భానుగుడి (కాకినాడ సిటీ): పదో తరగతి పరీక్షల మూల్యాంకనానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో పరీక్షలు రాసి ఫలితాల కోసం వేచి చూడాల్సి వచ్చేది. ఆ పద్ధతికి స్వస్తి పలికి, పరీక్షలు ముగిసిన వెంటనే వీలైనంత త్వరగా ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా పరీక్షలు జరుగుతుండగానే మూల్యాంకనం ఏర్పాట్లు షురూ చేసింది. మూల్యాంకన ప్రక్రియ పలు దశల్లో జరగనుంది. తొలుత పరీక్ష కేంద్రాల నుంచి ప్రశ్నపత్రాలను మూల్యాంకనం జరిగే కేంద్రానికి 20 చొప్పున కట్టగా కట్టి తెస్తారు.
వీటిని స్ట్రాంగ్ రూములో పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడి (ఆర్‌జేడీ) పర్యవేక్షణలో భద్రపరుస్తారు. స్ట్రాంగ్‌రూము జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డ్ (డీసీఈబీ) కార్యదర్శి, పరీక్షల విభాగం సహాయ సంచాలకుల పర్యవేక్షణలో ఉంటుంది. స్ట్రాంగ్ రూము నుంచి మూల్యాంకన పత్రాలను చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లకు వాల్యుయేషన్ నిమిత్తం అందిస్తారు. అసిస్టెంట్ ఎగ్జామినర్ రోజుకు 40 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాలి. ఒక్కో జవాబు పత్రానికి టీఏ, డీఏలు కాకుండా రూ.6 చొప్పున చెల్లిస్తారు. మూల్యాంకనంలో చీఫ్ ఎగ్జామినర్లదే కీలక పాత్ర. అసిస్టెంట్ ఎగ్జామినర్లు, చీఫ్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లు, ప్రత్యేక సిబ్బందిగా ప్రభుత్వ ఉపాధ్యాయులను మాత్రమే విధుల్లోకి తీసుకుంటారు.
నేటి నుంచి కోడింగ్.. 12 నుంచి మూల్యాంకనం
మూల్యాంకన ప్రక్రియలో భాగంగా ఆదివారం నుంచి కోడింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. జవాబు పత్రాలపై విద్యార్థుల వివరాలను తొలగించే విధానాన్ని కోడింగ్ అంటారు. కోడింగ్ అనంతరం మూల్యాంకనానికి 950 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లను, 160 మంది చీఫ్ ఎగ్జామినర్లను, మార్కులు, ఇతర వివరాలు నమోదు చేసేందుకు 320 మంది స్పెషల్ అసిస్టెంట్లను నియమించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ పీఆర్‌జీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో మూల్యాంకన ప్రక్రియకు ఏర్పాట్లు చేశారు. ఈ పాఠశాలలోని 36 తరగతి గదులను మూల్యాంకనానికి వినియోగించనున్నారు. మే 12 వరకూ కోడింగ్ ప్రక్రియ, అనంతరం 22వ తేదీ వరకూ మూల్యాంకనం జరగనున్నాయి.
4 లక్షల పరీక్ష పత్రాల మూల్యాంకనం
రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లా కావడంతో 4 లక్షల ప్రశ్నపత్రాలను మూల్యాంకనం చేయనున్నాం. ఈ ప్రక్రియకు ఆదివారం నుంచి శ్రీకారం చుడుతున్నాం. అన్ని గదుల్లోనూ పక్కా ఏర్పాట్లు చేశాం. ఫ్యాన్లు, లైట్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాం.
– డి.మధుసూదనరావు, ఆర్‌జేడీ, కాకినాడ
ఏర్పాట్లు పూర్తి
మూల్యాంకానికి విధుల్లోకి తీసుకునే ఉపాధ్యాయులకు ఇప్పటికే వాట్సాప్, మెయిల్ ద్వారా ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. వేసవి కారణంగా సిబ్బందికి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలూ తీసుకున్నాం.
– దాట్ల సుభద్ర, జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment