టెన్త్‌ స్పాట్‌కు తిప్పలు! | Some teachers do not like the evaluation of answer sheets | Sakshi

టెన్త్‌ స్పాట్‌కు తిప్పలు!

Published Sat, Apr 15 2023 3:14 AM | Last Updated on Sat, Apr 15 2023 3:19 PM

Some teachers do not like the evaluation of answer sheets - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనానికి తిప్పలు తప్పడం లేదు. ఓవైపు ఇబ్బందులు, మరోవైపు టీచర్ల అనాసక్తి కారణంగా జవాబు పత్రాలను దిద్ది మార్కులు వేసే ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. కొందరు టీచర్లు అనారోగ్యమనో, మరో అత్యవసర కారణమో చూపుతూ స్పాట్‌ వ్యాల్యూయేషన్‌ను తప్పించుకుంటున్నారని.. మరికొందరు చెప్పకుండానే హాజరుకావడం లేదని అధికారులు చెప్తున్నారు. మరోవైపు స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రాల వద్ద ఎలాంటి సౌకర్యాలూ ఉండటం లేదని, అసలే వేసవి కావడంతో తీవ్రంగా అవస్థలు పడుతున్నామని టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

డ్యూటీ వేసినా కూడా.. 
రాష్ట్రవ్యాప్తంగా ఇటీవలే టెన్త్‌ పరీక్షలు ముగిశాయి. స్పాట్‌ వాల్యూయేషన్‌ ప్రక్రియను గురువారం నుంచి మొదలు పెట్టారు. గతంలో మూల్యాంకన కేంద్రాలు 12 ఉంటే, ఈసారి 18కి పెంచారు. జిల్లా ల వారీగా సబ్జెక్టు, లాంగ్వేజ్‌ నిపుణులను మూ ల్యాంకన విధులకు తీసుకున్నారు. సాధారణంగా విద్యాశాఖ అధికారులు మూల్యాంకన ప్రక్రియ మొదలవడానికి కేవలం రెండు రోజుల ముందుగా టీచర్లకు విధులు వేస్తుంటారు.

ఈసారి కూడా అలా గే చేశారు. అయితే డ్యూటీ వేశారని తెలియడంతోనే కొందరు టీచర్లు నేరుగా వైద్యులను సంప్రదించి, ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నట్టు మెడిక ల్‌ సర్టిఫికెట్‌ తీసుకొచ్చి.. మూల్యాంకనం విధుల నుంచి తప్పించాలని కోరారు. మరికొందరు తొలి రోజు విధులకు హాజరవ్వలేదు. కరీంనగర్, ఆదిలా బాద్‌ జిల్లాలో ఎక్కువ మంది ఇలా డుమ్మా కొట్టడంతో అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు. 

కఠినంగా వ్యవహరించాల్సిందే.. 
మూల్యాంకన విధులకు హాజరవని టీచర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. బలమైన కారణాలుంటే తప్ప, మెడికల్‌ సర్టిఫికెట్లను అనుమతించకూడదని స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే కొన్ని సంఘాల నేతలు తమ వారిని విధుల నుంచి తప్పించాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ఆన్‌లైన్‌ మూల్యాంకన విధానం చేపడితే ఈ తిప్పలు ఉండవని.. విద్యాశాఖ ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. మొత్తంగా 30 లక్షలకుపైగా సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉండగా.. వివిధ సమస్యలతో ఈ ఏడాది స్పాట్‌ వాల్యూయేషన్‌ ఆలస్యమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది టెన్త్‌ ఫలితాల వెల్లడిపైనా ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ విషయమై పాఠశాల విద్య డైరెక్టర్‌ దేవసేనను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె స్పందించలేదు. 

టీచర్లు చెప్తున్న ఇబ్బందులేమిటి? 
♦ మూల్యాంకనం చేసే జవాబుపత్రాలకు ఒక్కోదానికి రూ.10 చెప్పున టీచర్లకు చెల్లిస్తారు. ఒక్కో టీచర్‌ రోజుకు 36 కన్నా ఎక్కువ సమాధాన పత్రాలను దిద్దలేరు. దూరప్రాంతాల నుంచి వచ్చే టీచర్లకు టీఏ, డీఏలేమీ ఇవ్వడం లేదు. పైగా మూల్యాంకన కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉండాలి. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అని కొందరు టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
♦  మూల్యాంకన కేంద్రాలను ఎక్కువగా ప్రైవేటు స్కూళ్లలో ఏర్పాటు చేశారు. అక్కడ విద్యార్థు లు కూర్చునే చిన్న బల్లలు ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వాటిపై కూర్చుని పేపర్లు దిద్దడం కష్టంగా ఉంటోందని, వెన్నునొప్పి వస్తోందని టీచర్లు అంటున్నారు. 
♦  ఈసారి ఆరు పేపర్లతోనే టెన్త్‌ పరీక్షలు నిర్వహించారు. గతంలో మొత్తంగా 11 పేపర్లు ఉండేవి. దీనితో ఎక్కువ పేపర్లు మూల్యాంకనం చేసే అవకాశం ఉండటం లేదని అంటున్నారు. 
♦ స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రాలకు టీచర్లు  కచ్చితంగా ఉదయం 8.30 గంటలకు చేరుకోవాలి. ఐదు నిమిషాలు ఆలస్యమైనా క్యాంపు ఆఫీసర్లు గేటు వద్దే ఆపేస్తున్నారు. దీన్ని టీచర్లు అవమానంగా భావిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న తమ కష్టాలు చూడకుండా నిలిపివేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement