ముంబైలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) దేశంలో పేరెన్నికగన్న ఉన్నతశ్రేణి విద్యాసంస్థ. ‘జ్ఞానమ్ పరమమ్ ధ్యేయమ్’ అనే ఉపనిషద్వాక్యాన్ని అది తన చిహ్నంలో అలంకరించుకుంది. చదువులో ముందుంటూ ఇంజనీరింగ్ చేయాలనుకునే ప్రతి విద్యార్థికీ బాంబే ఐఐటీలో అవకాశం రావాలన్న కోరిక బలంగా ఉంటుంది. మొన్న ఆదివారం అలాంటి ప్రాంగణంలో పద్దెమినిదేళ్ల దళిత విద్యార్థి దర్శన్ సోలంకీ ప్రాణం తీసుకున్న వైనం గమనిస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. ఎక్కడో అహ్మదాబాద్‌లో పుట్టి ఎన్నో కలలతో ఆ ప్రాంగణంలో అడుగుపెట్టిన దర్శన్ అంత చిన్న వయసులో ప్రాణం తీసుకోవటం తప్ప గత్యంతరం లేదనుకున్నాడంటే సంస్థ సిగ్గుపడాలి.
అంతవరకూ చదువులో చురుగ్గా ఉండేవాడు ఇటీవల ముభావంగా మారాడనీ, నెలక్రితం మాట్లాడినప్పుడు కుల వివక్ష సంగతి చెప్పాడనీ అతని సోదరి చెబుతున్నారు. తన కులం తెలిసినప్పటి నుంచీ సహ విద్యార్థులు మాట్లాడటం మానేశారనీ, తాను ఒంటరినయ్యాననీ బాధపడ్డాడని అంటున్నారు. ఇదే ముంబైలో 2019లో వైద్య శాస్త్రంలో పీజీ చేస్తున్న పాయల్ తాడ్వీ అనే గిరిజన విద్యార్థిని సహ విద్యార్థినుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. గైనకాలజీలో పీజీ చేస్తున్న తనను కనీసం ఆపరేషన్ థియేటర్‌లోకి కూడా రానీయలేదని చివరిసారిగా రాసిన లేఖలో ఆమె బాధ పడింది.
విద్యాసంస్థలు చిన్నవైనా, పెద్దవైనా వాటి తరగతి గదులు నిలువెల్లా కులోన్మాదంతో లుకలుకలాడుతున్నాయని తరచు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాటిల్లో ఆవగింజంత నిజం లేదన్న బుకాయింపులూ ఆ వెనకే వినవస్తున్నాయి. బహుశా కేవలం ఆ కారణం వల్లే దళిత, ఆదివాసీ విద్యార్థులకు కుల సర్పాల తాకిడి తప్పడం లేదేమో! తమ ప్రాంగణంలో కుల వివక్ష లేనేలేదని, ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక విభాగం ఉన్నదని చెబుతున్న బాంబే ఐఐటీ ఆ విభాగం పని తీరెలావుందో ఇప్పటికైనా సమీక్షించుకోవటం మంచిది. ఏడేళ్లనాడు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ వేముల ప్రాణం తీసుకున్నప్పుడు యాజమాన్యం నుంచి వచ్చిన సంజాయిషీకీ, దీనికీ పెద్దగా తేడాలేదు. రోహిత్ వేముల మరణానికి దారితీసిన పరిస్థితులేమిటో వెలికి తీయాల్సిన జస్టిస్ రూపన్‌వాల్ కమిషన్ అతను ఎస్సీ కాదని చెప్పడానికే తాపత్రయపడింది. తన చిన్ననాడే తల్లిదండ్రులు విడిపోయి దళిత స్త్రీ అయిన తల్లి పెంపకంలో దళిత వాడలోనే పెరిగిన రోహిత్ దళితుడు కాడని ‘నిరూపించింది’. మన సమాజంలో అన్నిచోట్లా కులం రాజ్యమేలుతోంది.
అందుకు ఢిల్లీ ఎయిమ్స్ మొదలుకొని ఉన్నతశ్రేణి విద్యాసంస్థలేవీ మినహాయింపు కాదని 2007లో థోరట్ కమిటీ ఇచ్చిన నివేదిక మొదలుకొని 2013 నాటి ముంగేకర్ కమిటీ నివేదిక వరకూ చెబుతూనే వస్తున్నాయి. కానీ వాటిని అవసరమైనంతగా పట్టించుకోవటం లేదని దర్శన్ సోలంకీ ఉదంతం మరోసారి నిరూపించింది. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘హిందూ’ కథనం ప్రకారం నిరుడు ఫిబ్రవరిలో బాంబే ఐఐటీలో కుల వివక్ష, అందువల్ల తలెత్తే అనారోగ్య సమస్యలపై సంస్థ లోని ఎస్సీ, ఎస్టీ విభాగం రెండు సర్వేలు చేసింది. దాంట్లో వచ్చిన ఫలితాల ఆధారంగా కొన్ని చర్యలు తీసుకోవాలని కూడా సంకల్పించింది. కానీ ఏడాదైంది. ఇంకా ఆ సంకల్పం ఆచరణ రూపం దాల్చినట్టు లేదు. అసలు సర్వేలకు స్పందించిన విద్యార్థుల సంఖ్య చూస్తేనే వివక్ష ఎంత బలంగా ఉన్నదో అర్థమవుతుంది. బాంబే ఐఐటీలో దాదాపు 2,000 మంది దళిత విద్యార్థులుంటే కేవలం 20 శాతంమంది మాత్రమే తొలి సర్వేకు స్పందించారట! రెండో సర్వేకైతే 5 శాతంమంది మాత్రమే జవాబిచ్చారు. స్టూడెంట్ కౌన్సెలర్‌గా ఉంటున్న మహిళా ప్రొఫెసర్ రిజర్వేషన్ల గురించి సామాజిక మాధ్యమాల్లో బాహాటంగా వ్యక్తంచే సిన అభిప్రాయాలు వారి భయానికి కారణం.
రాజ్యాంగం అట్టడుగు కులాలవారికి కల్పిస్తున్న రిజర్వేషన్ల గురించి మేధావులనుకునేవారిలోనే, శాఖాధిపతుల్లోనే బోలెడంత అజ్ఞానం గూడుకట్టుకుంది. ఇక చదువుకోవడానికొచ్చిన పిల్లల్లో దాన్ని వెదకటం వృ«థా ప్రయాస. దర్శన్ తల్లిదండ్రుల ప్రకారం సహ విద్యార్థులకు అతని కులం తెలిసినప్పటినుంచీ ‘ఉచితంగా సీటు సంపాదించావు. మేం భారీగా డబ్బు చెల్లించాల్సివచ్చింది’ అంటూ వేధించారట. దేశంలో శతాబ్దాలుగా వేళ్లూనుకున్న కుల వివక్షవల్ల కొన్ని కులాలు ఈనాటికీ సామాజిక నిరాదరణకు గురవుతున్నాయని, ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయాయని గుర్తించి మన రాజ్యాంగ నిర్మాతలు ఆ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారు. దాన్ని ఈనాటికీ పూర్తి స్థాయిలో అందుకోలేనంత బలహీన స్థితిలో ఆ వర్గాలున్నాయి.
ఒక దళిత విద్యార్థి లేదా గిరిజన విద్యార్థి ఉన్నత చదువుల వరకూ ఎదగాలంటే ఇంటిల్లి్లపాదీ ఎన్ని త్యాగాలు చేయాల్సివుంటుందో, మరెన్ని కష్టాలు భరించాల్సివుంటుందో తెలిస్తే అటువంటివారిని ఎవరూ గేలిచేయరు. కానీ ఆధిపత్య కులాల పిల్లలకు ఇదంతా ఎవరు చెప్పాలి? ఇళ్లల్లో చెప్పరు. క్లాసు పుస్తకాల్లో ఉండదు. విశ్వవిద్యాలయ ఆచార్యులు కూడా మౌనం పాటిస్తారు. కులం లేనట్టు ఇంతగా నటించే సమాజంలో అంతిమంగా ఇక జరిగేదేమిటి? బాంబే ఐఐటీలో ఎస్సీ, ఎస్టీ విభాగం నిరుడు ఇచ్చిన నివేదికను బయటపెట్టి దానిపై లోతుగా చర్చిస్తే బహుశా దర్శన్‌కు ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదేమో! ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వటం మంచిదే. కానీ అంతకన్నా ముందు రిజర్వేషన్ల అవసరం గురించి, తోటి విద్యార్థులతో సున్నితంగా, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాల్సిన తీరుగురించి దళితేతర విద్యార్థులకు కౌన్సెలింగ్ తప్పనిసరి చేయాలి. అప్పుడే ఏదోమేరకు కులవివక్ష జాడ్యం పోతుంది.
Comments
Please login to add a commentAdd a comment