Mumbai IIT
-
నేలరాలిన దళిత సుమం
ముంబైలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) దేశంలో పేరెన్నికగన్న ఉన్నతశ్రేణి విద్యాసంస్థ. ‘జ్ఞానమ్ పరమమ్ ధ్యేయమ్’ అనే ఉపనిషద్వాక్యాన్ని అది తన చిహ్నంలో అలంకరించుకుంది. చదువులో ముందుంటూ ఇంజనీరింగ్ చేయాలనుకునే ప్రతి విద్యార్థికీ బాంబే ఐఐటీలో అవకాశం రావాలన్న కోరిక బలంగా ఉంటుంది. మొన్న ఆదివారం అలాంటి ప్రాంగణంలో పద్దెమినిదేళ్ల దళిత విద్యార్థి దర్శన్ సోలంకీ ప్రాణం తీసుకున్న వైనం గమనిస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. ఎక్కడో అహ్మదాబాద్‌లో పుట్టి ఎన్నో కలలతో ఆ ప్రాంగణంలో అడుగుపెట్టిన దర్శన్ అంత చిన్న వయసులో ప్రాణం తీసుకోవటం తప్ప గత్యంతరం లేదనుకున్నాడంటే సంస్థ సిగ్గుపడాలి. అంతవరకూ చదువులో చురుగ్గా ఉండేవాడు ఇటీవల ముభావంగా మారాడనీ, నెలక్రితం మాట్లాడినప్పుడు కుల వివక్ష సంగతి చెప్పాడనీ అతని సోదరి చెబుతున్నారు. తన కులం తెలిసినప్పటి నుంచీ సహ విద్యార్థులు మాట్లాడటం మానేశారనీ, తాను ఒంటరినయ్యాననీ బాధపడ్డాడని అంటున్నారు. ఇదే ముంబైలో 2019లో వైద్య శాస్త్రంలో పీజీ చేస్తున్న పాయల్ తాడ్వీ అనే గిరిజన విద్యార్థిని సహ విద్యార్థినుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. గైనకాలజీలో పీజీ చేస్తున్న తనను కనీసం ఆపరేషన్ థియేటర్లోకి కూడా రానీయలేదని చివరిసారిగా రాసిన లేఖలో ఆమె బాధ పడింది. విద్యాసంస్థలు చిన్నవైనా, పెద్దవైనా వాటి తరగతి గదులు నిలువెల్లా కులోన్మాదంతో లుకలుకలాడుతున్నాయని తరచు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాటిల్లో ఆవగింజంత నిజం లేదన్న బుకాయింపులూ ఆ వెనకే వినవస్తున్నాయి. బహుశా కేవలం ఆ కారణం వల్లే దళిత, ఆదివాసీ విద్యార్థులకు కుల సర్పాల తాకిడి తప్పడం లేదేమో! తమ ప్రాంగణంలో కుల వివక్ష లేనేలేదని, ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక విభాగం ఉన్నదని చెబుతున్న బాంబే ఐఐటీ ఆ విభాగం పని తీరెలావుందో ఇప్పటికైనా సమీక్షించుకోవటం మంచిది. ఏడేళ్లనాడు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ వేముల ప్రాణం తీసుకున్నప్పుడు యాజమాన్యం నుంచి వచ్చిన సంజాయిషీకీ, దీనికీ పెద్దగా తేడాలేదు. రోహిత్ వేముల మరణానికి దారితీసిన పరిస్థితులేమిటో వెలికి తీయాల్సిన జస్టిస్ రూపన్వాల్ కమిషన్ అతను ఎస్సీ కాదని చెప్పడానికే తాపత్రయపడింది. తన చిన్ననాడే తల్లిదండ్రులు విడిపోయి దళిత స్త్రీ అయిన తల్లి పెంపకంలో దళిత వాడలోనే పెరిగిన రోహిత్ దళితుడు కాడని ‘నిరూపించింది’. మన సమాజంలో అన్నిచోట్లా కులం రాజ్యమేలుతోంది. అందుకు ఢిల్లీ ఎయిమ్స్ మొదలుకొని ఉన్నతశ్రేణి విద్యాసంస్థలేవీ మినహాయింపు కాదని 2007లో థోరట్ కమిటీ ఇచ్చిన నివేదిక మొదలుకొని 2013 నాటి ముంగేకర్ కమిటీ నివేదిక వరకూ చెబుతూనే వస్తున్నాయి. కానీ వాటిని అవసరమైనంతగా పట్టించుకోవటం లేదని దర్శన్ సోలంకీ ఉదంతం మరోసారి నిరూపించింది. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘హిందూ’ కథనం ప్రకారం నిరుడు ఫిబ్రవరిలో బాంబే ఐఐటీలో కుల వివక్ష, అందువల్ల తలెత్తే అనారోగ్య సమస్యలపై సంస్థ లోని ఎస్సీ, ఎస్టీ విభాగం రెండు సర్వేలు చేసింది. దాంట్లో వచ్చిన ఫలితాల ఆధారంగా కొన్ని చర్యలు తీసుకోవాలని కూడా సంకల్పించింది. కానీ ఏడాదైంది. ఇంకా ఆ సంకల్పం ఆచరణ రూపం దాల్చినట్టు లేదు. అసలు సర్వేలకు స్పందించిన విద్యార్థుల సంఖ్య చూస్తేనే వివక్ష ఎంత బలంగా ఉన్నదో అర్థమవుతుంది. బాంబే ఐఐటీలో దాదాపు 2,000 మంది దళిత విద్యార్థులుంటే కేవలం 20 శాతంమంది మాత్రమే తొలి సర్వేకు స్పందించారట! రెండో సర్వేకైతే 5 శాతంమంది మాత్రమే జవాబిచ్చారు. స్టూడెంట్ కౌన్సెలర్‌గా ఉంటున్న మహిళా ప్రొఫెసర్ రిజర్వేషన్ల గురించి సామాజిక మాధ్యమాల్లో బాహాటంగా వ్యక్తంచే సిన అభిప్రాయాలు వారి భయానికి కారణం. రాజ్యాంగం అట్టడుగు కులాలవారికి కల్పిస్తున్న రిజర్వేషన్ల గురించి మేధావులనుకునేవారిలోనే, శాఖాధిపతుల్లోనే బోలెడంత అజ్ఞానం గూడుకట్టుకుంది. ఇక చదువుకోవడానికొచ్చిన పిల్లల్లో దాన్ని వెదకటం వృ«థా ప్రయాస. దర్శన్ తల్లిదండ్రుల ప్రకారం సహ విద్యార్థులకు అతని కులం తెలిసినప్పటినుంచీ ‘ఉచితంగా సీటు సంపాదించావు. మేం భారీగా డబ్బు చెల్లించాల్సివచ్చింది’ అంటూ వేధించారట. దేశంలో శతాబ్దాలుగా వేళ్లూనుకున్న కుల వివక్షవల్ల కొన్ని కులాలు ఈనాటికీ సామాజిక నిరాదరణకు గురవుతున్నాయని, ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయాయని గుర్తించి మన రాజ్యాంగ నిర్మాతలు ఆ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారు. దాన్ని ఈనాటికీ పూర్తి స్థాయిలో అందుకోలేనంత బలహీన స్థితిలో ఆ వర్గాలున్నాయి. ఒక దళిత విద్యార్థి లేదా గిరిజన విద్యార్థి ఉన్నత చదువుల వరకూ ఎదగాలంటే ఇంటిల్లి్లపాదీ ఎన్ని త్యాగాలు చేయాల్సివుంటుందో, మరెన్ని కష్టాలు భరించాల్సివుంటుందో తెలిస్తే అటువంటివారిని ఎవరూ గేలిచేయరు. కానీ ఆధిపత్య కులాల పిల్లలకు ఇదంతా ఎవరు చెప్పాలి? ఇళ్లల్లో చెప్పరు. క్లాసు పుస్తకాల్లో ఉండదు. విశ్వవిద్యాలయ ఆచార్యులు కూడా మౌనం పాటిస్తారు. కులం లేనట్టు ఇంతగా నటించే సమాజంలో అంతిమంగా ఇక జరిగేదేమిటి? బాంబే ఐఐటీలో ఎస్సీ, ఎస్టీ విభాగం నిరుడు ఇచ్చిన నివేదికను బయటపెట్టి దానిపై లోతుగా చర్చిస్తే బహుశా దర్శన్‌కు ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదేమో! ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వటం మంచిదే. కానీ అంతకన్నా ముందు రిజర్వేషన్ల అవసరం గురించి, తోటి విద్యార్థులతో సున్నితంగా, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాల్సిన తీరుగురించి దళితేతర విద్యార్థులకు కౌన్సెలింగ్ తప్పనిసరి చేయాలి. అప్పుడే ఏదోమేరకు కులవివక్ష జాడ్యం పోతుంది. -
అడ్వాన్స్‌డ్‌లో అగ్రస్థానం
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఐఐటీలు తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్సుడ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు ముఖ్యంగా రాష్ట్రానికి చెందిన విద్యార్థులు విజయఢంకా మోగించారు. ఢిల్లీ ఐఐటీ సోమవారం విడుదల చేసిన ఈ ఫలితాల్లో అగ్రస్థానాలను సాధించడమే కాకుండా సంఖ్యాపరంగా అత్యధిక ర్యాంకులను సాధించారు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఆలిండియా ర్యాంకుల్లో జనరల్ కేటగిరీలో సెకండ్ ర్యాంకు, ఈడబ్యూఎస్ ఆలిండియా కోటాలో ప్రథమ ర్యాంకును వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గంగుల భువన్‌రెడ్డి (345 మార్కులు) సాధించాడు. ఓబీసీలో ప్రథమ ర్యాంకు, జనరల్ కేటగిరీలో 14వ ర్యాంకును విజయనగరం జిల్లా గుర్ల మండలం లగడాం గ్రామానికి చెందిన లండా జితేంద్ర (318 మార్కులు) దక్కించుకున్నాడు. జితేంద్ర మెయిన్స్‌లో ఆలిండియా ర్యాంకుల్లో 4వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగు విద్యార్థులు వివిధ కేటగిరీల్లో 1, 2, 5, 9, 10వ ర్యాంకులతో పాటు వంద లోపు 35 ర్యాంకులు సాధించారు. బాలికల్లో మద్రాస్ జోన్లో ఏపీకి చెందిన కొత్తపల్లి అనిత ఆలిండియా జనరల్ కేటగిరీలో 44వ స్థానాన్ని సాధించింది. తెలుగు విద్యార్థుల్లో 321 మార్కులకు పైగా సాధించిన వారు 10 మంది ఉన్నారు. మద్రాస్ జోన్ పరిధిలో టాప్ 500 ర్యాంకుల్లో 429 మంది ఉండగా అందులో తెలుగు విద్యార్థులు ముందువరసలో నిలిచారు. జాయింట్ సీట్ అలకేషన్ అధారిటీ (జోసా) మంగళవారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది. – ఆలిండియా జనరల్‌లో కాపెల్లి యశ్వంత్‌సాయి (ఏలూరు) 32వ ర్యాంకు, చిలుకూరి మణిప్రణీత్ (విజయవాడ) 47వ ర్యాంకు, కందుల యశ్వంత్ 113వ ర్యాంకు, పైడా వెంకట గణేష్ ఓబీసీ 15వ ర్యాంకు, కృష్ణకమల్ ఈడబ్ల్యూఎస్ 11వ ర్యాంకు, నన్నపనేని యశస్వి ఈడబ్ల్యూఎస్ 12, మోగంటి హర్షదీప్ ఈడబ్ల్యూఎస్ 13, వారాడ జశ్వంత్‌నాయుడు ఓబీసీ 41, నాగెల్లి నితిన్‌సాయి ఓబీసీ 48, వారణాసి యశ్వంత్‌కృష్ణ ఈడబ్యూఎస్ 32, దండా సాయి ప్రవల్లిక ఓబీసీ 34, బి వెంకటసూర్యవైద్య ఓబీసీ 53, ఎం.జయప్రకాశ్ ఓబీసీ 54, ఎస్.వి.సాయిసిద్దార్థ్ ఓబీసీ 69, వారాడ వినయభాస్కర్ ఓబీసీ 73, బిజ్జం చెన్నకేశవరెడ్డి ఈడబ్ల్యూఎస్ 47, ఎస్.విష్ణువర్థన్ ఓబీసీ 94, ఎం.సాయి అక్షయ్‌రెడ్డి ఈడబ్యూఎస్ 48, వడ్డి ఆదిత్య ఈడబ్ల్యూఎస్ 57 ర్యాంకులను సాధించారు. ఇద్దరిదీ వ్యవసాయ కుటుంబమే... ఆలిండియా జనరల్ కేటగిరీలో రెండో స్థానంలో నిలిచిన గంగుల భువన్‌రెడ్డి, ఓబీసీలో ఒకటో స్థానంలో నిలిచిన లడ్డా జితేంద్ర ఇద్దరూ వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. వీరిద్దరూ వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రకు చెందిన వారు. ఇంటి నుంచే పరీక్షకు సిద్ధం.. లాక్‌డౌన్‌కు ముందు విజయవాడలోని కార్పొరేట్ కాలేజీలో చదువుకున్నానని, ఆ తరువాత ఇంటి నుంచి ప్రిపేర్ అయ్యానని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గంగుల భువన్‌రెడ్డి తెలిపాడు. మెయిన్స్‌లో 26వ ర్యాంకు సాధించానని, పరీక్షల ముందు రోజుకు 10 నుంచి 15 గంటల పాటు చదివానని పేర్కొన్నాడు. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్సు కోర్సులో చేరాలని కోరుకుంటున్నట్లు భువన్‌రెడ్డి చెప్పాడు. 8వ తరగతి వరకు చదువుకున్న భువన్‌రెడ్డి తల్లి వరలక్ష్మి గృహిణి కాగా తండ్రి గంగుల ప్రభాకర్‌రెడ్డి ఇంటర్ వరకు చదువుకున్నారు. ఆయన వ్యవసాయంతోపాటు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తున్నారు. టెన్త్ వరకు నేర్చుకున్నవి ఉపకరించాయి: జితేంద్ర విజయనగరం జిల్లా గుర్ల మండలం లగడాం గ్రామానికి చెందిన లండా జితేంద్ర విజయవాడలోని కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదివాడు. టెన్త్ వరకు నేర్చుకున్న అంశాలు ఇంటర్, జేఈఈ పరీక్షల్లో విజయానికి దోహదం చేశాయని జితేంద్ర పేర్కొన్నాడు. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్సు కోర్సులో చేరాలనుకుంటున్నానని చెప్పాడు. జితేంద్ర తండ్రి వెంకటరమణ వ్యవసాయంతో పాటు చిన్నపాటి ట్రాన్స్‌పోర్టు వ్యాపారంలో ఉన్నారు. -
క్యాట్‌లో మెరిసిన నల్లగొండ ఆణిముత్యం
జాతీయ స్థాయిలో 100 పర్సంటైల్ సాధించిన అనురాగ్‌రెడ్డి 16 మందిలో అతనొకడు.. నల్లగొండ అర్బన్: ప్రతిష్టాత్మక మేనేజ్మెంట్ కోర్సుల ప్రవేశ పరీక్ష అయిన కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)-2014లో నల్లగొండ జిల్లాకు చెందిన పడిగెపాటి అనురాగ్‌రెడ్డి 100 పర్సంటైల్ సాధించాడు. జాతీయస్థాయిలో మొత్తం 16 మంది 100 పర్సంటైల్ సాధించగా, తెలంగాణ, ఏపీల నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక విద్యార్థి అనురాగ్‌రెడ్డి. ముంబై ఐఐటీలో ఫైనలియర్ చదువుతున్న అనురాగ్.. క్యాట్ పరీక్షల్లోనూ సత్తా చాటాడు. నవంబర్ 16న క్యాట్ పరీక్ష రాసిన అతడు క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డాటా ఎంటర్ ప్రిటేషన్‌లో 144.80 స్కేల్డ్ స్కోరు సాధించాడు. ఇది పర్సంటైల్‌లో గణిస్తే 100కు 100 శాతం. వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్‌లో 119.08 స్కేల్డ్ స్కోరు సాధించగా, పర్సంటైల్‌లో ఇది 99.94 శాతం. మొత్తం మీద 262.47 స్కేల్డ్ స్కోరుతో 100 శాతం పర్సంటైల్ సాధించాడు. చిన్ననాటి నుంచే చదువులో మేటి.. అనురాగ్ మొదటి నుంచీ చదువులో ప్రతిభ కనబరుస్తున్నాడు. పదోతరగతి నల్లగొండ, ఇంటర్ విజయవాడలో పూర్తి చేశాడు. ఐఐటీలో 97వ ర్యాంకు సాధించి ముంబై ఐఐటీలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో చేరాడు. అనురాగ్ తండ్రి జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారుడు. తల్లి రత్నమాల మిర్యాలగూడలోని ఎన్ఎస్పీ ఓఎండీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో పెదనాన్న అమరేందర్‌రెడ్డి పర్యవేక్షణలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నాడు. అనురాగ్‌కు ఎంసెట్‌లో 37వ ర్యాంకు రాగా, తిరువనంతపురంలోని స్పేస్ ఇంజనీర్స్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ఐశాట్‌లో జాతీయస్థాయిలో 10వ ర్యాంకు సాధించాడు. భవిష్యత్ ఇప్పుడే చెప్పలేను: ‘విద్యార్థిగా నా లక్ష్యాలను నెరవేర్చుకుంటూ వెళుతున్నాను. క్యాట్‌లో సాధించిన ర్యాంకుతో నా లక్ష్యం పరిపూర్ణమయింది. అయితే, భవిష్యత్‌లో ఏం కావాలనే దానిపై నేనింకా నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయాత్మక స్థానంలో ఉండాలనేది, జాతీయస్థాయిలో గుర్తింపు రావాలనేది నా కోరిక.’ అని ‘సాక్షి’తో తన విజయానందాన్ని పంచుకున్నాడు అనురాగ్. ముంబై ఐఐటీలో ఉన్న ఇతను శనివారం రాత్రి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడాడు. అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏ చేయాలనేది తన ఆశ అని అనురాగ్ చెప్పాడు. క్యాట్-2014 ఫలితాలు విడుదల సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)లలో ప్రవేశాలకు నవంబరులో నిర్వహించిన కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్)-2014 ఫలితాలను శనివారం ప్రకటించారు. ఈ పరీక్షకు 1.70 లక్షల మంది హాజరయ్యారు. ఫలితాలను www.iimcat.ac.in లో చూసుకోవచ్చు. అభ్యర్థుల్లో 16 మంది(ఒక బాలికతో సహా)కి 100 పర్సంటైల్, 10 మందికి 99.99 పర్సంటైల్ లభించినట్లు సమాచారం. క్యాట్-2014 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రస్తుత 13 ఐఐఎం లతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్‌లలో కొత్తగా ఏర్పాటు కానున్న ఆరు ఐఐఎంలు, దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూళ్లలో ప్రవేశం పొందవచ్చు. -
అక్షరాలకు అద్భుతరూపం
దేశ,విదేశీయుల మనస్సులు గెల్చుకున్న శశిధర్‌రెడ్డి అక్షరాలతో సమస్యలపై సమరం నేడు మాతృభాషా దినోత్సవం సనత్‌నగర్,న్యూస్‌లైన్: బీఆర్క్ (ఆర్కిటెక్చర్)...ఆపై ముంబయి ఐఐటీ లో విజువల్ డిజైనింగ్ చేశాడు ఆ కుర్రోడు. ఆంగ్లాన్ని అవపోశన పట్టేశాడు...ఇందులో వింతేముంది...అనుకుంటున్నారా..ఒక్క క్షణం...ఆంగ్లంలో గలగలా మాట్లా డే ఆ కుర్రోడే మాతృభాష తెలుగుదనం గొప్పతనాన్ని విశ్వమంతా ఖ్యాతింపజేస్తున్నాడు. బడిఒడిలో మొదటగా తాను నేర్చుకున్న తెలుగు ఓనమాలనే అస్త్రాలుగా చేసుకుని అద్భుతాలకు నాంది పలికాడు. కోట్లాది హృదయాలను తనఅక్షర ప్రయోగంతో తట్టిలేపాడు. పరదేశీయుల మనస్సులనూ గెలుచుకున్నాడు. ఆయనే బహురూపాల్లో స్వభాషా ప్రియత్వాన్ని చాటుతోన్న హైదరాబాదీ నేస్తం జి.శశిధర్‌రెడ్డి. అంతరించిపోతున్న భాషల్లో తెలుగు కూడా ఒకటి అన్న చేదువార్తను జీర్ణించుకోలేని ఆ కుర్రోడు తనవంతుగా టైపోగ్రఫీ (ఖతిచిత్రకళ)తో తెలుగుభాష గొప్పతనాన్ని చాటుతున్నాడు. కేవలం అక్షరాలను ఉపయోగించి భావవ్యక్తీరణ చేయడమే టైపోగ్రఫీ. నేడు మాతృభాష దినోత్సవం సందర్భంగా...శశిధర్‌రెడ్డి తెలుగుఅక్షరాలతో చేసిన ప్రయోగాలతో కొన్ని.. ‘అమ్మ’కం...ఓ అద్భుతం: పెంచిన తల్లి ప్రేమ.. జన్మనిచ్చిన తల్లి ప్రేమ.. సహజత్వానికి... కృత్రిమతత్వానికి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. అందుకే మాతృభాషలోని మధురామృతాన్ని తానొక్కడే జుర్రుకోవడమే కాదు... ఇతరులకు పంచాలని కంకణం కట్టుకున్నాడు. అ అంటే అమ్మ అని అందరికీ తెలుసు. ‘అ’ అక్షరంతోనే అమ్మ ప్రేమను టైపోగ్రఫీతో కళ్లకు కట్టినట్లు చూపించా డు. పేదరికంతో గర్భాన్ని అద్దెకిస్తున్న తల్లులు (సరోగసీ), పుట్టిన బిడ్డలను వివిధ కారణాలతో అమ్ముకుం టున్న మాతృమూర్తులు, గర్భసంచి తొలగింపు శస్త్రచికిత్సలు వంటివాటిపై ఒక్క అక్షరంతో తన సందేశాన్ని వ్యక్తపర్చాడు. సహజత్వం ఉట్టిపడే తెలుగు అక్షరాలకు శశిధర్‌రెడ్డి సృజనను జోడించి తల్లిగర్భంలో బిడ్డ ఆకా రం వచ్చేలా టైపోగ్రఫీ చేయడం అందరినీ ఆకట్టుకుం ది. గత ఏడాది గౌహతిలో జరిగిన అంతర్జాతీయ టైపోగ్రఫీ పోటీలకు హాజరై ప్రపంచదేశాల ప్రతినిధులను ఆలోచింపజేయడమే కాదు శశిధర్‌రెడ్డిని విజేతగా నిలిపింది. తెలుగు అక్షరాలతో మద్యంపై పోరాటం: సాధారణంగా మనం రాసే అక్షరాలకు సృజనాత్మకతను జోడించి టైపోగ్రఫీ ద్వారా మద్యం రక్కసిపై ఆయన పోరాడుతున్నాడు. మద్యంతో బతుకులు ఏవిధంగా ఛిద్రమవుతున్నాయో ఖతిచిత్రకళ ద్వారా సందేశాన్ని అందించారు. మద్యం సేవించడం ద్వారా ఆరోగ్యం పాడై, కుటుంబ బాధ్యతలు మరిచి చివరకు ఉరితాడును పట్టుకుంటున్నట్లుగా తాడుతో అక్షరరూపంలోకి తేవడం విశేషం. ఇంగ్లీష్....తిప్పిచూస్తే తెలుగు: తెలుగు భాష ప్రాశస్త్యాన్ని చాటడంలో శశిధర్‌రెడ్డి ప్రత్యేకత సాధించారని చెప్పొచ్చు. ఇంగ్లీష్ పదం ఒక అర్థాన్ని చెబితే...అదే పదాన్ని 180 డిగ్రీలో తిప్పి చూస్తే తెలుగుపదం మరో అర్ధాన్ని ఇస్తోంది. ఇలాంటి ప్రయోగాల ద్వారా తెలుగుభాష గొప్పతనం గురించి కొంతైనా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నదే నా తాపత్రయం అని చెప్పుకొచ్చారు. శ్రీముత్యాలు ఫాంట్‌కు రూపకల్పన: తెలుగుభాషపై అభిమానంతో శ్రీముత్యాలు ఫాంట్‌కు రూపొందించారు. మిగతా ఫాంట్ల కంటే భిన్నంగా తెలుగు భాషను సులువుగా చదువుకునేలా దీనిని తయారుచేయడం జరిగిం ది. శ్రీ అంటే తన గురువు శ్రీకుమార్, ముత్యాలు అంటే హైదరాబాద్ పెరల్స్ పేరిట శ్రీముత్యాలు అని పెట్టిన ట్లు శశిధర్ తెలిపారు. ఇదే కాకుండా చిన్నపిల్లలు సులువుగా అర్థం చేసుకునేలా పుస్తకాలు రూపొందిస్తున్నట్లు శశిధర్ చెప్పారు. -
విశాఖలో ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య
బాంబే ఐఐటీలో పీహెచ్డీ చేస్తున్న హైదరాబాద్ వాసి శివతేజ శాస్త్రవేత్త కావాలనుకుని అంతలోనే అనంత వాయువుల్లోకి పాలిథిన్ కవరు తలకు చుట్టుకుని, టేప్ అతికించుకుని బలవన్మరణం! చదివేది ముంబైలో.. నివాసం హైదరాబాద్‌లో.. కానీ, విశాఖలో ఆత్మహత్య చేసుకోవడంపై సందేహం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు సాక్షి, హైదరాబాద్, విశాఖపట్నం, ముంబై: అతను చదువుల్లో టాప్.. ఎందరో కలలుగనే ముంబై ఐఐటీలో సులువుగా సీటు తెచ్చుకున్నాడు.. బాగా చదివి సైంటిస్ట్‌గా కావాలనుకున్నాడు.. ఆ దిశగా వేగంగా ముందుకు సాగాడు.. తన ఆశయాలకు కుటుంబం నుంచి కావలసినంత తోడ్పాటూ ఉంది.. ఉన్నట్లుండి ఏమైందోగానీ, బతుకుపై విరక్తి పెంచుకున్నాడు. బలవంతంగా ప్రాణం తీసుకున్నాడు.. హైదరాబాద్‌కు చెందిన మొలకల శివతేజ (26) అనే ఐఐటీ విద్యార్థి వ్యథ ఇది.. అయితే, ఏ సమస్యలూ లేని శివతేజ ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. శివతేజ చదువుకునేది ముంబైలో.. స్వస్థలం హైదరాబాద్.. కానీ, విశాఖపట్నంలోని ఒక లాడ్జిలో ఆయన మృతి చెందడంపై సందేహాలు వస్తున్నాయి. కడప జిల్లా తొండూరు మండలం కొరుగుంట్లపల్లికి చెందిన మొలకల రాజశేఖర్‌రెడ్డి, ఉషారాణి దంపతులు కొన్నేళ్ల కింద హైదరాబాద్‌కు వలస వచ్చారు. రాజశేఖర్‌రెడ్డి ఒక ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంస్థలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి కాప్రా ప్రాంతంలోని శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారి కుమారుడు శివతేజ. చిన్నప్పటి నుంచీ చదువులో చురుకుగా ఉన్న శివతేజ.. పదోతరగతి తరువాత రామయ్య ఇన్స్టిట్యూట్లో ఇంటర్‌తో పాటు ఐఐటీ శిక్షణ పొందాడు. ఐఐటీ ఎంట్రెన్స్‌లో 120వ ర్యాంక్ సాధించి, ముంబై ఐఐటీలో చేరాడు. అక్కడే ఎంటెక్ కూడా పూర్తి చేసిన శివతేజ ప్రస్తుతం పీహెచ్డీ చేస్తున్నాడు. చదువులోనూ ఎప్పుడూ చురుకుగా ఉంటాడు. కానీ, అకస్మాత్తుగా విశాఖపట్నంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంక్రాంతి శుభాకాంక్షలు చెబుదామని... సంక్రాంతి సందర్భంగా శివతేజకు శుభాకాంక్షలు చెప్పేందుకు 13వ తేదీన తల్లిదండ్రులు ప్రయత్నించారు. కానీ, రెండు రోజుల పాటు ప్రయత్నించినా.. ఫోన్ కలవలేదు. ముంబైలోని హాస్టల్‌కు ఫోన్‌చేస్తే.. అక్కడ లేడని సమాధానం వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ముంబై ఐఐటీకి వెళ్లి.. హాస్టల్లో, స్నేహితులను అందరినీ అడిగారు. ఆచూకీ తెలియకపోవడంతో.. ఈ నెల 16న ముంబైలో మిస్సింగ్ కేసు పెట్టారు. ఇదంతా జరుగుతుండగానే శనివారం ఉదయం విశాఖ పోలీసుల నుంచి వారికి తేజ మరణవార్త అందింది. ఆత్మహత్య చేసుకున్న స్థలంలో లభ్యమైన పాన్ కార్డు, ఐఐటీ బాంబే గుర్తింపు కార్డు, పర్సు సహాయంతో.. పోలీసులు మృతుడిని గుర్తించి సమాచారం ఇచ్చారు. ఏం జరిగింది? శివతేజ ఈ నెల 16వ తేదీన విశాఖపట్నంలో అశ్విని లాడ్జిలోని ఒక గదిలో దిగాడు. మరుసటి రోజు 17న మధ్యాహ్నం రిసెప్షన్లో వాటర్ బాటిల్ తీసుకున్నాడు. అయితే, అదే రోజు రాత్రి లాడ్జి సిబ్బంది భోజనం కోసం తలుపుకొట్టినా, తెరవలేదు. దాంతో నిద్రపోయి ఉంటాడని భావించి సిబ్బంది పట్టించుకోలేదు. 18వ తేదీ ఉదయం కూడా ఎంతసేపు తలుపుకొట్టినా.. తెరవకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా... బాత్రూమ్లో శివతేజ మృతదేహం కనిపించింది. మృతదేహం తలపై నుంచి మెడవరకు పాలిథిన్ కవరు చుట్టి, గట్టిగా టేపుతో అతికించి ఉంది. చేతి వేళ్లకూ టేపు అతికించి ఉంది. ఘటనా స్థలంలో రెండు కత్తులు, టేప్, పాలిథిన్ కవర్ లభించాయి. అనుమానాస్పద మృతిగా... శివతేజ ముంబైలో చదువుతున్నా.. అక్కడ పెద్దగా స్నేహితులు లేరని పోలీసులు చెబుతున్నారు. చదువులోనూ చురుకు.. ఆర్థిక సమస్యలు కూడా లేవని అంటున్నారు. ఎలాంటి దుర్వ్యసనాలూ లేవని తేల్చారు. తేజ విశాఖకు వచ్చే ముందు బ్యాంకులోంచి కేవలం రూ. ఏడు వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకుని వచ్చాడు. అయితే, ఒకవేళ ఏదైనా ప్రేమ వ్యవహారంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. శివతేజ మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, మెయిల్స్‌తో పాటు ఫేస్బుక్ అకౌంట్‌నూ పోలీసులు పరిశీలించారు. కానీ, అనుమానించదగ్గ అంశాలేవీ కనిపించలేదని తెలుస్తోంది. కానీ, ఘటనా స్థలంలో మాత్రం రెండు కత్తులు, టేప్, పాలిథిన్ కవర్ లభించాయి. దాంతో పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. శత్రువులెవరూ లేరు: శివతేజ తండ్రి రాజశేఖర్ ‘‘తేజ అసలు విశాఖ ఎందుకు వచ్చాడో అంతుపట్టడం లేదు. నా కుమారుడికి ఎవరితోనూ శత్రుత్వం, వివాదాలు లేవు. చక్కగా చదువుకుంటాడు. ఎప్పుడూ మాతో మాట్లాడేవాడు ఫోన్ ఎందుకు ఎత్తలేదో తెలియక ముంబై వెళ్లాం. అక్కడ లేడు. కొద్దిరోజుల కింద తన పీహెచ్డీ రిపోర్ట్ చాలా బాగుందని ప్రొఫెసర్ ప్రశంసించారని కూడా చెప్పాడు. కానీ, ఇలా జరగడమేమిటో అర్థం కావడంలేదు.’’ కారణాలేమిటో బయటకు తేవాలి: రామయ్య ‘‘బాగా చదువుకొనే పిల్లలు ఇలా ఆత్మహత్యలకు పాల్పడడం బాధ కలిగిస్తోంది. శివతేజ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడవలసి వచ్చిందో తెలియాలి. ఇందుకోసం ఒక కమిటీ వేసి సమగ్ర దర్యాఫ్తు చేపట్టాలి. ఒక్క శివతేజ అంశమే కాదు.. ఐఐటీల్లో చదివే విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలను తెలుసుకోవాలి. ఐఐటీల్లో చదివేవారు ఎలాంటి పరిస్థితులనైనా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి.’’ ఇంటర్నెట్ వీడియోలు చూసి.. చదువులో ఎంతో చురుకుగా ఉండే శివతేజ ఇంటర్నెట్లో ఆత్మహత్యల వీడియోలు చూసి, ఆ తరహాలో బలవన్మరణానికి పాల్పడ్డట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటివరకూ విదేశాల్లో మాత్రమే అలాంటి ఆత్మహత్యలు జరిగాయి. శివతేజ తలపై నుంచి మెడవరకు చుట్టూ గట్టి పాలిథిన్ కవర్‌ను నాలుగైదు చుట్లు గట్టిగా బిగించుకున్నాడు. గాలి చొరబడకుండా దాన్ని టేపుతో అతికించుకున్నాడు. తర్వాత చేతివేళ్లన్నింటిని కలిపి టేపు చుట్టుకున్నాడు. పాలిథిన్ కవరును గట్టిగా బిగించుకోవడం వల్ల ఊపిరాడక మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే, మృతిపై అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.