సాక్షి, అమరావతి: యువతకు ఉద్యోగాల కల్పనలో ఇంజనీరింగ్, మేనేజ్‌మెంటు కోర్సులే ముఖ్యభూమిక పోషిస్తున్నాయి. ఈ రెండు కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్ధుల్లోనే ఎక్కువమందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఇండియా స్కిల్ రిపోర్టు–2021 ఈ విషయాలను వెల్లడించింది. బీఈ, బీటెక్, ఎంబీఏ కోర్సులు చేసిన వారితో పోలిస్తే బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంసీఏ, పాలిటెక్నిక్ కోర్సులు చదివిన వారికి తక్కువగానే అవకాశాలు లభించాయి. విచిత్రమేమంటే బీకాం, బీఎస్సీల కన్నా 2021లో బీఏ విద్యార్థులకు అవకాశాలు మెరుగయ్యాయి. దేశవ్యాప్తంగా యువత నుంచి నిపుణులు సేకరించిన అభిప్రాయాలు, వాటిని విశ్లేషించి రూపొందించిన నివేదికలోని ముఖ్యాంశాలు ఏమిటంటే..
మహిళలకు పెరిగిన అవకాశాలు
ఉద్యోగ, ఉపాధికి యోగ్యమైన ప్రతిభ పురుషుల కన్నా స్త్రీలలో అధికంగా ఉండడంతో వారికే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి.
► ఉద్యోగావకాశాల్లో పురుషులు 38.91 శాతం మంది ఉండగా మహిళలు 41.25 శాతంగా ఉండడం విశేషం. కాలేజీల్లో చేరుతున్న మహిళల శాతం కూడా పెరగడంతో అదే సంఖ్యలో ఉద్యోగాల శాతంలోనూ వారి పెరుగుదల ఉంది.
► కరోనా సమయంలో మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లు ఎక్కువ ఉపాధి, ఉద్యోగాల కల్పనతో ముందు వరసలో ఉండగా ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో నిలవడం విశేషం. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో మెట్రో స్థాయి నగరాలు లేనప్పటికీ 5వ స్థానంలో నిలబడడం అన్నది చిన్న విషయం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
► వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అనుకున్న మేర పరిశ్రమలు, ఇతర సంస్థలు రాలేదు. అయినప్పటికీ ఉద్యోగ, ఉపాధి కల్పనలో ఏపీ మెరుగైన ఫలితాలనే సాధించింది. సాఫ్ట్‌వేర్, ఐటీ సంస్థలు ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాయి. రానున్న కాలంలో ఈ సంస్థలు మహిళలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే అవకాశముంది.
► ఐటీ, ఇంటర్నెట్ ఆధారిత ఉద్యోగాల్లో పురుషులతో సమానంగా మహిళలు పోటీపడుతున్నట్లు నివేదిక వెల్లడించింది.
► అలాగే, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఫార్మా, హెల్త్ కేర్ రంగాల్లోనూ అవకాశాలు దక్కుతున్నాయి.
► మహిళలకు అత్యధికంగా 2015లో 30% మేర అవకాశాలు లభించగా మళ్లీ 2021లోనే అంతకన్నా అత్యధికంగా 41.25% ఉండడం విశేషం.
► ఇక పురుషుల్లో ఐటీతో పాటు ఆటోమోటివ్‌లో 79 శాతం, లాజిస్టిక్‌లో 75 శాతం, కోల్ అండ్ ఎనర్జీ రంగంలో 72 శాతం అవకాశాలు దక్కించుకోగలిగారు.
కరోనాతో యువతలో తగ్గిన నైపుణ్యం
కరోనా కారణంగా నైపుణ్యాల పరంగా చూస్తే యువతలో ఆ సామర్థ్యాలు 45.9 శాతం మేర తగ్గింది. 18–21 ఏళ్లలోపున్న యువతలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు తక్కువగా ఉంటున్నాయి. ఇటువంటి యువత 40 శాతం కన్నా ఎక్కువగా ఉన్నారు. అలాగే, కరోనావల్ల ఉద్యోగాల కల్పన 2018తో పోలిస్తే 1.48 శాతం మేర మందగించినా నైపుణ్యాలు, శిక్షణ వంటి కార్యక్రమాల ద్వారా తమకు కావలసిన మానవ వనరులను సంస్థలు సమకూర్చుకుంటున్నాయి. ఉద్యోగాల కల్పన 2018లో 47.38 శాతం మేర ఉంటే 2021 నాటికి 45.9 శాతానికి తగ్గింది.
ఇంటర్న్‌షిప్‌తోనే అవకాశాలు
ఎంతోకాలంగా కొనసాగుతున్న సంప్రదాయ కోర్సులతో పారిశ్రామిక అవసరాలకు తగ్గ నైపుణ్యాలు విద్యార్థుల్లో ఉండడంలేదు. దీనికి కరోనా కూడా తోడైంది. ఈ నేపథ్యంలో.. విద్యార్థుల్లో తగిన నైపుణ్యాలు, సామర్థ్యాలను నెలకొల్పేందుకు ఆయా కాలేజీలు కోర్సుల్లో భాగంగానే ఇంటర్న్‌షిప్‌ను అమలుచేస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులు కోర్సు పూర్తిచేసే సమయానికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోగలుగుతున్నారు. ఏపీలో గతంలో ఈ ఇంటర్న్‌షిప్ లేకపోవడంతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని డిగ్రీ కోర్సులను నాలుగేళ్ల హానర్స్ కోర్సులుగా మార్పు చేయడంతోపాటు నైపుణ్యాల కోసం ఒక ఏడాది ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేయించారు. దీంతో ఇంటర్న్‌షిప్‌తో డిగ్రీలు పూర్తిచేసిన వారిలో 85.92 శాతం మందికి అవకాశాలు దక్కుతున్నట్లు నివేదిక పేర్కొంది.
ఐటీలో ఇంకా నైపుణ్యాల కొరత
నైపుణ్యాల విషయానికొస్తే ఐటీ రంగంలో చాలా అంతరం ఉంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు భారీ పెట్టుబడులతో ముందుకొస్తున్న తరుణంలో అందుకు తగ్గట్లుగా యువతను నైపుణ్యాలతో తీర్చిదిద్దేలా విద్యారంగంలో మార్పులు రావలసి ఉంటుందని నివేదిక అభిప్రాయపడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, బిగ్‌డేటా, రోబోటిక్స్, ఆటోమేటెడ్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటాసైన్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంశాల్లో నైపుణ్యం ఉన్న వారికి భారీ డిమాండ్ ఉంది. బయోటెక్నాలజీ, ఫార్మా, హెల్త్‌కేర్, ఎనర్జీ, లాజిస్టిక్ రంగాల్లోనూ అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఐటీ పరిశ్రమ పురోగమిస్తున్న నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌తోపాటు హార్డ్‌వేర్ ఇంజనీర్లకూ డిమాండ్ పెరగనుందని అంచనా వేసింది. ఐటీ రంగంలో 48.27%, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో 47.35%, కంప్యూటర్ సైన్స్‌లో 38.34 శాతం మందికి రానున్న కాలంలో అవకాశాలు దక్కనున్నాయని పేర్కొంది.
ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సులే.. ఉపాధిలో మేటి
Published Wed, Feb 9 2022 3:28 AM | Last Updated on Wed, Feb 9 2022 3:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment