Dalit student
-
Supreme Court: ఆ విద్యార్థికి ఐఐటీ సీటివ్వండి
న్యూఢిల్లీ: నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదివినా సమయానికి ప్రవేశరుసుం కట్టలేక ప్రతిష్టాత్మక ఐఐటీ ధన్బాద్లో సీటు కోల్పోయిన దళిత విద్యార్థికి సర్వోన్నత న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. వెంటనే ఆ విద్యార్థి అతుల్ కుమార్‌కు సీటు ఇవ్వాలని ఐఐటీ ధన్‌బాద్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం సోమవారం ఆదేశించింది. జూన్ 24వ తేదీ సాయంత్రం ఐదింటిలోపు అడ్మిషన్ ఫీజు రూ.17,500 కట్టలేకపోవడంతో బీటెక్ సీటు కోల్పోయిన తనకు న్యాయం చేయాలంటూ విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెల్సిందే. ‘‘ విద్యార్థి ఆరోజు ఆన్లైన్లో ఫీజు చెల్లింపు కోసం మధ్యాహ్నం మూడు గంటలకే లాగిన్ అయ్యాడు. తర్వాత పదేపదే ఎస్ఎంఎస్లు, వాట్సాప్‌లో రిమైండ్లతో గడువును గుర్తుచేశాం’’ అని ఐఐటీ సీట్ల కేటాయింపు విభాగం వాదించింది. దీంతో సీజేఐ కలగజేసుకుని ‘‘మీరెందుకంతగా వ్యతిరేకిస్తున్నారు?. ఈ పిల్లాడికి ఏమైనా చేయగలవేమో చూడండి. ఆ డబ్బులే ఉంటే కట్టకుండా ఎందుకుంటాడు? అణగారిన వర్గాలకు చెందిన రోజువారీ కూలీ కుమారుడు. పైగా అతనిదిదారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబం. ఐఐటీలో సీటు కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు. ప్రతిభగల ఇలాంటి విద్యార్థిని మనం ఊరకనే వదిలేయలేం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా సుప్రీంకోర్టుకు సంక్రమించిన అసాధారణ అధికారంతో మిమ్మల్ని ఆదేశిస్తున్నాం. ఇదే ఏడాది అదే బ్యాచ్ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ కోర్సులో విద్యార్థికి సీటివ్వండి. హాస్టల్ వసతి సహా అర్హతగల అన్ని ప్రయోజనాలు అతనికి అందేలా చూడండి’’ అని ఐఐటీ కాలేజీ విభాగాన్ని కోర్టు ఆదేశించింది. కిక్కిరిసిన కోర్టు హాలులో అంతసేపూ చేతులు కట్టుకుని నిలబడిన విద్యార్థితో ‘‘ ఆల్ ది బెస్ట్. బాగా చదువుకో’’ అని సీజేఐ అన్నారు. బాగా చదువుతూ ఇంజనీరింగ్ చేస్తున్న అతని ఇద్దరు అన్నల బాగోగులు తదితరాల గురించి కూడా ఆయన ఆరాతీశారు.ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌జిల్లా టిటోరా గ్రామానికి చెందిన అతుల్ ఐఐటీ ధన్బాద్లో సీటు వచ్చినా పేదరికం కారణంగా డబ్బులు కట్టలేక నిస్సహాయుడయ్యాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు తలో చేయి వేసి నగదు సర్దినా చివరి నిమిషంలో ఆన్లైన్ చెల్లింపు విఫలమై ఫీజు కట్టలేకపోయాడు. జార్ఖండ్ హైకోర్టు లీగ్ సర్వీసెస్ అథారిటీని ఆశ్రయించగా పరీక్షను ఐఐటీ మద్రాస్ నిర్వహించినందున మద్రాస్ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. అక్కడ విచారణ నెమ్మదించడంతో ఈసారి నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. -
దళిత విద్యార్ధికి అండగా సుప్రీంకోర్టు.. సీటు ఇవ్వాలని ఆదేశం
న్యూఢిల్లీ: గడువు తేదీలోగా ఫీజు కట్టలేకపోయిన ఓ పేద విద్యార్థికి అడ్మిషన్ ఇవ్వాలని ఐఐటీ ధన్‌బాద్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతిభ గల విద్యార్థిని ఫీజు విషయంలో సీటుకు దూరం చేయడాన్ని అనుమతించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.అసలేం జరిగిందంటే..ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా టిటోరా గ్రామానికి చెందిన 18 ఏళ్ల అతుల్‌కుమార్ ఐఐటీ ధన్బాద్లో ఎలక్టానిక్ ఇంజనీరింగ్‌లో సీటు సాధించాడు. సీటు ఖరారు చేసేందుకు జూన్ 24 లోపు రూ.17,500 ఫీజు కట్టాల్సి ఉండగా,అతడి తల్లిదండ్రులు గడువులోగా ఫీజు కట్టలేకపోయారు. తండ్రి రోజుకు 450 సంపాదించే కూలీ అవ్వడంతో..వారి నిస్సహాయతను చూసిన టిటోడా గ్రామస్థులు విరాళాలు వేసుకొని ఆ మొత్తం సమకూర్చారు. అయితే అప్పటికే గడువు తేదీ దగ్గర పడటంతో.. చివరిరోజుసాంకేతిక కారణాలతో ధన్‌బాద్ ఐఐటీ ఆన్లైన్ పోర్టల్ పనిచేయక అతుల్ ఆ మొత్తాన్ని సకాలంలో కట్టలేకపోయాడు. సీటు వచ్చినట్టే వచ్చి చేజారింది.దీంతో విద్యార్ధి తనకు న్యాయం చేయాలని కోరుతూ తొలుత జార్ఖండ్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి.ఆ తర్వాత చెన్నై లీగల్ సర్వీసెస్‌కు వెళ్లాడు. అయిన ప్రయోజనం లేకపోవడంతో మద్రాస్ హైకోర్టును అశ్రయించాడు. మద్రాస్ హైకోర్టు దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని కోరింది. తాజాగా నేడు సుప్రీంకోర్టులో విచారణకు రాగా.. ‘ విద్యార్థి చాలా తెలివైన వాడు. కేవలం రూ. 17,000 కట్టలేని కారణంగా అతని చదువును కోల్పోయాడు. ప్రతిభావంతుడైన వ్యక్తి ఫీజు కట్టని విషయంలో వదిలివేలయం. అతుల్ కుమార్‌ను అదే బ్యాచ్‌లో చేర్చుకోవాలి. మరే ఇతర విద్యార్థి అభ్యర్థిత్వానికి భంగం కలగకుండా సూపర్‌న్యూమరీ సీటు సృష్టించాలి. అతనికి సీటు కల్పించాలి’ అని ఐఐటీ ధన్‌బాద్‌ను ఆదేశించింది -
నేలరాలిన దళిత సుమం
ముంబైలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) దేశంలో పేరెన్నికగన్న ఉన్నతశ్రేణి విద్యాసంస్థ. ‘జ్ఞానమ్ పరమమ్ ధ్యేయమ్’ అనే ఉపనిషద్వాక్యాన్ని అది తన చిహ్నంలో అలంకరించుకుంది. చదువులో ముందుంటూ ఇంజనీరింగ్ చేయాలనుకునే ప్రతి విద్యార్థికీ బాంబే ఐఐటీలో అవకాశం రావాలన్న కోరిక బలంగా ఉంటుంది. మొన్న ఆదివారం అలాంటి ప్రాంగణంలో పద్దెమినిదేళ్ల దళిత విద్యార్థి దర్శన్ సోలంకీ ప్రాణం తీసుకున్న వైనం గమనిస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. ఎక్కడో అహ్మదాబాద్‌లో పుట్టి ఎన్నో కలలతో ఆ ప్రాంగణంలో అడుగుపెట్టిన దర్శన్ అంత చిన్న వయసులో ప్రాణం తీసుకోవటం తప్ప గత్యంతరం లేదనుకున్నాడంటే సంస్థ సిగ్గుపడాలి. అంతవరకూ చదువులో చురుగ్గా ఉండేవాడు ఇటీవల ముభావంగా మారాడనీ, నెలక్రితం మాట్లాడినప్పుడు కుల వివక్ష సంగతి చెప్పాడనీ అతని సోదరి చెబుతున్నారు. తన కులం తెలిసినప్పటి నుంచీ సహ విద్యార్థులు మాట్లాడటం మానేశారనీ, తాను ఒంటరినయ్యాననీ బాధపడ్డాడని అంటున్నారు. ఇదే ముంబైలో 2019లో వైద్య శాస్త్రంలో పీజీ చేస్తున్న పాయల్ తాడ్వీ అనే గిరిజన విద్యార్థిని సహ విద్యార్థినుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. గైనకాలజీలో పీజీ చేస్తున్న తనను కనీసం ఆపరేషన్ థియేటర్లోకి కూడా రానీయలేదని చివరిసారిగా రాసిన లేఖలో ఆమె బాధ పడింది. విద్యాసంస్థలు చిన్నవైనా, పెద్దవైనా వాటి తరగతి గదులు నిలువెల్లా కులోన్మాదంతో లుకలుకలాడుతున్నాయని తరచు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాటిల్లో ఆవగింజంత నిజం లేదన్న బుకాయింపులూ ఆ వెనకే వినవస్తున్నాయి. బహుశా కేవలం ఆ కారణం వల్లే దళిత, ఆదివాసీ విద్యార్థులకు కుల సర్పాల తాకిడి తప్పడం లేదేమో! తమ ప్రాంగణంలో కుల వివక్ష లేనేలేదని, ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక విభాగం ఉన్నదని చెబుతున్న బాంబే ఐఐటీ ఆ విభాగం పని తీరెలావుందో ఇప్పటికైనా సమీక్షించుకోవటం మంచిది. ఏడేళ్లనాడు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ వేముల ప్రాణం తీసుకున్నప్పుడు యాజమాన్యం నుంచి వచ్చిన సంజాయిషీకీ, దీనికీ పెద్దగా తేడాలేదు. రోహిత్ వేముల మరణానికి దారితీసిన పరిస్థితులేమిటో వెలికి తీయాల్సిన జస్టిస్ రూపన్వాల్ కమిషన్ అతను ఎస్సీ కాదని చెప్పడానికే తాపత్రయపడింది. తన చిన్ననాడే తల్లిదండ్రులు విడిపోయి దళిత స్త్రీ అయిన తల్లి పెంపకంలో దళిత వాడలోనే పెరిగిన రోహిత్ దళితుడు కాడని ‘నిరూపించింది’. మన సమాజంలో అన్నిచోట్లా కులం రాజ్యమేలుతోంది. అందుకు ఢిల్లీ ఎయిమ్స్ మొదలుకొని ఉన్నతశ్రేణి విద్యాసంస్థలేవీ మినహాయింపు కాదని 2007లో థోరట్ కమిటీ ఇచ్చిన నివేదిక మొదలుకొని 2013 నాటి ముంగేకర్ కమిటీ నివేదిక వరకూ చెబుతూనే వస్తున్నాయి. కానీ వాటిని అవసరమైనంతగా పట్టించుకోవటం లేదని దర్శన్ సోలంకీ ఉదంతం మరోసారి నిరూపించింది. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘హిందూ’ కథనం ప్రకారం నిరుడు ఫిబ్రవరిలో బాంబే ఐఐటీలో కుల వివక్ష, అందువల్ల తలెత్తే అనారోగ్య సమస్యలపై సంస్థ లోని ఎస్సీ, ఎస్టీ విభాగం రెండు సర్వేలు చేసింది. దాంట్లో వచ్చిన ఫలితాల ఆధారంగా కొన్ని చర్యలు తీసుకోవాలని కూడా సంకల్పించింది. కానీ ఏడాదైంది. ఇంకా ఆ సంకల్పం ఆచరణ రూపం దాల్చినట్టు లేదు. అసలు సర్వేలకు స్పందించిన విద్యార్థుల సంఖ్య చూస్తేనే వివక్ష ఎంత బలంగా ఉన్నదో అర్థమవుతుంది. బాంబే ఐఐటీలో దాదాపు 2,000 మంది దళిత విద్యార్థులుంటే కేవలం 20 శాతంమంది మాత్రమే తొలి సర్వేకు స్పందించారట! రెండో సర్వేకైతే 5 శాతంమంది మాత్రమే జవాబిచ్చారు. స్టూడెంట్ కౌన్సెలర్‌గా ఉంటున్న మహిళా ప్రొఫెసర్ రిజర్వేషన్ల గురించి సామాజిక మాధ్యమాల్లో బాహాటంగా వ్యక్తంచే సిన అభిప్రాయాలు వారి భయానికి కారణం. రాజ్యాంగం అట్టడుగు కులాలవారికి కల్పిస్తున్న రిజర్వేషన్ల గురించి మేధావులనుకునేవారిలోనే, శాఖాధిపతుల్లోనే బోలెడంత అజ్ఞానం గూడుకట్టుకుంది. ఇక చదువుకోవడానికొచ్చిన పిల్లల్లో దాన్ని వెదకటం వృ«థా ప్రయాస. దర్శన్ తల్లిదండ్రుల ప్రకారం సహ విద్యార్థులకు అతని కులం తెలిసినప్పటినుంచీ ‘ఉచితంగా సీటు సంపాదించావు. మేం భారీగా డబ్బు చెల్లించాల్సివచ్చింది’ అంటూ వేధించారట. దేశంలో శతాబ్దాలుగా వేళ్లూనుకున్న కుల వివక్షవల్ల కొన్ని కులాలు ఈనాటికీ సామాజిక నిరాదరణకు గురవుతున్నాయని, ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయాయని గుర్తించి మన రాజ్యాంగ నిర్మాతలు ఆ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారు. దాన్ని ఈనాటికీ పూర్తి స్థాయిలో అందుకోలేనంత బలహీన స్థితిలో ఆ వర్గాలున్నాయి. ఒక దళిత విద్యార్థి లేదా గిరిజన విద్యార్థి ఉన్నత చదువుల వరకూ ఎదగాలంటే ఇంటిల్లి్లపాదీ ఎన్ని త్యాగాలు చేయాల్సివుంటుందో, మరెన్ని కష్టాలు భరించాల్సివుంటుందో తెలిస్తే అటువంటివారిని ఎవరూ గేలిచేయరు. కానీ ఆధిపత్య కులాల పిల్లలకు ఇదంతా ఎవరు చెప్పాలి? ఇళ్లల్లో చెప్పరు. క్లాసు పుస్తకాల్లో ఉండదు. విశ్వవిద్యాలయ ఆచార్యులు కూడా మౌనం పాటిస్తారు. కులం లేనట్టు ఇంతగా నటించే సమాజంలో అంతిమంగా ఇక జరిగేదేమిటి? బాంబే ఐఐటీలో ఎస్సీ, ఎస్టీ విభాగం నిరుడు ఇచ్చిన నివేదికను బయటపెట్టి దానిపై లోతుగా చర్చిస్తే బహుశా దర్శన్‌కు ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదేమో! ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వటం మంచిదే. కానీ అంతకన్నా ముందు రిజర్వేషన్ల అవసరం గురించి, తోటి విద్యార్థులతో సున్నితంగా, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాల్సిన తీరుగురించి దళితేతర విద్యార్థులకు కౌన్సెలింగ్ తప్పనిసరి చేయాలి. అప్పుడే ఏదోమేరకు కులవివక్ష జాడ్యం పోతుంది. -
బైక్‌ను తాకాడని దళిత విద్యార్థి గొంతు పిసికిన టీచర్
బలియా (యూపీ): తన మోటారుసైకిల్‌ను తాకాడనే కారణంగా ఓ దళిత విద్యార్థిని తరగతి గదిలో బంధించి, ఇనుప రాడ్‌తో కొట్టాడో ఉపాధ్యాయుడు. ఉత్తరప్రదేశ్‌లోని నగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని రనౌపూర్ హయ్యర్ సెకండరీ స్కూల్లో శుక్రవారం ఈ దారుణం చోటుచేసుకుంది. ‘స్కూల్ ఉపాధ్యాయుడు కృష్ణ మోహన్ శర్మ బైక్‌ను ఆరో తరగతి చదువుకుంటున్న ఓ దళిత విద్యార్థి తాకాడు. శర్మ ఆగ్రహంతో ఆ బాలుడిని గదిలో బంధించి, ఐరన్ రాడ్‌తో, చీపురుతో కొట్టాడు. అతడి గొంతు పిసికాడు. స్కూల్ సిబ్బంది బాధిత బాలుడిని కాపాడారు’ అని పోలీసులు తెలిపారు. ఆగ్రహించిన బాలుడి కుటుంబసభ్యులు శనివారం స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. అధికారులు ఉపాధ్యాయుడు శర్మను సస్పెండ్ చేశారు. చదవండి: పాపం పక్షులు.. గుండెల్ని పిండేస్తున్న వీడియో.. స్పందించిన గడ్కరీ కార్యాలయం -
75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!
జెండా పండుగ అయిపోయింది.. ఇక ఆ రంగు లైట్లు ఆర్పేసి ఇటు రండి.. తొమ్మిదేళ్ల దళిత విద్యార్థి ఇంద్రా మేఘ్వాల్ చిత్రపటం వద్ద పెట్టిన కొవ్వొత్తుల వెలుగులో... చీకట్లు చూద్దాం. ఒక గ్లాసుడు నీళ్లు.. పోయిన చిన్న ప్రాణం. అగ్రవర్ణం దాహార్తికి చిన్నబోయిన త్రివర్ణాలు కనిపిస్తాయి. ఇది ‘..అనుకోని సంఘ టన’ అని సర్దిచెప్పుకునే లోపే.. ‘కాదు.. అనునిత్యమే’ అన్నమాట రీసౌండ్‌లా ‘జనగణమన’కన్నా ఎక్కువ శబ్దంతో మన చెవుల్లో మారుమోగుతుంది. – ఇదీ సామాజిక భారతం రోడ్లపై వేలాది జెండాల ప్రదర్శనలు, వాట్సాప్ డీపీలు, ధగధగా మెరిసే కాంతుల అలంకరణలు, గొప్పగా సంబురాలు.. వీటన్నిటి మధ్య బిల్కిస్ బానో సామూహిక అత్యాచార దోషులకు స్వాతంత్య్ర దినోత్సవం ఇచ్చిన స్వేచ్ఛా వాయువులు. వారి మెడలో పూలదండలు, పంచుకున్న మిఠాయిలు.. అమృతోత్సవాలను చేదెక్కించ లేదూ! – ఇదీ రాజకీయ భారతం ‘కలకత్తా ఫుట్‌పాత్‌లపై ఎందరో గాలివానల్లో తడుస్తున్నారు వాళ్లను అడగండి పదిహేను ఆగస్టు గురించి ఏమంటారో..’ .. 1947లో స్వాతంత్య్రం వచ్చిన రోజున మాజీ ప్రధాని వాజ్‌పేయి రాసుకున్న కవిత ఇది.. ఉత్సవాలు జరిగిన మరునాడే (ఆగస్టు 16న) వాజ్‌పేయి వర్ధంతి జరిపినవారిలో ఎవరైనా.. ఆయన గుర్తుగానైనా.. ఫుట్‌పాత్‌లపై ఉన్న వారిని అడిగి ఉంటారా ‘..ఆగస్టు 15 గురించి ఏమంటారూ’ అని.. – వృద్ధిరేటు 75 ఏళ్లుగా పెరిగీ పెరిగీ హైరైజ్ భవనాల్లో చిక్కుకునిపోయిందని, అక్కడి నుంచి ఫుట్‌పాత్ దాకా రాలేదని తెలిసేది కదా! – ఇదీ ఆర్థిక భారతం ‘..దేశభక్తి, అఖండత అని ఒకటే అంటున్నారు.. మేం దేశభక్తి ఎలా చాటుకోవాలి? మా ఇంటిపై జెండా ఎగురవేసే కదా..? మరి జెండా ఎగురవేయడానికి మాకు ఇల్లు ఏది?..’ ..ఇది ఏ సామాన్యుడో అన్నది కాదు.. గరీబోళ్ల సీఎం టంగుటూరి అంజయ్య 1970లో అన్నమాట! మరి ‘ఇంటింటికీ జెండా పండుగ’.. అంటూ జెండాలు పంచిన నాయకులకు ఈ ప్రశ్న ఏమైనా ఎదురై ఉంటుందా.. బధిర శంఖారావంలా! – ఇదీ నేటి జన భారతం హుందాతనం, ఆత్మగౌరవం, సమన్యాయం.. చైతన్యం, సమున్నత మానవ విలువలు, సామాజిక న్యాయం, లౌకిక భావన, సౌభ్రాతృత్వం.. ఆదా యాల్లో, అంతస్థుల్లో, అవకాశాల్లో, సౌకర్యాల్లో.. సమానత్వం తెచ్చుకుందాం అని 75 ఏళ్ల క్రితం రాసుకున్న రాతలు రాజ్యాంగం పుస్తకాన్ని దాటి బయటికి రానట్టున్నాయ్.. – ఇదీ గణతంత్ర భారతం ... వీటన్నింటినీ అంబేద్కర్‌కు వదిలేసి మన నేతలు ఏం చేస్తున్నారో చూడండి. ► గాంధీ, గాడ్సేల ఎత్తును భారతీయత స్కేలుతో కొలిచి.. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువని తేల్చు కునే పనిలో తీరిక లేకుండా మునిగిపోయారు. ► ఇన్నేళ్లూ నెహ్రూ, గాంధీల పాలనలోనే భారతావని నడిచినా.. ఇప్పుడు క్విట్ ఇండియా స్ఫూర్తిగా దేశాన్ని ఏకం చేస్తామంటూ అదే గాంధీలు కొత్తగా ‘జోడో యాత్రలు’ చేస్తున్నారు. ► గాంధీ, నెహ్రూలపై విద్వేషం చిమ్ముతూ కొందరు.. నెహ్రూ కూడళ్లలో జనగణమన పాడుతూ గాంధీకి వెకిలి మకిలి పూస్తే జాగ్రత అని హెచ్చరిస్తూ మరికొందరు.. 75 ఏళ్ల తర్వాత కూడా అవే పేర్లు, అదే స్మరణ, అదే రాజకీయం.. ► 75 ఏళ్ల క్రితం గీసిన విభజన రేఖలు.. ఇప్పుడా దూరాన్ని మరింత పెంచాయి. రెండు వర్గాల మధ్య అపనమ్మకాన్ని, అగాధాన్ని ఎగదోస్తూ.. ‘లౌకికం’ అన్న మాటను ఫక్తు రాజకీయం చేశాయి. మన మట్టి మీదే పుట్టి పెరిగినా.. త్రివర్ణ పతాకం చేతపట్టి మేమూ భారతీయులమే అని చెప్పుకోవాల్సిన దుఃస్థితికి తెచ్చాయి. ► దేశ విభజన నాటి హింసాకాండ, విధ్వంసాలు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. మానిపోతున్న గాయాలను కెలుకుతూ విభే దాలకు ఆజ్యం పోస్తూనే ఉన్నాయి. నాటి దాష్టీకాన్ని నేటికీ అంటగడుతూ.. విచ్ఛిన్నకర శక్తులంటూ పాత కాలపు చర్చను లేవదీస్తూనే ఉన్నాయి. .. ఇదీ 75 ఏళ్ల భారతం.. స్వేచ్ఛ వచ్చిందనుకున్న తొలిరోజున ఉన్నకాడే.. ఇప్పటికీ ఉన్నామని చెప్పకనే చెబుతున్న తీరు.. ఇది స్వప్నం.. స్వాతంత్య్రోత్సవాల సందర్భంగా సోషల్ మీడియాలో యువతతో నడిచిన ఓ చిట్‌ఛాట్ ఇది. ‘..నేను పుణెలో చదివా, నాలుగేళ్లు బెంగళూరులో, ఇప్పుడు తిరువనంతపురంలో ఉద్యోగం. రేపు ఎక్కడికి వెళ్తానో తెలియదు. నన్ను ఏ ప్రాంతం వాడని అడక్కండి..’ ‘..ఇదిగో వీడు అబ్దుల్లా.. అమెరికా నుంచి ఈమధ్యే దిగుమతి అయ్యాడు, ఢిల్లీ వాడే అనుకోండి. ఈ అమ్మాయి సారిక, వీడి ఫియాన్సీ. వాళ్లు రాజు, అభిషేక్, శ్రవణ్.. మేమంతా హాస్టల్ మేట్స్.. మమ్మల్ని ఏ కులం, ఏ మతం అని ప్రశ్నించకండి. అవన్నీ పాలిటిక్స్ కోసమే.. మేం భారతీయులం..’ ... కెరీర్ గోలలో కొట్టుకుపోతూ దేశం గురించి పట్టించుకోవడం లేదని యువతపై వేస్తున్న అపవాదు నిజం కాదనిపిస్తోంది. వీరిని చూస్తుంటే.. కులం, ప్రాంతం, మతం హద్దులు చెరిపేసుకుని.. అన్ని వర్ణాలనూ త్రివర్ణంలో కలుపుకొని పోతారనే ఆశలు ఇంకా మిణుకుమిణుకుమంటున్నాయి. ఇది నిజం... అట్టడుగు వర్గాలను అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టి ఆనందపడ్డా, వారి పరిస్థితి ఉన్నకాడే ఉన్నదనడానికి ఇదొక్క ‘చిత్రం’ చాలదా! -
నీళ్ల కుండను తాకాడని .. దళిత బాలుడ్ని కొట్టి చంపిన టీచర్
ఉదయపూర్: స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ కూడా దేశంలో కుల వివక్ష వికృతరూపం ఎక్కడో ఒకచోట బట్టబయలువుతూనే ఉంది. రాజస్తాన్‌లోని జలోర్ జిల్లాలోని సురానా గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో చెయిల్ సింగ్ అనే టీచర్ తన కోసం ప్రత్యేకంగా ఉంచుకున్న నీళ్లకుండను ఇంద్రకుమార్ మేఘవాలా దళిత విద్యార్థి తాకాడు. దాంతో తొమ్మిదేళ్ల ఆ బాలుడ్ని విచక్షణారహితంగా చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. జులై 20న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీచర్ దెబ్బలకు తన కొడుకు చెవులు, కళ్లు, ముఖానికి తీవ్రంగా గాయాలయ్యాయని, అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడని తండ్రి దేవరామ్ మేఘవాలా కన్నీటిపర్యంతమయ్యారు. పైగా కులం పేరుతో దూషించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీన్ని రాజస్థాన్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆదేశించారు. టీచర్‌ను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ చెప్పారు. -
కొట్టి.. పాదాలు నాకించి.. దళిత విద్యార్థికి తీవ్ర అవమానం
రాయ్‌బరేలీ: పదో తరగతి చదువుతున్న ఒక దళిత విద్యార్థిని కొందరు తీవ్రంగా కొట్టి, పాదాలు నాకించిన వీడియో సోషల్ మీడియాలో కలకలం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి 8 మందిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం ఈనెల 10న జగత్పూర్ నగరంలో నివసించే పదో తరగతి పిల్లాడిని అతని స్నేహితుడు మోటార్‌సైకిల్‌పై రామ్‌లీలా మైదానానికి తీసుకుపోయాడు. అక్కడనుంచి అతన్ని సెలూన్ రోడ్‌కు, అట్నించి మరికొందరు కలిసి ఒక తోటకు తీసుకుపోయారు. తోటలో అతన్ని అంతా కలిసి తీవ్రంగా కొట్టారు. అనంతరం దాడి చేసినవారిలో ఒకరి పాదాలను నాకమని సదరు విద్యార్థిని బలవంతపెడుతూ ఈ మొత్తం ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అనంతరం ఆ పిల్లాడు తన తల్లితో కలిసి కొట్వాలీ పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. పిల్లాడిపై దాడికి కారణాలను పోలీసులు వెల్లడించలేదు. అతని ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు 8 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారని అధికారులు తెలిపారు. దాడిచేసిన వారిలో కొందరు మైనర్లున్నారనే వాదనకు ఇంతవరకు ఆధారం లభించలేదన్నారు. మోకాళ్లపై కూర్చోబెట్టి.. దాదాపు రెండున్నర నిమిషాలున్న ఈ వీడియోలో నిందితులంతా మోటార్‌సైకిళ్లపై కూర్చొని ఉండగా బాధితుడు మోకాళ్లపై కూర్చొని ఉన్నాడు. నిందితుల్లో ఒకరు బాధితుడిని ఠాకూర్ అనే పేరు గట్టిగా చెప్పమని బలవంతపెడుతూ తిట్టడం, మరోమారు ఈ తప్పు చేస్తావా? అని ప్రశ్నించాడు. దీంతో పాటు ఇదే ఘటనకు సంబంధించిన ఇంకొక వీడియోలో ఇకపై గంజాయి అమ్మవుగా అని బాధితుడిని నిందితులు ప్రశ్నిస్తున్నట్లు కనిపించింది. ఈ రెండు వీడియోల కలకలం సద్దుమణగకముందే ఒంటరిగా దొరికిన అబ్బాయిని తీవ్రంగా కొట్టారంటూ ఒక వ్యక్తి అగ్రకుల వ్యక్తులను దుర్భాషలాడుతున్నట్లున్న మరో వీడియో కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. తనపై దాడి చేసింది ఎవరో, ఎందుకు చేశారో తెలియదని బాధితుడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చెప్పారు. దాడి అనంతరం నిందితులంతా అక్కడ నుంచి వెళ్లిపోగా స్థానికులు తనను రక్షించారన్నారు. రాజకీయ విమర్శలు ఈ ఘటన బయటపడిన వెంటనే రాజకీయ రంగు పులుముకుంది. స్థానిక కాంగ్రెస్ నేత సుశీల్ రాయ్‌బరేలీ కలెక్టర్‌ను కలిసి ఘటనపై చర్యలు తీసుకోవాలన్నారు. సమాజ్‌వాదీ నేత అఖిలేశ్‌ను కలిసిన బాధితుడు, అతని కుటుంబ సభ్యులు ఘటన గురించి వివరించారు. ఎస్పీ ఎంఎల్ఏ మనోజ్ కుమార్ పాండే బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కేసుపై రాజీ చేసుకోమని విద్యార్థిపై ఒత్తిడి తెచ్చారని, కానీ స్థానికులు ఆందోళనకు దిగడంతో పోలీసులు తేలికపాటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని ఎస్పీ నేతలు విమర్శించారు. కేసులో ప్రధాన నిందితుడిని పట్టుకోలేదన్నారు. నిందితుల ఇళ్లను పడగొట్టాలని, బాధితుడికి రక్షణ కల్పించి పరిహారం ఇవ్వాలని, అతన్ని కేంద్రీయవిద్యాలయంలో చేర్చాలని డిమాండ్‌చేశారు. ప్రజాస్వామ్యంలో కులాధిపత్యానికి తావులేదని అఖిలేశ్ ట్వీట్ చేశారు. వెనుకబడినవర్గాలకు తాము అండగా ఉంటామన్నారు. ఈ ఘటనకు బీజేపీ కారణమని విమర్శించారు. -
పరీక్షా కేంద్రంలో బాలిక.. ఊరి ప్రజలంతా అక్కడే.. ఎవరా అమ్మాయి..?
పాట్నా: మన ఇంట్లో ఎవరైనా పరీక్ష రాసేందుకు వెళ్తున్నారంటే కుటుంబ సభ్యులు ఆల్ ది బెస్ట్ చెబుతారు. కానీ, ఇక్కడ ఓ బాలిక తాను పరీక్ష రాసేందుకు వెళ్తే గ్రామస్తులందరూ ఆమె వెనకే పరీక్షా కేంద్రం వరకు వెళ్లి ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో ఆమె వెనక్కు తిరిగి.. తన గ్రామస్తులకు చేతులు ఊపుతూ అభివాదం చేసింది. ఆ సమయంలో బాలికను చూసిన ఆ గ్రామస్తులంతా ఆనందంతో తిరిగి అభివాదం చేశారు. ఈ వినూత్న ఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. అధికారుల నిర్లక్ష్యంతో సీతామర్హి జిల్లాలోని డబ్ టోల్ గ్రామం అభివృద్ధికి నోచుకోలేదు. 900 మంది దళిత జనాభా ఉన్న ఆ గ్రామంలో అందరూ కూలి పనులు, వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆ గ్రామంలో ఇప్పటి వరకు ఏ ఒక్క అమ్మాయి కూడా పదో తరగతి వరకు చదవకపోవడం గమనార్హం. కానీ, కొందరు యువకులు డిగ్రీ వరకు చదువుకున్నప్పటికీ ఉద్యోగాలు చేసే స్థాయికి చేరుకోలేకపోయారు. కాగా, ఇందిరా కుమారి అనే బాలిక ఇటీవలే మంచి మార్కులతో ప్రీ-బోర్డ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు (బీఎస్ఈబీ) ఆధ్వర్యంలో మెట్రిక్యులేషన్ పరీక్షకు అర్హత సాధించింది. దీంతో ఆ గ్రామం నుంచి ఈ పరీక్షకు అర్హత సాధించిన మొదటి బాలికగా ఇందిర నిలిచింది. కాగా, గ్రామస్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. చదువుకోవడం కోసం ఇందిరా ఎన్నో కష్టాలను అనుభవించిందన్నారు. కష్టాలతో పోరాడింది కానీ చదువును విడిడిపెట్టలేదన్నారు. ఇప్పుడు ఇందిర గ్రామంలోకి ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. -
లైంగిక దాడి: బిర్యాని తినిపించి.. మద్యం తాగించి..
నిజామాబాద్ అర్బన్: దళిత విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనలో ఆరుగురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. సామూహిక అత్యాచారం కేసు వివరాలను గురువారం ఆయన తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. నిజామాబాద్‌కు చెందిన నవీన్‌కుమార్‌కు, బాధిత విద్యార్థినితో పరిచయం ఉంది. మంగళవారం నవీన్, మరో ఇద్దరు కలసి ఆమెను తీసుకుని నగర శివారుతోపాటు అంకాపూర్ తదితర ప్రాంతాల్లో తిరిగారు. అక్కడ ఆమెకు బిర్యాని తినిపించడంతోపాటు మభ్యపెట్టి మద్యం తాగించారు. అర్ధరాత్రి నిజామాబాద్ బస్టాండ్ సమీపంలో మర మ్మతులో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్దకు వచ్చి ఆమెపై ఈ ముగ్గురు అత్యాచారం చేయగా, మరో ముగ్గురు వారికి సహకరించారు. అక్కడే ఎదురుగా ఉన్న షాపింగ్‌మాల్ సెక్యూరిటీ గార్డ్ గమనించి యువకులను ప్రశ్నించడంతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో సెక్యూరిటీ గార్డు డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో వారు పారిపోయారు. పోలీసులు వచ్చి విద్యార్థినిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో నవీన్‌తో పాటు గంజి చంద్రశేఖర్, తుమ్మ భానుప్రకాశ్, సిరిగాద చరణ్, షేక్ కరీం, పి.గంగాధర్ పాల్గొన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. ఇందులో ఐదుగురిని బుధవారం అరెస్టు చేయగా, ఒకరిని గురువారం ఉదయం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. -
‘కుక్కను ఉసిగొల్పిన హోంమంత్రి మరదలు’
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): దళిత విద్యార్థిపై పెంపుడు కుక్కను ఉసిగొల్పి అతని మృతికి కారణమైన రాష్ట్ర హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తమ్ముడు భార్యను అరెస్టు చేయకుండా, బాధిత కుటుంబానికి అండగా నిలుస్తున్న బీఎస్పీ నాయకులపై కేసులు పెడుతున్నారని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఏపీ అధ్యక్షుడు పట్టపు రవి అన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత నెల 28న దళిత విద్యార్థి ఎన్.వరుణ్ తోటివారితో కలిసి ఆడుకునేందుకు అమలాపురంలోని హౌసింగ్ కాలనీకి వెళ్లాడని, ఆ సమయంలో హోంమంత్రి మరదలు పెంపుడు కుక్కను ఉసిగొల్పిందన్నారు. దానినుంచి తప్పించుకునే క్రమంలో వరుణ్ పక్కనే ఉన్న ఎర్రకాలువలో పడి మృతిచెందాడని చెప్పారు. ఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా పోలీసులు స్పందించటంలేదన్నారు. విద్యార్థి మృతికి కారణమైన మహిళను 2 రోజుల్లో అరెస్టు చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బచ్చలకూర పుష్పరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి లంకా కరుణాకర్ దాస్ పాల్గొన్నారు. -
సీటు ఇప్పించండి సారూ..
నల్లమాడ: ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించాలని, ఇందుకోసం ప్రభుత్వం అన్ని వసతులు కల్పి స్తోందని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నారు. అయితే చదువుకోవాలని ఉన్నా కళాశాలలో సీటు రాకపోవడంతో ఓ దళిత విద్యార్థిని ఆవేదనకు గురవుతోంది. సీటు ఇవ్వండి సారూ.. అంటూ జిల్లాలోని అన్ని గురుకుల కళాశాలల చుట్టూ తిరుగుతోంది. తమ బిడ్డకు సీటు రాకుండా ఇంతటితోనే చదువు ఆగిపోతే కూలీగా మారడం మినహా మరో గత్యంతరం లేదని విద్యార్థిని తల్లిదండ్రులు వాపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే... కదిరి రూరల్ మండలం ఎగువపల్లి దళితవాడకు చెందిన గంగప్ప, గంగమ్మ దంపతుల కుమార్తె వై.గౌతమి ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు నల్లమాడ మండలంలోని ఆర్.రామాపురం గురుకుల పాఠశాలలో చదివింది. పదిలో 8.0 గ్రేడ్ పాయింట్లతో ఉత్తీర్ణత సాధించింది. నర్సింగ్ చేసి వైద్యపరంగా సేవ చేయాలన్న ఉద్దేశంతో ఇంటర్లో బైపీసీలో చేరాలనుకుంది. బైపీసీలో సీటు కోసం జిల్లాలోని గుత్తి, తిమ్మాపురం, హిందూపురం, అమరాపురం తదితర కళాశాలలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసింది. ఎక్కడా సీటు రాకపోవడంతో విద్యార్థినితో పాటు తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. గురుకుల కళాశాలల్లో ఎక్కడైనా సరే సీటు ఇప్పించాలని గురుకుల కళాశాలల జిల్లా కన్వీనర్‌కు విన్నవించినా ప్రయోజనం లేదని విద్యార్థిని తండ్రి గంగప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్లో సీట్ల కేటాయింపులో ముందుగా గురుకుల పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. తమ బిడ్డకు సీటు ఇవ్వాలని అడగటానికి శుక్రవారం ఆయన ఆర్.రామాపురం గురుకుల కళాశాలకు వచ్చినట్లు తెలిపాడు. -
బాలిక మీద ‘హత్యాచారం’పై వెల్లువెత్తిన నిరసనలు
సాక్షి, బెంగళూరు: విజయపుర జిల్లాలో మృగాళ్ల చేతుల్లో అత్యాచారానికి, హత్యకు గురైన9వ తరగతి దళిత విద్యార్థిని దానమ్మ (15) కేసును సీఐడీకి అప్పగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనలో దోషులందరినీ వీలైనంత త్వరగా పట్టుకొని శిక్ష పడేలా చూస్తామని తెలిపింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచనల మేరకు ఈ కేసు విచారణను ముమ్మరం చేశారు. ఇక, బాధిత బాలిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.8 లక్షల పరిహారాన్ని ప్రకటించగా, జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న ఎం.బి.పాటిల్ తన వంతుగా రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అయితే బాధిత బాలిక కుటుంబం మాత్రం తమకు కావాల్సింది ప్రభుత్వం అందించే పరిహారం కాదని, న్యాయం కావాలని కోరుతోంది. బాలిక కుటుంబాన్ని సీఎం సిద్ధరామయ్య కలిసి ఓదార్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబం విలపిస్తూ తమ చిన్నారిని పొట్టనబెట్టుకున్న కామాంధులను కఠినంగా శిక్షించాలని సీఎంను వేడుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు విజయపుర ఘోరంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందంటూ వివిధ సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. బెంగళూరుతో పాటు బళ్లారి, మండ్య, మైసూరు, శివమొగ్గ, బెళగావి తదితర ప్రాంతాల్లో స్వచ్చంద సంఘాల ప్రతినిధులు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. దారుణానికి పాల్పడిన దోషులపై తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వారిని బహిరంగంగా ఉరి తీయాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎలా ఉందో ఈ ఘటన చాటుతోందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. రాష్టంలో శాంతి, భద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడుతున్నారు. విజయపుర జిల్లాలో సీఎం పర్యటిస్తున్న సమయంలోనే ఇలాంటి ఘటన జరగడం పోలీసు యంత్రాంగం పనితీరుకు నిదర్శనమని విమర్శిస్తున్నారు. బీజేపీపై సీఎం విమర్శలు సీఎం సిద్ధరామయ్య మాత్రం బీజేపీ నేతల వ్యాఖ్యలను కొట్టి పారేశారు. ఓ మైనర్ బాలిక చావును కూడా బీజేపీ నేతలు రాజకీయాల కోసం వాడుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. బాలిక పోస్ట్‌మార్టమ్ రిపోర్టు ఇంకా రావాల్సి ఉందని, నివేదిక వచ్చిన వెంటనే అన్ని వివరాలు పూర్తి స్థాయిలో తెలుస్తాయని చెప్పారు. -
కారులో ఎక్కించుకుని.. కాళ్లు మొక్కించుకుని..
ముషీరాబాద్: తనను కులం పేరుతో దూషించడమే కాకుండా కారులో ఎక్కించుకుని నగరంలో తిప్పుతూ, కొట్టుకుంటూ కాళ్లు మొక్కించుకున్నారని, దాన్ని వీడియో కూడా తీశారని దోమలగూడకు చెందిన విద్యార్థి పల్లె భాగ్యరాజు మాదిగ తెలిపారు. బుధవారం విద్యానగర్‌లోని ఎంఆర్పిఎస్ కార్యాలయంలో జాతీయ కన్వీనర్ దేవయ్య మాదిగ, జన్ను కనకరాజు మాదిగలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 15న గాంధీనగర్ జగదాంబ ఆస్పత్రి వద్ద తన స్నేహితుడు రమేష్ కారు కుమార్ అనే వ్యక్తికి ఢీ కొనడంతో అతడికి గాయాలయ్యాయన్నాడు. వైద్య ఖర్చుల కోసం రూ.5వేలు ఇస్తానని రమేష్ చెప్పగా కుమార్ కుమారుడు శ్రీధర్‌రెడ్డి, అతడి స్నేహితులు రమేష్‌తో బలవంతంగా రూ.30వేలకు కాగితం రాయించుకున్నట్లు తెలిపాడు. రమేష్ వద్దకు రాగా వైద్య ఖర్చులు ఇస్తామని, కావాలంటే కేసు పెట్టుకోమని చెప్పానన్నాడు. దీంతో 17న రాత్రి శ్రీధర్‌రెడ్డి తనకు ఫోన్ చేసి చిక్కడపల్లిలోని మధురాలయ బార్ వద్దకు రమ్మని చెప్పాడన్నారు. అక్కడ శ్రీధర్‌రెడ్డి మరో ఆరుగురు వ్యక్తులు తనను బలవంతంగా కారులో ఎక్కించుకుని వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ దాడి చేశారని, కులం పేరుతో దూషించడమేగాక కాళ్లు మొక్కించుకుని దానిని వీడియో తీసినట్లు తెలిపాడు. తాను చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా మరుసటి రోజు రమ్మన్నారని, 18న ఎస్ఐ నాగుల్‌మీరా ఇద్దరితో మాట్లాడుదామంటూ రాజీ ధోరణిలో మాట్లాడారని తెలిపాడు. తన కేసు నమోదు చేయాలని, తనకు ఎఫ్ఐఆర్ కాపీ కావాలని కోరడంతో శ్రీధర్‌రెడ్డితో పాటు సాయికుమార్, రమేష్, మరో నలుగురిపై నమోదు చేసినట్లు చెప్పారు. నిందితులను అరెస్ట్ చేయాలి భాగ్యరాజుపై దాడిచేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఎంఆర్పిఎస్ జాతీయ కో ఆర్డినేటర్ దేవయ్య మాదిగ అన్నారు. నిజామాబాద్‌లో భరత్‌రెడ్డి చేసిన ఘోరం మరవకముందే నగరం నడిబొడ్డున ఓ దళిత విద్యార్థిపై అగ్రకులస్తులు దాడి చేయడం దారుణమన్నారు. న్యాయం కావాలని పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే పట్టించుకోని ఎస్ఐ నాగుల్‌మీరాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
పోలీసుల కస్టడీలో రేప్ నిందితుడు
తిరువనంతపురం: కేరళలో సంచలనం సృష్టించిన దళిత న్యాయ విద్యార్థిని హత్యాచారం కేసులో కీలక నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అతడిని పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పినరయి రవి ధ్రువీకరించారు. ఈ ఘటన చోటు చేసుకున్న దాదాపు 50 రోజుల తర్వాత పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించారు. ఏప్రిల్ 28న ఎర్నాకులం జిల్లాలో దళిత విద్యార్థినిపై అత్యాచారం చేసి, అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఈ ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళనలు రేగాయి. దీంతో ఈ కేసు దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సిట్ ఏర్పాటు చేసింది. అనుమానితుడి ఊహా చిత్రాలు విడుదల చేశారు. మృతురాలి ఇంటి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. -
ఆ మరో నిర్భయ దేహంలో 38 గాయాలు
న్యూఢిల్లీ: కేరళలో దారుణ లైంగిక దాడి, అనంతరం హత్యకు గురైన దళిత యువతి ఒంటిపైన.. అంతర్భాగాల్లో మొత్తం 38 చిన్నాపెద్ద గాయాలయినట్లు తెలిసింది. పెరువంబూర్లో గత నెల 28న నిర్భయకన్నా దారుణంగా ఓ న్యాయవిద్యార్థినిపై లైంగికదాడి.. అనంతరం కత్తిపోట్లతో హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు తెలిపిన ఆమె పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం బాధితురాలి ఒంటిపైన.. అంతర్భాగాల్లో కలిపి 38చోట్ల చిన్న పెద్ద గాయాలయినట్లు తెలుస్తోంది. రేప్ కు పాల్పడినవారు చాలా దారుణంగా వ్యవహరించినట్లు శవపరీక్ష నిర్వహించిన వైద్యులు తెలిపారు. మే 11న బాధితురాలి ఇంటికి మోదీ! కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రధాని నరంద్రమోదీ వెళ్లనున్నారు. ఈ నెల 11న మోదీ ఆ యువతి స్వగ్రామం పెరువంబూర్కు స్వయంగా వెళ్లి ఓదార్చనున్నారు. అలాగే, సామాజిక న్యాయశాఖ మంత్రి థవర్ చాంద్ గెహ్లాట్ కూడా వారి ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ కేసు పురోగతిపై ఆరా తీశారు. వివరాలు తనకు పంపించాలని ఆదేశించారు. మరోపక్క, ఇదివరకే కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎన్నికల కమిషన్ అవకాశం ఇస్తే ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకునేందుకైనా తాను సిద్ధమని, ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పారు. -
రేప్ చేసి, కత్తులతో పొడిచి..
త్రివేండ్రం: లా చదువుతున్న దళిత విద్యార్థిని అత్యాచారం చేసి, కడుపుపై తన్ని, కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన కేరళలో జరిగింది. గత నెల 28న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. ఎర్నాకుళం జిల్లా పెరుంబవూర్‌లో బాధితురాలు మానసిక స్థితి సరిగా లేని తల్లితో కలసి నివసించేది. ఈ నెల 28న ఆమె మృతదేహం బయటపడింది. ఆమె ఒంటిపై పలు కత్తిపోట్లు ఉన్నాయి. కడుపుపై తన్నడంతో ప్రేగులు బయటకు వచ్చాయి. ఆమెపై లైంగికదాడి జరిగినట్టు పోస్టుమార్టమ్ నివేదికలో తేలింది. పట్టపగలే ఈ ఘటన జరిగినట్టు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై ఇరుగుపొరుగువారు నోరు విప్పలేదు. దారుణం జరిగి ఐదు రోజులు కావాస్తున్నా పోలీసులు ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదు. బాధితురాలి కుటుంబానికి సాయం చేసేందుకు స్థానిక రాజకీయ నాయకులు కానీ సామాజిక కార్యకర్తలు కానీ ముందుకు రాలేదు. రెండు రోజుల తర్వాత బాధితురాలి హత్యాచారం వార్త పేపర్లో రావడంతో ఆమె స్నేహితులకు తెలిసింది. బాధితురాలి ఇంట్లోనే ఈ దారుణం జరిగి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. -
సాకారమైన కల
♦ బాసటగా నిలిచిన సాక్షి ♦ అమరేందర్లో అవధుల్లేని ఆనందం ♦ విద్యుత్ ఏఈగా నియామకం ♦ పేద దళిత విద్యార్థి విజయగాధ పేదింటి విద్యాకుసుమం.. అమరేందర్. ఆర్థిక ఇబ్బందులు పట్టిపీడిస్తున్నా.. చదువుల్లో టాపర్‌గా నిలుస్తూ అందరి చేత మన్ననలు పొందుతున్నాడు. బీటెక్ చదువుకు పేదరికం అడ్డంకిగా మారడంతో ‘సాక్షి’ బాసటగా నిలిచింది. ‘ప్రతిభను వెక్కిరిస్తున్న పేదరికం’ అంటూ వెన్నుదన్నుగా నిలిచింది. సాక్షి కథనానికి దాతల నుంచి విశేష స్పందన.. ఫలితంగా చదువు కొనసాగడమేకాక విద్యుత్ ఏఈ ఉద్యోగం వరించింది. గురువారం అతను బాధ్యతలు స్వీకరించిన వేళ ఆ పేద కుటుంబంలో అవధుల్లేని ఆనందం వెల్లువెత్తింది. అమరేందర్ విజయపథం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. వర్గల్: ములుగు మండలం అచ్చాయపల్లికి చెందిన తుడుం కృష్ణ, కళమ్మ దంపతుల రెండో సంతానం అమరేందర్. మరో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. అర ఎకరం భూమి మి నహా ఆస్తిపాస్తులు లేవు. కూలీ పనే ఆధారం. పేదరికం నేపథ్యంలో అమరేందర్‌ను వర్గల్ మండలం మైలారానికి చెందిన మేనమామ బి.యాదగిరి చేరదీశాడు. మామ సంరక్షణలో ఉంటూ మైలారంలో ఒకటినుంచి పదోతరగతి వరకు చదివాడు. తొమ్మిదోతరగతి చదువుతుండగానే తండ్రి మరణించాడు. ఆ విషాదం నుంచి కోలుకొని 2007-08లో పదోతరగతిలో 514 మార్కులు సాధించి మండల స్థాయిలో రెండో టాపర్‌గా నిలిచాడు. ఉపాధ్యాయులు యాదగిరి, నిరంతరం సూచనలిచ్చే ఎల్లం సహకారంతో డీఆర్డీఏ ద్వారా విజయవాడ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్లో ఉచిత సీటు దక్కించుకున్నాడు. డ్రెస్సుల కొనుగోలుకు రాజిరెడ్డి, యాదగిరి తదితర ఉపాధ్యాయులు ఆర్థిక సహకారా న్ని అందించారు. ఆ తరువాత అంచనాలకు తగ్గట్టుగానే ఇంటర్లో 96.3 శాతం మార్కులు సాధించి కాలేజీ టాపర్‌గా నిలిచాడు. ఎంసెట్ లోనూ మెరుగైన ర్యాంకు రావడంతో జేఎన్టీయూలో సీటు దక్కించుకున్నాడు. ప్రవేశ ఫీజు తదితరాలు కలిపి రూ.30 వేలు ఖర్చవుతుంద ని తెలిసి అమరేందర్ డీలాపడిపోయాడు. ఆ తరుణంలో ‘సాక్షి’ అతని దీనగాథను గుర్తిం చింది. 2010 అక్టోబర్‌లో ‘ప్రతిభను వెక్కిరిస్తున్న పేదరికం’ అంటూ కథనాన్ని ప్రచురిం చి అమరేందర్ పరిస్థితిని వెలుగులోకి తెచ్చింది. ఈ కథనంతో దాతల అండ పుష్కలంగా లభించింది. అమరేందర్ బీటెక్ ఇంజినీరింగ్ చదువులకు అడ్డుతొలగిపోయింది. ట్యూషన్ చెప్పుకుంటూ కాస్తోకూస్తో సంపాదించుకుంటూ లక్ష్యం వైపు సాగిన అమరేందర్ ఇంజినీరింగ్ పూర్తి కాగానే చెన్నైలో ప్రైవేటు ఉద్యోగం వచ్చింది. తల్లి ఆరోగ్యం క్షీణించడంతో నెలరోజుల్లోనే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి వెనుదిరిగివచ్చాడు. ఆ తరువాత టీఎస్ జెన్కో, టీఎస్‌ట్రాన్స్‌కో, టీఎస్ ఎస్పీడీసీఎల్, టీఎస్ ఎన్పీడీసీఎల్లో అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగం కోసం ఎంపిక పరీక్ష రాసి అన్నింటిలోనూ మంచి ర్యాంకులు సాధించాడు. తన ప్రాంతంలో ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా టీఎస్ ఎస్పీడీసీఎల్ను ఎంపిక చేసుకున్నాడు. సీఎం నియోజకవర్గ పరిధిలోని జగదేవ్‌పూర్ మండల ఏఈగా గురువారం విధుల్లో చేరాడు. అమరేందర్ ఉద్యోగంలో చేరడంతో అటు తల్లి కళమ్మ, ఇటు మేనమామ యాదగిరి కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. ‘సాక్షి’కి ప్రత్యేక కృతజ్ఞతలు.. తొలి అడుగు తడబడుతున్న సమయంలో బీటెక్ చదువులకు అవరోధాన్ని ‘సాక్షి’ కథనం తొలగించింది. ఆ కథనం ఫలితంగా ఎందరో దాతలు నా చదువుకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. దాతల సహకారమూ మరవలేనిది. ఇంజినీరింగ్ పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించాలన్న నా కలసాకారమైంది. ప్రధానంగా రైతులకు సేవ చేసే అవకాశం విద్యుత్ ఏఈగా నాకు దక్కడం ఆనందంగా ఉన్నది. నాకు ఉద్యోగం రావడంతో మా కుటుంబం అవధుల్లేని ఆనందంలో మునిగితేలుతున్నది. చెప్పలేని సంతోషం పంచుతున్నది. నా ఈ విజయంలో భాగస్వాములైన ఉపాధ్యాయులు, మిత్రులు, కష్టాల్లో అండగా నిలిచిన వారందరికి ధన్యవాదాలు. - అమరేందర్, ఏఈ -
మాటకు - మాట