ముషీరాబాద్: తనను కులం పేరుతో దూషించడమే కాకుండా కారులో ఎక్కించుకుని నగరంలో తిప్పుతూ, కొట్టుకుంటూ కాళ్లు మొక్కించుకున్నారని, దాన్ని వీడియో కూడా తీశారని దోమలగూడకు చెందిన విద్యార్థి పల్లె భాగ్యరాజు మాదిగ తెలిపారు. బుధవారం విద్యానగర్‌లోని ఎంఆర్‌పిఎస్ కార్యాలయంలో జాతీయ కన్వీనర్ దేవయ్య మాదిగ, జన్ను కనకరాజు మాదిగలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 15న గాంధీనగర్ జగదాంబ ఆస్పత్రి వద్ద తన స్నేహితుడు రమేష్ కారు కుమార్ అనే వ్యక్తికి ఢీ కొనడంతో అతడికి గాయాలయ్యాయన్నాడు. వైద్య ఖర్చుల కోసం రూ.5వేలు ఇస్తానని రమేష్ చెప్పగా కుమార్ కుమారుడు శ్రీధర్‌రెడ్డి, అతడి స్నేహితులు రమేష్‌తో బలవంతంగా రూ.30వేలకు కాగితం రాయించుకున్నట్లు తెలిపాడు.
రమేష్ వద్దకు రాగా వైద్య ఖర్చులు ఇస్తామని, కావాలంటే కేసు పెట్టుకోమని చెప్పానన్నాడు. దీంతో 17న రాత్రి శ్రీధర్‌రెడ్డి తనకు ఫోన్ చేసి చిక్కడపల్లిలోని మధురాలయ బార్ వద్దకు రమ్మని చెప్పాడన్నారు. అక్కడ శ్రీధర్‌రెడ్డి మరో ఆరుగురు వ్యక్తులు తనను బలవంతంగా కారులో ఎక్కించుకుని వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ దాడి చేశారని, కులం పేరుతో దూషించడమేగాక కాళ్లు మొక్కించుకుని దానిని వీడియో తీసినట్లు తెలిపాడు. తాను చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా మరుసటి రోజు రమ్మన్నారని, 18న ఎస్‌ఐ నాగుల్‌మీరా ఇద్దరితో మాట్లాడుదామంటూ రాజీ ధోరణిలో మాట్లాడారని తెలిపాడు. తన కేసు నమోదు చేయాలని, తనకు ఎఫ్‌ఐఆర్ కాపీ కావాలని కోరడంతో శ్రీధర్‌రెడ్డితో పాటు సాయికుమార్, రమేష్, మరో నలుగురిపై నమోదు చేసినట్లు చెప్పారు.
నిందితులను అరెస్ట్ చేయాలి
భాగ్యరాజుపై దాడిచేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఎంఆర్‌పిఎస్ జాతీయ కో ఆర్డినేటర్ దేవయ్య మాదిగ అన్నారు. నిజామాబాద్‌లో భరత్‌రెడ్డి చేసిన ఘోరం మరవకముందే నగరం నడిబొడ్డున ఓ దళిత విద్యార్థిపై అగ్రకులస్తులు దాడి చేయడం దారుణమన్నారు. న్యాయం కావాలని పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే పట్టించుకోని ఎస్‌ఐ నాగుల్‌మీరాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment