సాక్షి, అమరావతి: నాలుగో పారిశ్రామిక విప్లవం ప్రపంచ పారిశ్రామిక రూపురేఖలను వేగంగా మార్చేస్తోంది. 2000 సంవత్సరం నుంచి మొదలైన ఇండస్ట్రీ–4 టెక్నాలజీ విప్లవంతో ఈ రంగంలో సరికొత్త ఉపాధి అవకాశాలు వచ్చి చేరుతున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, వర్చువల్ రియాల్టీ, బ్లాక్‌చైన్, ఫుల్‌స్టాక్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇలా అనేక కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి రావడం వల్ల పరిశ్రమల రూపురేఖలే మారిపోతున్నాయి. కానీ.. ఈ తరహా సాంకేతికను అందిపుచ్చుకున్న నిపుణులు అందుబాటులో లేకపోవడంతో ఆ పరిశ్రమ నిపుణుల కొరత ఎదుర్కొంటోంది.
భారీగా ఉద్యోగాలు
వచ్చే రెండేళ్లలో ఇండస్ట్రీ–4 టెక్నాలజీలో ప్రపంచవ్యాప్తంగా 13.30 కోట్ల ఉద్యోగాలు వస్తాయని వరల్డ్ ఎకనామిక్ ఫోర్ అంచనా వేసిందంటే ఈ కోర్సులకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి వివిధ కంపెనీలు ఆకర్షణీయమైన జీతాలతో ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయి. బ్లాక్ చైన్, ఐవోటీ, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులు పూర్తి చేసిన వారికి ఇండియాలోనే రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ప్రారంభ వేతనం లభిస్తోంది. అదే ఫుల్‌స్టాక్ వంటి అప్లికేషన్ డెవలప్‌మెంట్ కోర్సులను నేర్చుకుంటే అమెరికా వంటి దేశాల్లో ప్రారంభ వేతనం రూ.50 లక్షలపైనే ఉంటోంది.
వివిధ సంస్థలతో ఒప్పందాలు
లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఇండస్ట్రీ–4 టెక్నాలజీలో అవకాశాలను రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ టెక్నాలజీలకు సంబంధించిన కోర్సులను అందించే విధంగా వివిధ సంస్థలతో ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ (అపిటా) ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఏఆర్ అండ్ వీఆర్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి టెక్నాలజీల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేవిధంగా బ్లాక్‌బక్ ఇంజనీరింగ్ లిమిటెడ్, ఏ–ప్లస్ అసోసియేట్స్, ట్వంటీ ఫస్ట్ సెంచురీ సాఫ్ట్‌వేర్ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఐవోటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,సైబర్ సెక్యూరిటీ, వర్చువల్ రియాల్టీ, బ్లాక్‌చైన్, ఫుల్‌స్టాక్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి టెక్నాలజీల్లో నేరుగా శిక్షణ ఇచ్చి అనంతరం ఉపాధి కల్పించే విధంగా ఐబీఎం, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి సంస్థలతో చర్చలు జరుపుతోంది. అపిటా కాకుండా ఉడేమీ కోర్సెరా, ఐబీ హబ్స్, నెక్స్ట్ వేవ్ వంటి సంస్థలు ఆన్‌లైన్ ద్వారా ఈ కోర్సులను అందిస్తున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో రూ.20 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ
ఇండస్ట్రీ–4 టెక్నాలజీలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ) ఇండస్ట్రీ–4 సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీని ఏర్పాటు చేస్తోంది. సుమారు రూ.20 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే ఇండస్ట్రీ–4 టెక్నాలజీకి విశాఖ వేదికగా మారనుంది.
ఈ కోర్సులకు అధిక డిమాండ్
ఇండస్ట్రీ–4 టెక్నాలజీ కోర్సులకు అధిక డిమాండ్ ఉంది. ఇంటర్మీడియెట్ పూర్తికాగానే ఈ కోర్సులు చేస్తే డిగ్రీ కాగానే క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల ద్వారా రూ.లక్షల్లో జీతాలతో ఉద్యోగాల్లో చేరొచ్చు. రానున్న రెండేళ్లలో సైబర్ సెక్యూరిటీలో 30 లక్షలు, ఐవోటీలో 1.50 కోట్ల ఉద్యోగాలు వస్తాయని అంచనా. బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉద్యోగాల డిమాండ్ 517 శాతం పెరుగుతుందని అంచనా. ఇంజనీరింగ్‌తో పాటు ఈ కోర్సులను పూర్తి చేయడం ద్వారా మంచి ఉపాధి లభిస్తుంది.
– రాహుల్ అత్తులూరి, సీఈవో, నెక్ట్స్ వేవ్
అపిటా ద్వారా శిక్షణ
ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న ఇండస్ట్రీ–4 టెక్నాలజీ కోర్సులను ఇంజనీరింగ్ విద్యార్థులకు అందుబాటులోకి తెస్తున్నాం. ఇంజనీరింగ్ చేస్తూనే ఈ కోర్సులను పూర్తి చేసేలా వివిధ సంస్థలతో చర్చలు జరుపుతున్నాం. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఏఆర్ అండ్ వీఆర్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి టెక్నాలజీ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చాం. త్వరలో బ్లాక్‌చైన్ టెక్నాలజీని కూడా తెస్తున్నాం.
– అనిల్‌కుమార్ తెంటు, సీఈవో, అపిటా
Comments
Please login to add a commentAdd a comment