సాక్షి, మదనపల్లె: సచివాలయ మహిళా పోలీసు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మదనపల్లెలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని రామారావుకాలనీ స్టోర్‌వీధికి చెందిన అరుణమ్మ, రెడ్డెప్పల కుమార్తె రెడ్డిరోజా(35)ను, పట్టణంలోని నిమ్మనపల్లె రోడ్డు విద్యోదయా కాలనీకి చెందిన లక్ష్మీరవికుమార్‌తో 16 ఏళ్ల క్రితం వివాహం జరిపించారు. రెడ్డిరోజా కలికిరి మండలం పారపట్ల సచివాలయంలో మహిళా పోలీస్‌గా పనిచేస్తుండగా, కలికిరి పట్టణంలోని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో లక్ష్మీరవికుమార్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. దంపతులు ఇద్దరూ కలికిరిలో నివాసం ఉంటున్నారు.
రెడ్డిరోజా శనివారం పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వచ్చిన అనంతరం మదనపల్లెలో బంధువుల ఇంటిలో జరుగుతున్న శుభకార్యానికి హాజరైంది. సాయంత్రం భర్తతో కలిసి రామారావుకాలనీలోని ఇంటికి వెళ్లింది. అక్కడే ఇద్దరూ ఒకే గదిలో ఉండగా, భర్త టీ కోసం బయటకు వచ్చి పది నిమిషాల అనంతరం గదిలోకి వెళ్లాడు. అప్పటికే రెడ్డిరోజా చీరచున్నీతో గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతుండగా కిందకు దించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. అక్కడి నుంచి హుటాహుటిన రెడ్డిరోజాను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురీ గదికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్‌ఐ రమణ ఆస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను అడిగి వివరాలు సేకరించారు.
అయితే, గత 15 సంవత్సరాలుగా తమకు పిల్లలు లేకపోవడం, అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో తన భార్య రెడ్డిరోజా తీవ్ర మనస్తాపానికి గురైందన్నారు. పలుమార్లు ఈ విషయమై తన వద్ద బాధపడేదని, శనివారం శుభకార్యంలో మరోసారి రెడ్డిరోజా మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని భర్త లక్ష్మీరవికుమార్ చెప్పారు. కాగా, రెడ్డిరోజా తల్లిదండ్రులు అరుణమ్మ, రెడ్డెప్పలు బంధువులతో కలిసి ఆస్పత్రికి చేరుకుని తమ బిడ్డ మృతికి అల్లుడు లక్ష్మీ రవికుమార్ కారణమని ఆరోపిస్తూ గొడవకు దిగారు. గదిలో ఉన్న 10 నిమిషాల్లోనే తమ కుమార్తె ఎలా ఉరివేసుకుంటుందని వాదనకు దిగారు. ఆస్పత్రి అవుట్‌పోస్ట్ పోలీస్ సిబ్బంది వారికి సర్దిచెప్పి, స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. దీంతో అక్కడి నుంచి వెళ్లి వారు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment