్వాత ప్రథమ సంవత్సర జవాబు పత్రాల వాల్యుయేషన్ ఉంటుంది. విధుల్లో పాల్గొనే వారికి రవాణా, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయా లని బోర్డు నిర్ణయించింది. లెక్చరర్లంతా పాల్గొనాలి విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా స్పాట్ వ్యాల్యుయేషన్‌లో వీలైనంత ఎక్కువ మంది లెక్చరర్లు పాల్గొనాలి. జేఈఈ వంటి ఇతర పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థులకు ఫలితాలపై మానసిక ఆందోళన లేకుండా చూసేందుకు త్వరగా మూల్యాంకనం పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం లెక్చరర్లంతా సహకారం అందించాలి. మూల్యాంకన కేంద్రాల్లో హై శానిటైజేషన్ ఏర్పాట్లు చేయాలి. – డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు -
163 మంది టీచర్లకు నోటీసులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనానికి డుమ్మా కొట్టిన టీచర్లపై జిల్లా విద్యాశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పేపర్ల మూల్యాంకనానికి గైర్హాజరైన 163 మంది ఉపాధ్యాయులకు నోటీసులు జారీచేసింది. విద్యాశాఖ చర్యలతో ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం రేగింది. పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం హయత్‌నగర్‌లోని వర్డ్ అండ్ డీడ్ పాఠశాలలో కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈనెల 15న మూల్యాంకనం ప్రారంభంకాగా.. తొలిరోజు ఇంగ్లిష్ లాంగ్వేజ్ పేపర్ల మూల్యాంకనానికి 163 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు (స్కూల్ అసిస్టెంట్లు) అనధికారికంగా గైర్హాజరయ్యారు. అన్ని పేపర్ల మూల్యాంకనం ఈనెల 26వ తేదీకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 11 రోజుల్లోనే ఆరు లక్షల జవాబు పేర్లను దిద్దాల్సిన బాధ్యతను సుమారు మూడు వేల మంది టీచర్లకు అప్పగించారు. స్వల్ప సమయంలో లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉండగా.. టీచర్లు బాధ్యతారాహిత్యంగా విధులకు గైర్హాజరయ్యారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన డీఈఓ కె.సత్యనారాయణరెడ్డి.. డుమ్మా కొట్టిన టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. సీసీఏ నియయ నిబంధనలు–1991 ప్రకారం సర్వీసు నుంచి ఎందుకు సస్పెండ్ చేయకూడదో పేర్కొనాలని నోటీసుల్లో ప్రస్తావించారు. 24 గంటలలోగా వివరణ ఇవ్వాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇదీ పరిస్థితి.. ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారు, వికలాంగులు, ఏడాదిలోపు శిశువు ఉన్న టీచర్లకు మూల్యాంకన విధులకు సాధారణంగా గైర్హాజరవుతారు. దీన్ని ఎవరూ తప్పబట్టరు. అయితే ఒక్క సబ్జెక్టుకు సంబంధించిన టీచర్లే భారీగా డుమ్మా కొట్టిన తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే వారు స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్‌లో రిపోర్టు చేయలేదని తెలుస్తోంది. వాస్తవంగా జవాబు పత్రాల మూల్యంకనం.. టీచర్ల విధుల్లో భాగం. పైగా ఈ విధులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇటువంటి కీలక బాధ్యతలు చేపట్టాల్సిన ఉపాధ్యాయలు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని జిల్లా విద్యాశాఖ ఉపేక్షించడం లేదు. వాస్తవంగా గతంలో పోల్చుకుంటే మూల్యాంకనం ఈసారి కొంత ఆలస్యమైంది. అంతకుముందు పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించడానికి ముందే వాల్యుయేషన్ ముగిసేది. అయితే ఇటీవల లోక్‌సభ ఎన్నికలు రావడంతో మూల్యాంకనానికి ఆలస్యమైంది. సెలవు రోజుల్లో మూల్యాంకనం చేస్తే ఉపాధ్యాయులు సంపాదిత సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. సంపాదిత సెలవులకు బదులుగా పాత ఉత్తర్వుల ప్రకారం టీఏ, డీఏలు ఇస్తోంది. కచ్చితంగా సంపాదిత సెలవులే ఇవ్వాలని టీచర్లు పట్టుబడుతున్నారు. పైగా కొత్త జిల్లాల ప్రకారం స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్‌ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు అనుగుణంగా క్యాంప్‌ను కొనసాగిస్తున్నారు. ఈ కేంద్రానికి వికారాబాద్, మేడ్చల్ జిల్లాల నుంచి రాకపోకలు జరిపేందుకు తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉపాధ్యాయులు విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపైనా సర్కారు స్పందించలేదు. ఈ రెండు కారణాల వల్లే కొందరు టీచర్లు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. మరికొందరు మూల్యాంకనం తమ బాధ్యత కాదన్నట్లుగా భావించి పెడచెవిన పెట్టినట్లు సమాచారం. -
ఓయూలో షార్ట్ సర్క్యూట్
హైదరాబాద్: ఓయూ క్యాంపస్ పరీక్షల నియంత్రణ విభాగం జవాబు పత్రాల మూల్యాంకన (స్పాట్ వాల్యుయేషన్) కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షల జవాబు పత్రాలు కొన్ని కాలిపోగా.. మరికొన్ని ఫైరింజన్ నీటికి తడిసిపోయాయి. స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ తలెత్తగా.. సెక్యూరిటీ గార్డు అధికారులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన అధికారులు ఫైరింజన్‌ను పిలిపించి ఘోర ప్రమాదాన్ని నివారించగలిగారు. అగ్ని ప్రమాదాన్ని అరికట్టకలిగారు కాని ఫైరింజన్ నీటికి వేలాది జవాబు పత్రా లు తడిసి ముదై్ద, మూల్యాంకనానికి పనికి రాకుండా పోయాయి. కంట్రోలర్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు వీసీ నివాసం ఎదుట ఆందోళన చేపట్టారు. చిన్న ప్రమాదమే: కంట్రోలర్ జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదాన్ని సకాలంలో స్పందించి అరికట్టామని కంట్రోలర్ ప్రొ.కుమార్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ జరిగిన గదిలో గత నెల 28, 29, 30, 31 తేదీల్లో జరిగిన బీఎస్సీ 2వ, 4వ సెమిస్టర్ పరీక్షల జవాబు పత్రాలున్నాయ న్నారు. వాటిలో 5 శాతం మాత్రమే కాలిపోయాయన్నారు. అనుకోకుండా జరిగిన ఘట న కాబట్టి తమ తప్పిదం ఏమీ లేదన్నారు. కాగా, అగ్నిప్రమాదంపై విచారణ జరిపేందుకు క్యాంపస్‌లోని సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.శివరాజ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించినట్టు వీసీ రామచంద్రం తెలిపారు. -
సీసీ కెమెరాల నిఘాలో స్పాట్ వాల్యుయేషన్
గుంటూరు ఎడ్యుకేషన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థుల జవాబు పత్రాలకు మూల్యాంకనం (స్పాట్ వాల్యూయేషన్) ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది. జిల్లా కేంద్రంలోని స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖాధికారులు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. మూల్యాంకన విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులు విధిగా గుర్తింపు కార్డును ధరించడంతో పాటు సెల్ఫోన్లు వెంట తీసుకురాకూడదని నిబంధనలు విధించారు. ఒక్కసారి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలోకి అడుగుపెట్టిన ఉపాధ్యాయులు సాయంత్రం మూల్యాంకనం ముగిసేవరకూ బయటకు వెళ్లేందుకు అవకాశం లేని విధంగా విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా 2,100 మంది ఉపాధ్యాయుల నియామకం నగరంపాలెం స్టాల్ బాలికోన్నత పాఠశాలలోని స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో క్యాంప్ అధికారి, డీఈవో ఆర్.ఎస్ గంగా భవాని పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న 2,100 మంది ఉపాధ్యాయులను విద్యాశాఖ నియమించింది. వీరిలో అసిస్టెంట్ క్యాంప్ అధికారులతో పాటు చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లు ఉన్నారు. సోమవారం ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ ఈనెల 15వ తేదీ వరకూ కొనసాగుతుంది. మూల్యాంకన విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు తాగునీరు, క్యాంటిన్, టాయిలెట్లు వంటి మౌలిక వసతులను కల్పించారు. స్పాట్ వాల్యుయేషన్ కేంద్ర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్యాంటిన్లో నామమాత్రపు ధరకు ఆహారంతో పాటు ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మినరల్ వాటర్ సదుపాయం కల్పిస్తున్నారు. గతేడాది వరకు నగరపాలక సంస్థ సరఫరా చేసే నీటినే నేరుగా ఉపాధ్యాయులకు అందిస్తూ రాగా గుంటూరు నగరంలో ఇటీవల డయేరియా ప్రబలిన నేపథ్యంలో కూలింగ్ వాటర్ క్యాన్లు తెప్పించేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాకు చేరుకున్నఆరు లక్షల స్క్రిప్ట్‌లు పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు సంబంధించి వివిధ జిల్లాల నుంచి ఆరు లక్షల స్క్రిప్ట్‌లు జిల్లాకు వచ్చాయి. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్ రోజుకు 40 స్క్రిప్ట్‌లకు మూల్యాంకనం నిర్వహించాల్సి ఉందని డీఈవో ఆర్.ఎస్ గంగా భవానీ చెప్పారు. స్పాట్ వాల్యుయేషన్ విధి నిర్వహణకు నియామకం పొందిన ఉపాధ్యాయులు సోమవారం ఉదయం 8.30 గంటలకు స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. సంబంధిత ఉపాధ్యాయులను రిలీవ్ చేసి పంపాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. విధులకు గైర్హాజరైన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంతో శ్రమకోర్చి పరీక్షలు రాసిన ఏ ఒక్క విద్యార్థికీ నష్టం కలిగించని రీతిలో ప్రశ్నపత్రాలకు పకడ్బందీగా మూల్యాంకనం జరపడంతో పాటు వచ్చిన మార్కులను చీఫ్ ఎగ్జామినర్లు, కోడింగ్ అధికారులతో పాటు అసిస్టెంట్ క్యాంప్ అధికారులతో క్షుణ్ణంగా పరిశీలించే విధంగా చర్యలు చేçపడుతున్నట్టు చెప్పారు. -
ఎస్ఎస్సీ స్పాట్‌ను బహిష్కరిస్తున్నాం: జాక్టో
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమయ్యే ఎస్ఎస్సీ స్పాట్ వాల్యుయేషన్‌ను బహిష్కరిస్తున్నట్లు జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్ (జాక్టో) ప్రకటించింది. బుధవారం ఈ మేరకు జాక్టో నాయకులు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శికి బహిష్కరణ నోటీసు అందించారు. కార్యక్రమంలో జాక్టో చైర్మన్ కె.రవీందర్‌రెడ్డి, టీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మణిపాల్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ మమత, టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డి.మల్లారెడ్డి, ఆర్‌యూపీపీటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సి.జగదీశ్, టీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కె.రమేశ్, సింగరేణి టీచర్స్ అధ్యక్షుడు జి.ఎం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
‘స్పాట్’లో ఉద్రిక్తత
- పదోతరగతి మూల్యాంకనం బహిష్కరణకు ఉపాధ్యాయ సంఘాల యత్నం - ‘స్పాట్’ సెంటర్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు - నాయకుల అరెస్ట్, విడుదల అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాక్టో, ఫ్యాప్టో మంగళవారం చేపట్టిన పదో తరగతి మూల్యాంకనం బహిష్కరణ ఉద్రిక్తతకు దారి తీసింది. బహిష్కరణకు ముందుగానే పిలుపునివ్వడంతో అనంతపురంలోని ‘స్పాట్’ కేంద్రమైన కేఎస్ఆర్ బాలికోన్నత పాఠశాల వద్ద మంగళవారం ఉదయం ఏడు గంటలకే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాధారణ పోలీసులతో పాటు పదుల సంఖ్యలో స్పెషల్ పార్టీ పోలీసులను మోహరించారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఇటువైపు ఎవరూ రావొద్దంటూ ఆంక్షలు విధించారు. అయితే.. ఎనిమిది గంటల సమయంలో వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.ఓబుళపతి, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి తదితరులు కేఎస్ఆర్ పాఠశాల గేటు వద్దకు చేరుకున్నారు. విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన వారిని అడ్డుకున్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికే మూల్యాంకనం బహిష్కరిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో వచ్చిన వారిలో ఎక్కువ మంది విధుల్లో పాల్గొనకుండా వెనుదిరిగారు. ఉపాధ్యాయ నాయకులను పోలీసులు అడ్డగించారు. బలవంతంగా జీపులో టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ మూల్యాంకన కేంద్రం వద్ద కర్ఫ్యూ వాతావరణాన్ని తలిపించేలా బందోబస్తు ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టారు. తామేమీ సంఘ విద్రోహశక్తులం కామని, సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుండగా.. ఎస్‌ఎల్‌టీఏ, టీఎన్‌యూఎస్ నాయకులు తాము విధుల్లో పాల్గొంటామని, పేపర్లు దిద్దేందుకు ఇవ్వాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయితే అప్పటికే 90 శాతానికి పైగా టీచర్లు ‘స్పాట్’లో పాల్గొనకుండా వెళ్లిపోయారు. ఈ హైడ్రామా మధ్యాహ్నం 12 గంటల దాకా నడిచింది. చివరకు అందుబాటులో ఉన్న కొందరు ఉపాధ్యాయులకు పేపర్లు దిద్దే అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు భద్రత కొనసాగించారు. -
పది స్పాట్ ప్రారంభం
- సోషల్ టీచర్ల కొరత కర్నూలు సిటీ: పదవ తరగతి స్పాట్ వాల్యుయేషన్ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ నెల 16వ తేది వరకు నిర్వహించే స్పాట్‌కు 1,987 మంది టీచర్లును కేటాయించారు. అయితే సోషల్ సబ్జెక్టుకు సంబంధించిన టీచర్లు తక్కువగా ఉన్నారు. ఉన్న వారు కూడా వయస్సు భారం, అనారోగ్య కారణాల వల్ల రాలేమని డీఈఓకు విన్నివించారు. అయితే స్పాట్‌కు ఆర్డరు ఇచ్చిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా మంగళవారం నాటికి విధుల్లో చేరాలని డీఈఓ తాహెరా సుల్తానా ఆదేశించారు. స్పాట్ జరుగుతున్న మాంటిస్సోరి స్కూల్లోని కేంద్రాన్ని డీఈఓ తనిఖీ చేశారు. ముల్యాంకనంలో పొరపాట్లకు తావు లేకుండా వ్యవహరించాలని సూచించారు. -
టెన్త్ స్పాట్ వాల్యుయేషన్‌కు ఏర్పాట్లు
- నేటి నుంచి 16 వరకు మూల్యాంకనం - స్పాట్ అధికారులతో డీఈఓ సమావేశం కర్నూలు సిటీ: పదవ తరగతి స్పాట్ వాల్యుయేషన్ సోమవారం ప్రారంభం కానుంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గత నెల17వ తేదీన మొదలైన పరీక్షలు 30తో ముగిశాయి. ఈ క్రమంలో వెంటనే స్పాట్ వాల్యుయేషన్ మొదలెట్టి వీలైనంత తొందరగానే ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వం ఇప్పటీకే అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు ఆదేశాలు ఇచ్చింది. స్కూల్ విద్యార్థులకు సవరణాత్మకమైన బోధన జరుగుతోంది. ఇందుకు ఇబ్బందులు లేకుండా స్పాట్‌కు సిబ్బందిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆదే అంశంపై ఆదివారం డీఈఓ తాహెరా సుల్తానా తన ఛాంబర్లో స్పాట్ అధికారులతో సమావేశమయ్యారు. మూల్యాంకనానికి మొత్తం 1987 మందిని నియమించామని తెలిపారు. 19 మంది ఏసీఓలు, 236 మంది సీఈలు, 1651 మంది ఏఈలు, 336 మంది స్పెషల్ అసిస్టెంట్లు పని చేస్తారన్నారు. ముల్యాంకనంలో అవకతవకలు చోటు చేసుకోకుండా పగద్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు రెమ్యునరేషన్ ఇస్తామన్నారు. ఈనెల16వ తేదీ వరకు స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుందన్నారు. సమావేశంలో డీసీఈబీ సెక్రటరీ ఓంకార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
స్పాట్ తుస్..
బెంగళూరు: డిమాండ్ల పరిష్కారానికి అధ్యాపకులు చేపట్టిన ధర్నా కొనసాగడంతో పీయూసీ జవాబు పత్రాల మూల్యాంకనం(స్పాట్ వాల్యుయేషన్) శుక్రవారం కూడా మొదలు కాలేదు.ఎట్టి పరిస్థితుల్లోనూ శుక్రవారం మూల్యాంకనం ప్రారంభమవుతుందని ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కిమ్మెన రత్నాకర్ చెప్పిన మాటలు ఆచరణలోకి రాలేదు. వివరాలు... వేతనాల పెంపు ప్రధాన డిమాండ్‌గా రాష్ట్ర ప్రభుత్వ పీయూసీ కళాశాలల అధ్యపకులు కొన్ని రోజులుగా బెంగళూరులోని ఫ్రీడం పార్కులో ధర్నా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగుసార్లు ప్రభుత్వం వారితో సమస్య పరిష్కారం కోసం చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. ఈ విషయమై ప్రైవేటు, రిటైర్డ్ అధ్యాపకులను వినియోగించి శుక్రవారం మూల్యాంకన ప్రక్రియను ప్రారంభిస్తామని కిమ్మెన రత్నాకర్ గురువారం మీడియాతో పేర్కొన్నారు. అంతేకాకుండా ద్వితీయ పీయూసీ ఫలితాలను మే 2న విడుదల చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రైవేటు ద్వితీయ పీయూసీ అధ్యాపకులు కానీ, రిటైర్డ్ అధ్యాపకులు కాని మూల్యాంకనం చేసేందుకు ముందుకు రాకపోవడంతో శుక్రవారం ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఇదిలా ఉండగా ధర్నా చేస్తున్న కొంతమంది అధ్యాపకులు అస్వస్థతకు లోను కావడంతో సహచరులు బాధితులను దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స ఇప్పిస్తున్నారు. -
మా ఫీజులు మా ఇష్టం
- మీరిస్తున్న ట్యూషన్ ఫీజులు మాత్రం పెంచండి - ప్రభుత్వానికి ప్రైవేటు ఇంటర్మీడియెట్ కాలేజీల డిమాండ్.. స్పాట్ వాల్యుయేషన్ బహిష్కరణ - సర్కారు ఇస్తున్న ఉపకార వేతనాలన్నీ కాలేజీల ఖాతాలోకే.. - రెండేళ్లకు ఒక్కో విద్యార్థికి రూ.10 వేల దాకా చెల్లిస్తున్న ప్రభుత్వం - అయినా వివిధ పేర్లతో రూ.5 వేల నుంచి రూ. 50 వేల దాకా వసూలు చేస్తున్న యాజమాన్యాలు - ఇంజనీరింగ్ తరహా ఫీజు విధానం ఉండాలంటున్న తల్లిదండ్రులు - ఫీజుల హేతుబద్ధీకరణకు ఏడుగురితో కమిటీ వేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: మేం వసూలు చేసే ఫీజుల మాటెత్తకండి... మాకు ఇస్తున్న ట్యూషన్ ఫీజులను మాత్రం పెంచండి..! రాష్ట్రంలో ప్రైవేటు ఇంటర్మీడియెట్ కాలేజీల డిమాండ్ ఇదీ!! అడ్మిషన్ ఫీజు, ల్యాబ్ డిపాజిట్, ఇంటర్నల్ పరీక్షల ఫీజు.. తల్లిదండ్రుల నుంచి ఇలా రకరకాల పేరుతో కాలేజీని బట్టి రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు గుంజుతున్న యాజమాన్యాలు ఇప్పుడు.. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల కోర్సు చదివే దాదాపు 4.5 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం చెల్లిస్తున్న ట్యూషన్ ఫీజును పెంచాలని పట్టుబడుతున్నాయి. ఈ ఫీజును కనీసం రూ.8 వేల నుంచి రూ.18 వేలకు పెంచాలని బెట్టు చేస్తున్నాయి. ఇందుకు స్పాట్ వాల్యుయేషన్‌ను సైతం బహిష్కరించాయి. దీంతో ప్రభుత్వం ఫీజుల హేతుబద్ధీకరణకు శుక్రవారం ఒక కమిటీ వేసింది. ప్రభుత్వం చెల్లించే ట్యూషన్ ఫీజు పెంపుపై ఈ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా... యాజమాన్యాల అడ్డగోలు ఫీజులను నియంత్రించాలని, ఇంజనీరింగ్ తరహాలో ఒకే రకమైన ఫీజు విధానం తీసుకురావాలని తల్లిదండ్రులు, విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థికి వచ్చేవన్నీ కాలేజీలకే.. ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఫీజులను పెంచాలని యాజమాన్యాలు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఇంటర్మీడియట్ విద్యాశాఖ 2006లో నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పలు సిఫారసులు చేసినా అవి అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం ప్రభుత్వం ఫస్టియర్ విద్యార్థికి రూ.1,760, సెకండియర్ విద్యార్థికి రూ.1,940 ట్యూషన్ ఫీజుగా చెల్లిస్తోంది. అలాగే విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి రూ.7 వేల స్కాలర్షిప్ను ఇస్తోంది. అంటే ఒక్కో విద్యార్థికి రెండేళ్లలో రూ. 10 వేలకు పైగా ప్రభుత్వం నుంచే వస్తోంది. సర్కారు ఇస్తున్న ఈ మొత్తాన్ని 90 శాతం కాలేజీలు తమ ఖాతాలోనే వేసుకుంటున్నాయి. అయినా వివిధ పేర్లతో కాలేజీ స్థాయిని బట్టి రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నాయి. చిక్కుల్లో గ్రామీణ కళాశాలలు.. రాష్ట్రంలో మొత్తం 3,200 వరకు జూనియర్ కాలేజీలు ఉండగా.. అందులో ప్రైవేటు కాలేజీలే 2,600 వరకు ఉన్నాయి. అందులో గ్రామీణ ప్రాంతాల్లో 650కి పైగా ఉన్నాయి. విద్యార్థుల్లేక, వచ్చే ఫీజులు నిర్వహణకు సరిపోక గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ తరహాలో కాలేజీని బట్టి ఒకే రకమైన ఫీజు ఉండాల్సిన అవసరం ఉందని విద్యావేత ్తలు పేర్కొంటున్నారు. గ్రామీణ కాలేజీలకు న్యాయం జరిగేలా చూడాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. కార్పొరేట్ కాలేజీలదీ మరో కథ! కార్పొరేట్ కాలేజీలదీ మరో తీరు. ఆ కాలేజీల్లో చేరే విద్యార్థులకు యాజమాన్యాలు ప్రభుత్వం నుంచి ట్యూషన్ ఫీజు తీసుకోవు. స్కాలర్షిప్లు అడగవు కానీ ఇష్టానుసారం వసూళ్లు చేసుకుంటాయి. డే స్కాలర్ అయినా, రెసిడెన్షియల్ అయినా వారు నిర్ణయించిందే ఫీజు! ఒక్కో విద్యార్థి నుంచి ఏటా రూ.25 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నా వాటిపై ఎలాంటి నియంత్రణ లేదు. ఫీజుల హేతుబద్ధీకరణకు కమిటీ రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఫీజుల హేతుబద్ధీకరణకు ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు శుక్రవారం జీవో జారీ చేసింది. ఇంటర్ విద్యా కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఆర్థిక శాఖ ప్రతినిధి, న్యాయ శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఫీజుల విధానంపై అధ్యయనం చేసి నెల రోజుల్లో నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. -
స్పాట్లో అలసత్వం వహిస్తే చర్యలు
స్పష్టం చేసిన ఆర్ఐవో పాపారావు జోరందుకున్న ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ శ్రీకాకుళం న్యూకాలనీ : ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యూయేషన్‌లో అలసత్వం వహించి తప్పులు చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని, తక్షణమే తప్పిస్తామని ఆర్ఐవో, క్యాంప్ ఆఫీసర్ పాత్రుని పాపారావు హెచ్చరించారు. శ్రీకాకుళంలోని ఆర్సీఎం సెయింట్‌జాన్స్ జూనియర్ కళాశాల కేంద్రంగా జరుగుతున్న తొలి విడతలో తెలుగు, ఇంగ్లిష్, హిందీ, మ్యాథ్స్, సివిక్స్ పేపర్ల మూల్యాంకనం కొనసాగుతోంది. అయితే ఇంగ్లిష్ సబ్జెక్టులో కొంతమంది ఎగ్జామినర్లు తప్పుల మీద తప్పులు చేస్తున్నట్లు.. మార్కులు కేటాయింపుల్లో హెచ్చు తగ్గులు ఉంటున్న విషయం ఆర్ఐవో వద్దకు చేరుకుంది. దీంతో ఆదివారం సదరు ఎగ్జామినర్లను సున్నితంగా మందలించారు. అనుభవం ఉన్నవారు ఇలా చేయడం సరికాదని, ఒకటికి రెండుమార్లు సరి చూసుకోవాలన్నారు. విద్యార్థుల జీవితాలు మన చేతుల్లో ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలని హితబోధ చేశారు. మళ్లీ ఇదే సీన్ రిపీటయితే విధుల నుంచి తప్పిస్తామని హెచ్చరించారు. సమయపాలన విధిగా పాటించాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా స్పాట్ వాల్యూయేషన్ జొరందుకుంది. తొలి మూడు రోజులు అధికారులు, ఎగ్జామినర్లు, స్కూృటినైజర్ల నియామకాలతో మందకొడిగా సాగుతూ వస్తున్న స్పాట్ ఊపందుకుంది. ఈ నెల 23 నుంచి రెండు విడతలుగా ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్ల దిద్దుబాటు ప్రక్రియ మొదలుకానుందని అధికారులు వెల్లడించారు. -
5 నిమిషాలు దాటితే నో ఎంట్రీ
మరికొద్ది గంటల్లో టెన్త్ పరీక్షలు.. సర్వం సిద్ధం ♦ పరీక్షలకు హాజరు కానున్న 5.67 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యే టెన్త్ విద్యార్థులకు ముఖ్య సూచనలు ♦ స్కూల్ యూనిఫారంలో రావద్దు ♦ విద్యార్థులు పరీక్షలకు పాఠశాల యూనిఫారం వేసుకొని రావద్దు. ♦ యూనిఫారం వేసుకొని వస్తే అనుమతించరు. వేరే దుస్తులు ధరించాలి. ♦ ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగ్‌లు, పుస్తకాలను పరీక్ష హాల్లోకి అనుమతించరు. ♦ బ్లాక్ లేదా బ్లూ పెన్నుతోనే పరీక్షలు రాయాలి. ఇతర రంగుల పెన్నులతో పరీక్ష రాయవద్దు. ♦ జవాబుపత్రాల లోపల ఎలాంటి గుర్తులు పెట్టవద్దు. హాల్‌టికెట్ నెంబరు, ఫోన్‌నెంబరు వంటి రాయవద్దు. అలా రాస్తే ఆ జవాబు పత్రాన్ని మూల్యాంకనం చేయరు. ♦ ఏదైనా సహాయం అవసరం అయితే ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయంలో ఏర్పాటు చేసే హెల్ప్‌లైన్ కేంద్రానికి (040-23230942) ఫోన్ చేసి సహాయం పొందవచ్చు. ♦ డీఈవో కార్యాలయాల్లో ఉండే హెల్ప్ కేంద్రాలకు కూడా ఫోన్ చేసి సహాయం పొందవచ్చు. ♦ విద్యార్థులకు కేటాయించిన కేంద్రంలోనే పరీక్ష రాయాలి. ♦ ఆలస్యం అయిందన్న కారణంతో సమీపంలోని కేంద్రానికి వెళితే అనుమతించరు. ♦ ఏప్రిల్ 11 నుంచి స్పాట్ వాల్యుయేషన్ ♦ ప్రభుత్వ పరీక్షల విభాగం ♦ డెరైక్టర్ డా.సురేందర్‌రెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21వ తేదీ(రేపటి) నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. ప్రతిరోజు పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయని చెప్పారు. విద్యార్థులను ఉదయం 9:35 గంటల వరకే పరీక్ష హాల్లోకి అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. అంతకుమించి ఆలస్యమైతే అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ద్వితీయభాష పరీక్ష మాత్రం ఉదయం 9:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఉంటుందన్నారు. పరీక్షల ఏర్పాట్లపై శనివారం సురేందర్‌రెడ్డి విలేక రులతో మాట్లాడారు. విద్యార్థులను గంట ముందుగానే(ఉదయం 8:30 గంటలకే) పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని, ఆ సమయాన్ని వినియోగించుకొని ముందుగానే రావాలన్నారు. వీలైతే ఈ నెల 20 నాడే తమ పరీక్ష కేంద్రాలు ఎక్కడున్నాయో వెళ్లి చూసుకోవాలన్నారు. హాల్‌టికెట్లు అందని వారు వెబ్సైట్ www.bsetelangana.org నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎవరైనా గెజిటెడ్ అధికారితో సంతకం చేయించుకొని హాజరు కావచ్చన్నారు. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన మరిన్ని అంశాలు ఆయన మాటల్లోనే.. వికలాంగులు 20 మార్కుల కే పాస్ అంధ, మూగ, చెవిటి, అంగవైకల్యం కలిగిన విద్యార్థులు ఉత్తీర్ణత మార్కులను 20కి తగ్గించారు. వీరికి జంబ్లింగ్ విధానం ఉండదు. వారు మూడు లాంగ్వేజెస్ పేపర్లకు బదులు ఒక్క భాషా పేపరు రాస్తే చాలు. డిస్లెక్సియాతో బాధపడేవారు ఇంగ్లిషు పేపరు రాయాల్సిన అవసరం లేదు. 9వ తరగతి విద్యార్థిని సహాయకునిగా ఇవ్వడంతోపాటు గంట అదనంగా సమయం ఇస్తారు. జవాబుపత్రాల మూల్యాంకనాన్ని ఏప్రిల్ 11 నుంచి ప్రారంభిస్తారు. 5 ఏళ్ల సర్వీసున్నవారినే మూల్యాంకన విధులకు తీసుకుంటారు. మూల్యాంకనం ప్రారంభమయ్యాక 7 వారాల తరువాతే ఫలితాలను వెల్లడించేందుకు వీలు ఉంటుంది. మాల్‌ప్రాక్టీస్‌కు సహకరిస్తే చర్యలు మాల్‌ప్రాక్టీస్‌కు సహకరిస్తే ఇన్విజిలేటర్లపైనా చర్యలు ఉంటాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో ఇన్విజిలేటర్లు కొంత మంది ప్రైవేటు స్కూళ్ల టీచర్లను తీసుకున్నామని, 425 కేంద్రాల్లో ఫర్నిచర్ కొరత ఉంటే ఇతర స్కూళ్ల నుంచి తెప్పించి సర్దుబాటు చేశామన్నారు. జిల్లాకు ఒక సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, 5 మార్కులు కలిగిన ఆబ్జెక్టివ్ పేపర్‌ను చివరి అరగంట సమయంలో ఇస్తారని తెలిపారు. పరీక్ష కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ మినహా మరెవరూ సెల్ఫోన్లు వాడటానికి వీల్లేదని, చీఫ్ సూపరింటెండెంట్లు కెమెరా లేని సెల్ఫోన్లనే వినియోగించాలన్నారు. మొత్తం 5 లక్షల 67 వేల 478 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని, వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 5 లక్షల 21 వేల 46 మంది, ప్రైవేట్ విద్యార్థులు 35,711 మంది, ఓరియంటల్ ఎస్సెస్సీ, ఒకేషనల్ విద్యార్థులు మరో 10,721 మంది ఉన్నారు. 392 కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్స్ ఉంటాయని, 144 ఫ్లైయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. -
ఇంటర్ స్పాట్ బహిష్కరించిన లెక్చరర్లు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్లతో సమానంగా ప్రాధాన్యం ఇవ్వాలంటూ ప్రైవేట్ లెక్చరర్లు ఆదిలాబాద్‌లో ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్‌ను బహిష్కరించారు. శుక్రవారం మధ్యాహ్నం లెక్చరర్ల సంఘం ఆధ్వర్యంలో స్పాట్ కేంద్రం వద్ద నిరసన తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు పెండింగ్ స్కాలర్‌షిప్పులను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆందోళనలో సంఘం జిల్లా నేతలు తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ మూల్యాంకనంలో అక్రమాలు
-
ఆర్యూ డిగ్రీ ఫలితాలు విడుదల
కర్నూలు(జిల్లా పరిషత్): రాయలసీమ విశ్వవిద్యాలయ పరిధిలో మార్చి/ఏప్రిల్‌లో నిర్వహించిన డిగ్రీ(బీఏ,బీకాం, బిఎస్సీ,బీబీఎం, బీసీఏ) కోర్సుల ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సర పరీక్ష ఫలితాలను సోమవారం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వై. నరసింహులు తన ఛాంబర్లో విడుదల చేశారు. ఫలితాల వివరాలను ఆయన వెల్లడించారు. మొత్తంగా అమ్మాయిలే పై చేయని, వారే టాపర్లుగా నిలిచారని ఆయన వివరించారు. స్పాట్ వాల్యుయేషన్ ముగించిన మూడు రోజుల్లోపే తక్కువ సమయంలో ఫలితాలను విడుదల చేసిన డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ ఎన్‌టికె నాయక్, పరీక్షల విభాగ సిబ్బందిని ఆయన అభినందించారు. ప్రొఫెసర్ ఎన్‌టికె నాయక్ మాట్లాడుతూ ఈ ఫలితాలను, రీ వాల్యుయేషన్‌కు సంబంధించిన వివరాలను, ఇన్స్టంట్ ఎగ్జామినేషన్‌కు సంబంధించిన వివరాలను www.rayalaseemauniversity.ac.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఈ మార్కుల జాబితాను ఆయా కళాశాలలకు పంపిస్తామని తెలిపారు. ఇన్స్టంట్ పరీక్షల కోసం మే 10వ తేదీలోపు అపరాధ రుసుం లేకుండా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఆర్యూ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఐఈ చక్రవర్తి, పరీక్షల విభాగం సిబ్బంది పాల్గొన్నారు. ప్రథమ సంవత్సరంలో... బీఏ, బీబీఎం, బీసీఏ, బీకాం, బిఎస్సీ, బీఏ(ఓఎల్) కోర్సుల్లో మొత్తం 14,215 మంది విద్యార్థులకు 7760 మంది(54.59శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఇందులో బాలురు 8,709 మందికి గాను 4,068(46.71శాతం) మంది, బాలికల్లో 5,506 మందికి గాను 3,692(67.05శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు. ద్వితీయ సంవత్సరంలో... ద్వితీయ సంవత్సరంలో 11,679 మంది విద్యార్థులకు గాను 6,062(51.91శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 7,385 మందికి గాను 2,986(40.43శాతం) మంది, బాలికల్లో 4,294 మందికి గాను 3,076(71.63శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు వీసీ వివరించారు. తృతీయ సంవత్సరంలో... తృతీయ సంవత్సరంలో మొత్తం 9,687 మందికి గాను 6,24 మంది(64.97శాతం) ఉత్తీర్ణత సాధించారు. అందులో బాలురల్లో 5,877 మందికి గాను 3,294 మంది(56.05శాతం) మంది, బాలికల్లో 3,810 మందికి గాను 3000 మంది(78.74శాతం) మంది ఉత్తీర్ణులైనట్లు ఆయన వివరించారు. బ్రాంచ్‌ల వారీగా టాపర్లు వీరే... బీఏలో..వడ్డే శ్రీదేవి (వైష్ణవి కాలేజి, డోన్) 932మార్కు లు, ఎం. భాగ్యశ్రీ(కేవీఆర్ కాలేజి) 952, పీఎస్ ఆయేషాబేగం(కేవీఆర్ కాలేజి) 973, సంజపోగు సునీత(బసిరెడ్డి కాలేజి) 1011, ఎం. భాను(కేవీఆర్ కాలేజి) 1025, బి. భాగ్యశ్రీ(ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి) 1390, జి శిరీష(కేవీఆర్ కాలేజి) 869 మార్కులు సాధించారు. బీబీఎంలో... ఎం. అనూష(ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి) 1710 మార్కులు బీసీఏలో... తాడి ప్రమీల(నేషనల్ డిగ్రీ కాలేజి, నంద్యాల) 1448 మార్కులు బీకాం కంప్యూటర్లో... వి. రమ్యపావని(సెయింట్ జోసఫ్స్ కాలేజి, కర్నూలు) 1387, సి. మనస్సి(ప్రభుత్వ డిగ్రీ కళాశాల, శ్రీశైలం) 1252 మార్కులు సాధించారు. బీఎస్సీలో... కె. అరుణావతి(కేవీఆర్ కాలేజి)1524 మార్కులు, జె. స్రవంతి(సెయింట్ జోసఫ్ డిగ్రీ కాలేజి, కర్నూలు) 1600, స్వాతి కలింగిరి(నేషనల్ డిగ్రీకాలేజి, నంద్యాల) 1454, సి. శేషగిరి ఫణికృష్ణ(నేషనల్ డిగ్రీ కాలేజి, నంద్యాల) 1575, ఎస్. మహేశ్వరి(కేవీఆర్ డిగ్రీ కాలేజి) 1451, పి. తేజేశ్వరాచారి(నేషనల్ డిగ్రీ కళాశాల, నంద్యాల) 1650, పి. వెంకటరమణమ్మ(ఎస్పీవై రెడ్డి కాలేజి, నంద్యాల) 1642, జి. శ్రావణి(కేవీఆర్ డిగ్రీ కాలేజి) 1685, జి. పద్మావతి(శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల) 1679, బి. హరికుమార్(సెయింట్ జోసఫ్ డిగ్రీ కాలేజి, కర్నూలు) 1471, యు. మనోజ్ఞ రత్న(కర్నూలు డిగ్రీ కళాశాల) 1459, కె. కిరణ్‌కుమార్(శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాల, కర్నూలు) 1378, కె. రాజేశ్వరి(వాసవి మహిళా కళాశాల, కర్నూలు) 1636, జి. సుజాతయాదవ్(ప్రభుత్వ డిగ్రీ కళాశాల, శ్రీశైలం)1591, డి. జ్యోతి(ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నందికొట్కూరు) 1394 మార్కులు సాధించారు. బీఏఓఎల్లో... ఎస్. సామినా ఫాతిమా 1083, షేక్ నౌషద్ బేగమ్ 1066(ఇస్లామియా అరబిక్ కాలేజి, కర్నూలు) మార్కులు సాధించారు. -
కేయూలో స్పాట్ వాల్యుయేషన్ రేపటి నుంచే..
వరంగల్ : కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ జవాబు పత్రాల స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ఏప్రిల్ 27వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని పరీక్షల నియంత్రణాధికారి బి.వెంకట్రామ్రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల నుండి ఇంగ్లిష్, జువాలజీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, ఫిజిక్స్, తెలుగు పత్రాలు... మధ్యాహ్నం 2 గంటల నుంచి మ్యాథ్స్, కెమిస్ట్రీ, కామర్స్ పత్రాల వాల్యుయేషన్ జరుగుతుందని చెప్పారు. పరీక్షల విభాగంలో ఓ అధికారికి, కాంట్రాక్టు లెక్చరర్‌కు మధ్య ఏప్రిల్ 18న వివాదం జరగడంతో స్పాట్ వాల్యుయేషన్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. -
15న పదో తరగతి ఫలితాలు
ఉదయం 11 గంటలకు విడుదల సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈనెల 15న విడుదల కానున్నాయి. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆరోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలోని డి-బ్లాక్ సమావేశ మందిరంలో ఈ ఫలితాలు విడుదల చేయనున్నారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 15 వరకు జరిగిన టెన్త్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 21 వేల స్కూళ్ల నుంచి 12.26 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. గత నెల 16న ప్రారంభమైన స్పాట్ వాల్యుయేషన్ ముగి యడంతో ఫలితాల వెల్లడికి సంబంధించిన పనుల్లో అధికారులు నిమగ్నమయ్యా రు. ఇక ఆ తరువాత నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఎక్కడివి అక్కడే (తెలంగాణ జిల్లాలవి తెలంగాణలో, సీమాంధ్ర జిల్లాల విద్యార్థులవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో) చేపట్టాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. మరోవైపు ఈనెల 25 నుంచి జరిగే ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 1వ తేదీతో ముగియనున్నాయి. వాటి మూల్యాంకనాన్ని కూడా ఎక్కడివి అక్కడే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. -
‘పది’ మూల్యాంకనం షురూ
ఆదిలాబాద్ రూరల్, న్యూస్‌లైన్ : పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్(మూల్యాంకనం) ఎట్టకేలకు బుధవారం గందరగోళం మధ్య ప్రారంభమైంది. స్థానిక కాన్వెంట్ స్కూల్లోని స్పాట్ వాల్యూయేషన్ కేంద్రానికి ఉదయమే ఉపాధ్యాయ సంఘాల నాయకులు పెద్దమొత్తం చేరుకున్నారు. వెంటనే ఉపాధ్యాయులపై సస్పెన్షన్ ఎత్తి వేయాలని కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినదించారు. ఏకపక్ష నిర్ణయం సరికాదని అన్నారు. దీంతో మూల్యాంకన కేంద్రం వద్ద గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా బలగాలను మొహరించారు. కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించారు. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కావాల్సిన పది జవాబు పత్రాల మూల్యాంకనం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైంది. ఇన్విజిలేటర్ల నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్నారని కలెక్టర్ ఆయా పరీక్ష కేంద్రాల్లోని జిల్లా వ్యాప్తంగా 29 మంది ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. వారి సస్పెన్షన్ ఎత్తి వేసే వరకు మూల్యాంకనంలో పాల్గొనేది లేదని ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు ‘స్పాట్’ను బహిష్కరించారు. స్పందించిన కలెక్టర్ 17మంది ఉపాధ్యాయులపై సస్పెన్షన్ ఎత్తివేసినట్లు డీఈవో రామారావు ప్రకటించారు. మిగితా 12మంది సస్పెన్షన్లను పరిశీలించి త్వరలోనే ఎత్తి వేస్తామని ఆయన పేర్కొన్నారు. మూల్యాంకనానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కొనసాగుతుందని వివరించారు. ఈ నెల 28వరకు మూల్యాంకనం కొనసాగుతుందని, ఇందుకోసం 1,400 మంది ఏఈవోలు, సీఈలను నియమించామని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలకు మద్ధతుగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు అశోక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు దారట్ల జీవన్, రవీంద్ర, దేవేందర్, వెంకటి, జాదవ్ కిరణ్‌కుమార్‌నాయక్, శామ్యూల్, పిల్లి కిషన్ పాల్గొన్నారు.