క్యాట్ - 2014.. టైమ్ మేనేజ్‌మెంట్ కీలకం! | CAT-2014: Time management Entrance exam | Sakshi
Sakshi News home page

క్యాట్ - 2014.. టైమ్ మేనేజ్‌మెంట్ కీలకం!

Published Thu, Aug 14 2014 12:36 AM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM

క్యాట్ - 2014.. టైమ్ మేనేజ్‌మెంట్ కీలకం!

క్యాట్ - 2014.. టైమ్ మేనేజ్‌మెంట్ కీలకం!

టాప్ స్టోరీ: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లలో పీజీ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్). దేశంలోని మొత్తం 13 ఐఐఎంలలో ఉన్న 3335 సీట్లకు ప్రతిఏటా లక్షల్లో అభ్యర్థులు పోటీపడుతుంటారు. మేనేజ్‌మెంట్  కోర్సు ఔత్సాహికులకు అత్యంత ముఖ్యమైన క్యాట్‌లో ఈ ఏడాది పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ప్రశ్నల సంఖ్యను, సమయ పరిమితిని పెంచనున్నారు. సిటీ నుంచి భారీ సంఖ్యలో అభ్యర్థులు క్యాట్‌కు ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో క్యాట్ - 2014లో ప్రధాన మార్పులపై ఫోకస్..
 
క్యాట్ - 2014 ప్రధాన మార్పులివే..
 -    ప్రతి ఏటా పరీక్షను అక్టోబర్‌లో నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది నవంబర్ 16, 22వ తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
 -    గతేడాది 20 రోజుల్లో 40 స్లాట్స్‌లో పరీక్ష నిర్వహించగా.. ఈ సంవత్సరం కేవలం రెండు రోజుల్లో రోజుకు రెండు సెషన్లలో పరీక్ష ఉంటుంది.
 -    గతేడాది 40 నగరాల్లో పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 99 నగరాల్లో 354 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
 -    ఇంతకు ముందులా అభ్యర్థులకు టెస్ట్ తేదీని ఎంపిక చేసుకునే అవకాశం లేదు. అభ్యర్థులకు టెస్ట్ తేదీని క్యాట్ సెంటర్ తెలియజేస్తుంది.
 -    ఈ ఏడాది ఆఫ్‌లైన్ వోచర్స్‌ను తొలగించారు. అభ్యర్థులు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌ల ద్వారా ఫీజులను చెల్లించాలి.
 -    అడ్మిట్ కార్డులను పరీక్ష తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 -    పరీక్ష వ్యవధి ఇప్పటివరకు 140 నిమిషాలు ఉండగా.. దాన్ని 170 నిమిషాలకు పెంచనున్నారు.
 -    పరీక్షలోని రెండు విభాగాలు క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్; వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్‌లలో ఇప్పటివరకు ప్రతి విభాగంలో అడిగే 30 ప్రశ్నలను 50 ప్రశ్నలకు పెంచి ఇవ్వనున్నారు.
 -    ఒక సెక్షన్‌కు సమాధానాలు గుర్తించకుండానే.. మరో సెక్షన్ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే అవకాశాన్ని కల్పించారు. ఇంతకుముందు ఒక సెక్షన్‌కు సమాధానాలిస్తేనే మరో సెక్షన్‌కు వెళ్లే అవకాశం ఉండేది.
 -    పరీక్ష విధానాన్ని తెలుసుకునేందుకు, అర్థం చేసుకునేందుకు క్యాట్ వెబ్‌సైట్‌లో పరీక్షకు ముందు అందుబాటులో ఉండే ట్యుటోరియల్‌ను తొలగించారు.
- 13 ఐఐఎంలతోపాటు కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆరు ఐఐఎంలకు కూడా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కొత్త ఆరు ఐఐఎంలలో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్న ఐఐఎం కూడా ఉంది.
 
 పోటీ తీవ్రం
 2014 క్యాట్‌లో ప్రశ్నల సంఖ్య ఎక్కువగా పెంచి.. సమయం స్వల్పంగానే పెంచారు. అంటే.. ప్రశ్నలు ఎక్కువ.. సమయం తక్కువ. కాబట్టి ఈ ఏడాది క్యాట్‌లో టైమ్ మేనే జ్‌మెంట్ చాలా కీలకంగా మారనుంది. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు చాకచక్యంగా గుర్తించగలిగిన వారు మాత్రమే మంచి పర్సంటైల్ సొంతం చేసుకునే వీలుంటుంది.  అందుకోసం అభ్యర్థులు సాధ్యమైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. 2014 క్యాట్‌కు పోటీ మరింతగా పెరిగే ఆస్కారముంది. పరీక్ష గతేడాదిలా అక్టోబర్‌లో కాకుండా.. నవంబర్‌లో  నిర్వహించనుండటంతో ప్రిపరేషన్‌కు సరిపడ సమయం లభిస్తుంది. అలాగే గతేడాది 40 సిటీల్లో క్యాట్ నిర్వహిస్తే.. ఇప్పుడు మొత్తం 99 నగరాల్లో పరీక్ష జరుగనుంది. అదేవిధంగా కేంద్రంలో కొత్త ప్రభుత్వ, ఆర్థిక వ్యవస్థలో సానుకూల పరిస్థితుల కారణంగా జాబ్ మార్కెట్ పురోగమనాన్ని చూసి మేనేజ్‌మెంట్ కోర్సుల వైపు ఎక్కువ మంది మొగ్గుచూపే అవకాశముంది. పై కారణాలతో క్యాట్‌కు ఈసారి పోటీ తీవ్రంగా ఉంటుందని నిపుణుల అంచనా.
 
 పటిష్ట ప్రణాళికతో సిద్ధమవ్వాలి
 క్యాట్‌ను ఈ ఏడాది నవంబర్‌లో నిర్వహిస్తుండటంతో ప్రిపరేషన్‌కు  అభ్యర్థులకు మరో నెల సమయం అందుబాటులోకి వచ్చింది. పరీక్షకు అదనపు సమయం దొరికింది కదా.. అని అభ్యర్థులు విశ్రమించకూడదు. ఐఐఎంలో సీటు సాధించాలంటే.. మంచి పర్సంటైల్ సాధించాలనే విషయాన్ని గుర్తెరగాలి. పరీక్షకు మూడు నెలలకుపైగా సమయం ఉంది. కాబట్టి ఇప్పటినుంచే పటిష్టమైన ప్రణాళికను రూపొందించుకుని సిద్ధమవ్వాలి. సాధారణంగా విద్యార్థులు.. పరీక్షకు చాలా సమయం ఉందిలే అనే నిర్లిప్త భావంతో ఉంటారు. ఇది సరికాదు. పరీక్ష తేదీలతో సంబంధం లేకుండా.. క్యాట్ ప్రకటన విడుదల నాటి నుంచే బాగా  శ్రమించాలి.  మెచ్చిన ఐఐఎంలో అడుగుపెట్టాలంటే తీవ్ర పోటీని ఎదుర్కొవాల్సి ఉంటుంది.
 
 వీలైనన్ని మాక్‌టెస్టులు సాధన చేయాలి
 పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. మార్పులను దృష్టిలో ఉంచుకుని మాక్‌టెస్టులను సాధ్యమైనంత ఎక్కువగా సాధన చేయాలి. నిర్దేశిత 170 నిమిషాల్లో 100 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలిగేలా ప్రాక్టీస్ చేయాలి. పరీక్షలో ఒక్కో ప్రశ్నకు ఉండే 140 సెకన్ల సమయాన్ని 102 సెకన్లకు కుదించారు. ఈ స్వల్ప సమయంలోనే వేగంగా ప్రశ్నను చదివి, అర్థం చేసుకుని సమాధానాన్ని గుర్తించగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ఇలా అయితేనే నిర్దేశిత సమయంలోగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించగలరు.
 
 ప్రవేశ ప్రక్రియ
 క్యాట్ పర్సంటైల్ ఆధారంగా వివిధ ఐఐఎంలకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ ప్రక్రియలో ఐఐఎంలు తమ సొంత విధానాన్ని అనుసరిస్తున్నాయి. కొన్ని ఐఐఎంలు క్యాట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి రిటెన్ ఎబిలిటీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నాయి. మరికొన్ని అకడెమిక్ రికార్డ్‌కు, వర్క్ ఎక్స్‌పీరియన్స్‌కు ప్రాధాన్యతనిస్తున్నాయి.
 
 క్యాట్ స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్న ఐఐఎంలు..
 -    ఐఐఎం- అహ్మదాబాద్, ఐఐఎం - బెంగళూర్, ఐఐఎం - కోల్ కతా,
 -    ఐఐఎం - ఇండోర్, ఐఐఎం - కాశీపూర్, ఐఐఎం - కోజికోడ్, ఐఐఎం - లక్నో, ఐఐఎం - రాయ్‌పూర్, ఐఐఎం - రాంచీ, ఐఐఎం- రోహ్‌తక్,
 -    ఐఐఎం -షిల్లాంగ్, ఐఐఎం - తిరుచిరాపల్లి, ఐఐఎం - ఉదయ్‌పూర్.
 -    క్యాట్ - 2014 స్కోర్ ఆధారంగా పైన పేర్కొన్న 13 ఐఐఎంలే కాకుండా మరో ఆరు ఐఐఎంలలో ప్రవేశాలు క ల్పించనున్నారు. అవి.. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, బీహార్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్న ఐఐఎంల్లో 2015-16 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు ఉంటాయి.
 
 క్యాట్ - 2014 సమాచారం
 అర్హత: 50 శాతం (ఎస్సీ, ఎస్టీ, శారీరక వికలాంగులకు 45 శాతం) మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డి గ్రీ ఉత్తీర్ణత.
 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌కు సంబంధించి అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయడానికి క్యాట్ వెబ్‌సైట్‌లో వీడియో అందుబాటులో ఉంది. అభ్యర్థులు దీని ఆధారంగా తప్పులు లేకుండా దరఖాస్తు నింపొచ్చు.
 ముఖ్య తేదీలు:
 ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2014
 అడ్మిట్ కార్డ్స్ డౌన్‌లోడ్: అక్టోబర్ 16 నుంచి నవంబర్ 22 వరకు
 పరీక్ష తేదీలు: నవంబర్ 16, 22
 ఫలితాల ప్రకటన: డిసెంబర్ మూడోవారం
 వెబ్‌సైట్: www.iimcat.ac.in
 
 మార్పులు అనుకూలమే!
 ‘‘దేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూల్స్‌లో ప్రవేశానికి పోటీపడే వారి సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంటుంది.   క్యాట్-2014లో  మార్పుల గురించి  విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గతంలో రెండు సెక్షన్లలో ఒక్కోదానిలో 30 ప్రశ్నల చొప్పున మొత్తం 60 ప్రశ్నలుండేవి. ఈ 60 ప్రశ్నలు  140 నిమిషాల్లో.. అంటే.. ప్రతి సెక్షన్‌కు 70 నిమిషాల్లో పూర్తిచేయాల్సి వచ్చేది.  ఒక సెక్షన్ పూర్తయితేనే, మరో సెక్షన్‌కు వెళ్లేందుకు వీలుండేది. దీంతో విద్యార్థులు తెలియని ప్రశ్నలను వదిలేసినా.. మిగిలిన సమయం వృథా అయ్యేది. ప్రస్తుత మార్పుల ప్రకారం ప్రతి సెక్షన్‌కు 50 ప్రశ్నల చొప్పున మొత్తం 100 ప్రశ్నలు.. 170 నిమిషాల్లో పూర్తిచేయాలి. రెండు సెక్షన్లను కలపటం వల్ల తేలికైన ప్రశ్నలన్నింటినీ ముందుగా పూర్తిచేసి.. క్లిష్టమైన ప్రశ్నలకు మిగతా సమయంలో సమాధానాలు ఇవ్వొచ్చు. కాబట్టి గతంతో పోల్చితే ప్రస్తుత మార్పులు విద్యార్థులకు అనుకూలమనే చెప్పాలి. ఈ ఏడాది కొత్తగా 6 ఐఐఎంలు రావచ్చని అంచనా. కాబట్టి  3335 సీట్లకు అదనంగా మరో 300-400 సీట్లు పెరిగే అవకాశం ఉంది’’
 -రామ్‌నాథ్ కనకదండి, కోర్సు డెరైక్టర్, క్యాట్, టైమ్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement