సాక్షి, రంగారెడ్డి జిల్లా: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనానికి డుమ్మా కొట్టిన టీచర్లపై జిల్లా విద్యాశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పేపర్ల మూల్యాంకనానికి గైర్హాజరైన 163 మంది ఉపాధ్యాయులకు నోటీసులు జారీచేసింది. విద్యాశాఖ చర్యలతో ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం రేగింది. పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం హయత్‌నగర్‌లోని వర్డ్ అండ్ డీడ్ పాఠశాలలో కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈనెల 15న మూల్యాంకనం ప్రారంభంకాగా.. తొలిరోజు ఇంగ్లిష్ లాంగ్వేజ్ పేపర్ల మూల్యాంకనానికి 163 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు (స్కూల్ అసిస్టెంట్లు) అనధికారికంగా గైర్హాజరయ్యారు. అన్ని పేపర్ల మూల్యాంకనం ఈనెల 26వ తేదీకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 11 రోజుల్లోనే ఆరు లక్షల జవాబు పేర్లను దిద్దాల్సిన బాధ్యతను సుమారు మూడు వేల మంది టీచర్లకు అప్పగించారు. స్వల్ప సమయంలో లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉండగా.. టీచర్లు బాధ్యతారాహిత్యంగా విధులకు గైర్హాజరయ్యారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన డీఈఓ కె.సత్యనారాయణరెడ్డి.. డుమ్మా కొట్టిన టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. సీసీఏ నియయ నిబంధనలు–1991 ప్రకారం సర్వీసు నుంచి ఎందుకు సస్పెండ్ చేయకూడదో పేర్కొనాలని నోటీసుల్లో ప్రస్తావించారు. 24 గంటలలోగా వివరణ ఇవ్వాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఇదీ పరిస్థితి..
ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారు, వికలాంగులు, ఏడాదిలోపు శిశువు ఉన్న టీచర్లకు మూల్యాంకన విధులకు సాధారణంగా గైర్హాజరవుతారు. దీన్ని ఎవరూ తప్పబట్టరు. అయితే ఒక్క సబ్జెక్టుకు సంబంధించిన టీచర్లే భారీగా డుమ్మా కొట్టిన తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే వారు స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్‌లో రిపోర్టు చేయలేదని తెలుస్తోంది. వాస్తవంగా జవాబు పత్రాల మూల్యంకనం.. టీచర్ల విధుల్లో భాగం. పైగా ఈ విధులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇటువంటి కీలక బాధ్యతలు చేపట్టాల్సిన ఉపాధ్యాయలు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని జిల్లా విద్యాశాఖ ఉపేక్షించడం లేదు. వాస్తవంగా గతంలో పోల్చుకుంటే మూల్యాంకనం ఈసారి కొంత ఆలస్యమైంది.
అంతకుముందు పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించడానికి ముందే వాల్యుయేషన్ ముగిసేది. అయితే ఇటీవల లోక్‌సభ ఎన్నికలు రావడంతో మూల్యాంకనానికి ఆలస్యమైంది. సెలవు రోజుల్లో మూల్యాంకనం చేస్తే ఉపాధ్యాయులు సంపాదిత సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. సంపాదిత సెలవులకు బదులుగా పాత ఉత్తర్వుల ప్రకారం టీఏ, డీఏలు ఇస్తోంది. కచ్చితంగా సంపాదిత సెలవులే ఇవ్వాలని టీచర్లు పట్టుబడుతున్నారు. పైగా కొత్త జిల్లాల ప్రకారం స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్‌ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు అనుగుణంగా క్యాంప్‌ను కొనసాగిస్తున్నారు. ఈ కేంద్రానికి వికారాబాద్, మేడ్చల్ జిల్లాల నుంచి రాకపోకలు జరిపేందుకు తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉపాధ్యాయులు విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపైనా సర్కారు స్పందించలేదు. ఈ రెండు కారణాల వల్లే కొందరు టీచర్లు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. మరికొందరు మూల్యాంకనం తమ బాధ్యత కాదన్నట్లుగా భావించి పెడచెవిన పెట్టినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment