విశాఖలో ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య | IIT student found dead in Vizag lodge | Sakshi
Sakshi News home page

విశాఖలో ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

Published Sun, Jan 19 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM

విశాఖలో ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

విశాఖలో ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

బాంబే ఐఐటీలో పీహెచ్‌డీ చేస్తున్న హైదరాబాద్ వాసి శివతేజ
శాస్త్రవేత్త కావాలనుకుని అంతలోనే అనంత వాయువుల్లోకి
పాలిథిన్ కవరు తలకు చుట్టుకుని, టేప్ అతికించుకుని బలవన్మరణం!
చదివేది ముంబైలో.. నివాసం హైదరాబాద్‌లో..
కానీ, విశాఖలో ఆత్మహత్య చేసుకోవడంపై సందేహం
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

 
సాక్షి, హైదరాబాద్, విశాఖపట్నం, ముంబై: అతను చదువుల్లో టాప్.. ఎందరో కలలుగనే ముంబై ఐఐటీలో సులువుగా సీటు తెచ్చుకున్నాడు.. బాగా చదివి సైంటిస్ట్‌గా కావాలనుకున్నాడు.. ఆ దిశగా వేగంగా ముందుకు సాగాడు.. తన ఆశయాలకు కుటుంబం నుంచి కావలసినంత తోడ్పాటూ ఉంది.. ఉన్నట్లుండి ఏమైందోగానీ, బతుకుపై విరక్తి పెంచుకున్నాడు. బలవంతంగా ప్రాణం తీసుకున్నాడు.. హైదరాబాద్‌కు చెందిన మొలకల శివతేజ (26) అనే ఐఐటీ విద్యార్థి వ్యథ ఇది.. అయితే, ఏ సమస్యలూ లేని శివతేజ ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. శివతేజ చదువుకునేది ముంబైలో.. స్వస్థలం హైదరాబాద్.. కానీ, విశాఖపట్నంలోని ఒక లాడ్జిలో ఆయన మృతి చెందడంపై సందేహాలు వస్తున్నాయి.
 
 కడప జిల్లా తొండూరు మండలం కొరుగుంట్లపల్లికి చెందిన మొలకల రాజశేఖర్‌రెడ్డి, ఉషారాణి దంపతులు కొన్నేళ్ల కింద హైదరాబాద్‌కు వలస వచ్చారు. రాజశేఖర్‌రెడ్డి ఒక ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంస్థలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి కాప్రా ప్రాంతంలోని శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారి కుమారుడు శివతేజ. చిన్నప్పటి నుంచీ చదువులో చురుకుగా ఉన్న శివతేజ.. పదోతరగతి తరువాత రామయ్య ఇన్‌స్టిట్యూట్‌లో ఇంటర్‌తో పాటు ఐఐటీ శిక్షణ పొందాడు. ఐఐటీ ఎంట్రెన్స్‌లో 120వ ర్యాంక్ సాధించి, ముంబై ఐఐటీలో చేరాడు. అక్కడే ఎంటెక్ కూడా పూర్తి చేసిన శివతేజ ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నాడు. చదువులోనూ ఎప్పుడూ చురుకుగా ఉంటాడు. కానీ, అకస్మాత్తుగా విశాఖపట్నంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
 సంక్రాంతి శుభాకాంక్షలు చెబుదామని...
 సంక్రాంతి సందర్భంగా శివతేజకు శుభాకాంక్షలు చెప్పేందుకు 13వ తేదీన తల్లిదండ్రులు ప్రయత్నించారు. కానీ, రెండు రోజుల పాటు ప్రయత్నించినా.. ఫోన్ కలవలేదు. ముంబైలోని హాస్టల్‌కు ఫోన్‌చేస్తే.. అక్కడ లేడని సమాధానం వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ముంబై ఐఐటీకి వెళ్లి.. హాస్టల్‌లో, స్నేహితులను అందరినీ అడిగారు. ఆచూకీ తెలియకపోవడంతో.. ఈ నెల 16న ముంబైలో మిస్సింగ్ కేసు పెట్టారు. ఇదంతా జరుగుతుండగానే శనివారం ఉదయం విశాఖ పోలీసుల నుంచి వారికి తేజ మరణవార్త అందింది. ఆత్మహత్య చేసుకున్న స్థలంలో లభ్యమైన పాన్ కార్డు, ఐఐటీ బాంబే గుర్తింపు కార్డు, పర్సు సహాయంతో.. పోలీసులు మృతుడిని గుర్తించి సమాచారం ఇచ్చారు.
 
 ఏం జరిగింది?
 శివతేజ ఈ నెల 16వ తేదీన విశాఖపట్నంలో అశ్విని లాడ్జిలోని ఒక గదిలో దిగాడు. మరుసటి రోజు 17న మధ్యాహ్నం రిసెప్షన్‌లో వాటర్ బాటిల్ తీసుకున్నాడు. అయితే, అదే రోజు రాత్రి లాడ్జి సిబ్బంది భోజనం కోసం తలుపుకొట్టినా, తెరవలేదు. దాంతో నిద్రపోయి ఉంటాడని భావించి సిబ్బంది పట్టించుకోలేదు. 18వ తేదీ ఉదయం కూడా ఎంతసేపు తలుపుకొట్టినా.. తెరవకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా... బాత్‌రూమ్‌లో శివతేజ మృతదేహం కనిపించింది. మృతదేహం తలపై నుంచి మెడవరకు పాలిథిన్ కవరు చుట్టి, గట్టిగా టేపుతో అతికించి ఉంది. చేతి వేళ్లకూ టేపు అతికించి ఉంది. ఘటనా స్థలంలో రెండు కత్తులు, టేప్, పాలిథిన్ కవర్ లభించాయి.
 
 అనుమానాస్పద మృతిగా...
 శివతేజ ముంబైలో చదువుతున్నా.. అక్కడ పెద్దగా స్నేహితులు లేరని పోలీసులు చెబుతున్నారు. చదువులోనూ చురుకు.. ఆర్థిక సమస్యలు కూడా లేవని అంటున్నారు. ఎలాంటి దుర్వ్యసనాలూ లేవని తేల్చారు. తేజ విశాఖకు వచ్చే ముందు బ్యాంకులోంచి కేవలం రూ. ఏడు వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకుని వచ్చాడు. అయితే, ఒకవేళ ఏదైనా ప్రేమ వ్యవహారంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. శివతేజ మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, మెయిల్స్‌తో పాటు ఫేస్‌బుక్ అకౌంట్‌నూ పోలీసులు పరిశీలించారు. కానీ, అనుమానించదగ్గ అంశాలేవీ కనిపించలేదని తెలుస్తోంది. కానీ, ఘటనా స్థలంలో మాత్రం రెండు కత్తులు, టేప్, పాలిథిన్ కవర్ లభించాయి. దాంతో పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
 
 శత్రువులెవరూ లేరు: శివతేజ తండ్రి రాజశేఖర్
 ‘‘తేజ అసలు విశాఖ ఎందుకు వచ్చాడో అంతుపట్టడం లేదు. నా కుమారుడికి ఎవరితోనూ శత్రుత్వం, వివాదాలు లేవు. చక్కగా చదువుకుంటాడు. ఎప్పుడూ మాతో మాట్లాడేవాడు ఫోన్ ఎందుకు ఎత్తలేదో తెలియక ముంబై వెళ్లాం. అక్కడ లేడు. కొద్దిరోజుల కింద తన పీహెచ్‌డీ రిపోర్ట్ చాలా బాగుందని ప్రొఫెసర్ ప్రశంసించారని కూడా చెప్పాడు. కానీ, ఇలా జరగడమేమిటో అర్థం కావడంలేదు.’’
 
 కారణాలేమిటో బయటకు తేవాలి: రామయ్య
 ‘‘బాగా చదువుకొనే పిల్లలు ఇలా ఆత్మహత్యలకు పాల్పడడం బాధ కలిగిస్తోంది. శివతేజ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడవలసి వచ్చిందో  తెలియాలి. ఇందుకోసం ఒక కమిటీ వేసి సమగ్ర దర్యాఫ్తు చేపట్టాలి. ఒక్క శివతేజ అంశమే కాదు.. ఐఐటీల్లో చదివే విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలను తెలుసుకోవాలి. ఐఐటీల్లో చదివేవారు ఎలాంటి పరిస్థితులనైనా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి.’’
 
 ఇంటర్‌నెట్ వీడియోలు చూసి..
 చదువులో ఎంతో చురుకుగా ఉండే శివతేజ ఇంటర్‌నెట్‌లో ఆత్మహత్యల వీడియోలు చూసి, ఆ తరహాలో బలవన్మరణానికి పాల్పడ్డట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటివరకూ విదేశాల్లో మాత్రమే అలాంటి ఆత్మహత్యలు జరిగాయి. శివతేజ తలపై నుంచి మెడవరకు చుట్టూ గట్టి పాలిథిన్ కవర్‌ను నాలుగైదు చుట్లు గట్టిగా బిగించుకున్నాడు. గాలి చొరబడకుండా దాన్ని టేపుతో అతికించుకున్నాడు. తర్వాత చేతివేళ్లన్నింటిని కలిపి టేపు చుట్టుకున్నాడు. పాలిథిన్ కవరును గట్టిగా బిగించుకోవడం వల్ల ఊపిరాడక మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే, మృతిపై అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement