సాకారమైన కల
♦ బాసటగా నిలిచిన సాక్షి
♦ అమరేందర్‌లో అవధుల్లేని ఆనందం
♦ విద్యుత్ ఏఈగా నియామకం
♦ పేద దళిత విద్యార్థి విజయగాధ
పేదింటి విద్యాకుసుమం.. అమరేందర్. ఆర్థిక ఇబ్బందులు పట్టిపీడిస్తున్నా.. చదువుల్లో టాపర్‌గా నిలుస్తూ అందరి చేత మన్ననలు పొందుతున్నాడు. బీటెక్ చదువుకు పేదరికం అడ్డంకిగా మారడంతో ‘సాక్షి’ బాసటగా నిలిచింది. ‘ప్రతిభను వెక్కిరిస్తున్న పేదరికం’ అంటూ వెన్నుదన్నుగా నిలిచింది. సాక్షి కథనానికి దాతల నుంచి విశేష స్పందన.. ఫలితంగా చదువు కొనసాగడమేకాక విద్యుత్ ఏఈ ఉద్యోగం వరించింది. గురువారం అతను బాధ్యతలు స్వీకరించిన వేళ ఆ పేద కుటుంబంలో అవధుల్లేని ఆనందం వెల్లువెత్తింది. అమరేందర్ విజయపథం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది.
వర్గల్: ములుగు మండలం అచ్చాయపల్లికి చెందిన తుడుం కృష్ణ, కళమ్మ దంపతుల రెండో సంతానం అమరేందర్. మరో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. అర ఎకరం భూమి మి నహా ఆస్తిపాస్తులు లేవు. కూలీ పనే ఆధారం. పేదరికం నేపథ్యంలో అమరేందర్‌ను వర్గల్ మండలం మైలారానికి చెందిన మేనమామ బి.యాదగిరి చేరదీశాడు. మామ సంరక్షణలో ఉంటూ మైలారంలో ఒకటినుంచి పదోతరగతి వరకు చదివాడు. తొమ్మిదోతరగతి చదువుతుండగానే తండ్రి మరణించాడు. ఆ విషాదం నుంచి కోలుకొని 2007-08లో పదోతరగతిలో 514 మార్కులు సాధించి మండల స్థాయిలో రెండో టాపర్‌గా నిలిచాడు.
ఉపాధ్యాయులు యాదగిరి, నిరంతరం సూచనలిచ్చే ఎల్లం సహకారంతో డీఆర్‌డీఏ ద్వారా విజయవాడ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్‌లో ఉచిత సీటు దక్కించుకున్నాడు. డ్రెస్సుల కొనుగోలుకు రాజిరెడ్డి, యాదగిరి తదితర ఉపాధ్యాయులు ఆర్థిక సహకారా న్ని అందించారు. ఆ తరువాత అంచనాలకు తగ్గట్టుగానే ఇంటర్‌లో 96.3 శాతం మార్కులు సాధించి కాలేజీ టాపర్‌గా నిలిచాడు. ఎంసెట్ లోనూ మెరుగైన ర్యాంకు రావడంతో జేఎన్‌టీయూలో సీటు దక్కించుకున్నాడు. ప్రవేశ ఫీజు తదితరాలు కలిపి రూ.30 వేలు ఖర్చవుతుంద ని తెలిసి అమరేందర్ డీలాపడిపోయాడు. ఆ తరుణంలో ‘సాక్షి’ అతని దీనగాథను గుర్తిం చింది. 2010 అక్టోబర్‌లో ‘ప్రతిభను వెక్కిరిస్తున్న పేదరికం’ అంటూ కథనాన్ని ప్రచురిం చి అమరేందర్ పరిస్థితిని వెలుగులోకి తెచ్చింది. ఈ కథనంతో దాతల అండ పుష్కలంగా లభించింది.
అమరేందర్ బీటెక్ ఇంజినీరింగ్ చదువులకు అడ్డుతొలగిపోయింది. ట్యూషన్ చెప్పుకుంటూ కాస్తోకూస్తో సంపాదించుకుంటూ లక్ష్యం వైపు సాగిన అమరేందర్ ఇంజినీరింగ్ పూర్తి కాగానే చెన్నైలో ప్రైవేటు ఉద్యోగం వచ్చింది. తల్లి ఆరోగ్యం క్షీణించడంతో నెలరోజుల్లోనే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి వెనుదిరిగివచ్చాడు. ఆ తరువాత టీఎస్ జెన్‌కో, టీఎస్‌ట్రాన్స్‌కో, టీఎస్ ఎస్‌పీడీసీఎల్, టీఎస్ ఎన్‌పీడీసీఎల్‌లో అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగం కోసం ఎంపిక పరీక్ష రాసి అన్నింటిలోనూ మంచి ర్యాంకులు సాధించాడు. తన ప్రాంతంలో ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా టీఎస్ ఎస్‌పీడీసీఎల్‌ను ఎంపిక చేసుకున్నాడు. సీఎం నియోజకవర్గ పరిధిలోని జగదేవ్‌పూర్ మండల ఏఈగా గురువారం విధుల్లో చేరాడు. అమరేందర్ ఉద్యోగంలో చేరడంతో అటు తల్లి కళమ్మ, ఇటు మేనమామ యాదగిరి కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.
‘సాక్షి’కి ప్రత్యేక కృతజ్ఞతలు..
తొలి అడుగు తడబడుతున్న సమయంలో బీటెక్ చదువులకు అవరోధాన్ని ‘సాక్షి’ కథనం తొలగించింది. ఆ కథనం ఫలితంగా ఎందరో దాతలు నా చదువుకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. దాతల సహకారమూ మరవలేనిది. ఇంజినీరింగ్ పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించాలన్న నా కలసాకారమైంది. ప్రధానంగా రైతులకు సేవ చేసే అవకాశం విద్యుత్ ఏఈగా నాకు దక్కడం ఆనందంగా ఉన్నది. నాకు ఉద్యోగం రావడంతో మా కుటుంబం అవధుల్లేని ఆనందంలో మునిగితేలుతున్నది. చెప్పలేని సంతోషం పంచుతున్నది. నా ఈ విజయంలో భాగస్వాములైన ఉపాధ్యాయులు, మిత్రులు, కష్టాల్లో అండగా నిలిచిన వారందరికి ధన్యవాదాలు. - అమరేందర్, ఏఈ