Gurukul College
-
ఏపీ ‘గురుకుల’ ఫలితాల వెల్లడి
సాక్షి,అమరావతి/గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలోని 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను గురువారం అధికారులు విడుదల చేశారు. ఈ సంస్థ పరిధిలో 38 పాఠశాలలు, 7 జూనియర్ కాలేజీలు, ఒక డిగ్రీ కళాశాల ఉన్నాయి. 2023–24 విద్యా సంవత్సరంలో ఐదో తరగతిలో ఉన్న 3,195 సీట్లకు, 6, 7, 8 తరగతుల్లో మిగిలి ఉన్న 356 ఖాళీల భర్తీకి, ఇంటర్‌లోని ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ/సీఈసీ విభాగాల్లో ఉన్న 1,149 సీట్లకు, డిగ్రీలోని బీఏ, బీకాం, బీఎస్సీలోని 4,852 సీట్లకు గత నెల 20న ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి ఆర్.నరసింహారావు తెలిపారు. విద్యార్థుల ర్యాంకులను వారి మొబైల్ నంబర్లతో పాటు వారి పాఠశాలలకు కూడా పంపించామని, https://aprs.apcfss.in వెబ్సైట్లో కూడా ఉంచామన్నారు. మొత్తం అన్ని విభాగాల్లోను 87,252 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు వివరించారు. వీరికి ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించి అర్హులైనవారికి ప్రవేశాలు కల్పిస్తామన్నారు. కాగా, 12 మైనార్టీ పాఠశాలలు, 3 జూనియర్ కాలేజీల్లో మైనార్టీ విద్యార్థులకు ప్రవేశ పరీక్షతో సంబంధం లేకుండా నేరుగా అడ్మిషన్లు చేపడతామని చెప్పారు. తొలి స్థానంలో నిలిచింది వీరే.. గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలకు 100 మార్కులకు, ఇంటర్, డిగ్రీ కాలేజీ ఎంట్రన్స్ టెస్ట్ 150 మార్కులకు నిర్వహించారు. వీరిలో అత్యధిక మార్కులు సాధించి తొలి స్థానంలో నిలిచిన అభ్యర్థుల పేర్లను గురుకుల విద్యాలయ సంస్థ వెల్లడించింది. ♦ ఐదో తరగతి ప్రవేశ పరీక్షలో విజయనగరం జిల్లాకు చెందిన బి.దిలీప్ కృష్ణ 99 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు. ఆరో తరగతిలో పి.జితేంద్రకుమార్ (శ్రీకాకుళం జిల్లా), ఏడో తరగతిలో జీకే సాయిపవన్ (పశ్చిమ గోదావరి), ఎనిమిదో తరగతిలో కె.నవీన్ కుమార్ (కృష్ణా జిల్లా) మొదటి స్థానం సాధించారు. ♦ ఇంటర్ కేటగిరీలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కె.సాయి సృజన (ఎంపీసీ) 146 మార్కులు, టీ సాహితి (బైపీసీ) 140 మార్కులు, విజయనగరం జిల్లాకు చెందిన కేవీ.వంశీకృష్ణ నాయుడు (ఎంఈసీ/సీఈసీ) 133 మార్కులతో ప్రథమ స్థానం సాధించారు. ♦ డిగ్రీ విభాగంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె.అచ్యుతరావు (బీఏ), విజయనగరం జిల్లాకు చెందిన ఎం.జ్ఞానతేజ (బీకాం), టి.పునీత్ కుమార్ (బీఎస్సీ–ఎంఎస్సీఎస్), పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఎస్.తేజ (బీఎస్సీ–ఎంపీసీ) విభాగాల్లో మొదటి ర్యాంకులు సాధించారు. -
Hyderabad: గురుకుల కాలేజీలో దారుణం
గచ్చిబౌలి/ హైదరాబాద్: గాఢనిద్రలో ఉన్న ఇంటర్ విద్యార్థి గొంతుకోసిన ఘటన గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన వివరాలిలా ఉన్నాయి. కళాశాలలో ఈనెల 25న సాయంత్రం అల్పాహారం వడ్డించే సమయంలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి సాత్విక్ (16) లైన్లో ఉన్నాడు. రెండో సంవత్సరం విద్యార్థి సేమియా వడ్డిస్తుండగా సాత్విక్ చేతిపై పడటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం వడ్డించిన విద్యార్థి.. ఈ విషయాన్ని తన స్నేహితుడికి చెప్పగా, అతడు సాత్విక్‌పై చేయిచేసుకున్నాడు. దీంతో టీచర్లు ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపించారు. ఆ తర్వాత.. రాత్రి హాస్టల్లో నిద్రపోయిన సాత్విక్ 1.30 సమయంలో గొంతు వద్ద నొప్పిగా అనిపించి, నిద్రలేవగా గొంతు భాగంలో రక్తం రావడం గమనించి స్నేహితులకు చెప్పాడు. గొంతు వద్ద రక్తస్రావం అవుతుండటంతో వెంటనే గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. దాదాపు 18 కుట్లు పడ్డాయి. ప్రాణాపాయం లేదని, విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తనపై చేయిచేసుకున్న విద్యార్థే దాడిచేసి ఉంటాడని గచ్చిబౌలి పోలీసులకు సాత్విక్ ఫిర్యాదు చేశాడు. కాగా, బ్లేడ్‌తో అతనిపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అనుమానిత విద్యార్థిని పోలీసులు విచారించి సొంత పూచీకత్తుపై పంపించినట్లు తెలిసింది. తమ కొడుకును కేసులో ఇరికిస్తున్నారని అనుమానితుని తల్లిదండ్రులు ఆరోపించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యాక్షేత్రంలో కలకలం.. గ్రామీణ పేద విద్యార్థులకు ఉత్తమవిద్య అందిస్తూ గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల అగ్రభాగంలో ఉంది. ఇదే కళాశాలలో ఫిబ్రవరి 19న ఇంటర్ విద్యార్థి వంశీకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా సాత్విక్‌పై దాడి జరగడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఇది కూడా చదవండి: వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఆ తర్వాత భార్యను.. -
విద్యార్థినికి సీటు నిరాకరణపై హెచ్ఆర్సీ సీరియస్
కర్నూలు (సెంట్రల్): కరోనా నేపథ్యంలో ఏడాదిపాటు చదువుకు దూరమైన విద్యార్థినిని ఇంటర్మీడియెట్‌లో ప్రవేశానికి నిరాకరించడంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) సీరియస్ అయింది. దీనిపై కంబాలపాడు గురుకుల కాలేజీ ప్రిన్సిపాల్‌తో పాటు ఇంటర్ బోర్డు కమిషనర్, రీజినల్ జాయింట్ డైరెక్టర్లకు హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది. కర్నూలు జిల్లా సి.బెళగళ్ మండలం పోలకల్‌కు చెందిన ఎం.శ్రావణి 2020లో పదో తరగతి పాసైంది. అదే ఏడాది కరోనా విజృంభిస్తుండటంతో ఆమె కాలేజీలో చేరలేదు. ఈ సంవత్సరం కర్నూలు జిల్లా కంబాలపాడు గురుకుల కాలేజీలో చేరేందుకు దరఖాస్తు చేసుకుంది. ఆమె మార్కుల ఆధారంగా బైపీసీలో సీటు వచ్చింది. అయితే గతేడాది ఆమె ఇంటర్లో చేరకపోవడంతో వివరాలు ఆన్లైన్లో నమోదు కావడం లేదంటూ ఆమెకు సీటును నిరాకరించారు. ఈ విషయం మీడియాలో రావడంతో హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఆమెకు సీటు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని కాలేజీ ప్రిన్సిపాల్‌తోపాటు ఇంటర్ బోర్డు కమిషనర్, బోర్డు రీజినల్ డైరెక్టర్లకు నోటీసులు పంపింది. నెల రోజుల్లో ఏమి చర్యలు తీసుకున్నది వివరించాల్సిందిగా కమిషన్ చైర్మన్ ఎం.సీతారామమూర్తి, జ్యుడిషియల్ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం, నాన్ జ్యుడిషియల్ సభ్యుడు ఎం.శ్రీనివాసరావులు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. -
సీటు ఇప్పించండి సారూ..
నల్లమాడ: ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించాలని, ఇందుకోసం ప్రభుత్వం అన్ని వసతులు కల్పి స్తోందని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నారు. అయితే చదువుకోవాలని ఉన్నా కళాశాలలో సీటు రాకపోవడంతో ఓ దళిత విద్యార్థిని ఆవేదనకు గురవుతోంది. సీటు ఇవ్వండి సారూ.. అంటూ జిల్లాలోని అన్ని గురుకుల కళాశాలల చుట్టూ తిరుగుతోంది. తమ బిడ్డకు సీటు రాకుండా ఇంతటితోనే చదువు ఆగిపోతే కూలీగా మారడం మినహా మరో గత్యంతరం లేదని విద్యార్థిని తల్లిదండ్రులు వాపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే... కదిరి రూరల్ మండలం ఎగువపల్లి దళితవాడకు చెందిన గంగప్ప, గంగమ్మ దంపతుల కుమార్తె వై.గౌతమి ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు నల్లమాడ మండలంలోని ఆర్.రామాపురం గురుకుల పాఠశాలలో చదివింది. పదిలో 8.0 గ్రేడ్ పాయింట్లతో ఉత్తీర్ణత సాధించింది. నర్సింగ్ చేసి వైద్యపరంగా సేవ చేయాలన్న ఉద్దేశంతో ఇంటర్లో బైపీసీలో చేరాలనుకుంది. బైపీసీలో సీటు కోసం జిల్లాలోని గుత్తి, తిమ్మాపురం, హిందూపురం, అమరాపురం తదితర కళాశాలలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసింది. ఎక్కడా సీటు రాకపోవడంతో విద్యార్థినితో పాటు తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. గురుకుల కళాశాలల్లో ఎక్కడైనా సరే సీటు ఇప్పించాలని గురుకుల కళాశాలల జిల్లా కన్వీనర్‌కు విన్నవించినా ప్రయోజనం లేదని విద్యార్థిని తండ్రి గంగప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్లో సీట్ల కేటాయింపులో ముందుగా గురుకుల పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. తమ బిడ్డకు సీటు ఇవ్వాలని అడగటానికి శుక్రవారం ఆయన ఆర్.రామాపురం గురుకుల కళాశాలకు వచ్చినట్లు తెలిపాడు. -
ఎవరెస్టుపై మన్యం వీరులు
చింతూరు (రంపచోడవరం): మన్యంవీరులు మరోమారు దేశవ్యాప్తంగా తమ సత్తా చాటి రాష్ట్రానికి ఖ్యాతి తెచ్చి పెట్టారు. చింతూరు మండలానికి చెందిన దూబి భద్రయ్య శిక్షణలో జిల్లా నుంచి ఎవరెస్టు అధిరోహణకు వెళ్లిన నలుగురు గురుకుల కళాశాల విద్యార్థుల్లో అడ్డతీగలకు చెందిన ప్రసన్నకుమార్ గురువారం ఎవరెస్టు శిఖరాన్ని అధిరో హించినట్లు భద్రయ్య తెలిపారు. ప్రసన్నకుమార్‌తో పాటు నెల్లూరుకు చెందిన వెంకటేష్ అనే వి ద్యార్థి కూడా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడని ఆయన తెలిపారు. 87 వేల మీటర్ల ఎత్తుగల ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు మన రాష్ట్రానికి చెందిన పది మంది గురుకుల విద్యార్థులు గత నెల 18న బయలుదేరి వెళ్లారు. నేపాల్, చైనా, టిబెట్ మీదుగా ఎవరెస్టు శిఖరం వద్దకు చేరుకున్న వారు మైనస్ 40 డిగ్రీల చలిలో ఈ నెల 8న ఎవరెస్టు అధిరోహణ యాత్ర ప్రారంభించగా పది మందిలో ఇద్దరు విద్యార్థులు గురువారం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. కూతవేటు దూరంలో మరో ముగ్గురు జిల్లాకు చెందిన మరో ముగ్గురు గురుకుల విద్యార్థులు ఎవరెస్టు అధిరోహణలో కూతవేటు దూరంలో ఉన్నారు. చింతూరుకు చెందిన వీరబాబు, అడ్డతీగలకు చెందిన సత్యనారాయణ, మారేడుమిల్లికి చెందిన రమణారెడ్డి ఇప్పటి వరకూ 7,100 మీట ర్లు ఎక్కారని, మరో 1,600 మీటర్లు ఎక్కితే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిస్తారని, రెండు రోజుల్లో వారు ఈ ఘనత చాటుతారని కోచ్ భద్ర య్య తెలిపారు. వీరితోపాటు శ్రీకాకుళం జిల్లాకు చెం దిన రమణమూర్తి, రేణుక, విశాఖపట్నం జిల్లాకు చెందిన రాంబాబు, వాసుదేవ, సింహాచలంకూడా ఎవరెస్టు అధిరోహణలో నిమగ్నమై ఉన్నారన్నారు. -
భలేగా చేశారే..!
సాక్షి, హైదరాబాద్: సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల, పాఠశాలలో విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లే ముఖ్య అతిథులయ్యారు. ఈ అరుదైన సంఘటన గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల/పాఠశాలలో జరిగింది. ఇక్కడ చదివే పది, ఇంటర్మీడియట్ విద్యార్థినుల వీడ్కోలు వేడుక శనివారం రాత్రి నిర్వహించారు. దీనికి గతానికి భిన్నంగా పాఠశాలలో స్వీపర్లు నరసింహ, రాజును ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. సాంప్రదాయం ప్రకారం ప్రధాన గేటు వద్ద అతిథులకు ప్రిన్సిపల్ ప్రమోద పుష్పగుచ్ఛం అందించి ఆహ్వానించారు. విద్యార్థులు గౌరవ మర్యాదలతో వేదిక వద్దకు తీసుకెళ్లి వారిని సత్కరించారు. ఈ సందర్భంగా నరసింహ, రాజు మాట్లాడుతూ.. కలలో కూడా ఇలాంటి గౌరవం దక్కుతుందని ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశారు. -
ఇంటర్ ప్రవేశానికి 15న తుది గడువు
అనంతపురం రూరల్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురుకుల పాఠశాలలు, కళాశాలల జిల్లా కోఆర్డినేటర్ ఉషారాణి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను www.apswreis.inలో డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు కుల, ఆదాయ, ధ్రువీకరణ పత్రాలు, 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన మార్కుల జాబితాను జత చేసి దగ్గరలోని గురుకుల కళాశాలలో ఈనెల 15లోపు అందజేయాలన్నారు.