prefer
-
హైబ్రిడ్ పథకాల పట్ల ఆకర్షణ
న్యూఢిల్లీ: హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ పథకాలకు ఇన్వెస్టర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. జూన్ క్వార్టర్లో రూ.14,021 కోట్లను ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీని వెనుక ప్రభుత్వం ఇటీవల తీసుకొచి్చన నూతన పన్ను నిబంధన కారణమని తెలుస్తోంది. క్రితం ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచి్చన పెట్టుబడులు రూ.10,084 కోట్లుగా ఉన్నాయి. అంటే సమారు 40 శాతం మేర పెట్టుబడులు పెరిగాయి. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో బంగారం తదితర సాధనాల్లోనూ కొంత మేర పెట్టుబడులు పెడతాయి. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల ఫోలియోలు (ఇన్వెస్టర్ల పెట్టుబడి ఖాతాలు) కూడా పెరిగాయి. మధ్యస్థం నుంచి తక్కువ రిస్క్ తీసుకునే వారికి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈక్విటీ, డెట్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ కాస్త తగ్గుతుంది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో ఇవే హైబ్రిడ్ ఫథకాల నుంచి ఇన్వెస్టర్లు రూ.7,420 కోట్లను నికరంగా ఉపసంహరించుకోవడం గమనార్హం. గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలోనూ రూ.7,041 కోట్లు, సెపె్టంబర్ త్రైమాసికంలో రూ.14,436 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. 2021 డిసెంబర్ త్రైమాసికం తర్వాత హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి గరిష్ట స్థాయిలో పెట్టుబడులు రావడం మళ్లీ జూన్ త్రైమాసికంలోనే నమోదైంది. పన్ను పరమైన అనుకూలత హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి పెట్టుబడులు రావడం వెనుక పన్ను పరమైన ప్రయోజనాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను మూడేళ్లపాటు కొనసాగిస్తే వచి్చన లాభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి చూపించుకునే అవకాశం ఉండేది. దీంతో పన్ను భారం తక్కువగా ఉండేది. కానీ, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచి్చన నిబంధనల ప్రకారం డెట్ ఫండ్స్‌లో పెట్టుబడుల కాల వ్యవధితో సంబంధం లేకుండా లాభం వార్షిక ఆదాయంలో భాగంగా చూపించి పన్ను చెల్లించడం తప్పనిసరి. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించుకునే వెసులుబాటు రద్ధు చేశారు. దీంతో ఆవి ఆకర్షణను కోల్పోయాయి. డెట్ పథకాలకు సంబంధించి పన్ను నిబంధనలో మార్పు హైబ్రిడ్ పథకాల్లోకి పెట్టుబడులు పెరిగేందుకు కారణమైనట్టు క్లయింట్ అసోసియేట్స్ సహ వ్యవస్థాపకుడు హిమాన్షు కోహ్లి తెలిపారు. ‘‘ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో వార్షిక రాబడి 7 శాతంగా ఉంటుంది. డెట్ ఫండ్స్‌తో పోలిస్తే పన్ను పరంగా అనుకూలమైనది. అందుకే ఈ విభాగంలో మరింత ఆదరణ కనిపిస్తోంది’’ అని వివరించారు. డెట్ ఫండ్స్‌పై పన్ను నిబంధన మారిపోవడంతో ఇన్వెస్టర్లు హైబ్రిడ్ పథకాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు మారి్నంగ్‌స్టార్ రీసెర్చ్ మేనేజర్ కౌస్తభ్ బేల పుర్కార్ తెలిపారు. ఆర్బిట్రేజ్ ఫండ్స్ తక్కువ అస్థిరతలతో, ఈక్విటీ పన్ను ప్రయోజనం కలిగి ఉండడం ఆకర్షణీయమైనదిగా పేర్కొన్నారు. హైబ్రిడ్ పథకాల్లో లాభాలకు ఈక్విటీ మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది కనుక తక్కువ పన్ను అంశం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోందని తెలుస్తోంది. -
మహిళల ఓటు రియల్ ఎస్టేట్‌కే
న్యూఢిల్లీ: దేశంలో మెజారిటీ మహిళలు సొంతింటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. తాము రియల్టీలో పెట్టుబడులు పెడతామని 65 శాతం మంది మహిళలు ఓ సర్వేలో భాగంగా చెప్పారు. 20 శాతం మంది తాము స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించగా, 8 శాతం మంది బంగారానికి ఓటు చేశారు. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ‘అనరాక్’ ఈ సర్వేని నిర్వహించింది. 5,500 మంది వినియోగదారుల అభిప్రాయాలను అనరాక్ సర్వే తెలుసుకుంది. ఇందులో సగం మంది మహిళలు పాల్గొన్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తామని 7 శాతం మంది చెప్పారు. రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పిన వారిలో 83 శాతం మంది రూ.45 లక్షలకు పైన ధర కలిగిన వాటిని తీసుకుంటామని తెలిపారు. ‘‘ఇంటిని కొనుగోలు చేయాలనుకునే మహిళల్లో 33 శాతం మంది రూ.45–90 లక్షల శ్రేణిలో ఉన్న వాటికి అనుకూలంగా ఉన్నారు. 27 శాతం మంది రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య బడ్జెట్లో చూస్తున్నారు. ఇక 20 శాతం మంది రూ.1.5 కోట్లకుపైన ఉన్న విలాసవంతమైన ఇళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రూ.45 లక్షల్లోపు ధరలోని అందుబాటు ధరల ఇళ్లు చాలా తక్కువ మంది ఎంపికగా ఉన్నాయి’’అని అనరాక్ వెల్లడించింది. గతంలో మహిళలు ఇళ్లను 77 శాతం మేర నివాసం కోసమే తీసుకోగా, తాజాగా అది 82 శాతానికి చేరింది. మిగిలిన వారు పెట్టుబడుల కోణంలో తీసుకుంటున్నారు. పలు ప్రయోజనాలు.. మహిళలు తమ పేరిట ఇళ్లను కొనుగోలు చేయడం వల్ల పలు ప్రయోజనాలు పొందొచ్చని అనరాక్ సూచించింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పేరిట యాజమాన్య హక్కులను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపింది. 2015లో తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద ప్రయోజనాలు పొందాలంటే ప్రాపర్టీ మహిళల పేరిట నమోదు చేయడం లేదంటే సహ యజమానిగా ఉండాలన్న విషయాన్ని ప్రస్తావించింది. మహిళలకు స్టాంప్ డ్యూటీ చార్జీలు తక్కువగా ఉండడాన్ని కూడా పేర్కొంది. బ్యాంకులు మహిళలకు తక్కువ రేట్లపై గృహ రుణాలను ఇస్తున్నట్టు తెలిపింది. -
హెల్త్ ఇన్సూరెన్స్‌పై కీలక సర్వే! ఈ విషయాలు తెలుసుకోండి!
ముంబై: అవసరమైతే ఖరీదైన కొనుగోళ్లకు దూరంగా ఉండి మరీ, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని దేశంలో మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ నిర్వహించిన సర్వేలో 85 శాతం మంది ఇదే చెప్పారు. 19 పట్టణాల నుంచి 6,600 మంది సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేశారు. కరోనాతో అనిశ్చితి, ఆందోళనకర పరిస్థితులతో మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడినట్టు ఈ సర్వే నివేదిక పేర్కొంది. సర్వేలో పాల్గొన్న 89 శాతం మంది తమ హెల్త్ ఇన్సూరెన్స్‌లో హెల్త్ కన్సల్టేషన్ (వైద్య సలహా) కూడా భాగంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కనుక మానసిక ఆరోగ్యంపై అత్యవసర అవగాహన అవసరం ఉన్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. కరోనా తర్వాత ఆరోగ్యం, శ్రేయస్సుపై తమ అవగాహన పెరిగినట్టు 84 శాతం మంది సర్వేలో చెప్పారు. వైద్య అత్యవసరాల్లో వినియోగించుకునేందుకు వీలుగా కొంత నిధిని పక్కన పెట్టనున్నట్టు 52 శాతం మంది తెలిపారు. ఖర్చు దృష్ట్యా తాము మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించేందుకు వెనుకాడినట్టు 35 శాతం మంది వెల్లడించారు. తాము బరువు, రక్తపోటు తదితర ఆరోగ్య అంశాలను తరచూ పర్యవేక్షించుకోవడం లేదని ప్రతి ముగ్గురిలో ఒక్కరు చెప్పడం గమనార్హం. కరోనా తర్వాత ఆరోగ్యం విషయంలో ప్రజల ఆలోచన విధానం మారిందని, ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండడంతోపాటు అత్యవసర పరిస్థితుల పట్ల సన్నద్ధతను అర్థంచేసుకుంటున్నారని ఆదిత్య బిర్లాహెల్త్ ఇన్సూరెన్స్ సర్వే నివేదిక తెలిపింది. ‘‘ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరాన్ని కరోనా తర్వాత ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. టెక్నాలజీ సాయంతో తాము తీసుకునే ఆహారాన్ని పర్యవేక్షించుకుంటున్నారు’ ’అని ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో మయాంక్ భత్వాల్ తెలిపారు. -
అమ్మాయిలు @ ఆర్ట్స్
ఉన్నత విద్యపై అఖిల భారత సర్వే సాక్షి, హైదరాబాద్: నువ్వు ఏమి కావాలనుకుంటున్నావ్ అని ఏ విద్యార్థిని అడిగినా.. ఏ ఇంజనీరో, డాక్టరో అని ఠక్కున చెప్పేసేవారే ఎక్కువ మంది ఉండేవారు. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని డాక్టర్‌గానో, ఇంజనీర్‌గానో చూసుకోవాలనే అనుకునేవారు. కానీ ప్రస్తుతం ఆ ట్రెండ్ మారింది. డిగ్రీ, పీజీ స్థాయిల్లో సాంకేతిక విద్య, సైన్స్ గ్రూపుల కంటే ఆర్ట్స్ గ్రూపులపైనే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో అమ్మాయిలు.. అబ్బాయిల కంటే ముందున్నారు. ఏకంగా 37.97 శాతం మంది అమ్మాయిలు ఆర్ట్స్ కోర్సులపై మక్కువ చూపిస్తుండగా, 30.25 శాతం మంది అబ్బాయిలు ఈ గ్రూపుల్లో చేరడానికే ఇష్టపడుతున్నారు. అయితే ఇంజనీరింగ్‌లో చేరుతున్న వారిలో అమ్మాయిలు చాలా తక్కువగా (12 శాతం ) ఉండటం గమనార్హం. మరోవైపు బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ)లో 25.74% మంది చేరుతున్నా, పోస్టు గ్రాడ్యుయేషన్‌కు (పీజీ) వచ్చేసరికి వారి సంఖ్య 3.98 శాతానికి తగ్గిపోతోంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. 2012-13 గణాంకాల ఆధారంగా మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఉన్నతవిద్యపై రూపొందిస్తున్న అఖిలభారత సర్వేలో ఈ అంశాలను పొందుపరిచారు. ప్రస్తుతం నివేదిక రూపకల్పన చివరి దశలో ఉంది. త్వరలో అందుబాటులోకి రానుంది. దేశ వ్యాప్తంగా ఏటా 79% మంది డిగ్రీలో చేరుతుండగా, వారిలో పీజీకి వస్తున్న వారు 11.8 శాతమే. డిగ్రీలో గ్రూపుల వారీగా చూస్తే బీఏలో అత్యధికంగా 25.74% చేరుతున్నారు. అందులో అమ్మాయిలు 29.93 శాతం కాగా, అబ్బాయిలు 22.42 శాతం. ఇక బీకాంలో 11.04 శాతం మంది చేరుతుండగా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్‌లో 9.35% మంది, బీటెక్‌లో 7.46 శాతం, బీఈలో 7.99 శాతం మంది చేరుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితిదీ... - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 21,57,338 మంది డిగ్రీ కోర్సుల్లో చేరుతుంటే పోస్టు గ్రాడ్యుయేషన్‌కు వస్తున్నవారు 4,69,123 మంది మాత్రమే. అంటే 21.7 శాతం అన్నమాట. ఇదీ దేశ సగటుతో పోల్చితే దాదాపు రెట్టింపు. - మహారాష్ట్రలో అత్యధికంగా ఏటా 28.28 లక్షల మంది డిగ్రీ కోర్సుల్లో చేరుతుండగా 3.79 ల క్షల మంది మాత్రమే పీజీలో చేరుతున్నారు. ఇది మన రాష్ట్రం కంటే తక్కువే. - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పీహెచ్‌డీలో చేరుతున్నవారు 7,987 మంది ఉండగా, ఎం.ఫిల్లో చేరుతున్నవారు 1,282 మంది మాత్రమే. పీజీ డిప్లొమా కోర్సుల్లో చేరుతున్నవారు 4,538 మంది ఉండగా, డిప్లొమా కోర్సుల్లో 1.21 లక్షల మంది చేరుతున్నారు. - డిప్లొమా కోర్సులతోపాటు సర్టిఫికెట్ కోర్సులు, ఇంటిగ్రేటెడ్ కోర్సులు అన్ని కలిపి తెలంగాణ, ఏపీ నుంచి మొత్తం 27.72 లక్షల మంది ఉన్నత విద్యను అభ్యసిస్తూ మూడో స్థానంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా 2.85 కోట్ల మంది ఉన్నత విద్యను అభ్యసిస్తుండగా, అందులో 39.77 లక్షల మందితో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. 36.89 లక్షల మందితో మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది.