రాయ్‌బరేలీ: పదో తరగతి చదువుతున్న ఒక దళిత విద్యార్థిని కొందరు తీవ్రంగా కొట్టి, పాదాలు నాకించిన వీడియో సోషల్ మీడియాలో కలకలం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి 8 మందిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం ఈనెల 10న జగత్‌పూర్ నగరంలో నివసించే పదో తరగతి పిల్లాడిని అతని స్నేహితుడు మోటార్‌సైకిల్‌పై రామ్‌లీలా మైదానానికి తీసుకుపోయాడు. అక్కడనుంచి అతన్ని సెలూన్ రోడ్‌కు, అట్నించి మరికొందరు కలిసి ఒక తోటకు తీసుకుపోయారు. తోటలో అతన్ని అంతా కలిసి తీవ్రంగా కొట్టారు.
అనంతరం దాడి చేసినవారిలో ఒకరి పాదాలను నాకమని సదరు విద్యార్థిని బలవంతపెడుతూ ఈ మొత్తం ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అనంతరం ఆ పిల్లాడు తన తల్లితో కలిసి కొట్వాలీ పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. పిల్లాడిపై దాడికి కారణాలను పోలీసులు వెల్లడించలేదు. అతని ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు 8 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారని అధికారులు తెలిపారు. దాడిచేసిన వారిలో కొందరు మైనర్లున్నారనే వాదనకు ఇంతవరకు ఆధారం లభించలేదన్నారు.
మోకాళ్లపై కూర్చోబెట్టి..
దాదాపు రెండున్నర నిమిషాలున్న ఈ వీడియోలో నిందితులంతా మోటార్‌సైకిళ్లపై కూర్చొని ఉండగా బాధితుడు మోకాళ్లపై కూర్చొని ఉన్నాడు. నిందితుల్లో ఒకరు బాధితుడిని ఠాకూర్ అనే పేరు గట్టిగా చెప్పమని బలవంతపెడుతూ తిట్టడం, మరోమారు ఈ తప్పు చేస్తావా? అని ప్రశ్నించాడు. దీంతో పాటు ఇదే ఘటనకు సంబంధించిన ఇంకొక వీడియోలో ఇకపై గంజాయి అమ్మవుగా అని బాధితుడిని నిందితులు ప్రశ్నిస్తున్నట్లు కనిపించింది. ఈ రెండు వీడియోల కలకలం సద్దుమణగకముందే ఒంటరిగా దొరికిన అబ్బాయిని తీవ్రంగా కొట్టారంటూ ఒక వ్యక్తి అగ్రకుల వ్యక్తులను దుర్భాషలాడుతున్నట్లున్న మరో వీడియో కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. తనపై దాడి చేసింది ఎవరో, ఎందుకు చేశారో తెలియదని బాధితుడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చెప్పారు. దాడి అనంతరం నిందితులంతా అక్కడ నుంచి వెళ్లిపోగా స్థానికులు తనను రక్షించారన్నారు.
రాజకీయ విమర్శలు
ఈ ఘటన బయటపడిన వెంటనే రాజకీయ రంగు పులుముకుంది. స్థానిక కాంగ్రెస్ నేత సుశీల్ రాయ్‌బరేలీ కలెక్టర్‌ను కలిసి ఘటనపై చర్యలు తీసుకోవాలన్నారు. సమాజ్‌వాదీ నేత అఖిలేశ్‌ను కలిసిన బాధితుడు, అతని కుటుంబ సభ్యులు ఘటన గురించి వివరించారు. ఎస్‌పీ ఎంఎల్‌ఏ మనోజ్ కుమార్ పాండే బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కేసుపై రాజీ చేసుకోమని విద్యార్థిపై ఒత్తిడి తెచ్చారని, కానీ స్థానికులు ఆందోళనకు దిగడంతో పోలీసులు తేలికపాటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని ఎస్‌పీ నేతలు విమర్శించారు. కేసులో ప్రధాన నిందితుడిని పట్టుకోలేదన్నారు. నిందితుల ఇళ్లను పడగొట్టాలని, బాధితుడికి రక్షణ కల్పించి పరిహారం ఇవ్వాలని, అతన్ని కేంద్రీయవిద్యాలయంలో చేర్చాలని డిమాండ్‌చేశారు. ప్రజాస్వామ్యంలో కులాధిపత్యానికి తావులేదని అఖిలేశ్ ట్వీట్ చేశారు. వెనుకబడినవర్గాలకు తాము అండగా ఉంటామన్నారు. ఈ ఘటనకు బీజేపీ కారణమని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment