common admission test
-
క్యాట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లలో 2020–21 విద్యా సంవత్సరం ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి గతేడాది నవంబర్ 24న నిర్వహించిన క్యాట్ (కామన్ అడ్మిషన్ టెస్ట్)–2019 పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 2.09 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 1.34 లక్షల మంది పురుషులు, 75 వేల మంది మహిళలు ఉన్నారు. తెలంగాణకు చెందిన వారు దాదాపు 7 వేల మంది క్యాట్ పరీక్ష రాసినట్లు సమాచారం. తాజా ఫలితాల్లో దేశవ్యాప్తంగా 10 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా, వీరంతా పురుషులే కావడం గమనార్హం. 100 పర్సంటైల్ వచ్చిన వారంతా డిగ్రీలో ఇంజనీరింగ్ నేపథ్యమున్న వారే. టాప్ టెన్‌లో ఆరుగురు ఐఐటీ విద్యార్థులు కాగా, మరో ఇద్దరు ఎన్ఐటీకి చెందిన విద్యార్థులు. వీరిలో నలుగురు మహారాష్ట్ర, మిగిలిన ఆరుగురు తెలంగాణ, జార్ఖండ్, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందినవారు. మరో 21 మంది 99.9 పర్సంటైల్ సాధించగా, ఇందులో 19 మంది ఇంజనీరింగ్ నేపథ్యమున్న వారే కావడం గమనార్హం. వరంగల్ నిట్ విద్యార్థులు క్యాట్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. -
‘క్యాట్’ ఫలితాల వెల్లడి
న్యూఢిల్లీ: ఐఐఎం (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్)లతోపాటు దేశంలోని ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూళ్లలో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)లో అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థి సాయిప్రణీత్ రెడ్డి 100 పర్సెంటైల్ సాధించాడు. 2018 ఏడాదిలో ప్రవేశాల కోసం ఐఐఎం–లక్నో ఆధ్వర్యంలో గతేడాది నవంబరులో దేశవ్యాప్తంగా 140 పట్టణాల్లో జరిగిన క్యాట్‌కు దాదాపు 2 లక్షల మంది హాజరయ్యారు. సోమవారం ఫలితాలు విడుదలవగా మొత్తం 20 మంది విద్యార్థులు 100 పర్సెంటైల్ సాధించారు. గతేడాది క్యాట్ పరీక్షలోనూ 20 మంది 100 పర్సెంటైల్ సాధించగా వారందరూ అబ్బాయిలు, ఇంజినీరింగ్ నేపథ్యం ఉన్నవారే. ఈ ఏడాది అందుకు భిన్నంగా ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు నాన్–ఇంజినీర్లు కూడా 100 పర్సెంటైల్‌ను సొంతం చేసుకున్నారని క్యాట్ కన్వీనర్ నీరజా ద్వివేది చెప్పారు. క్యాట్‌కు రెండు లక్షల మంది హాజరవ్వడం గత మూడేళ్లలో ఇదే తొలిసారని ఆమె తెలిపారు. క్యాట్ స్కోర్‌ను అనుసరించి దేశంలోని 20 ఐఐఎంలలో దాదాపు 4,000 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. ఐఐఎం అహ్మదాబాద్‌లో చేరతా: సాయి ప్రణీత్ అనంతపురం జిల్లాకు చెందిన, ఐఐటీ మద్రాస్‌లో చదువుతున్న సాయి ప్రణీత్ రెడ్డి 100 పర్సెంటైల్ సాధించాడు. ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీయే చదవాలని కోరుకుంటున్నట్లు అతను చెప్పాడు. ‘టెక్నికల్ రంగంలోనూ నేను రాణించగలను. కానీ కొన్నిసార్లు మన పనిని ఇతరులతో చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను గుర్తించాను. అందుకోసం నిర్వహణా నైపుణ్యాలు కావాలి. అవి నేర్చుకోవడానికి మన దేశంలో ఐఐఎంలే అత్యుత్తమం’ అని సాయి ప్రణీత్ వివరించాడు. నాలుగోసారి 100 పర్సెంటైల్ ముంబైలో క్యాట్ కోచింగ్ సెంటర్ నిర్వహించే ప్యాట్రిక్ డిసౌజా 100 పర్సెంటైల్ సాధించడం ఇది నాలుగోసారి. కోచింగ్ సెంటర్ నడుపుతున్నందున క్యాట్‌లో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను తెలుసుకునేందుకు ఇప్పటికి 14 సార్లు పరీక్ష రాశాననీ, ప్రతీసారి కనీసం 99 పర్సెంటైల్ సాధించానని ఆయన చెప్పారు. కోల్‌కతా విద్యార్థి విశాల్ వోహ్రా, సూరత్ నుంచి మీత్ అగర్వాల్, ఢిల్లీ అమ్మాయి చావీ గుప్తా తదితరులు 100 పర్సెంటైల్ సాధించారు. -
క్యాట్-2015 ప్రిపరేషన్ ప్రణాళిక
కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్).. దే శంలోని అత్యుత్తమ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశాలకు మార్గం సుగమం చేస్తోంది. క్యాట్‌లో సత్తా చాటితే ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎంలు), ఇతర పతిష్టాత్మక బి-స్కూల్స్‌లలో సీట్లు పొందొచ్చు. ప్రతి ఏడాది ఈ పరీక్షకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరవుతున్నారు. ఈసారి (క్యాట్-2015) దరఖాస్తుల సంఖ్య రికార్డు స్థాయిలో 2.18 లక్షలకు చేరింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఔత్సాహిక విద్యార్థులు పోటీకి అనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలి. క్యాట్ ప్రిపరేషన్ ప్రణాళికా వ్యూహాలపై నిపుణుల సలహాలు... గత ఏడాది రెండు లక్షల్లోపున్న క్యాట్ దరఖాస్తుల సంఖ్య ఈ ఏడాది రెండు లక్షలు దాటింది. దీంతో క్యాట్ -2015 పరీక్ష రాయబోతున్న విద్యార్థులు కాస్త గట్టి పోటీనే ఎదుర్కోవలసి ఉంటుంది. ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానానికి 2009లో రూపకల్పన జరిగింది. అప్పటి నుంచి క్యాట్ దరఖాస్తుల సరళిని పరిశీలిస్తే క్యాట్-2015కు వచ్చిన దరఖాస్తుల సంఖ్యే అధికం.అయితే దరఖాస్తుల సంఖ్యను చూసి ఔత్సాహిక విద్యార్థులు ఆందోళన చెందక్కర్లేదని నిపుణులు సూచిస్తున్నారు. అనవసర ఆందోళన తుది ఫలితంపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.పోటీకి తగ్గట్టు ప్రిపరేషన్ పరంగా పదునైన వ్యూహాలతో ముందుకెళ్తే విజయం కష్టం కాదనేది నిపుణుల మాట. టైం మేనేజ్మెంట్ గతానికి భిన్నంగా అనేక మార్పులతో క్యాట్ 2015 నోటిఫికేషన్ విడుదలైంది. మార్పుల ప్రభావం ఫలితాలపై పడకుండా ఉండాలంటే అభ్యర్థులు ప్రధానంగా టైం మేనేజ్మెంట్, సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూషన్‌లపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.అందుబాటులో ఉన్న సమయానికి అనుగుణంగా సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూషన్ (ప్రిపరేషన్ పరంగా) చేసుకోవాలి.క్యాట్ ప్రశ్నపత్రంలో మూడు సెక్షన్లు ఉంటాయి. మూడు గంటల్లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి అభ్యర్థి విజయంలో టైం మేనేజ్మెంట్ కీలకపాత్ర పోషిస్తుంది.ప్రతి సెక్షన్‌ను 60 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాలనే నిబంధన ఉంది. దీంతో క్యాట్‌లో టైం మేనేజ్మెంట్ విస్మరించలేని అంశంగా మారింది. ఇప్పటి నుంచి పరీక్ష తేదీ (నవంబర్ 29) వరకు ఉన్న సమయాన్ని అభ్యర్థులు తమ వ్యక్తిగత సామర్థ్యాల ఆధారంగా ప్రిపరేషన్ పరంగా విభజించుకోవాలి.సిలబస్‌లో పేర్కొన్న అంశాల్లో పూర్తి చేయని చాప్టర్లుంటే.. వాటిని అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేసే విధంగా ఆయా అంశాలకు సమయాన్ని కేటాయించాలి . మూడు సెక్షన్లకు మూడు గంటలు చొప్పున రోజుకు మొత్తం 9 గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాలి. వారానికి రెండు మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. మొత్తం మీద కనీసం 10 నుంచి 12 మాక్ టెస్ట్‌లకు హాజరై వాటిలో చూపిన ప్రదర్శన ఆధారంగా బలహీనంగా ఉన్న అంశాలపై కొంత ఎక్కువ దృష్టి పెట్టాలి. అన్ని సబ్జెక్ట్‌లకు ప్రిపరేషన్ పరంగా సమతుల్యత ఉండే విధంగా చూసుకోవాలి. నవంబర్ మొదటి వారం నుంచి పూర్తిగా రివిజన్‌కే కేటాయించాలి. సెక్షన్లు.. సబ్జెక్ట్‌ల వారీగా వ్యూహాలు సెక్షన్ 1: క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: ఈ సెక్షన్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అంశాలతో ముడిపడి ఉంటుంది. కాలిక్యులేషన్స్ వేగంగా చేయగలిగే నేర్పు సొంతం చే సుకుంటే ఈ సెక్షన్లో రాణించవచ్చు.నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ప్రాబబిలిటీ అండ్ పెర్ముటేషన్స్/ కాంబినేషన్స్, నెంబర్స్, అల్జీబ్రా, జామెట్రీ విభాగాలపై దృష్టి పెట్టాలి. వీటికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్‌పై పట్టు సాధించాలి. క్యాట్‌లో 10 శాతం ప్రశ్నలు బేసిక్స్ ఆధారంగా చేసుకుని సొంత ఆలోచనతో సమాధానాలు గుర్తించే విధంగా ఉంటాయి. అభ్యర్థుల సమయం ఇక్కడే ఎక్కువగా వృథా అవుతోంది.కాబట్టి ఇలాంటి ప్రశ్నలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా డెరైక్ట్ బేసిక్స్ ఆధారంగా ఉండే ప్రశ్నల విషయంలో ఎక్కువ దృష్టి సారించాలి. అంటే ఫార్ములా బేస్డ్ ప్రశ్నల సాధనకు ప్రాధాన్యం ఇవ్వాలి. సెక్షన్-2: డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్:డేటా ఇంటర్ప్రిటేషన్లోగ్రాఫ్, చార్ట్‌లలో ఇచ్చిన డేటాకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అధిక శాతం ప్రశ్నలు అభ్యర్థుల స్వీయ విశ్లేషణ, సూక్ష్మ పరిశీలనల ఆధారంగా సమాధానం రాబట్టేవిగా ఉంటాయి.గ్రాఫ్, చార్ట్‌లలో ఇచ్చిన దత్తాంశాలపై నేరుగా ప్రశ్నలు అడగకుండా సంబంధిత కాన్సెప్ట్‌ను అర్థం చేసుకుని ఏ ఫార్ములా ఆధారంగా సమాధానం కనుక్కోగలమనే విధంగా ఈ ప్రశ్నలు ఉంటాయి. ఈ క్రమంలో పర్సంటేజీ, యావరేజెస్‌పై పట్టు సాధించాలి. దీనికి సంబంధించి క్యాట్ స్టాండర్డ్ మెటీరియల్ లేదా ఆన్లైన్ టెస్ట్‌ల్లోని ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి. వెర్బల్ ఎబిలిటీ సెక్షన్-2లో మరో ఉప విభాగం వెర్బల్ ఎబిలిటీ. ఇందులో ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు స్పీడ్ రీడింగ్‌ను అలవర్చుకోవాలి. ఒక అంశాన్ని చదువుతున్నప్పుడే అందులోని కీలక అంశాలను గుర్తించే నైపుణ్యాన్ని సొంతం చేసుకోవాలి. అర్థాలు, సమానార్థాలు, ఫ్రేజెస్, వర్డ్ యూసేజ్, సెంటెన్స్ ఫార్మేషన్, వొకాబ్యులరీలపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. రీడింగ్ కాంప్రహెన్షన్ రీడింగ్ కాంప్రహెన్షన్ క్యాట్లోఎక్కువ స్కోరు సాధించడానికి అవకాశం ఉన్న విభాగం. అభ్యర్థులు ఒక అంశాన్ని విశ్లేషణాత్మకంగా చదవడం అలవర్చుకుంటే ఇందులో రాణించొచ్చు. చదివేటప్పుడు అందులోని ముఖ్య సమాచారంతో పాటు... ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉన్న అంశాలు, కీలక పదాలను గుర్తించే నేర్పు సొంతం చేసుకోవాలి. దీని కోసం ఇంగ్లిష్ దినపత్రికల్లోని ఎడిటోరియల్స్, ఇతర వ్యాసాలు చదివి వాటి సారాంశాన్ని క్లుప్తంగా రాసుకోవాలి. ప్రిఫిక్స్, సఫిక్స్ విధానంలో వర్డ్ లెర్నింగ్‌తో వొకాబ్యులరీలో పట్టు సాధించొచ్చు. ప్రతి రోజు కనీసం 20 నుంచి 30 కొత్త పదాలను నేర్చుకోవడంతో పాటు వాటి వాడుకలపై అవగాహన పెంచుకోవాలి. క్యాట్ దరఖాస్తు సరళి సంవత్సరం దరఖాస్తులు హాజరు 2009 2.42 లక్షలు 2.16 లక్షలు 2010 2.04 లక్షలు 1.86 లక్షలు 2011 2.05 లక్షలు 1.85 లక్షలు 2012 2.14 లక్షలు 1.91 లక్షలు 2013 1.96 లక్షలు 1.94 లక్షలు 2014 1.89 లక్షలు 1.68 లక్షలు 2015 2.18 లక్షలు --- సీట్లు పెరగడమే... ప్రధాన కారణం ఐఐఎంలలో సీట్ల సంఖ్య పెరగడమే... క్యాట్-2015కు దరఖాస్తులు పెరగడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇప్పటికే ఉన్న ఐఐఎంలలో ఆయా ప్రోగ్రామ్‌లలో ఇన్‌టేక్‌ను పెంచడం; కొత్త ఐఐఎంలు నెలకొల్పడం వంటి చర్యల ఫలితంగా వచ్చే విద్యా సంవత్సరానికి మరిన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 2016-18 సంవత్సరానికి 19 ఐఐఎంలలో దాదాపు 5 వేల సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్లేస్‌మెంట్స్ పరంగా చాలా క్యాంపస్‌లు వంద శాతం రిజల్ట్స్ సాధించాయి. ఈ అంశం కూడా విద్యార్థులను క్యాట్ పరీక్ష వైపు ఆక ర్షించేందకు దోహదపడింది. - ప్రొఫెసర్ రాజేంద్ర కె.బండి, డెరైక్టర్, అడ్మిషన్స్, ఐఐఎం-బెంగళూరు స్పీడ్ కాలిక్యులేషన్తో విజయవంతంగా క్యాట్ ఔత్సాహిక అభ్యర్థులు ఇప్పటి నుంచే రివిజన్‌పై ప్రధానంగా దృష్టి పెట్టాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ ప్రారంభించిన అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేసుకోవాలి. ప్రశ్నలకు త్వరగా సమాధానాలు గుర్తించేందుకు స్పీడ్ కాలిక్యులేషన్ అలవర్చుకోవాలి. రీడింగ్, కాలిక్యులేషన్లలో స్పీడ్ ప్రాక్టీస్ అవసరం. ఈ ఏడాది క్యాట్‌లో ఆన్ స్క్రీన్ కాలిక్యులేటర్ ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. కాబట్టి దాని ద్వారా బేసిక్ కాలిక్యులేషన్స్ చేద్దాం అనే ధోరణి సరికాదు. ప్రతిదానికి ఆన్ స్క్రీన్ కాలిక్యులేటర్‌పై ఆధారపడితే సమయం వృథా అవుతుంది. కాబట్టి మెంటల్ కాలిక్యులేషన్ స్పీడ్ పెంచుకోవాలి. నవంబర్ మొదటి వారం నుంచి మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరు కావడం ఎంతో ఉపకరిస్తుంది. -రామ్‌నాథ్ ఎస్.కనకదండి, క్యాట్ కోర్స్ డెరైక్టర్ - టైమ్ ఇన్స్టిట్యూట్ -
క్యాట్ 2015
ప్రతిష్టాత్మక ఐఐఎంలలో మేనేజ్మెంట్ పీజీ ప్రోగ్రాంల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)-2015 నోటిఫికేషన్ విడుదలైంది. 2016-17 విద్యాసంవత్సరంలో 19 ఐఐఎంల్లో ప్రవేశాలకు క్యాట్ నిర్వహణ బాధ్యతలు ఐఐఎం-అహ్మదాబాద్ నిర్వహిస్తోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ల్లో వివిధ మేనేజ్మెంట్ పోస్టు గ్రాడ్యుయేట్, ఫెలో ప్రోగ్రామ్స్‌లో చేరడానికి క్యాట్‌లో సత్తా చాటాల్సిందే. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఐఐఎంలు రెండో దశ ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రత్యేకంగా రిటెన్ ఎబిలిటీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశాన్ని కల్పిస్తాయి. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. ఆన్లైన్రిజిస్ట్రేషన్: ఆగస్టు 6-సెప్టెంబరు 20 పరీక్ష తేది: నవంబరు 29 పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా 136 నగరాల్లో 650 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష విధానం: రెండు సెషన్లలో ఆన్లైన్ విధానంలో పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్‌ను కచ్చితంగా 60 నిమిషాల వ్యవధిలో పూర్తిచేయాలి. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలతోపాటు వన్ వర్డ్ ఆన్సర్ ప్రశ్నలు కూడా ఉంటాయి. సెక్షన్-1 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 34 సెక్షన్-2 డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ 32 సెక్షన్-3 వెర్బల్ అండ్ రీడింగ్ కాంప్రెహెన్షన్ 34 మొత్తం మార్కులు 100 పరీక్ష కాల వ్యవధి: 180 నిమిషాలు. క్యాట్-2015 ద్వారా ప్రవేశం కల్పించే ఐఐఎం క్యాంపస్‌లు: విశాఖపట్నం, అహ్మదాబాద్, అమృత్సర్, బెంగళూరు, బోధ్‌గయా, కలకత్తా, ఇండోర్, కాశీపూర్, కొజీకోడ్, లక్నో, నాగ్‌పూర్, రాయ్‌పూర్, రాంచీ, రోహ్తక్, సంబల్పూర్, షిల్లాంగ్, సిర్మౌర్, తిరుచిరాపల్లి, ఉదయ్‌పూర్. ప్రోగ్రామ్స్: పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్(పీజీపీ), పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్(పీజీపీ-ఎఫ్ఏబీఎం), పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్(పీజీపీఈఎం), పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ అండ్ మేనేజ్మెంట్ (పీజీపీపీఎం), పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్(పీజీడీఎం), ఎగ్జిక్యూటివ్ పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (ఈపీజీపీ), ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్(ఎఫ్‌పీఎం) మొదలైనవి. వెబ్సైట్: https://iimcat.ac.in -
క్యాట్‌లో మెరిసిన నల్లగొండ ఆణిముత్యం
జాతీయ స్థాయిలో 100 పర్సంటైల్ సాధించిన అనురాగ్‌రెడ్డి 16 మందిలో అతనొకడు.. నల్లగొండ అర్బన్: ప్రతిష్టాత్మక మేనేజ్మెంట్ కోర్సుల ప్రవేశ పరీక్ష అయిన కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)-2014లో నల్లగొండ జిల్లాకు చెందిన పడిగెపాటి అనురాగ్‌రెడ్డి 100 పర్సంటైల్ సాధించాడు. జాతీయస్థాయిలో మొత్తం 16 మంది 100 పర్సంటైల్ సాధించగా, తెలంగాణ, ఏపీల నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక విద్యార్థి అనురాగ్‌రెడ్డి. ముంబై ఐఐటీలో ఫైనలియర్ చదువుతున్న అనురాగ్.. క్యాట్ పరీక్షల్లోనూ సత్తా చాటాడు. నవంబర్ 16న క్యాట్ పరీక్ష రాసిన అతడు క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డాటా ఎంటర్ ప్రిటేషన్‌లో 144.80 స్కేల్డ్ స్కోరు సాధించాడు. ఇది పర్సంటైల్‌లో గణిస్తే 100కు 100 శాతం. వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్‌లో 119.08 స్కేల్డ్ స్కోరు సాధించగా, పర్సంటైల్‌లో ఇది 99.94 శాతం. మొత్తం మీద 262.47 స్కేల్డ్ స్కోరుతో 100 శాతం పర్సంటైల్ సాధించాడు. చిన్ననాటి నుంచే చదువులో మేటి.. అనురాగ్ మొదటి నుంచీ చదువులో ప్రతిభ కనబరుస్తున్నాడు. పదోతరగతి నల్లగొండ, ఇంటర్ విజయవాడలో పూర్తి చేశాడు. ఐఐటీలో 97వ ర్యాంకు సాధించి ముంబై ఐఐటీలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో చేరాడు. అనురాగ్ తండ్రి జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారుడు. తల్లి రత్నమాల మిర్యాలగూడలోని ఎన్ఎస్పీ ఓఎండీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో పెదనాన్న అమరేందర్‌రెడ్డి పర్యవేక్షణలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నాడు. అనురాగ్‌కు ఎంసెట్‌లో 37వ ర్యాంకు రాగా, తిరువనంతపురంలోని స్పేస్ ఇంజనీర్స్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ఐశాట్‌లో జాతీయస్థాయిలో 10వ ర్యాంకు సాధించాడు. భవిష్యత్ ఇప్పుడే చెప్పలేను: ‘విద్యార్థిగా నా లక్ష్యాలను నెరవేర్చుకుంటూ వెళుతున్నాను. క్యాట్‌లో సాధించిన ర్యాంకుతో నా లక్ష్యం పరిపూర్ణమయింది. అయితే, భవిష్యత్‌లో ఏం కావాలనే దానిపై నేనింకా నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయాత్మక స్థానంలో ఉండాలనేది, జాతీయస్థాయిలో గుర్తింపు రావాలనేది నా కోరిక.’ అని ‘సాక్షి’తో తన విజయానందాన్ని పంచుకున్నాడు అనురాగ్. ముంబై ఐఐటీలో ఉన్న ఇతను శనివారం రాత్రి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడాడు. అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏ చేయాలనేది తన ఆశ అని అనురాగ్ చెప్పాడు. క్యాట్-2014 ఫలితాలు విడుదల సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)లలో ప్రవేశాలకు నవంబరులో నిర్వహించిన కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్)-2014 ఫలితాలను శనివారం ప్రకటించారు. ఈ పరీక్షకు 1.70 లక్షల మంది హాజరయ్యారు. ఫలితాలను www.iimcat.ac.in లో చూసుకోవచ్చు. అభ్యర్థుల్లో 16 మంది(ఒక బాలికతో సహా)కి 100 పర్సంటైల్, 10 మందికి 99.99 పర్సంటైల్ లభించినట్లు సమాచారం. క్యాట్-2014 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రస్తుత 13 ఐఐఎం లతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్‌లలో కొత్తగా ఏర్పాటు కానున్న ఆరు ఐఐఎంలు, దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూళ్లలో ప్రవేశం పొందవచ్చు. -
ఏపీ ఐఐఎం ప్రవేశాలకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: ఏపీలో కొత్తగా ఏర్పాటుచేయతలపెట్టిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లో వచ్చే ఏడాదినుంచి ప్రవేశాలకు కేంద్రప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ‘కామన్ అడ్మిషన్ టెస్టు (క్యాట్) ఫర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్’ వెబ్సైట్లో ఈ అంశాన్ని పొందుపరిచారు. 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలకు ఏపీ ఐఐఎంను కూడా కలిపారు. దీంతోపాటు ఈ ఏడాది కొత్తగా ఏర్పాటుచేయబోతున్న హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, బీహార్, ఒడిశా, మహారాష్ట్ర ఐఐఎంలలోనూ ప్రవేశాలు కల్పించడానికి నిర్ణయించారు. ఇంతకుముందు అహ్మదాబాద్, బెంగళూరు, కలకత్తా, ఇండోర్, కాశీపూర్, కొజికోడ్, లక్నో, రాయపూర్, రాంచీ, రోహతక్, షిల్లాంగ్, తిరుచిరాపల్లి, ఉదయపూర్లలో ఐఐఎం క్యాంపస్‌లు ఉన్నాయి. ఈ ఏడాదినుంచి కొత్తగా ఏపీతోసహా ఆరు ఐఐఎంలు జతకానున్నాయి. క్యాట్ ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. అర్హులైన అభ్యర్థులకు ఈ ఐఐఎంలలో ప్రవేశాలు కల్పిస్తారు. 5న శంకుస్థాపన ఏపీకి మంజూరైన ఐఐఎంను విశాఖపట్నంలో ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాదినుంచి ప్రవేశాలకు వీలుగా తాత్కాలిక భవనాలను ఇప్పటికే ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆంధ్రా యూనివర్సిటీలో ఇటీవల నిర్మించిన భవనాలను ఐఐఎంకు కేటాయించారు. శాశ్వతభవనాలకోసం విశాఖ సమీపంలోని గంభీరంవద్ద ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలానికి కేంద్ర బృందం కూడా అంగీకారం తెలిపింది. జనవరి 5వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ భవనాలకు శంకుస్థాపన చేయనున్నారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఆరోజున కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతిఇరానీ విశాఖపట్నం రానున్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన ఐఐటీ, ఐఐఎస్ఈఆర్లకు కూడా వచ్చే నెలలో శంకుస్థాపన ఉంటుందని అధికారులు తెలిపారు. -
క్యాట్ స్కోర్‌తోపాటు కావలసినవెన్నో
ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లలో ప్రవేశానికి తొలి మెట్టుగా భావించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) ముగిసింది. దేశవ్యాప్తంగా ఈ నెల 16, 22 తేదీల్లో నాలుగు స్లాట్లలో నిర్వహించిన పరీక్షకు లక్షన్నర మందికిపైగా హాజరయ్యారు. ఈ ప్రతిష్టాత్మక బీస్కూల్స్ క్యాట్ స్కోర్‌తోపాటు మరెన్నో అంశాలను పరిగణనలోకి తీసుకొని వాటికి కూడా వెయిటేజీ కల్పిస్తున్నాయి. క్యాట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి.. మలి దశలో రిటెన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. వీటిలోనూ ముందంజలో నిలిస్తే ఐఐఎం కల నెరవేరినట్లే! క్యాట్ ముగిసిన నేపథ్యంలో ఐఐఎంల ప్రవేశ ప్రక్రియ తీరుతెన్నులు..సన్నద్ధతకు మార్గాలపై నిపుణుల విశ్లేషణ, సూచనలు.. క్యాట్ స్కోర్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలతోపాటు పదో తరగతి నుంచి ప్రొఫెషనల్ కోర్సు వరకూ.. అకడమిక్ ట్రాక్ రికార్డ్, వర్క్ ఎక్స్పీరియన్స్ వంటి వాటిని కూడా ఐఐఎంలు పరిశీలిస్తున్నాయి. కాబట్టి వీటికి కల్పించిన వెయిటేజీలోనూ ముందంజలో నిలవడం అవసరం. రిటెన్ ఎబిలిటీ టెస్ట్ ఐఐఎంల ఎంపిక ప్రక్రియలో రిటెన్ ఎబిలిటీ టెస్ట్ ఎంతో కీలకం. ఇందులో ఒక నిర్దిష్ట అంశాన్ని ఇచ్చి నిర్దేశించిన సమయంలోగా వ్యాసం రాయమంటున్నారు. ఇది సాధారణంగా వర్తమాన ఆర్థిక-సామాజిక పరిణామాలపై ఉంటుంది. 15 నుంచి 30 నిమిషాల సమయం ఇస్తారు. ఐఐఎంలో చేరే విద్యార్థికి మేనేజ్మెంట్ దృక్పథంతోపాటు సామాజిక అంశాలపైనా అవగాహన ఉందా? అని పరీక్షించడం ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం. కాబట్టి అభ్యర్థులు ఇటీవల కాలంలో సంభవించిన జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై లోతైన అవగాహన పెంచుకోవాలి. రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లో రాణించేందుకు భావ వ్యక్తీకరణ చాలా ముఖ్యం. నిర్దిష్ట అంశంపై తమ అభిప్రాయాలను సదరు అభ్యర్థి ఎంత సూటిగా, స్పష్టంగా, సరళంగా రాశాడు? అనే విషయాన్ని ఐఐఎం ఎంపిక కమిటీలు క్షుణ్నంగా పరిశీలిస్తున్నాయి. సదరు వ్యాసంలో కంటెంట్ నాణ్యతకు, భాషకు ప్రత్యేకంగా వెయిటేజీ కేటాయిస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు కేవలం ఆయా అంశాలపై అవగాహన, సమాచార సేకరణకే పరిమితం కాకుండా.. చక్కటి రాత నైపుణ్యాలు, ప్రజెంటేషన్ స్కిల్స్ సైతం పెంచుకోవాలి. నిర్దిష్ట అంశాన్ని విభిన్న కోణాల్లో విశ్లేషించడం.. తమదైన శైలిలో వివరణనివ్వడం.. చక్కటి ముగింపు వంటివి రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లో మంచి మార్కులు సాధించేందుకు దోహదపడతాయి. గ్రూప్ డిస్కషన్‌పై గురి ఐఐఎంల ప్రవేశ ప్రక్రియలో మరో ప్రధానమైన అంకం.. గ్రూప్ డిస్కషన్. ఇందులో.. నిర్దిష్ట సంఖ్యలో అభ్యర్థులను ఒక బృందంగా ఏర్పాటు చేస్తారు. తర్వాత ఏదైనా అంశం ఇచ్చి దానిపై చర్చించమంటారు. గ్రూప్ డిస్కషన్ ప్రధాన ఉద్దేశం అభ్యర్థికి సదరు అంశంపై ఉన్న అవగాహనను తెలుసుకోవడం. దీంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, బృంద నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, విశ్లేషణ సామర్థ్యం పరీక్షిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా అభ్యర్థి భావోద్వేగ స్థితిని పరిశీలిస్తారు. కాబట్టి బృంద చ ర్చలో అభ్యర్థులు ఆవేశానికి, ఉద్రేకానికి లోనుకాకుండా జాగ్రత్త వహించాలి. ఇప్పటినుంచే గ్రూప్ డిస్కషన్లో అడిగేందుకు అవకాశమున్న ముఖ్యమైన అంశాలను గుర్తించి వాటిని కూలంకషంగా చర్చించడం అలవాటు చేసుకోవాలి. ఇందుకోసం న్యూస్ ఛానెళ్లలో నిర్వహించే చర్చా కార్యక్రమాలను వినడం; దినపత్రికల్లోని ఎడిటోరియల్స్ చదవడం- వాటి నుంచి కీలక అంశాలను గుర్తించి సొంతంగా నోట్స్ రాయడం వంటివి చేయాలి. మాక్ గ్రూప్ డిస్కషన్స్‌కు హాజరవడం, తోటి అభ్యర్థులతో చర్చలు సాగించడం కూడా మేలు చేస్తుంది. పర్సనల్ ఇంటర్వ్యూ క్యాట్ పర్సంటైల్, అకడమిక్ రికార్డ్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ల ఆధారంగా ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో అభ్యర్థి వ్యక్తిగత ఆసక్తులు, లక్ష్యాలను తెలుసుకుంటారు. మేనేజ్మెంట్ కోర్సులో చేరడానికి కారణం ఏమిటి? భవిష్యత్ ప్రణాళికలు, వాటిని చేరుకునేందుకు అనుసరించబోయే మార్గాల గురించి ప్రశ్నలు సంధిస్తారు. కాబట్టి ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు తమ భవిష్యత్తు లక్ష్యాలపై పూర్తి స్పష్టత ఉండాలి. పని అనుభవం ఉన్న అభ్యర్థులను తమ వర్క్ ప్రొఫైల్‌కు సంబంధించిన ప్రశ్నలు అడిగే అవకాశమెక్కువ. ప్రస్తుత విధులు, వృత్తిపరంగా సాధించిన విజయాలు, తద్వారా సంస్థకు, సమాజానికి కలిగిన ప్రయోజనాల గురించి అడుగుతారు. తాజా గ్రాడ్యుయేట్స్ విషయంలో ఎక్కువగా వారి ఆసక్తులు, అభిరుచులు, విద్యా నేపథ్యంపైనే ప్రశ్నలుంటాయి. ఇంటర్వ్యూలో విజయ సాధనకు మాక్ ఇంటర్వ్యూలకు హాజరవడం, ఇప్పటికే ఐఐఎంలలో చదువుతున్న అభ్యర్థుల సలహాలు స్వీకరించడం ఎంతో ఉపయుక్తం. ఇలా.. క్యాట్ ముగిసిన మరుసటి రోజు నుంచే పకడ్బందీగా, పటిష్ట ప్రణాళిక రూపొందించుకొని సిద్ధమవడం ద్వారా ఐఐఎంలలో ప్రవేశ అవకాశాలు మెరుగుపర్చుకోవచ్చు. డైవర్సిటీ వెయిటేజీ ఐఐఎంలలో ప్రవేశంకేవలం విద్యాధికులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఉన్నత వర్గాలకే సాధ్యం అనే అభిప్రాయాలను తొలగించే ప్రయత్నం జరుగుతోంది. ఐఐఎంలు అన్ని వర్గాలకు అనుకూలం అనే భావన కల్పించేందుకు ఈ ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లు కృషి చేస్తున్నాయి. ఐఐఎం-అహ్మదాబాద్ మినహా ఇతర అన్ని ఐఐఎంలు అకడమిక్ డైవర్సిటీకి, జండర్ డైవర్సిటీకి కూడా ఎంపిక ప్రక్రియలో వెయిటేజీ కల్పిస్తున్నాయి. అకడమిక్ డైవర్సిటీ విధానం మేరకు.. అభ్యర్థులను టెక్నికల్, నాన్-టెక్నికల్‌గా వర్గీకరించి నాన్-టెక్నికల్ విద్యార్థులకు ప్రత్యేక వెయిటేజీ ఇస్తున్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ(అగ్రికల్చర్) తదితర నాన్ టెక్నికల్ విద్యార్థులకు రెండు నుంచి మూడు శాతం మేర వెయిటేజీ అందిస్తున్నాయి. అదేవిధంగా మహిళల సంఖ్య పెంచేందుకు జండర్ డైవర్సిటీ పేరుతో ఒకటి నుంచి రెండు శాతం వెయిటేజీ ఇస్తున్నాయి. క్యాట్-2014 కటాఫ్ పర్సంటైల్.. ఐఐఎంలు.. క్యాట్ ముగిశాక మలిదశకు హాజరయ్యేందుకు క్యాట్‌లో నిర్దిష్ట కటాఫ్ పర్సంటైల్స్‌ను పేర్కొంటున్నాయి. ఆ పర్సంటైల్ సాధించిన అభ్యర్థులనే తదుపరి దశకు పిలుస్తారు. ఐఐఎంలు జనరల్ కేటగిరీకి నిర్దేశించిన క్యాట్-2014 కటాఫ్‌ల వివరాలు... గమనిక: ఈ కటాఫ్‌లను తదుపరి దశలో పాల్గొనేందుకు కనీస అర్హతగా ఐఐఎంలు పేర్కొన్నాయి. కానీ గత అడ్మిషన్ల తీరును పరిశీలిస్తే కనీస కటాఫ్ కంటే ఎంతో ఎక్కువ పర్సంటైల్ పొందిన విద్యార్థులు మాత్రమే ప్రవేశం పొందగలిగారు. ఓవరాల్ కటాఫ్ 95 శాతంపైన ఉంటేనే అడ్మిషన్ లభించే అవకాశాలున్నాయి. ఆయా అంశాలు.. వెయిటేజీ వివరాలు.. క్యాట్ స్కోర్‌తోపాటు ఐఐఎంలు.. ప్రవేశ ప్రక్రియలో రిటెన్ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూలకు నిర్దిష్ట వెయిటేజీ ఇచ్చి వాటికి అనుగుణంగా తుది జాబితా రూపొందిస్తున్నాయి. ఆయా అంశాలకు ఇస్తున్న వెయిటేజీ వివరాలు శాతాల్లో.. వెయిటేజీ గణన ఇలా రిటెన్ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూల కంటే ముందుగా క్యాట్ పర్సంటైల్‌తోపాటు, ప్రొఫైల్ పేరిట పదో తరగతి నుంచి ప్రొఫెషనల్ కోర్సు వరకు సాధించిన అకడమిక్ రికార్డ్, వర్క్ ఎక్స్పీరియన్స్, జండర్ డైవర్సిటీ, అకడమిక్ డైవర్సిటీ అంశాలను నిర్దిష్ట శాతాల్లో గరిష్టంగా వంద శాతం వెయిటేజీకి గణిస్తున్నాయి. ఈ శాతాలు ఒక్కో ఐఐఎంకు ఒక్కో తీరుగా ఉంటాయి. ఈ విధానాన్నే ప్రీ-పర్సనల్ ఇంటర్వ్యూ క్రైటీరియాగా పేర్కొంటున్నాయి. టాప్ స్టోరీ ఫైనల్ సెలక్షన్ ఈ దశలో ప్రీ పర్సనల్ ఇంటర్వ్యూ క్రైటీరియాలో పేర్కొన్న అంశాలు, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ మూడింటినీ కలిపి వంద శాతం వెయిటేజీకి సంకలనం చేస్తున్నాయి. ఈ ప్రక్రియలో ప్రతిభ ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా రూపొందిస్తాయి. వర్క్ ఎక్స్‌పీరియన్స్‌కు అయిదు నుంచి పది శాతం మధ్యలో వెయిటేజీ కల్పిస్తున్నాయి. పదో తరగతి నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ వరకు ఒక్కో క్లాస్‌కు 10 నుంచి 15 శాతం చొప్పున వెయిటేజీ ఇస్తున్నాయి. ప్రొఫెషనల్ కోర్సుకు గరిష్టంగా అయిదు శాతం వెయిటేజీ కల్పిస్తున్నాయి. జనరల్ టిప్స్ * వర్తమాన రాజకీయ, సామాజిక, వ్యాపార పరిణామాలపై నిరంతర సమాచార సేకరణ. * వ్యాపార, వాణిజ్య సంబంధ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం. * రైటింగ్ ప్రాక్టీస్ చేయడం. * ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవడం. * నిరంతరం దినపత్రికలు, ఇతర మీడియా మార్గాల ద్వారా నిపుణుల చర్చా కార్యక్రమాలను వినడం. * జీడీ/ పీఐలో ఎదుటి వారిని మెప్పించేలా.. బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకునేందుకు ప్రయత్నించడం. * మాక్ ఇంటర్వ్యూలకు హాజరవడం, సన్నిహితులతో కలిసి బృంద చర్చల్లో పాల్గొనడం. * డెసిషన్ మేకింగ్ స్కిల్స్ పెంచుకోవడం. ఇందుకోసం ఏదో ఒక వాస్తవ సమస్యను పరిగణనలోకి తీసుకుని తాము సొంతంగా పరిష్కారాలను కనుగొనడం. * విశ్లేషణ నైపుణ్యాలను పెంచుకోవడం. ఏదైనా ఒక అంశాన్ని చేపట్టి అందులోని ‘కీ’ పాయింట్లను గుర్తించడం, ఆ అంశం ప్రాధాన్యం, ప్రభావం, ప్రయోజనం, ఫలితం వంటి వాటిని విశ్లేషించగలగడం. * తులనాత్మక అధ్యయన నైపుణ్యాలు పెంచుకోవడం. ఒక అంశంలో అంతర్గతంగా ఇమిడి ఉన్న ఇతర కీలక, అనుబంధ అంశాలను కూడా బేరీజు వేయగలిగే విధంగా తులనాత్మక అధ్యయనం కొనసాగించడం. మరెన్నో ప్రముఖ బిజినెస్ స్కూల్స్ ఐఐఎంలే కాకుండా ఐఐఎస్సీ-బెంగళూరు, ఐఐటీలు, ఎన్ఐటీలు వంటి వాటితోపాటు మరెన్నో ప్రముఖ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు కూడా క్యాట్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇవి వెయిటేజీ విషయంలో ఐఐఎంలకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. క్యాట్ స్కోర్‌కు అధిక వెయిటేజీ (సగటున 60 నుంచి 70 శాతం మేర) ఇస్తున్నాయి. ఇది ఒకరకంగా క్యాట్‌లో మంచి పర్సంటైల్ సాధించిన అభ్యర్థులకు చక్కటి అవకాశంగా నిపుణులు పేర్కొంటున్నారు. క్యాట్‌లో 98 శాతం పర్సంటైల్ సాధించినవారు కూడా తమకు నచ్చిన ఐఐఎంలో సీటు పొందలేని ఘటనలు కూడా ఎదురయ్యాయి. అలాంటి అభ్యర్థులకు ఐఐఎంలకు సమానంగా నాణ్యమైన విద్యను ఇతర బిజినెస్ స్కూల్స్ అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో మేనేజ్మెంట్ కోర్సులు ఆఫర్ చేస్తున్న ఐఐటీలు కూడా క్యాట్ స్కోర్‌నే పరిగణిస్తున్నాయి. ఔత్సాహిక అభ్యర్థులు కేవలం ఐఐఎంలకే పరిమితం కాకుండా మిగతా ఇన్స్టిట్యూట్లకు కూడా దరఖాస్తు చేసుకోవడం ద్వారా ప్రవేశ అవకాశాలు మెరుగుపరచుకోవచ్చు. దేశంలోని ఐఐఎంయేతర ప్రముఖ బిజినెస్ స్కూల్స్.. -
‘క్యాట్’ రిజిస్ట్రేషన్లకు అక్టోబర్ 10న అవకాశం
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)లు, ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో ప్రవేశానికి నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్)-2014 ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, దరఖాస్తుల ప్రక్రియకు అక్టోబర్ 10న అవకాశం ఉంది. ఈ ఏడాది క్యాట్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగస్టు 6 నుంచి సెప్టెంబర్ 30 వరకు జరగాల్సి ఉండగా మధ్యలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో ఒకరోజు ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు అక్టోబర్ 10న రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్-ఇండోర్ నిర్ణయించింది. గతేడాది క్యాట్‌కు 1.93 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. ఈసారి ఇప్పటివరకు 1.89 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కామన్ అడ్మిషన్ టెస్ట్ నవంబర్ 16, నవంబర్ 22న ఉదయం, మధ్యాహ్నం.. రెండు సెషన్లుగా జరగనుంది. ఫలితాలు డిసెంబర్ మూడో వారంలో వెలువడే అవకాశాలున్నాయి. వివరాలకు వెబ్సైట్: https://iimcat.ac.in/ -
క్యాట్ - 2014.. టైమ్ మేనేజ్మెంట్ కీలకం!
టాప్ స్టోరీ: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లలో పీజీ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్). దేశంలోని మొత్తం 13 ఐఐఎంలలో ఉన్న 3335 సీట్లకు ప్రతిఏటా లక్షల్లో అభ్యర్థులు పోటీపడుతుంటారు. మేనేజ్మెంట్ కోర్సు ఔత్సాహికులకు అత్యంత ముఖ్యమైన క్యాట్‌లో ఈ ఏడాది పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ప్రశ్నల సంఖ్యను, సమయ పరిమితిని పెంచనున్నారు. సిటీ నుంచి భారీ సంఖ్యలో అభ్యర్థులు క్యాట్‌కు ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో క్యాట్ - 2014లో ప్రధాన మార్పులపై ఫోకస్.. క్యాట్ - 2014 ప్రధాన మార్పులివే.. - ప్రతి ఏటా పరీక్షను అక్టోబర్‌లో నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది నవంబర్ 16, 22వ తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. - గతేడాది 20 రోజుల్లో 40 స్లాట్స్‌లో పరీక్ష నిర్వహించగా.. ఈ సంవత్సరం కేవలం రెండు రోజుల్లో రోజుకు రెండు సెషన్లలో పరీక్ష ఉంటుంది. - గతేడాది 40 నగరాల్లో పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 99 నగరాల్లో 354 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. - ఇంతకు ముందులా అభ్యర్థులకు టెస్ట్ తేదీని ఎంపిక చేసుకునే అవకాశం లేదు. అభ్యర్థులకు టెస్ట్ తేదీని క్యాట్ సెంటర్ తెలియజేస్తుంది. - ఈ ఏడాది ఆఫ్‌లైన్ వోచర్స్‌ను తొలగించారు. అభ్యర్థులు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌ల ద్వారా ఫీజులను చెల్లించాలి. - అడ్మిట్ కార్డులను పరీక్ష తేదీ వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. - పరీక్ష వ్యవధి ఇప్పటివరకు 140 నిమిషాలు ఉండగా.. దాన్ని 170 నిమిషాలకు పెంచనున్నారు. - పరీక్షలోని రెండు విభాగాలు క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్; వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్‌లలో ఇప్పటివరకు ప్రతి విభాగంలో అడిగే 30 ప్రశ్నలను 50 ప్రశ్నలకు పెంచి ఇవ్వనున్నారు. - ఒక సెక్షన్‌కు సమాధానాలు గుర్తించకుండానే.. మరో సెక్షన్ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే అవకాశాన్ని కల్పించారు. ఇంతకుముందు ఒక సెక్షన్‌కు సమాధానాలిస్తేనే మరో సెక్షన్‌కు వెళ్లే అవకాశం ఉండేది. - పరీక్ష విధానాన్ని తెలుసుకునేందుకు, అర్థం చేసుకునేందుకు క్యాట్ వెబ్సైట్లో పరీక్షకు ముందు అందుబాటులో ఉండే ట్యుటోరియల్ను తొలగించారు. - 13 ఐఐఎంలతోపాటు కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆరు ఐఐఎంలకు కూడా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కొత్త ఆరు ఐఐఎంలలో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్న ఐఐఎం కూడా ఉంది. పోటీ తీవ్రం 2014 క్యాట్‌లో ప్రశ్నల సంఖ్య ఎక్కువగా పెంచి.. సమయం స్వల్పంగానే పెంచారు. అంటే.. ప్రశ్నలు ఎక్కువ.. సమయం తక్కువ. కాబట్టి ఈ ఏడాది క్యాట్‌లో టైమ్ మేనే జ్మెంట్ చాలా కీలకంగా మారనుంది. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు చాకచక్యంగా గుర్తించగలిగిన వారు మాత్రమే మంచి పర్సంటైల్ సొంతం చేసుకునే వీలుంటుంది. అందుకోసం అభ్యర్థులు సాధ్యమైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. 2014 క్యాట్‌కు పోటీ మరింతగా పెరిగే ఆస్కారముంది. పరీక్ష గతేడాదిలా అక్టోబర్‌లో కాకుండా.. నవంబర్‌లో నిర్వహించనుండటంతో ప్రిపరేషన్‌కు సరిపడ సమయం లభిస్తుంది. అలాగే గతేడాది 40 సిటీల్లో క్యాట్ నిర్వహిస్తే.. ఇప్పుడు మొత్తం 99 నగరాల్లో పరీక్ష జరుగనుంది. అదేవిధంగా కేంద్రంలో కొత్త ప్రభుత్వ, ఆర్థిక వ్యవస్థలో సానుకూల పరిస్థితుల కారణంగా జాబ్ మార్కెట్ పురోగమనాన్ని చూసి మేనేజ్మెంట్ కోర్సుల వైపు ఎక్కువ మంది మొగ్గుచూపే అవకాశముంది. పై కారణాలతో క్యాట్‌కు ఈసారి పోటీ తీవ్రంగా ఉంటుందని నిపుణుల అంచనా. పటిష్ట ప్రణాళికతో సిద్ధమవ్వాలి క్యాట్‌ను ఈ ఏడాది నవంబర్‌లో నిర్వహిస్తుండటంతో ప్రిపరేషన్‌కు అభ్యర్థులకు మరో నెల సమయం అందుబాటులోకి వచ్చింది. పరీక్షకు అదనపు సమయం దొరికింది కదా.. అని అభ్యర్థులు విశ్రమించకూడదు. ఐఐఎంలో సీటు సాధించాలంటే.. మంచి పర్సంటైల్ సాధించాలనే విషయాన్ని గుర్తెరగాలి. పరీక్షకు మూడు నెలలకుపైగా సమయం ఉంది. కాబట్టి ఇప్పటినుంచే పటిష్టమైన ప్రణాళికను రూపొందించుకుని సిద్ధమవ్వాలి. సాధారణంగా విద్యార్థులు.. పరీక్షకు చాలా సమయం ఉందిలే అనే నిర్లిప్త భావంతో ఉంటారు. ఇది సరికాదు. పరీక్ష తేదీలతో సంబంధం లేకుండా.. క్యాట్ ప్రకటన విడుదల నాటి నుంచే బాగా శ్రమించాలి. మెచ్చిన ఐఐఎంలో అడుగుపెట్టాలంటే తీవ్ర పోటీని ఎదుర్కొవాల్సి ఉంటుంది. వీలైనన్ని మాక్‌టెస్టులు సాధన చేయాలి పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తారు. మార్పులను దృష్టిలో ఉంచుకుని మాక్‌టెస్టులను సాధ్యమైనంత ఎక్కువగా సాధన చేయాలి. నిర్దేశిత 170 నిమిషాల్లో 100 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలిగేలా ప్రాక్టీస్ చేయాలి. పరీక్షలో ఒక్కో ప్రశ్నకు ఉండే 140 సెకన్ల సమయాన్ని 102 సెకన్లకు కుదించారు. ఈ స్వల్ప సమయంలోనే వేగంగా ప్రశ్నను చదివి, అర్థం చేసుకుని సమాధానాన్ని గుర్తించగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ఇలా అయితేనే నిర్దేశిత సమయంలోగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించగలరు. ప్రవేశ ప్రక్రియ క్యాట్ పర్సంటైల్ ఆధారంగా వివిధ ఐఐఎంలకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ ప్రక్రియలో ఐఐఎంలు తమ సొంత విధానాన్ని అనుసరిస్తున్నాయి. కొన్ని ఐఐఎంలు క్యాట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి రిటెన్ ఎబిలిటీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నాయి. మరికొన్ని అకడెమిక్ రికార్డ్‌కు, వర్క్ ఎక్స్‌పీరియన్స్‌కు ప్రాధాన్యతనిస్తున్నాయి. క్యాట్ స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్న ఐఐఎంలు.. - ఐఐఎం- అహ్మదాబాద్, ఐఐఎం - బెంగళూర్, ఐఐఎం - కోల్ కతా, - ఐఐఎం - ఇండోర్, ఐఐఎం - కాశీపూర్, ఐఐఎం - కోజికోడ్, ఐఐఎం - లక్నో, ఐఐఎం - రాయ్‌పూర్, ఐఐఎం - రాంచీ, ఐఐఎం- రోహ్తక్, - ఐఐఎం -షిల్లాంగ్, ఐఐఎం - తిరుచిరాపల్లి, ఐఐఎం - ఉదయ్‌పూర్. - క్యాట్ - 2014 స్కోర్ ఆధారంగా పైన పేర్కొన్న 13 ఐఐఎంలే కాకుండా మరో ఆరు ఐఐఎంలలో ప్రవేశాలు క ల్పించనున్నారు. అవి.. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, బీహార్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్న ఐఐఎంల్లో 2015-16 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు ఉంటాయి. క్యాట్ - 2014 సమాచారం అర్హత: 50 శాతం (ఎస్సీ, ఎస్టీ, శారీరక వికలాంగులకు 45 శాతం) మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డి గ్రీ ఉత్తీర్ణత. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌కు సంబంధించి అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయడానికి క్యాట్ వెబ్సైట్లో వీడియో అందుబాటులో ఉంది. అభ్యర్థులు దీని ఆధారంగా తప్పులు లేకుండా దరఖాస్తు నింపొచ్చు. ముఖ్య తేదీలు: ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2014 అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్: అక్టోబర్ 16 నుంచి నవంబర్ 22 వరకు పరీక్ష తేదీలు: నవంబర్ 16, 22 ఫలితాల ప్రకటన: డిసెంబర్ మూడోవారం వెబ్సైట్: www.iimcat.ac.in మార్పులు అనుకూలమే! ‘‘దేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూల్స్‌లో ప్రవేశానికి పోటీపడే వారి సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంటుంది. క్యాట్-2014లో మార్పుల గురించి విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గతంలో రెండు సెక్షన్లలో ఒక్కోదానిలో 30 ప్రశ్నల చొప్పున మొత్తం 60 ప్రశ్నలుండేవి. ఈ 60 ప్రశ్నలు 140 నిమిషాల్లో.. అంటే.. ప్రతి సెక్షన్‌కు 70 నిమిషాల్లో పూర్తిచేయాల్సి వచ్చేది. ఒక సెక్షన్ పూర్తయితేనే, మరో సెక్షన్‌కు వెళ్లేందుకు వీలుండేది. దీంతో విద్యార్థులు తెలియని ప్రశ్నలను వదిలేసినా.. మిగిలిన సమయం వృథా అయ్యేది. ప్రస్తుత మార్పుల ప్రకారం ప్రతి సెక్షన్‌కు 50 ప్రశ్నల చొప్పున మొత్తం 100 ప్రశ్నలు.. 170 నిమిషాల్లో పూర్తిచేయాలి. రెండు సెక్షన్లను కలపటం వల్ల తేలికైన ప్రశ్నలన్నింటినీ ముందుగా పూర్తిచేసి.. క్లిష్టమైన ప్రశ్నలకు మిగతా సమయంలో సమాధానాలు ఇవ్వొచ్చు. కాబట్టి గతంతో పోల్చితే ప్రస్తుత మార్పులు విద్యార్థులకు అనుకూలమనే చెప్పాలి. ఈ ఏడాది కొత్తగా 6 ఐఐఎంలు రావచ్చని అంచనా. కాబట్టి 3335 సీట్లకు అదనంగా మరో 300-400 సీట్లు పెరిగే అవకాశం ఉంది’’ -రామ్‌నాథ్ కనకదండి, కోర్సు డెరైక్టర్, క్యాట్, టైమ్ -
ఒత్తిడికి దూరంగా.. వేగం, కచ్చితత్వంతో..
సమున్నత భవిష్యత్ దిశగా ఐఐఎంలలో ప్రవేశానికి మార్గం సుగమమం చేసే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.. మరో రెండు వారాల్లో క్యాట్-2013 ఆన్లైన్ పరీక్షలు మొదలు కానున్నాయి.. అక్టోబర్ 16 నుంచి ప్రారంభమై నవంబర్ 11 వరకు కొనసాగనున్నాయి.. వేలల్లో ఉండే సీట్ల కోసం లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్న నేపథ్యంలో గమ్యాన్ని చేరే క్రమంలో ఇప్పటి నుంచి వేసే అడుగులు కీలక పాత్రను పోషిస్తాయి.. ఒత్తిడికి లోనుకాకుండా నేర్చుకున్న ప్రతి అంశాన్ని పక్కాగా అమలు చేసినప్పుడే విజయం సాధ్యం. కాబట్టి క్యాట్ పరీక్షలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఫోకస్. క్యాట్‌లో రెండు విభాగాలు ఉంటాయి. అవి.. క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్; వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్. ప్రతి విభాగానికి 70 నిమిషాల చొప్పున మొత్తం 140 నిమిషాల సమయాన్ని సమాధానాలను గుర్తించడానికి కేటాయించారు. ప్రతి సెక్షన్లో 30 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ప్రతి సెక్షన్‌కు కౌంట్‌డౌన్ టైమర్ నిబంధన ఉంటుంది. నిర్దిష్ట సెక్షన్‌కు కేటాయించిన సమయం పూర్తయితే సమాధానాలివ్వడం పూర్తి కాకున్నా మరో సెక్షన్‌కు వెళ్లాలి. స్పీడ్ బ్రేకర్లు: ప్రతి క్యాట్ పరీక్షలో కొన్ని ప్రశ్నలను స్పీడ్ బ్రేకర్లుగా వ్యవహరిస్తారు. వీటిని సాధించడానికి ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుంది. దీంతో ఏకాగ్రత కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ప్రశ్నలను మొదట గుర్తించాలి. ఈ తరహా ప్రశ్నలు ఎక్కువగా అనలిటికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ విభాగాల్లో కనిపిస్తాయి. ఈ తరహా ప్రశ్నల సాధనలో పెద్ద అంకెలను గుణకారం లేదా భాగహారం చేయాల్సి వస్తుంది. సుదీర్ఘ కాలిక్యులేషన్స్ అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో జవాబు ఒక్కోసారి పాయింట్ (డెసిమల్ పాయింట్) రూపంలో కూడా రావచ్చు. ఇచ్చిన ఆప్షన్లన్నీ పాయింట్ తర్వాత ఉండే సంఖ్య మినహా ఒకే రకంగా ఉంటాయి. ఈనేపథ్యంలో సమాధానాన్ని గుర్తించే తొందరలో తప్పు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ప్రశ్నలను మార్క్ చేసుకొని తర్వాత ప్రయత్నించడం మంచిది. గెస్ వర్క్: గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రతి సమస్యకు కాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదన్న విషయం స్పష్టమవుతుంది. ఉదాహరణకు గ్రాఫ్ తరహా ప్రశ్నను తీసుకుంటే.. గ్రాఫ్‌ను ఒక్కసారి పరిశీలించడం ద్వారా సమాధానాన్ని గుర్తించవచ్చు. ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా సుదీర్ఘ కాలిక్యులేషన్ అవసరమా లేదా అనే అంశంపై స్పష్టత వస్తుంది. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ఒక్కోసారి గెస్ వర్క్ కూడా పనికి వస్తుంది. ఈ విషయాన్ని గమనించాలి. దీని ద్వారా సమయం కూడా కలిసొస్తుంది. మొదటి దశ ఇలా: క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ విభాగంలో మెరుగైన స్కోర్ చేయాలంటే వేగం, కచ్చితత్వమే కీలక సాధనాలు. ఈ విభాగాన్ని ముందుగా డేటా ఇంటర్‌ప్రిటేషన్‌తో ప్రారంభించడం మంచిది. ఎందుకంటే స్కోరింగ్‌కు అవకాశం ఉన్న విభాగం. కాబట్టి దీన్ని సాధించడానికి చివరి వరకు వేచి చూడడం సహేతుకం కాదు. ఈ విభాగాన్ని సాధించడానికి 20-25 నిమిషాల సమయం సరిపోతుంది. తర్వాత క్వాంటిటేటీవ్ ఎబిలిటీ విభాగంపై దృష్టి సారించండి. ఈ విభాగంలో ముందుగా ఒకే తరహాలో ఉండే ప్రశ్నలను (కేస్‌లెట్స్)ను మొదట సాధించడానికి ప్రయత్నించాలి. ఒక కేస్లెట్ను అవగాహన చేసుకోవడానికి నాలుగు నిమిషాలకు మించి సమయాన్ని కేటాయించవద్దు. నాలుగు నిమిషాల్లో ఎటువంటి అవగాహన రాకుంటే ఆ ప్రశ్నను వదిలి వేయడం ఉత్తమం. అంతేకాకుండా నెగిటివ్ మార్కింగ్ కారణంగా ఈ విభాగానికి సంబంధించి గెస్ వర్క్‌కు దూరంగా ఉండడమే మంచిది. క్వాంటిటేటివ్ ఎబిలిటీలో కొన్ని ప్రశ్నలను వాటికి ఇచ్చి ఆప్షన్ల ఆధారంగా సాధించాల్సి వస్తుంది. సమయ స్ఫూర్తి, తార్కిక వివేచనతో మిగిలిన ఆప్షన్లను స్కిప్ చేస్తూ సమాధానాన్ని కనుక్కోవాలి. ఈ విభాగం కోసం కేటాయించిన 70 నిమిషాల సమయాన్ని 35, 30 నిమిషాలుగా విభజించుకోవాలి. మొదటి 35 నిమిషాలను సులువైన ప్రశ్నలను సాధించేందుకు కేటాయించాలి. అంటే ఒకటి నుంచి ఒకటిన్నర నిమిషం పట్టే ప్రశ్నలు. ఈ దశలో సమాధానం కోసం ఒకటిన్నర నిమిషం కంటే ఎక్కువ సమయం కేటాయించవద్దు. ప్రశ్నను చదవడానికి 30 సెకన్ల సమయం వెచ్చించాలి. రెండో దశ 30 నిమిషాల్లో క్లిష్టంగా భావించి వదిలివేసిన ప్రశ్నలు సాధించండి. ఈ సందర్భంలో ప్రతి ప్రశ్నకు రెండు నుంచి రెండున్నర నిమిషాల సమయం కేటాయించవచ్చు. ఈ విభాగంలో ప్రతి 10 ప్రశ్నల్లో కనీసం ఎనిమిది ప్రశ్నలను 90 శాతం కచ్చితత్వంతో సాధించడానికి ప్రయత్నించాలి. లాజికల్తో: వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ విభాగం అభ్యర్థిలోని తార్కిక సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించింది. లాజికల్ రీజనింగ్‌తో ఈ విభాగాన్ని ప్రారంభించడం మంచిది. ఇందులో ముందుగా బాగా తెలిసిన ప్రశ్నలకు సమాధానం గుర్తించడం మంచిది. రీడింగ్ కాంప్రెహెన్షన్‌లో ప్రశ్నల అవగాహనకు ఐదు నిమిషాలు వెచ్చించాలి. లాజికల్ రీజనింగ్‌లో కూడా ఇదే తరహా వ్యూహాన్ని అనుసరించాలి. ప్రశ్నను అవగాహన చేసుకోవడంలో ఐదు నిమిషాలకు మించి ఎక్కువ సమయం పడితే దాన్ని విడిచి వేరే ప్రశ్నపై దృష్టి సారించాలి. రీడింగ్ కాంప్రెహెన్షన్ లేదా డేటా ఇంటర్‌ప్రిటేషన్ విభాగంలోని ప్రశ్నలకు ఎనిమిది నిమిషాలకు మించి సమయాన్ని కేటాయించకపోవడం మంచిది. ఈ విభాగానికి కేటాయించిన 70 నిమిషాల సమయాన్ని మూడు భాగాలుగా విభజించుకోవాలి. ఈ క్రమంలో వెర్బ ల్ ఎబిలిటీకి 20 నిమిషాలు, రీడింగ్ కాంప్రెహెన్షన్‌కు 30 నిమిషాలు, లాజికల్ రీజనింగ్‌కు 15 నిమిషాల సమయం కేటాయించాలి. ఈ విభాగానికి సంబంధించి ముఖ్యంగా గ్రామర్ అంశాల్లో ఎటువంటి గెస్ వర్క్‌ను ఎంచుకోకపోవడమే ఉత్తమం. ఈ విభాగంలో ప్రతి 10 ప్రశ్నల్లో కనీసం ఏడు సరైనవిగా ఉండే విధంగా చూసుకోవాలి. టైమ్ మేనేజ్మెంట్: ప్రతి విభాగానికి 70 నిమిషాల చొప్పున మొత్తం 140 నిమిషాల సమయాన్ని సమాధానాలను గుర్తించడానికి కేటాయించారు. ప్రతి సెక్షన్లో 30 ప్రశ్నలకు సమాధానం రాయాలి. మధ్యలో 15 నిమిషాలు ట్యుటోరియల్ ఉంటుంది. ప్రతి విభాగంలో సమాధానాలను గుర్తించడానికి 60 నిమిషాలు కేటాయించాలి. 10 నిమిషాలు సమయాన్ని బాఫర్గా వినియోగించుకోవాలి. ఎందుకంటే ప్రారంభంలో ప్రశ్నలను చదవడానికి, అవగాహన చేసుకోవడానికి ఈ సమయం సరిపోతుంది. రివ్యూ సిస్టమ్ ద్వారా సెక్షనల్ కటాఫ్ సాధించేందుకు అవసరమైన ప్రశ్నలను సాధించామా? లేదా? అనే అంశాన్ని కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఎన్ని ప్రశ్నలు సాధించాం? ఎన్ని మిగిలి ఉన్నాయి? అనే అంశంపై కూడా అవగాహన పొందొచ్చు. మార్కింగ్ ఆప్షన్ ఉపయోగించి తర్వాత సాధించాలనుకున్న ప్రశ్నలను మార్క్ చేసుకోవచ్చు. సిట్టర్స్: ప్రతి విభాగంలో కొన్ని సులువైన ప్రశ్నలు, నేరుగా (డెరైక్ట్) ఇచ్చిన ప్రశ్నలు ఉంటాయి (వీటిని సిట్టర్స్‌గా వ్యవహరిస్తారు). ముందుగా సిట్టర్స్ను గుర్తించే ప్రయత్నం చేయాలి. తద్వారా ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. చాలా మంది విద్యార్థులు ప్రశ్నలను ఇచ్చిన క్రమంలోనే సాధించడానికి ప్రయత్నిస్తుంటారు. అది సరికాదు. తక్కువ సమయం ద్వారా సాధించే సిట్టర్స్ తరహా ప్రశ్నలకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక దానితో ఒకటి ముడిపడి ఉండే లింక్డ్ ప్రశ్నలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి వీటికి తర్వాతి ప్రాధాన్యం ఇవ్వాలి. కీలకం: క్యాట్ విజయంలో ప్రిపరేషన్తోపాటు రెండు అంశాలు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. అవి.. ప్రశ్నల ఎంపిక, కచ్చితమైన సమాధానాలు ఇవ్వడం. ప్రశ్నల ఎంపికలో.. మొదట ప్రతి విభాగంలోని సులభమైన ప్రశ్నలను సాధించాలి. తర్వాత సమయాన్ని పరిగణనలోకి తీసుకుని క్లిష్టమైన ప్రశ్నలను ఎంచుకోవాలి. ‘సులభమైన ఏ ప్రశ్నను వదిలి వేయకూడదు, అన్ని ప్రశ్నలను క్షుణ్నంగా చదవాలి’ అనే మౌలిక సూత్రాన్ని క్యాట్‌లో విధిగా పాటించాలి. ప్రశ్నల ఎంపికలో మరో కీల కాంశం.. ప్రశ్నలను చదివేటప్పుడే.. వాటిపై ఒక అంచనాకు రావడం. ఎందుకంటే ఒకే ప్రశ్నను ఒకసారి చదివి తిరిగి మరోసారి చదవడం వల్ల.. పునరుక్తితోపాటు సమయం వృథా అవుతుంది. అంతేకాకుండా మొదటిసారి చదివినప్పుడు సదరు ప్రశ్నపై ఉండే స్పష్టత రెండోసారి ఉండకపోవచ్చు. ప్రశ్నల ఎంపిక విషయంలో డేటాఇంటర్‌ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్ విభాగంలో ఎటువంటి తార్కికత ఉండదు. వాటిని చదివి సాల్వ్ చేసుకుంటూ పోవాల్సిందే. క్వాంటిటేటివ్ ఎబిలిటీ, వెర్బల్ ఎబిలిటీలలో మాత్రం ప్రశ్నల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వీటిలో ప్రశ్నలను చదువుతున్నప్పుడే వాటిపై ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ప్రశ్నను చదివినప్పుడే సమాధానం గుర్తించగలమా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. సమాధానం తెలియని ప్రశ్నలు వదిలివేయడం ఉత్తమం. ఎందుకంటే జేఈఈ ఇతర పరీక్షల కంటే భిన్నమైన నెగిటివ్ మార్కింగ్ విధానాన్ని క్యాట్‌లో అనుసరిస్తారు. దాంతో మీరు నష్టపోవడమే కాకుండా ఇతరులు లాభం పొందుతారు. ట్యుటోరియల్: పరీక్ష ప్రారంభానికి ముందు.. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సమయంలో ఎలా వ్యవహరించాలి అనే విషయంలో అభ్యర్థులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో సూచనలు, సలహాలతో కూడిన 15 నిమిషాల ట్యుటోరియల్ అందుబాటులో ఉంటుంది. ఈ విభాగాన్ని త్వరితగతిన ముగించే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఎన్ని మాక్ టెస్ట్‌లు రాసినప్పటికీ.. రియల్ టైమ్‌లో పరీక్ష నిర్వహణ విధానంపై అవగాహన ఏర్పర్చుకోవడానికి ఈ ఒక్క అంశమే ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విభాగాన్ని నిర్లక్ష్యం చేయకుండా తగినంత ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. మొదటిసారి క్యాట్‌కు హాజరవుతున్న వారు ఈ అంశాన్ని గమనించాలి. ప్రతి సెక్షన్‌కు మధ్య మూడు నిమిషాల విరామం ఉంటుంది. దీన్ని రిలాక్స్ కావడానికి ఉపయోగించుకోవాలి. ఒత్తిడికి దూరంగా పరీక్షకు ముందు రోజు మంచి ఆహారం తీసుకుంటూ, చక్క ని నిద్రతో ప్రశాంతంగా గడపండి. చదవడం, మాక్ టెస్ట్‌లు రాయడం వంటి అంశాలకు దూరంగా ఉండడం మంచిది. దాంతో ఎటువంటి ఒత్తిడి లేకుండా పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు బాగా నేర్చుకున్న అంశాలనే కొన్ని సూచనలు పాటిస్తూ పరీక్షలో సాధించాలి. పరీక్ష రాసేటప్పుడు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత చిత్తంతో సమాధానాలు గుర్తించడంపై దృష్టి సారించాలి. దీన్ని కూడా ఒక మాక్ టెస్ట్‌గానే పరిగణించాలి. ఓపెన్ మైండ్: పరీక్షకు ఓపెన్ మైండ్‌తో హాజరు కావాలి. ప్రశ్నలను వేగంగా చదివి అవగాహన చేసుకోవాలి. అన్నీ తెలిసిన అంశాలు వస్తాయనేకాకుండా తెలియని అంశాలు కూడా రావచ్చు అనే ఆలోచనా విధానంతో ఉండడం మంచిది. ముందుగా పరీక్షలో బాగా తెలిసిన విభాగం నుంచే సమాధానాలను గుర్తించడం ప్రారంభించాలి. క్లిష్టంగా భావించే విభాగానికి మధ్యలో సమయం కేటాయించాలి. అంతేకాకుండా పరీక్ష హాల్లో మీ చుట్టు పక్కల చూసే ప్రయత్నం చేయకండి. తద్వారా సమయం వృథాతోపాటు ఏకాగ్రత కూడా దెబ్బతినే అవకాశం ఉంది. పరీక్ష చాలా రోజులపాటు పలు సెషన్లుగా జరుగుతుంది. కాబట్టి ఒక సెషన్లో సులభమైన ప్రశ్నలు వస్తే మరో సెషన్లో కష్టమైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉండొచ్చు అనే వాదనలను పట్టించుకోవద్దు. మాక్ టెస్ట్‌గానే నిర్దేశించిన సమయం కంటే ముందుగానే పరీక్ష కేంద్రానికి వెళ్లే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ తదితర అంశాలకు ఎక్కువ సమయం వెచ్చించాల్సి ఉంటుంది. పరీక్షకు ముందు ఒక సమస్యను సాధించడం లేదా కొత్త కాన్సెప్ట్‌ను నేర్చుకోవడం వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. దీన్ని కూడా ఒక మాక్ టెస్ట్‌గానే భావించాలి. అదేవిధంగా ఇప్పటి వరకు పలు మాక్ టెస్ట్‌లు రాయడం ప్రశ్నల సాధనలో ఒక రకమైన పద్ధతి అలవడుతుంది. కాబట్టి దీనికి భిన్నంగా పరీక్షలో ప్రశ్నలను సాధించడానికి ప్రయత్నించకండి. ప్రతి ప్రశ్నను చదవడానికి ప్రయత్నించాలి. మెరుగైన స్కోర్ సాధనలో వేగం కీలకమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వేగం, కచ్చితత్వం ఆధారంగా సమాధానాలను గుర్తించే అంశంపై దృష్టి సారించండి. ప్రశ్నను పూర్తిగా చదవకుండా, ఆప్షన్లను చూడకుండా సమాధానాలను గుర్తించడం సరైన వ్యూహం కాదు. మానిటర్‌కు దగ్గరగా కాకుండా కొద్ది దూరంలో కూర్చోండి. ప్రతి సెక్షన్‌కు మధ్య మూడు నిమిషాల విరామం ఉంటుంది. దీన్ని రిలాక్స్ కావడానికి ఉపయోగించుకోవాలి. మొదటి విభాగంలో డేటా ఇంటర్‌ప్రిటేషన్, రెండో విభాగంలో లాజికల్ రీజనింగ్ పార్ట్‌తో ప్రారంభించడం మంచిది. చాలా మంది అభ్యర్థులు కేటాయించిన సమయం కంటే ముందే పరీక్షను పూర్తి చేస్తారు. అందరూ రాసిన తర్వాతే బయటికి పంపిస్తారు. కాబట్టి పూర్తి సమయాన్ని వినియోగించుకోవడం మంచిది. -పల్లా రవితేజ, ఐఐఎం-కోల్‌కతా.. తప్పనిసరి క్యాట్-2013 అడ్మిట్ కార్డు ఫోటో గుర్తింపు కార్డు (డ్రైవింగ్ లెసైన్స్/ పాస్‌పోర్ట్/ పాన్‌కార్డు/ ఓటర్ ఐడీ కార్డు/ కాలేజీ ఐడీ కార్డు-దీన్ని నిరూపించే విధంగా పేరున్న ఏటీఎం కార్డు/డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు/ ఆధార్ కార్డు/ ఎంప్లాయి ఐడెంటిఫికేషన్ కార్డు/ నోటరైజ్డ్ ఆఫిడవిట్) అడ్మిట్ కార్డు, ఫోటో గుర్తింపు కార్డు లేకుంటే పరీక్షకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ఏవైనా కారణాలతో పేరు మార్పు చెందితే దాన్ని నిరూపించే పత్రాలను కూడా చూపించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలు డీఏ అభ్యర్థులకు స్క్రైబ్ కోసం ప్రొమెట్రిక్ సెంటర్ నుంచి ఆథరైజ్డ్ లెటర్, స్క్రైబ్ ఫోటో గుర్తింపు కార్డు నిర్దేశించిన సమయం కంటే గంటన్నర ముందు పరీక్ష హాలుకు చేరుకోవడం ఉత్తమం. తద్వారా సెక్యూరిటీ చెక్, గుర్తింపు పత్రాల తనిఖీ వంటి అంశాల్లో సమయం కలిసొస్తుంది. వివరాలకు: http://cat2013.iimidr.ac.in