management course
-
ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కోర్సులే.. ఉపాధిలో మేటి
సాక్షి, అమరావతి: యువతకు ఉద్యోగాల కల్పనలో ఇంజనీరింగ్, మేనేజ్మెంటు కోర్సులే ముఖ్యభూమిక పోషిస్తున్నాయి. ఈ రెండు కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్ధుల్లోనే ఎక్కువమందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఇండియా స్కిల్ రిపోర్టు–2021 ఈ విషయాలను వెల్లడించింది. బీఈ, బీటెక్, ఎంబీఏ కోర్సులు చేసిన వారితో పోలిస్తే బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంసీఏ, పాలిటెక్నిక్ కోర్సులు చదివిన వారికి తక్కువగానే అవకాశాలు లభించాయి. విచిత్రమేమంటే బీకాం, బీఎస్సీల కన్నా 2021లో బీఏ విద్యార్థులకు అవకాశాలు మెరుగయ్యాయి. దేశవ్యాప్తంగా యువత నుంచి నిపుణులు సేకరించిన అభిప్రాయాలు, వాటిని విశ్లేషించి రూపొందించిన నివేదికలోని ముఖ్యాంశాలు ఏమిటంటే.. మహిళలకు పెరిగిన అవకాశాలు ఉద్యోగ, ఉపాధికి యోగ్యమైన ప్రతిభ పురుషుల కన్నా స్త్రీలలో అధికంగా ఉండడంతో వారికే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ► ఉద్యోగావకాశాల్లో పురుషులు 38.91 శాతం మంది ఉండగా మహిళలు 41.25 శాతంగా ఉండడం విశేషం. కాలేజీల్లో చేరుతున్న మహిళల శాతం కూడా పెరగడంతో అదే సంఖ్యలో ఉద్యోగాల శాతంలోనూ వారి పెరుగుదల ఉంది. ► కరోనా సమయంలో మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లు ఎక్కువ ఉపాధి, ఉద్యోగాల కల్పనతో ముందు వరసలో ఉండగా ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో నిలవడం విశేషం. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో మెట్రో స్థాయి నగరాలు లేనప్పటికీ 5వ స్థానంలో నిలబడడం అన్నది చిన్న విషయం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ► వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అనుకున్న మేర పరిశ్రమలు, ఇతర సంస్థలు రాలేదు. అయినప్పటికీ ఉద్యోగ, ఉపాధి కల్పనలో ఏపీ మెరుగైన ఫలితాలనే సాధించింది. సాఫ్ట్వేర్, ఐటీ సంస్థలు ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాయి. రానున్న కాలంలో ఈ సంస్థలు మహిళలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే అవకాశముంది. ► ఐటీ, ఇంటర్నెట్ ఆధారిత ఉద్యోగాల్లో పురుషులతో సమానంగా మహిళలు పోటీపడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ► అలాగే, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఫార్మా, హెల్త్ కేర్ రంగాల్లోనూ అవకాశాలు దక్కుతున్నాయి. ► మహిళలకు అత్యధికంగా 2015లో 30% మేర అవకాశాలు లభించగా మళ్లీ 2021లోనే అంతకన్నా అత్యధికంగా 41.25% ఉండడం విశేషం. ► ఇక పురుషుల్లో ఐటీతో పాటు ఆటోమోటివ్‌లో 79 శాతం, లాజిస్టిక్‌లో 75 శాతం, కోల్ అండ్ ఎనర్జీ రంగంలో 72 శాతం అవకాశాలు దక్కించుకోగలిగారు. కరోనాతో యువతలో తగ్గిన నైపుణ్యం కరోనా కారణంగా నైపుణ్యాల పరంగా చూస్తే యువతలో ఆ సామర్థ్యాలు 45.9 శాతం మేర తగ్గింది. 18–21 ఏళ్లలోపున్న యువతలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు తక్కువగా ఉంటున్నాయి. ఇటువంటి యువత 40 శాతం కన్నా ఎక్కువగా ఉన్నారు. అలాగే, కరోనావల్ల ఉద్యోగాల కల్పన 2018తో పోలిస్తే 1.48 శాతం మేర మందగించినా నైపుణ్యాలు, శిక్షణ వంటి కార్యక్రమాల ద్వారా తమకు కావలసిన మానవ వనరులను సంస్థలు సమకూర్చుకుంటున్నాయి. ఉద్యోగాల కల్పన 2018లో 47.38 శాతం మేర ఉంటే 2021 నాటికి 45.9 శాతానికి తగ్గింది. ఇంటర్న్‌షిప్‌తోనే అవకాశాలు ఎంతోకాలంగా కొనసాగుతున్న సంప్రదాయ కోర్సులతో పారిశ్రామిక అవసరాలకు తగ్గ నైపుణ్యాలు విద్యార్థుల్లో ఉండడంలేదు. దీనికి కరోనా కూడా తోడైంది. ఈ నేపథ్యంలో.. విద్యార్థుల్లో తగిన నైపుణ్యాలు, సామర్థ్యాలను నెలకొల్పేందుకు ఆయా కాలేజీలు కోర్సుల్లో భాగంగానే ఇంటర్న్‌షిప్‌ను అమలుచేస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులు కోర్సు పూర్తిచేసే సమయానికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోగలుగుతున్నారు. ఏపీలో గతంలో ఈ ఇంటర్న్‌షిప్ లేకపోవడంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని డిగ్రీ కోర్సులను నాలుగేళ్ల హానర్స్ కోర్సులుగా మార్పు చేయడంతోపాటు నైపుణ్యాల కోసం ఒక ఏడాది ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేయించారు. దీంతో ఇంటర్న్‌షిప్‌తో డిగ్రీలు పూర్తిచేసిన వారిలో 85.92 శాతం మందికి అవకాశాలు దక్కుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఐటీలో ఇంకా నైపుణ్యాల కొరత నైపుణ్యాల విషయానికొస్తే ఐటీ రంగంలో చాలా అంతరం ఉంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు భారీ పెట్టుబడులతో ముందుకొస్తున్న తరుణంలో అందుకు తగ్గట్లుగా యువతను నైపుణ్యాలతో తీర్చిదిద్దేలా విద్యారంగంలో మార్పులు రావలసి ఉంటుందని నివేదిక అభిప్రాయపడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, బిగ్‌డేటా, రోబోటిక్స్, ఆటోమేటెడ్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటాసైన్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంశాల్లో నైపుణ్యం ఉన్న వారికి భారీ డిమాండ్ ఉంది. బయోటెక్నాలజీ, ఫార్మా, హెల్త్‌కేర్, ఎనర్జీ, లాజిస్టిక్ రంగాల్లోనూ అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఐటీ పరిశ్రమ పురోగమిస్తున్న నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌తోపాటు హార్డ్‌వేర్ ఇంజనీర్లకూ డిమాండ్ పెరగనుందని అంచనా వేసింది. ఐటీ రంగంలో 48.27%, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో 47.35%, కంప్యూటర్ సైన్స్‌లో 38.34 శాతం మందికి రానున్న కాలంలో అవకాశాలు దక్కనున్నాయని పేర్కొంది. -
ఇంజనీరింగ్‌పై తగ్గుతున్న క్రేజ్
సాక్షి, అమరావతి: చేరికలు క్రమేణా కుదించుకుపోతుండడంతో దేశంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల సంఖ్య ఏటా తగ్గిపోతోంది. గత పదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఈ తగ్గుదల ఏటా సగటున లక్ష వరకు ఉంటోంది. ఇంజనీరింగ్‌తో పాటు మేనేజ్మెంట్ కోర్సులలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) గణాంకాల ప్రకారం 2012–13లో దేశంలో 26.9 లక్షల ఇంజనీరింగ్ సీట్లుండగా ఇప్పుడు 23.61 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2014–15లో గరిష్ట స్థాయిలో 31.83 లక్షల సీట్లున్నాయి. అప్పటి నుంచి సీట్ల సంఖ్యలో ఏటా లక్ష చొప్పున తగ్గుదల కనిపించింది. సరైన బోధనా సిబ్బంది లేకపోవడం, లేబొరేటరీలు, ఇతర ప్రమాణాలను సంస్థలు పాటించకపోవడంతో విద్యార్థులలో నైపుణ్యాలు కొరవడి ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతూ వచ్చాయి. ఈ ప్రభావంతో క్రమేణా ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాల సంఖ్య తగ్గుతోంది. విద్యార్థుల చేరికలు పడిపోతుండటంతో కాలేజీలు సీట్ల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొత్త టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండటంతో ఆయా రంగాల్లోని అంశాలపై పరిజ్ఞానాన్ని విద్యార్థులు అలవర్చుకోవలసి వస్తోంది. పాత సంప్రదాయ కోర్సులకు ఆదరణ తగ్గుతుండడంతో కాలేజీలు క్రమేణా వాటిని వదులుకుంటున్నాయి. ఇవన్నీ ఇంజనీరింగ్ కోర్సులలో సీట్ల సంఖ్య తగ్గడానికి కారణంగా యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. మేనేజ్మెంట్ కోర్సుల్లో కొంత వ్యత్యాసం.. పదేళ్లుగా దేశంలో మేనేజ్మెంట్ కోర్సుల డేటా పరిశీలిస్తే 2012–13 నుంచి 2014–15 వరకు సీట్లు పెరగ్గా ఆ తర్వాత తగ్గాయి. 2017–18లో మేనేజ్మెంట్ సీట్ల సంఖ్య 3.94 లక్షలు కాగా 2018–19లో 3.74 లక్షలకు, 2019–20లో 3.73 లక్షలకు తగ్గాయి. తరువాత పెరుగుదల నమోదైంది. 2021–22లో 4.04 లక్షలకు చేరాయి. ఇంజనీరింగ్ వెలవెల.. మేనేజ్మెంట్ కోర్సులతో పోలిస్తే గత ఐదేళ్లలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎక్కువ సీట్లు ఖాళీగా ఉన్నాయి. మేనేజ్మెంట్ సీట్లు 34 – 37 శాతం వరకు ఖాళీగా ఉండగా ఇంజనీరింగ్ సీట్లు 45 – 48 శాతం వరకు ఖాళీగా ఉన్నాయి. బీఈ, బీటెక్ తర్వాత వెంటనే ఉద్యోగాలు రాకపోవడం కూడా దీనికి కారణం. అలాంటి వారు మేనేజ్మెంట్ కోర్సులలో చేరుతున్నట్లు తేలుతోంది. సివిల్, మెకానికల్, ఇతర ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు తమ కోర్ విభాగాల్లో ఉద్యోగాలు లేక మేనేజ్మెంట్ కోర్సుల ద్వారా కార్పొరేట్ రంగంలోకి ప్రవేశించాలని భావిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. స్కిల్ ఇండియా తాజా నివేదికల ప్రకారం ఇంజనీరింగ్ విద్యార్థులు 46.82 శాతం, మేనేజ్మెంట్ విద్యార్ధులు 46.59 శాతం ఉపాధి పొందినట్లు వెల్లడిస్తున్నాయి. వివిధ సంస్థలు ఇంజనీరింగ్ అర్హతలతోపాటు మేనేజ్మెంట్ నైపుణ్యాలున్న వారికి ప్రాధాన్యమిస్తుండడంతో అటువైపు మొగ్గు చూపుతున్నట్లు ఏఐసీటీఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలోనూ ఇవే రకమైన గణాంకాలు దేశంలోని పరిస్థితినే రాష్ట్రంలో ఏఐసీటీఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి. రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు 2.99 లక్షలుండగా 2021–22 నాటికి 2.37 లక్షలకు తగ్గాయి. మేనేజ్మెంట్ కోర్సుల్లో 2014–15లో 51,750 సీట్లుండగా 2021–22 నాటికి 39,451కి తగ్గాయి. -
క్యాట్ - 2014.. టైమ్ మేనేజ్మెంట్ కీలకం!
టాప్ స్టోరీ: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లలో పీజీ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్). దేశంలోని మొత్తం 13 ఐఐఎంలలో ఉన్న 3335 సీట్లకు ప్రతిఏటా లక్షల్లో అభ్యర్థులు పోటీపడుతుంటారు. మేనేజ్మెంట్ కోర్సు ఔత్సాహికులకు అత్యంత ముఖ్యమైన క్యాట్‌లో ఈ ఏడాది పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ప్రశ్నల సంఖ్యను, సమయ పరిమితిని పెంచనున్నారు. సిటీ నుంచి భారీ సంఖ్యలో అభ్యర్థులు క్యాట్‌కు ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో క్యాట్ - 2014లో ప్రధాన మార్పులపై ఫోకస్.. క్యాట్ - 2014 ప్రధాన మార్పులివే.. - ప్రతి ఏటా పరీక్షను అక్టోబర్‌లో నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది నవంబర్ 16, 22వ తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. - గతేడాది 20 రోజుల్లో 40 స్లాట్స్‌లో పరీక్ష నిర్వహించగా.. ఈ సంవత్సరం కేవలం రెండు రోజుల్లో రోజుకు రెండు సెషన్లలో పరీక్ష ఉంటుంది. - గతేడాది 40 నగరాల్లో పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 99 నగరాల్లో 354 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. - ఇంతకు ముందులా అభ్యర్థులకు టెస్ట్ తేదీని ఎంపిక చేసుకునే అవకాశం లేదు. అభ్యర్థులకు టెస్ట్ తేదీని క్యాట్ సెంటర్ తెలియజేస్తుంది. - ఈ ఏడాది ఆఫ్‌లైన్ వోచర్స్‌ను తొలగించారు. అభ్యర్థులు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌ల ద్వారా ఫీజులను చెల్లించాలి. - అడ్మిట్ కార్డులను పరీక్ష తేదీ వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. - పరీక్ష వ్యవధి ఇప్పటివరకు 140 నిమిషాలు ఉండగా.. దాన్ని 170 నిమిషాలకు పెంచనున్నారు. - పరీక్షలోని రెండు విభాగాలు క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్; వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్‌లలో ఇప్పటివరకు ప్రతి విభాగంలో అడిగే 30 ప్రశ్నలను 50 ప్రశ్నలకు పెంచి ఇవ్వనున్నారు. - ఒక సెక్షన్‌కు సమాధానాలు గుర్తించకుండానే.. మరో సెక్షన్ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే అవకాశాన్ని కల్పించారు. ఇంతకుముందు ఒక సెక్షన్‌కు సమాధానాలిస్తేనే మరో సెక్షన్‌కు వెళ్లే అవకాశం ఉండేది. - పరీక్ష విధానాన్ని తెలుసుకునేందుకు, అర్థం చేసుకునేందుకు క్యాట్ వెబ్సైట్లో పరీక్షకు ముందు అందుబాటులో ఉండే ట్యుటోరియల్ను తొలగించారు. - 13 ఐఐఎంలతోపాటు కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆరు ఐఐఎంలకు కూడా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కొత్త ఆరు ఐఐఎంలలో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్న ఐఐఎం కూడా ఉంది. పోటీ తీవ్రం 2014 క్యాట్‌లో ప్రశ్నల సంఖ్య ఎక్కువగా పెంచి.. సమయం స్వల్పంగానే పెంచారు. అంటే.. ప్రశ్నలు ఎక్కువ.. సమయం తక్కువ. కాబట్టి ఈ ఏడాది క్యాట్‌లో టైమ్ మేనే జ్మెంట్ చాలా కీలకంగా మారనుంది. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు చాకచక్యంగా గుర్తించగలిగిన వారు మాత్రమే మంచి పర్సంటైల్ సొంతం చేసుకునే వీలుంటుంది. అందుకోసం అభ్యర్థులు సాధ్యమైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. 2014 క్యాట్‌కు పోటీ మరింతగా పెరిగే ఆస్కారముంది. పరీక్ష గతేడాదిలా అక్టోబర్‌లో కాకుండా.. నవంబర్‌లో నిర్వహించనుండటంతో ప్రిపరేషన్‌కు సరిపడ సమయం లభిస్తుంది. అలాగే గతేడాది 40 సిటీల్లో క్యాట్ నిర్వహిస్తే.. ఇప్పుడు మొత్తం 99 నగరాల్లో పరీక్ష జరుగనుంది. అదేవిధంగా కేంద్రంలో కొత్త ప్రభుత్వ, ఆర్థిక వ్యవస్థలో సానుకూల పరిస్థితుల కారణంగా జాబ్ మార్కెట్ పురోగమనాన్ని చూసి మేనేజ్మెంట్ కోర్సుల వైపు ఎక్కువ మంది మొగ్గుచూపే అవకాశముంది. పై కారణాలతో క్యాట్‌కు ఈసారి పోటీ తీవ్రంగా ఉంటుందని నిపుణుల అంచనా. పటిష్ట ప్రణాళికతో సిద్ధమవ్వాలి క్యాట్‌ను ఈ ఏడాది నవంబర్‌లో నిర్వహిస్తుండటంతో ప్రిపరేషన్‌కు అభ్యర్థులకు మరో నెల సమయం అందుబాటులోకి వచ్చింది. పరీక్షకు అదనపు సమయం దొరికింది కదా.. అని అభ్యర్థులు విశ్రమించకూడదు. ఐఐఎంలో సీటు సాధించాలంటే.. మంచి పర్సంటైల్ సాధించాలనే విషయాన్ని గుర్తెరగాలి. పరీక్షకు మూడు నెలలకుపైగా సమయం ఉంది. కాబట్టి ఇప్పటినుంచే పటిష్టమైన ప్రణాళికను రూపొందించుకుని సిద్ధమవ్వాలి. సాధారణంగా విద్యార్థులు.. పరీక్షకు చాలా సమయం ఉందిలే అనే నిర్లిప్త భావంతో ఉంటారు. ఇది సరికాదు. పరీక్ష తేదీలతో సంబంధం లేకుండా.. క్యాట్ ప్రకటన విడుదల నాటి నుంచే బాగా శ్రమించాలి. మెచ్చిన ఐఐఎంలో అడుగుపెట్టాలంటే తీవ్ర పోటీని ఎదుర్కొవాల్సి ఉంటుంది. వీలైనన్ని మాక్‌టెస్టులు సాధన చేయాలి పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తారు. మార్పులను దృష్టిలో ఉంచుకుని మాక్‌టెస్టులను సాధ్యమైనంత ఎక్కువగా సాధన చేయాలి. నిర్దేశిత 170 నిమిషాల్లో 100 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలిగేలా ప్రాక్టీస్ చేయాలి. పరీక్షలో ఒక్కో ప్రశ్నకు ఉండే 140 సెకన్ల సమయాన్ని 102 సెకన్లకు కుదించారు. ఈ స్వల్ప సమయంలోనే వేగంగా ప్రశ్నను చదివి, అర్థం చేసుకుని సమాధానాన్ని గుర్తించగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ఇలా అయితేనే నిర్దేశిత సమయంలోగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించగలరు. ప్రవేశ ప్రక్రియ క్యాట్ పర్సంటైల్ ఆధారంగా వివిధ ఐఐఎంలకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ ప్రక్రియలో ఐఐఎంలు తమ సొంత విధానాన్ని అనుసరిస్తున్నాయి. కొన్ని ఐఐఎంలు క్యాట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి రిటెన్ ఎబిలిటీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నాయి. మరికొన్ని అకడెమిక్ రికార్డ్‌కు, వర్క్ ఎక్స్‌పీరియన్స్‌కు ప్రాధాన్యతనిస్తున్నాయి. క్యాట్ స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్న ఐఐఎంలు.. - ఐఐఎం- అహ్మదాబాద్, ఐఐఎం - బెంగళూర్, ఐఐఎం - కోల్ కతా, - ఐఐఎం - ఇండోర్, ఐఐఎం - కాశీపూర్, ఐఐఎం - కోజికోడ్, ఐఐఎం - లక్నో, ఐఐఎం - రాయ్‌పూర్, ఐఐఎం - రాంచీ, ఐఐఎం- రోహ్తక్, - ఐఐఎం -షిల్లాంగ్, ఐఐఎం - తిరుచిరాపల్లి, ఐఐఎం - ఉదయ్‌పూర్. - క్యాట్ - 2014 స్కోర్ ఆధారంగా పైన పేర్కొన్న 13 ఐఐఎంలే కాకుండా మరో ఆరు ఐఐఎంలలో ప్రవేశాలు క ల్పించనున్నారు. అవి.. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, బీహార్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్న ఐఐఎంల్లో 2015-16 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు ఉంటాయి. క్యాట్ - 2014 సమాచారం అర్హత: 50 శాతం (ఎస్సీ, ఎస్టీ, శారీరక వికలాంగులకు 45 శాతం) మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డి గ్రీ ఉత్తీర్ణత. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌కు సంబంధించి అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయడానికి క్యాట్ వెబ్సైట్లో వీడియో అందుబాటులో ఉంది. అభ్యర్థులు దీని ఆధారంగా తప్పులు లేకుండా దరఖాస్తు నింపొచ్చు. ముఖ్య తేదీలు: ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2014 అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్: అక్టోబర్ 16 నుంచి నవంబర్ 22 వరకు పరీక్ష తేదీలు: నవంబర్ 16, 22 ఫలితాల ప్రకటన: డిసెంబర్ మూడోవారం వెబ్సైట్: www.iimcat.ac.in మార్పులు అనుకూలమే! ‘‘దేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూల్స్‌లో ప్రవేశానికి పోటీపడే వారి సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంటుంది. క్యాట్-2014లో మార్పుల గురించి విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గతంలో రెండు సెక్షన్లలో ఒక్కోదానిలో 30 ప్రశ్నల చొప్పున మొత్తం 60 ప్రశ్నలుండేవి. ఈ 60 ప్రశ్నలు 140 నిమిషాల్లో.. అంటే.. ప్రతి సెక్షన్‌కు 70 నిమిషాల్లో పూర్తిచేయాల్సి వచ్చేది. ఒక సెక్షన్ పూర్తయితేనే, మరో సెక్షన్‌కు వెళ్లేందుకు వీలుండేది. దీంతో విద్యార్థులు తెలియని ప్రశ్నలను వదిలేసినా.. మిగిలిన సమయం వృథా అయ్యేది. ప్రస్తుత మార్పుల ప్రకారం ప్రతి సెక్షన్‌కు 50 ప్రశ్నల చొప్పున మొత్తం 100 ప్రశ్నలు.. 170 నిమిషాల్లో పూర్తిచేయాలి. రెండు సెక్షన్లను కలపటం వల్ల తేలికైన ప్రశ్నలన్నింటినీ ముందుగా పూర్తిచేసి.. క్లిష్టమైన ప్రశ్నలకు మిగతా సమయంలో సమాధానాలు ఇవ్వొచ్చు. కాబట్టి గతంతో పోల్చితే ప్రస్తుత మార్పులు విద్యార్థులకు అనుకూలమనే చెప్పాలి. ఈ ఏడాది కొత్తగా 6 ఐఐఎంలు రావచ్చని అంచనా. కాబట్టి 3335 సీట్లకు అదనంగా మరో 300-400 సీట్లు పెరిగే అవకాశం ఉంది’’ -రామ్‌నాథ్ కనకదండి, కోర్సు డెరైక్టర్, క్యాట్, టైమ్ -
ఐఐఎస్సీ అందిస్తున్న బ్యాచిలర్ డిగ్రీ కోర్సు
ఐఐఎస్సీ అందిస్తున్న బ్యాచిలర్ డిగ్రీ కోర్సు స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కోర్సు వివరాలను తెలపండి? -శ్రీధర్, హైదరాబాద్ వివిధ క్రీడలకు సంబంధించిన టోర్నమెంట్లను సక్రమంగా నిర్వహించడమే స్పోర్ట్స్ మేనేజ్మెంట్. ఒక స్పోర్ట్స్ ఈవెంట్‌కు సంబంధించి షెడ్యూల్ రూపకల్పన మొదలు.. పర్యవేక్షణ, పాల్గొనే క్రీడాకారులు, అధికారులు, సంబంధిత వర్గాలకు తగిన సౌకర్యాలు కల్పించడం వరకు అన్నీ స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో ముఖ్య విధులు. అంతేకాకుండా టోర్నీలకు తగిన ప్రచారం కల్పించడం, మార్కెటింగ్ వ్యవహారాలను పర్యవేక్షించేబాధ్యత కూడా వీరిదే. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి వివిధ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ సంస్థల్లో స్పోర్ట్స్ మేనేజర్‌గా అవకాశాలుంటాయి. ఆయా టోర్నమెంట్ల నిర్వహణ సమయంలో పీఆర్ఓగా కూడా వ్యవహరించవచ్చు. అంతేకాకుండా ప్రముఖ క్రీడాకారుల వ్యవహారాలను పర్యవేక్షించే పర్సనల్ మేనేజర్, ఏజెంట్స్‌గా, పీఆర్ఓగా అవకాశాలుంటాయి. టైగర్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ వంటి ప్రైవేట్ సంస్థలతోపాటు ప్రభుత్వ క్రీడా సంస్థల్లో కూడా వీరికి అవకాశాలుంటాయి. క్లబ్‌లు, హోటల్స్, రిసార్టులు, స్పోర్ట్స్ సెంటర్లు కూడా స్పోర్ట్స్ మేనేజర్లను నియమించుకుంటున్నాయి. విదేశాల్లోనూ అనేక అవకాశాలుంటాయి. ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లు: పీజీ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్; అలగప్ప యూనివర్సిటీ- తమిళనాడు (డిస్టెన్స్‌లో) వెబ్సైట్:www.alagappauniversity.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ - కోల్‌కతా వెబ్సైట్: www.iiswbm.edu లక్ష్మీబాయ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్-గ్వాలియర్. వెబ్సైట్: www.lnipe.gov.in ఎంబీఏ(స్పోర్ట్స్ మేనేజ్మెంట్): తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ-చెన్నై వెబ్సైట్: www.tnpesu.org పీజీ డిప్లొమా ఇన్ జియోఇన్ఫర్మాటిక్స్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి? -రవి, కర్నూలు. జియో సైన్స్, ఇన్ఫర్మాటిక్స్ సబ్జెక్ట్‌ల కలయికతో రూపొందించిన కోర్సు జియోఇన్ఫర్మాటిక్స్. ఈ కోర్సు పూర్తి చేస్తే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ), నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) వంటి ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగావకాశాలను దక్కించుకోవచ్చు. ప్రైవేట్ రంగానికొస్తే.. సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్, మినరల్ ఎక్స్‌ప్లోరేషన్, పబ్లిక్ హెల్త్, ట్రాన్స్‌పోర్టేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ-కామర్స్ సంబంధిత సంస్థలు జియోఇన్ఫర్మాటిక్స్ నిపుణులను నియమించుకుంటాయి. ఈ విభాగంలో టాప్ రిక్రూటర్స్: గూగుల్, టీసీఎస్, రిలయన్స్, మాగ్నసాఫ్ట్ టెక్నాలజీ. పీజీ డిప్లొమా ఇన్ జియోఇన్ఫర్మాటిక్స్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లు: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్- డెహ్రాడూన్; వివరాలకు: www.iirs.gov.in నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ వివరాలకు: http://npti.in జామియా మిలియా ఇస్లామియా-న్యూఢిల్లీ వివరాలకు: http://jmi.ac.in టెరీ యూనివర్సిటీ-ఢిల్లీ వివరాలకు: www.teriuniversity.ac.in సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్ వివరాలకు:www.cuj.ac.in సీడాక్-పుణే; వివరాలకు: http://cdac.in ఐఐఎస్సీ అందిస్తున్న బ్యాచిలర్ డిగ్రీ కోర్సు వివరాలను తెలపండి? -శ్రీధర్, నిర్మల్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ).. శాస్త్ర పరిశోధనలకు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యున్నత వేదిక. జాబ్ ఇండస్ట్రీ కోరుకుంటున్న స్కిల్స్, పరిశోధనల పరంగా విద్యార్థుల్లో ఆసక్తిని పెంచే ఉద్దేశంతో బ్యాచిలర్ స్థాయిలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్)డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టింది. ఇందులో ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. మొదటి మూడు (1,2,3) సెమిస్టర్లలో సైన్స్‌కు సంబంధించి క్లాసికల్, సైంటిఫిక్ అంశాలతోపాటు మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన బేసిక్ ప్రిన్సిపుల్స్‌పై అవగాహన కల్పిస్తారు. వీటిని కోర్ సబ్జెక్ట్‌లుగా పరిగణిస్తారు. తర్వాతి 4,5,6 సెమిస్టర్లలో.. మొదటి మూడు సెమిస్టర్ల తర్వాత విద్యార్థి తనకు ఆసక్తిని బట్టి ఏదో ఒక స్పెషలైజేషన్‌ను ఎంచుకోవాలి. ఇందుకోసం ఆరు రకాల స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉంటాయి. అవి.. బయాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంట్ సైన్స్, మెటీరియల్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్. ఇవన్నీ ఇంటర్‌డిసిప్లినరీ సబ్జెక్ట్‌లు. అయితే విద్యార్థి తన స్పెషలైజేషన్ కాకుండా ఆసక్తి, నాలెడ్జ్ ఆధారంగా ఇతర స్పెషలైజేషన్లలోని 30 శాతం సిలబస్‌ను కామన్‌గా చదవాలి. ఏడు, ఎనిమిదో సెమిస్టర్లను పూర్తిగా ప్రాజెక్ట్ వర్క్ కోసం కేటాయించారు. అర్హత: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్ట్‌లుగా 12వ తరగతి లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ప్రవేశం: ఐఐటీ-జేఈఈ, ఏఐపీఎంటీ వంటి జాతీయ ఎంట్రన్స్‌లలో సాధించిన స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తుంది. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై)కు ఎంపికైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంత విద్యార్థినులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వివరాలకు: www.iisc.ernet.in -
ఆన్లైన్లో ఎంబీఏ కోర్సులు
అన్నానగర్, న్యూస్‌లైన్: చెన్నైకు చెందిన ప్రముఖ మేనేజ్మెంట్ స్కూల్ గ్రేట్‌లెక్స్ ప్రముఖ విదేశీ బిజినెస్ స్కూల్ అయిన మై బి స్కూల్ డాట్ కాంతో కలసి విద్యార్థులకు మాస్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులను మూక్స్ ప్రారంభిస్తోందని గ్రేట్‌లేక్స్ సంస్థ వ్యవస్థాపక డీన్ డాక్టర్ వి.బాలా బాలచంద్రన్ తెలిపారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పంద వివరాలను వెల్లడించారు. ముఖ్యంగా ఎంబీఏ మేనేజ్మెంట్ విద్యార్థులకు ఈ ఆన్లైన్ మూక్స్ కోర్సులు ఒక వరం లాంటివన్నారు. 25 సబ్జెక్టుల్లో వీటిని బోధిస్తామన్నారు. మొత్తం 500 గంటల సేపు బోధనా తరగతులుంటాయన్నారు. ఆన్లైన్లో వీడియో లెక్చరర్లు కూడా ఉంటారన్నారు. దేశ, విదేశాలకు చెందిన మేనేజ్మెంట్ గురువులు ఆన్లైన్లో తరగతులను బోధిస్తారన్నారు. తాము ఉచితంగా బోధించే 25 మేనేజ్మెంట్లు సబ్జెక్టులు ఒక్కొక్కటి 20 గంటల నిడివిని కలిగి ఉంటాయని గ్రేట్‌లేక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ప్రొఫసర్ శ్రీరాం తెలిపారు. ఈ కోర్సులన్నీ ఆన్లైన్లో ఉచితంగా బోధిస్తున్నామని, వీటికి విద్యార్థులు ఎటువంటి ఫీజులు చెల్లించనవసరం లేదన్నారు. అదే విధంగా ఈ కోర్సులు పూర్తి అయిన తరువాత ఎటువంటి పరీక్షలూ, సర్టిఫికెట్లను ప్రదానం చేయడం వంటి ఫార్మాలిటీలుండవన్నారు. సర్టిఫికెట్లు పొందగోరే వారు ఫీజులను తప్పనిసరిగా చెల్లించాలన్నారు. ఫీజు చెల్లించిన వారికే తాము పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇతర వివరాలకు www.mybskoo .com లో సంప్రదించాలన్నారు. -
నూటికి నూరు విజేతలు వీరు
‘వందకు వంద మార్కులు తెచ్చుకున్నాడు మా అబ్బాయి’. ఈ మాట అంటున్నది ఒకటో తరగతి విద్యార్థి తల్లి కాదు. ప్రతిష్టాత్మకమైన ఐఐఎమ్ విద్యాసంస్థలో మేనేజ్మెంట్ కోర్సుల్లో అడుగుపెడుతున్న ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు. ఎలా చదివితే ఇది సాధ్యమవుతుంది?... ఇది వేలాది తల్లిదండ్రుల మెదళ్లను తొలిచే ప్రశ్న. ‘మా అబ్బాయికి లెక్కల్లో మెళకువలు నేర్పాను’ అంటారు సూర్యతేజ తండ్రి సాయిరామకృష్ణ. ‘క్లాసులో ఫస్ట్ రావాలని చెప్పను, అయితే ఫస్ట్ రాగలిగిన సమర్థత నీలో ఉన్నప్పుడు దానిని ఉపయోగ పెట్టకపోతే అది నీ తప్పు. ఆ పొరపాటు చదువులోనే కాదు, జీవితంలో కూడా చేయరాదు’ అని మార్గదర్శనం చేశానంటారు మరో విద్యార్థి పిల్లుట్ల కృష్ణ తండ్రి విశ్వనాథం. సక్సెస్‌కు ఒకటి కాదు, వందలాది దారులు. ఏ దారిలో వెళ్లామనేది కాదు, గమ్యం చేరడమే లక్ష్యం... అని విజేతలు నిరూపిస్తూనే ఉంటారు. తాజాగా ఇటీవల వెలువడిన కామన్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో శిఖరాగ్రాన నిలిచిన విజేతలలో మనవాళ్లు నలుగురున్నారు. వారిలో సూర్యతేజ, కృష్ణ ఇద్దరూ పరస్పరం భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్లు. సూర్యతేజ తండ్రి సామర్లకోట ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టారు. కృష్ణ తండ్రి విశ్వనాథం ప్రఖ్యాత విద్యాసంస్థల స్థాపకులు. వీరిద్దరూ తమ పిల్లలకు ‘వింటి నుంచి వదలిన బాణంలా’ దూసుకెళ్ల గలిగిన నైపుణ్యాన్ని నేర్పించారు. అవధానమే సోపానం! ‘నిజాయితీగా ఉండడం, సూటిగా మాట్లాడడం, అబద్ధం ఆడకపోవడం వంటి విలువలను నేర్పించాను. ఇంట్లో అందరం రామకృష్ణ పరమహంస బోధనలను అనుసరిస్తాం. ఆ ప్రభావం మా పిల్లల మీద ఉంది. మా వారు గణితావధానం చేస్తారు. ఒకసారి వేదిక మీద ‘అవధానం చేయడం అసాధ్యం కాదు, ఆసక్తి ఉన్న వాళ్లను అవధానిగా తీర్చిదిద్దగలను’ అన్నారు. అప్పటికి సూర్యతేజ ఎయిత్క్లాసులో ఉన్నాడు. ‘మన ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారు. వేదిక మీద చెప్పిన దానిని ఆచరించి చూపండి’ అన్నాను. అన్నట్లుగానే నేర్పించారాయన. తేజ చిన్నప్పుడు అవధానం చేశాడు. చిన్నబ్బాయి అభిషేక్ అవధానం చేయలేదు కానీ ఆ ప్రక్రియ నేర్చుకున్నాడు. ఇప్పుడు తాను చెన్నైలో టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అవధాన ప్రక్రియ... లెక్కల్లో మెళకువలు తెలుసుకోవడానికి దోహదం చేసింది. పిల్లలకు మాథ్స్ పరీక్ష కోసం ప్రిపేర్ కావాల్సిన అవసరం రాలేదు. - గంగా భవాని, సూర్యతేజ తల్లి నీ హండ్రెడ్ పర్సెంట్... ‘‘ఈ తరం పిల్లలు పెద్దవాళ్లు ఏది చెబితే దానిని యథాతథంగా అనుసరించడం లేదు. ప్రతి విషయాన్నీ ‘ఎందుకు’ అంటారు. అలా ఎందుకు చేయాలో చెప్పాలి. మా అబ్బాయి కృష్ణ ఐఐటి బాంబేలో బీటెక్ చదువుతూ క్యాట్‌కు ప్రిపేరయ్యాడు. బీటెక్ తర్వాత ఏ కోర్సు చదవాలనే డిస్కషన్ వచ్చినప్పుడు... ఉన్న ఆప్షన్లు ఏమిటి, వాటిలో పాజిటివ్‌లు, నెగెటివ్‌లను నా అనుభవాన్ని బట్టి విశ్లేషించి చెప్పాను. తుదినిర్ణయం దగ్గర ఎవరమూ జోక్యం చేసుకోలేదు. నేను పిల్లలకు చిన్నప్పటి నుంచి చెప్పిందల్లా... దేవుడు తెలివితేటలు ఇచ్చాడు. వాటిని సద్వినియోగం చేయగల శక్తిసామర్థ్యాలనూ ఇచ్చాడు. మేధ, సామర్థ్యాలను ఉపయోగించడం మన బాధ్యత, ఉపయోగపెట్టలేకపోతే అది అసమర్థత. క్లాసులో ఫస్ట్ రావడం నీ లక్ష్యం కావాలనుకోవద్దు, నీ శక్తిసామర్థ్యాలను నూటికి నూరుశాతం ఉపయోగించుకోమని చెప్పేవాడిని. పరీక్షలకు ప్రిపేరయ్యేటప్పుడు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే విసుక్కోకుండా వాళ్ల డౌట్స్ క్లియర్ చేయడం అలవాటు చేశాం. అది కూడా తనకు ఉపయోగపడింది’’. - విశ్వనాథం, కృష్ణ తండ్రి సరైన దిశానిర్దేశం ఉంటే గమ్యాన్ని చేరడం సులువవుతుంది. చక్కటి నైపుణ్యంతో మెరుగులు దిద్దితే వజ్రం కాంతులీనుతుంది. ఎంత చక్కటి పథనిర్దేశకులు ఉన్నా, ఎంతటి నిపుణులు శిక్షణ ఇచ్చినా లక్ష్యాన్ని చేరాలనే తపన లేకపోతే ఎవరూ ఎవరినీ అందలం ఎక్కించలేరు. చక్కటి గెడైన్స్... కెరీర్లో దూసుకుపోవాలనే ఆకాంక్ష ఉన్న వాళ్లకు చుక్కానిలా పనిచేస్తుంది. - వాకా మంజులారెడ్డి