గౌతమి
నల్లమాడ: ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించాలని, ఇందుకోసం ప్రభుత్వం అన్ని వసతులు కల్పి స్తోందని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నారు. అయితే చదువుకోవాలని ఉన్నా కళాశాలలో సీటు రాకపోవడంతో ఓ దళిత విద్యార్థిని ఆవేదనకు గురవుతోంది. సీటు ఇవ్వండి సారూ.. అంటూ జిల్లాలోని అన్ని గురుకుల కళాశాలల చుట్టూ తిరుగుతోంది. తమ బిడ్డకు సీటు రాకుండా ఇంతటితోనే చదువు ఆగిపోతే కూలీగా మారడం మినహా మరో గత్యంతరం లేదని విద్యార్థిని తల్లిదండ్రులు వాపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే... కదిరి రూరల్ మండలం ఎగువపల్లి దళితవాడకు చెందిన గంగప్ప, గంగమ్మ దంపతుల కుమార్తె వై.గౌతమి ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు నల్లమాడ మండలంలోని ఆర్.రామాపురం గురుకుల పాఠశాలలో చదివింది.
పదిలో 8.0 గ్రేడ్ పాయింట్లతో ఉత్తీర్ణత సాధించింది. నర్సింగ్ చేసి వైద్యపరంగా సేవ చేయాలన్న ఉద్దేశంతో ఇంటర్‌లో బైపీసీలో చేరాలనుకుంది. బైపీసీలో సీటు కోసం జిల్లాలోని గుత్తి, తిమ్మాపురం, హిందూపురం, అమరాపురం తదితర కళాశాలలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసింది. ఎక్కడా సీటు రాకపోవడంతో విద్యార్థినితో పాటు తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. గురుకుల కళాశాలల్లో ఎక్కడైనా సరే సీటు ఇప్పించాలని గురుకుల కళాశాలల జిల్లా కన్వీనర్‌కు విన్నవించినా ప్రయోజనం లేదని విద్యార్థిని తండ్రి గంగప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్‌లో సీట్ల కేటాయింపులో ముందుగా గురుకుల పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. తమ బిడ్డకు సీటు ఇవ్వాలని అడగటానికి శుక్రవారం ఆయన ఆర్.రామాపురం గురుకుల కళాశాలకు వచ్చినట్లు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment