arts groups
-
‘సెట్’ రద్దు సరే... మరి సీటు?
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ అధ్యాపకులకు తలనొప్పిగా మారుతోంది. 2025–26 విద్యా సంవత్సరం నుంచి గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు అర్హత పరీక్షలను గురుకుల విద్యాసంస్థల సొసైటీలు రద్దు చేశాయి. గురుకుల పాఠశాలలో పదోతరగతి చదివి ఉత్తీర్ణత సాధించిన వారికి నేరుగా ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం వరకు సెట్ నిర్వహించి... మార్కుల ఆధారంగా ప్రవేశాలు ఇస్తుండగా.. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందులోభాగంగా ప్రస్తుతం పదోతరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ఇంటర్లో ఎంపిక చేసుకునే కోర్సుకు సంబంధించిన సమాచారాన్ని స్వీకరిస్తున్నారు. ఇందులోభాగంగా ప్రతి విద్యార్థిని వారి అభిరుచులు, తదుపరి కోర్సుకు సంబంధించిన సమాచారాన్ని రికార్డు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీసీ, బైపీసీ కోర్సులను ఎంపిక చేసుకునే వారికి అదే కాలేజీలో సీటుకు ఎంపిక చేసుకుంటుండగా... సీఈసీ, ఇతర కోర్సులు కోరుకుంటున్న వారిని సమీపంలోని కాలేజీలకు పంపేందుకు ప్రాథమిక జాబితాలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే మెజార్టీ విద్యార్థులు మాత్రం ప్రస్తుతమున్న కాలేజీలోనే చదువుతామనే డిమాండ్ వినిపిస్తుండగా... కొందరు నగరంలోని కాలేజీల్లో చదువుతామని, మరికొందరు గురుకులాల్లో అందుబాటులో లేని కోర్సులకు ప్రాధాన్యత ఇస్తుండటం గురుకులాల అధ్యాపకులను గందరగోళానికి గురిచేస్తోంది. పరిమితంగా ఆర్ట్స్ గ్రూపులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల కాలేజీల్లో ఎక్కువగా ఎంపీసీ, బైపీసీ గ్రూపులే ఉన్నాయి. పరిమిత కాలేజీల్లోనే ఆర్ట్స్ గ్రూపులున్నాయి. కొన్నింట్లో ఎంఈసీ ఉండగా... సీఈసీ, హెచ్ఈసీ కోర్సులు లేవు. ప్రస్తుతం విద్యార్థుల నుంచి తీసుకుంటున్న సమాచారం ప్రకారం ఎక్కువ మంది మ్యాథ్స్, సైన్స్ గ్రూపులు చెబుతున్నప్పటికీ... మరికొందరు ఆర్ట్స్ గ్రూపుల పేర్లు చెబుతున్నారు. దీంతో అందుబాటులో లేని కోర్సుల్లో ప్రవేశాలు ఎలా అనే ప్రశ్న అధ్యాపకుల్లో తలెత్తుతోంది. దీంతో పరిస్థితిని జిల్లా కోఆర్డినేటర్లకు నివేదిస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ కోర్సులను ఎక్కువ మంది ఎంపిక చేసుకుంటుండటంతో సీట్ల పరిమితికి మించితే ఆయా విద్యార్థులను పొరుగు కాలేజీలకు రిఫర్ చేయాలని భావిస్తున్నారు. అయితే అందుకు విద్యార్థి సమ్మతి కూడా తప్పనిసరి. కానీ విద్యార్థులకు అవగాహన కల్పించకుండా... కేవలం వివరాలు సేకరించి నేరుగా అడ్మిషన్లు ఇవ్వొద్దని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుండగా... గురుకులాల్లో మెరుగైన విద్యాసంస్థలుగా ఉన్న సీఓఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ) జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలను మెరిట్ ఆధారంగా కల్పించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పదోతరగతిలో జీపీఏ 10 పాయింట్లు వచ్చిన వారికే అవకాశం కల్పించనున్నారు. అందుకు పదోతరగతి ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.643 రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులస్కూళ్లు/కాలేజీలు60,000 గురుకులాల్లో టెన్త్ చదువుతున్న విద్యార్థులు60,000 ఆ కాలేజీల్లో ఇంటర్లో ఉండే మొత్తం సీట్లు -
అమ్మాయిలు @ ఆర్ట్స్
ఉన్నత విద్యపై అఖిల భారత సర్వే సాక్షి, హైదరాబాద్: నువ్వు ఏమి కావాలనుకుంటున్నావ్ అని ఏ విద్యార్థిని అడిగినా.. ఏ ఇంజనీరో, డాక్టరో అని ఠక్కున చెప్పేసేవారే ఎక్కువ మంది ఉండేవారు. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని డాక్టర్‌గానో, ఇంజనీర్‌గానో చూసుకోవాలనే అనుకునేవారు. కానీ ప్రస్తుతం ఆ ట్రెండ్ మారింది. డిగ్రీ, పీజీ స్థాయిల్లో సాంకేతిక విద్య, సైన్స్ గ్రూపుల కంటే ఆర్ట్స్ గ్రూపులపైనే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో అమ్మాయిలు.. అబ్బాయిల కంటే ముందున్నారు. ఏకంగా 37.97 శాతం మంది అమ్మాయిలు ఆర్ట్స్ కోర్సులపై మక్కువ చూపిస్తుండగా, 30.25 శాతం మంది అబ్బాయిలు ఈ గ్రూపుల్లో చేరడానికే ఇష్టపడుతున్నారు. అయితే ఇంజనీరింగ్‌లో చేరుతున్న వారిలో అమ్మాయిలు చాలా తక్కువగా (12 శాతం ) ఉండటం గమనార్హం. మరోవైపు బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ)లో 25.74% మంది చేరుతున్నా, పోస్టు గ్రాడ్యుయేషన్‌కు (పీజీ) వచ్చేసరికి వారి సంఖ్య 3.98 శాతానికి తగ్గిపోతోంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. 2012-13 గణాంకాల ఆధారంగా మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఉన్నతవిద్యపై రూపొందిస్తున్న అఖిలభారత సర్వేలో ఈ అంశాలను పొందుపరిచారు. ప్రస్తుతం నివేదిక రూపకల్పన చివరి దశలో ఉంది. త్వరలో అందుబాటులోకి రానుంది. దేశ వ్యాప్తంగా ఏటా 79% మంది డిగ్రీలో చేరుతుండగా, వారిలో పీజీకి వస్తున్న వారు 11.8 శాతమే. డిగ్రీలో గ్రూపుల వారీగా చూస్తే బీఏలో అత్యధికంగా 25.74% చేరుతున్నారు. అందులో అమ్మాయిలు 29.93 శాతం కాగా, అబ్బాయిలు 22.42 శాతం. ఇక బీకాంలో 11.04 శాతం మంది చేరుతుండగా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్‌లో 9.35% మంది, బీటెక్‌లో 7.46 శాతం, బీఈలో 7.99 శాతం మంది చేరుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితిదీ... - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 21,57,338 మంది డిగ్రీ కోర్సుల్లో చేరుతుంటే పోస్టు గ్రాడ్యుయేషన్‌కు వస్తున్నవారు 4,69,123 మంది మాత్రమే. అంటే 21.7 శాతం అన్నమాట. ఇదీ దేశ సగటుతో పోల్చితే దాదాపు రెట్టింపు. - మహారాష్ట్రలో అత్యధికంగా ఏటా 28.28 లక్షల మంది డిగ్రీ కోర్సుల్లో చేరుతుండగా 3.79 ల క్షల మంది మాత్రమే పీజీలో చేరుతున్నారు. ఇది మన రాష్ట్రం కంటే తక్కువే. - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పీహెచ్‌డీలో చేరుతున్నవారు 7,987 మంది ఉండగా, ఎం.ఫిల్లో చేరుతున్నవారు 1,282 మంది మాత్రమే. పీజీ డిప్లొమా కోర్సుల్లో చేరుతున్నవారు 4,538 మంది ఉండగా, డిప్లొమా కోర్సుల్లో 1.21 లక్షల మంది చేరుతున్నారు. - డిప్లొమా కోర్సులతోపాటు సర్టిఫికెట్ కోర్సులు, ఇంటిగ్రేటెడ్ కోర్సులు అన్ని కలిపి తెలంగాణ, ఏపీ నుంచి మొత్తం 27.72 లక్షల మంది ఉన్నత విద్యను అభ్యసిస్తూ మూడో స్థానంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా 2.85 కోట్ల మంది ఉన్నత విద్యను అభ్యసిస్తుండగా, అందులో 39.77 లక్షల మందితో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. 36.89 లక్షల మందితో మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది.