క్యాట్‌లో మెరిసిన నల్లగొండ ఆణిముత్యం | Nalgonda student wins 100 percentile national wide | Sakshi
Sakshi News home page

క్యాట్‌లో మెరిసిన నల్లగొండ ఆణిముత్యం

Published Sun, Dec 28 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM

క్యాట్‌లో మెరిసిన నల్లగొండ ఆణిముత్యం

క్యాట్‌లో మెరిసిన నల్లగొండ ఆణిముత్యం

జాతీయ స్థాయిలో 100 పర్సంటైల్ సాధించిన అనురాగ్‌రెడ్డి
16 మందిలో అతనొకడు..

 
 నల్లగొండ అర్బన్: ప్రతిష్టాత్మక మేనేజ్‌మెంట్ కోర్సుల ప్రవేశ పరీక్ష అయిన కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)-2014లో నల్లగొండ జిల్లాకు చెందిన పడిగెపాటి అనురాగ్‌రెడ్డి 100 పర్సంటైల్ సాధించాడు. జాతీయస్థాయిలో మొత్తం 16 మంది 100 పర్సంటైల్ సాధించగా, తెలంగాణ, ఏపీల నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక విద్యార్థి అనురాగ్‌రెడ్డి. ముంబై ఐఐటీలో ఫైనలియర్  చదువుతున్న అనురాగ్.. క్యాట్ పరీక్షల్లోనూ సత్తా చాటాడు. నవంబర్ 16న క్యాట్ పరీక్ష రాసిన అతడు క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డాటా ఎంటర్ ప్రిటేషన్‌లో 144.80 స్కేల్డ్ స్కోరు సాధించాడు. ఇది పర్సంటైల్‌లో గణిస్తే 100కు 100 శాతం. వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్‌లో 119.08 స్కేల్డ్ స్కోరు సాధించగా, పర్సంటైల్‌లో ఇది 99.94 శాతం. మొత్తం మీద 262.47 స్కేల్డ్ స్కోరుతో 100 శాతం పర్సంటైల్ సాధించాడు.
 
 చిన్ననాటి నుంచే చదువులో మేటి..
 అనురాగ్ మొదటి నుంచీ చదువులో ప్రతిభ కనబరుస్తున్నాడు. పదోతరగతి నల్లగొండ, ఇంటర్ విజయవాడలో పూర్తి చేశాడు. ఐఐటీలో 97వ ర్యాంకు సాధించి ముంబై ఐఐటీలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో చేరాడు. అనురాగ్ తండ్రి జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారుడు. తల్లి రత్నమాల మిర్యాలగూడలోని ఎన్‌ఎస్‌పీ ఓఎండీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.  చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో పెదనాన్న అమరేందర్‌రెడ్డి పర్యవేక్షణలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నాడు. అనురాగ్‌కు ఎంసెట్‌లో 37వ ర్యాంకు రాగా, తిరువనంతపురంలోని స్పేస్ ఇంజనీర్స్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ఐశాట్‌లో జాతీయస్థాయిలో 10వ ర్యాంకు సాధించాడు.
 
 భవిష్యత్ ఇప్పుడే చెప్పలేను: ‘విద్యార్థిగా నా లక్ష్యాలను నెరవేర్చుకుంటూ వెళుతున్నాను. క్యాట్‌లో సాధించిన ర్యాంకుతో నా లక్ష్యం పరిపూర్ణమయింది. అయితే, భవిష్యత్‌లో ఏం కావాలనే దానిపై నేనింకా నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయాత్మక స్థానంలో ఉండాలనేది, జాతీయస్థాయిలో గుర్తింపు రావాలనేది నా కోరిక.’ అని ‘సాక్షి’తో తన విజయానందాన్ని పంచుకున్నాడు అనురాగ్. ముంబై ఐఐటీలో ఉన్న ఇతను శనివారం రాత్రి ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడాడు. అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏ చేయాలనేది తన ఆశ అని అనురాగ్ చెప్పాడు.
 
 క్యాట్-2014 ఫలితాలు విడుదల
 సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)లలో ప్రవేశాలకు నవంబరులో నిర్వహించిన కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్)-2014 ఫలితాలను శనివారం ప్రకటించారు. ఈ పరీక్షకు 1.70 లక్షల మంది హాజరయ్యారు. ఫలితాలను www.iimcat.ac.in లో చూసుకోవచ్చు. అభ్యర్థుల్లో 16 మంది(ఒక బాలికతో సహా)కి 100 పర్సంటైల్, 10 మందికి 99.99 పర్సంటైల్ లభించినట్లు సమాచారం. క్యాట్-2014 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రస్తుత  13 ఐఐఎం లతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్‌లలో కొత్తగా ఏర్పాటు కానున్న ఆరు ఐఐఎంలు, దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూళ్లలో ప్రవేశం పొందవచ్చు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement