స్పాట్‌లో అలసత్వం వహిస్తే చర్యలు
స్పష్టం చేసిన ఆర్‌ఐవో పాపారావు
జోరందుకున్న ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్
శ్రీకాకుళం న్యూకాలనీ : ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యూయేషన్‌లో అలసత్వం వహించి తప్పులు చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని, తక్షణమే తప్పిస్తామని ఆర్‌ఐవో, క్యాంప్ ఆఫీసర్ పాత్రుని పాపారావు హెచ్చరించారు. శ్రీకాకుళంలోని ఆర్‌సీఎం సెయింట్‌జాన్స్ జూనియర్ కళాశాల కేంద్రంగా జరుగుతున్న తొలి విడతలో తెలుగు, ఇంగ్లిష్, హిందీ, మ్యాథ్స్, సివిక్స్ పేపర్ల మూల్యాంకనం కొనసాగుతోంది. అయితే ఇంగ్లిష్ సబ్జెక్టులో కొంతమంది ఎగ్జామినర్లు తప్పుల మీద తప్పులు చేస్తున్నట్లు.. మార్కులు కేటాయింపుల్లో హెచ్చు తగ్గులు ఉంటున్న విషయం ఆర్‌ఐవో వద్దకు చేరుకుంది. దీంతో ఆదివారం సదరు ఎగ్జామినర్లను సున్నితంగా మందలించారు. అనుభవం ఉన్నవారు ఇలా చేయడం సరికాదని, ఒకటికి రెండుమార్లు సరి చూసుకోవాలన్నారు.
విద్యార్థుల జీవితాలు మన చేతుల్లో ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలని హితబోధ చేశారు. మళ్లీ ఇదే సీన్ రిపీటయితే విధుల నుంచి తప్పిస్తామని హెచ్చరించారు. సమయపాలన విధిగా పాటించాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా స్పాట్ వాల్యూయేషన్ జొరందుకుంది. తొలి మూడు రోజులు అధికారులు, ఎగ్జామినర్లు, స్కూృటినైజర్ల నియామకాలతో మందకొడిగా సాగుతూ వస్తున్న స్పాట్ ఊపందుకుంది. ఈ నెల 23 నుంచి రెండు విడతలుగా ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్ల దిద్దుబాటు ప్రక్రియ మొదలుకానుందని అధికారులు వెల్లడించారు.