పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈనెల 15న విడుదల కానున్నాయి. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.
ఉదయం 11 గంటలకు విడుదల
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈనెల 15న విడుదల కానున్నాయి. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆరోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలోని డి-బ్లాక్ సమావేశ మందిరంలో ఈ ఫలితాలు విడుదల చేయనున్నారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 15 వరకు జరిగిన టెన్త్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 21 వేల స్కూళ్ల నుంచి 12.26 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. గత నెల 16న ప్రారంభమైన స్పాట్ వాల్యుయేషన్ ముగి యడంతో ఫలితాల వెల్లడికి సంబంధించిన పనుల్లో అధికారులు నిమగ్నమయ్యా రు.
ఇక ఆ తరువాత నిర్వహించే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఎక్కడివి అక్కడే (తెలంగాణ జిల్లాలవి తెలంగాణలో, సీమాంధ్ర జిల్లాల విద్యార్థులవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో) చేపట్టాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. మరోవైపు ఈనెల 25 నుంచి జరిగే ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 1వ తేదీతో ముగియనున్నాయి. వాటి మూల్యాంకనాన్ని కూడా ఎక్కడివి అక్కడే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.