అమ్మాయిలు @ ఆర్ట్స్ | women prefer arts groups in Higher education | Sakshi
Sakshi News home page

అమ్మాయిలు @ ఆర్ట్స్

Published Sun, Jul 13 2014 1:16 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

అమ్మాయిలు @ ఆర్ట్స్ - Sakshi

అమ్మాయిలు @ ఆర్ట్స్

 ఉన్నత విద్యపై అఖిల భారత సర్వే

 సాక్షి, హైదరాబాద్: నువ్వు ఏమి కావాలనుకుంటున్నావ్ అని ఏ విద్యార్థిని అడిగినా.. ఏ ఇంజనీరో, డాక్టరో అని ఠక్కున చెప్పేసేవారే ఎక్కువ మంది ఉండేవారు. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని డాక్టర్‌గానో, ఇంజనీర్‌గానో చూసుకోవాలనే అనుకునేవారు. కానీ ప్రస్తుతం ఆ ట్రెండ్ మారింది. డిగ్రీ, పీజీ స్థాయిల్లో సాంకేతిక విద్య, సైన్స్ గ్రూపుల కంటే ఆర్ట్స్ గ్రూపులపైనే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో అమ్మాయిలు.. అబ్బాయిల కంటే ముందున్నారు. ఏకంగా 37.97 శాతం మంది అమ్మాయిలు ఆర్ట్స్ కోర్సులపై మక్కువ చూపిస్తుండగా, 30.25 శాతం మంది అబ్బాయిలు ఈ గ్రూపుల్లో చేరడానికే ఇష్టపడుతున్నారు. అయితే ఇంజనీరింగ్‌లో చేరుతున్న వారిలో అమ్మాయిలు చాలా తక్కువగా (12 శాతం ) ఉండటం గమనార్హం. మరోవైపు బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ)లో 25.74% మంది చేరుతున్నా, పోస్టు గ్రాడ్యుయేషన్‌కు (పీజీ) వచ్చేసరికి వారి సంఖ్య 3.98 శాతానికి తగ్గిపోతోంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. 2012-13 గణాంకాల ఆధారంగా మానవ వనరుల మంత్రిత్వ శాఖ  ఉన్నతవిద్యపై రూపొందిస్తున్న అఖిలభారత సర్వేలో ఈ అంశాలను పొందుపరిచారు. ప్రస్తుతం నివేదిక రూపకల్పన చివరి దశలో ఉంది. త్వరలో అందుబాటులోకి రానుంది. దేశ వ్యాప్తంగా ఏటా 79% మంది డిగ్రీలో చేరుతుండగా, వారిలో పీజీకి వస్తున్న వారు 11.8 శాతమే. డిగ్రీలో గ్రూపుల వారీగా చూస్తే బీఏలో అత్యధికంగా 25.74% చేరుతున్నారు. అందులో అమ్మాయిలు 29.93 శాతం కాగా, అబ్బాయిలు 22.42 శాతం. ఇక బీకాంలో 11.04 శాతం మంది చేరుతుండగా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్‌లో 9.35% మంది, బీటెక్‌లో 7.46 శాతం, బీఈలో 7.99 శాతం మంది చేరుతున్నారు.
 
 రాష్ట్రంలో పరిస్థితిదీ...
 
 - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 21,57,338 మంది డిగ్రీ కోర్సుల్లో చేరుతుంటే పోస్టు గ్రాడ్యుయేషన్‌కు వస్తున్నవారు 4,69,123 మంది మాత్రమే. అంటే 21.7 శాతం అన్నమాట. ఇదీ దేశ సగటుతో పోల్చితే దాదాపు రెట్టింపు.
 - మహారాష్ట్రలో అత్యధికంగా ఏటా 28.28 లక్షల మంది డిగ్రీ కోర్సుల్లో చేరుతుండగా 3.79 ల క్షల మంది మాత్రమే పీజీలో చేరుతున్నారు. ఇది మన రాష్ట్రం కంటే తక్కువే.
 - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పీహెచ్‌డీలో చేరుతున్నవారు 7,987 మంది ఉండగా, ఎం.ఫిల్‌లో చేరుతున్నవారు 1,282 మంది మాత్రమే. పీజీ డిప్లొమా కోర్సుల్లో చేరుతున్నవారు 4,538 మంది ఉండగా, డిప్లొమా కోర్సుల్లో 1.21 లక్షల మంది చేరుతున్నారు.
 - డిప్లొమా కోర్సులతోపాటు సర్టిఫికెట్ కోర్సులు, ఇంటిగ్రేటెడ్ కోర్సులు అన్ని కలిపి తెలంగాణ, ఏపీ నుంచి మొత్తం 27.72 లక్షల మంది ఉన్నత విద్యను అభ్యసిస్తూ మూడో స్థానంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా 2.85 కోట్ల మంది ఉన్నత విద్యను అభ్యసిస్తుండగా, అందులో 39.77 లక్షల మందితో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. 36.89 లక్షల మందితో మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement