‘స్పాట్’లో ఉద్రిక్తత
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాక్టో, ఫ్యాప్టో మంగళవారం చేపట్టిన పదో తరగతి మూల్యాంకనం బహిష్కరణ ఉద్రిక్తతకు దారి తీసింది.
- పదోతరగతి మూల్యాంకనం బహిష్కరణకు ఉపాధ్యాయ సంఘాల యత్నం
- ‘స్పాట్’ సెంటర్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
- నాయకుల అరెస్ట్, విడుదల
అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాక్టో, ఫ్యాప్టో మంగళవారం చేపట్టిన పదో తరగతి మూల్యాంకనం బహిష్కరణ ఉద్రిక్తతకు దారి తీసింది. బహిష్కరణకు ముందుగానే పిలుపునివ్వడంతో అనంతపురంలోని ‘స్పాట్’ కేంద్రమైన కేఎస్‌ఆర్ బాలికోన్నత పాఠశాల వద్ద మంగళవారం ఉదయం ఏడు గంటలకే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాధారణ పోలీసులతో పాటు పదుల సంఖ్యలో స్పెషల్ పార్టీ పోలీసులను మోహరించారు. 144 సెక‌్షన్ అమలులో ఉన్నందున ఇటువైపు ఎవరూ రావొద్దంటూ ఆంక్షలు విధించారు. అయితే.. ఎనిమిది గంటల సమయంలో వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.ఓబుళపతి, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి తదితరులు కేఎస్‌ఆర్ పాఠశాల గేటు వద్దకు చేరుకున్నారు. విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన వారిని అడ్డుకున్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికే మూల్యాంకనం బహిష్కరిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో వచ్చిన వారిలో ఎక్కువ మంది విధుల్లో పాల్గొనకుండా వెనుదిరిగారు. ఉపాధ్యాయ నాయకులను పోలీసులు అడ్డగించారు. బలవంతంగా జీపులో టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ మూల్యాంకన కేంద్రం వద్ద కర్ఫ్యూ వాతావరణాన్ని తలిపించేలా బందోబస్తు ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టారు. తామేమీ సంఘ విద్రోహశక్తులం కామని, సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుండగా.. ఎస్‌ఎల్‌టీఏ, టీఎన్‌యూఎస్ నాయకులు తాము విధుల్లో పాల్గొంటామని, పేపర్లు దిద్దేందుకు ఇవ్వాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయితే అప్పటికే 90 శాతానికి పైగా టీచర్లు ‘స్పాట్’లో పాల్గొనకుండా వెళ్లిపోయారు. ఈ హైడ్రామా మధ్యాహ్నం 12 గంటల దాకా నడిచింది. చివరకు అందుబాటులో ఉన్న కొందరు ఉపాధ్యాయులకు పేపర్లు దిద్దే అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు భద్రత కొనసాగించారు.