‘క్యాట్‌’ ఫలితాల వెల్లడి | CAT 2017 results declared, 20 candidates get 100 percentile | Sakshi
Sakshi News home page

‘క్యాట్‌’ ఫలితాల వెల్లడి

Published Tue, Jan 9 2018 1:44 AM | Last Updated on Sat, Aug 18 2018 8:53 PM

CAT 2017 results declared, 20 candidates get 100 percentile - Sakshi

న్యూఢిల్లీ: ఐఐఎం (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌)లతోపాటు దేశంలోని ప్రతిష్టాత్మక బిజినెస్‌ స్కూళ్లలో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌)లో అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థి  సాయిప్రణీత్‌ రెడ్డి 100 పర్సెంటైల్‌ సాధించాడు. 2018 ఏడాదిలో ప్రవేశాల కోసం ఐఐఎం–లక్నో ఆధ్వర్యంలో గతేడాది నవంబరులో దేశవ్యాప్తంగా 140 పట్టణాల్లో జరిగిన క్యాట్‌కు దాదాపు 2 లక్షల మంది హాజరయ్యారు.

సోమవారం ఫలితాలు విడుదలవగా మొత్తం 20 మంది విద్యార్థులు 100 పర్సెంటైల్‌ సాధించారు. గతేడాది క్యాట్‌ పరీక్షలోనూ 20 మంది 100 పర్సెంటైల్‌ సాధించగా వారందరూ అబ్బాయిలు, ఇంజినీరింగ్‌ నేపథ్యం ఉన్నవారే. ఈ ఏడాది అందుకు భిన్నంగా ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు నాన్‌–ఇంజినీర్లు కూడా 100 పర్సెంటైల్‌ను సొంతం చేసుకున్నారని క్యాట్‌ కన్వీనర్‌ నీరజా ద్వివేది చెప్పారు. క్యాట్‌కు రెండు లక్షల మంది హాజరవ్వడం గత మూడేళ్లలో ఇదే తొలిసారని ఆమె తెలిపారు. క్యాట్‌ స్కోర్‌ను అనుసరించి దేశంలోని 20 ఐఐఎంలలో దాదాపు 4,000 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు.

ఐఐఎం అహ్మదాబాద్‌లో చేరతా: సాయి ప్రణీత్‌
అనంతపురం జిల్లాకు చెందిన, ఐఐటీ మద్రాస్‌లో చదువుతున్న సాయి ప్రణీత్‌ రెడ్డి 100 పర్సెంటైల్‌ సాధించాడు. ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీయే చదవాలని కోరుకుంటున్నట్లు అతను చెప్పాడు. ‘టెక్నికల్‌ రంగంలోనూ నేను రాణించగలను. కానీ కొన్నిసార్లు మన పనిని ఇతరులతో చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను గుర్తించాను. అందుకోసం నిర్వహణా నైపుణ్యాలు కావాలి. అవి నేర్చుకోవడానికి మన దేశంలో ఐఐఎంలే అత్యుత్తమం’ అని సాయి ప్రణీత్‌ వివరించాడు.

నాలుగోసారి 100 పర్సెంటైల్‌
ముంబైలో క్యాట్‌ కోచింగ్‌ సెంటర్‌ నిర్వహించే ప్యాట్రిక్‌ డిసౌజా 100 పర్సెంటైల్‌ సాధించడం ఇది నాలుగోసారి. కోచింగ్‌ సెంటర్‌ నడుపుతున్నందున క్యాట్‌లో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను తెలుసుకునేందుకు ఇప్పటికి 14 సార్లు పరీక్ష రాశాననీ, ప్రతీసారి కనీసం 99 పర్సెంటైల్‌ సాధించానని ఆయన చెప్పారు. కోల్‌కతా విద్యార్థి విశాల్‌ వోహ్రా, సూరత్‌ నుంచి మీత్‌ అగర్వాల్, ఢిల్లీ అమ్మాయి చావీ గుప్తా తదితరులు 100 పర్సెంటైల్‌ సాధించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement