ఒత్తిడికి దూరంగా.. వేగం, కచ్చితత్వంతో.. | common admission test | Sakshi
Sakshi News home page

ఒత్తిడికి దూరంగా.. వేగం, కచ్చితత్వంతో..

Published Thu, Oct 3 2013 3:18 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

ఒత్తిడికి దూరంగా.. వేగం, కచ్చితత్వంతో.. - Sakshi

ఒత్తిడికి దూరంగా.. వేగం, కచ్చితత్వంతో..

సమున్నత భవిష్యత్ దిశగా ఐఐఎంలలో ప్రవేశానికి మార్గం సుగమమం చేసే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.. మరో రెండు వారాల్లో క్యాట్-2013 ఆన్‌లైన్ పరీక్షలు మొదలు కానున్నాయి.. అక్టోబర్ 16 నుంచి ప్రారంభమై నవంబర్ 11 వరకు కొనసాగనున్నాయి.. వేలల్లో ఉండే సీట్ల కోసం లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్న  నేపథ్యంలో గమ్యాన్ని చేరే క్రమంలో ఇప్పటి నుంచి  వేసే అడుగులు కీలక పాత్రను పోషిస్తాయి.. ఒత్తిడికి లోనుకాకుండా నేర్చుకున్న ప్రతి అంశాన్ని పక్కాగా అమలు చేసినప్పుడే విజయం సాధ్యం. కాబట్టి క్యాట్ పరీక్షలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఫోకస్.
 
 క్యాట్‌లో రెండు విభాగాలు ఉంటాయి. అవి.. క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్; వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్. ప్రతి విభాగానికి 70 నిమిషాల చొప్పున మొత్తం 140 నిమిషాల సమయాన్ని సమాధానాలను గుర్తించడానికి కేటాయించారు. ప్రతి సెక్షన్లో 30 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ప్రతి సెక్షన్‌కు కౌంట్‌డౌన్ టైమర్ నిబంధన ఉంటుంది. నిర్దిష్ట సెక్షన్‌కు కేటాయించిన సమయం పూర్తయితే సమాధానాలివ్వడం పూర్తి కాకున్నా మరో సెక్షన్‌కు వెళ్లాలి.
 
 స్పీడ్ బ్రేకర్లు:
 ప్రతి క్యాట్ పరీక్షలో కొన్ని ప్రశ్నలను స్పీడ్ బ్రేకర్లుగా వ్యవహరిస్తారు. వీటిని సాధించడానికి ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుంది. దీంతో  ఏకాగ్రత కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ప్రశ్నలను మొదట గుర్తించాలి. ఈ తరహా ప్రశ్నలు ఎక్కువగా అనలిటికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ విభాగాల్లో కనిపిస్తాయి. ఈ తరహా ప్రశ్నల సాధనలో పెద్ద అంకెలను గుణకారం లేదా భాగహారం చేయాల్సి వస్తుంది. సుదీర్ఘ కాలిక్యులేషన్స్  అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో జవాబు ఒక్కోసారి పాయింట్ (డెసిమల్ పాయింట్) రూపంలో కూడా రావచ్చు. ఇచ్చిన ఆప్షన్లన్నీ  పాయింట్ తర్వాత ఉండే సంఖ్య మినహా ఒకే రకంగా ఉంటాయి. ఈనేపథ్యంలో సమాధానాన్ని గుర్తించే తొందరలో తప్పు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ప్రశ్నలను మార్క్ చేసుకొని తర్వాత ప్రయత్నించడం మంచిది.
 
 గెస్ వర్క్:
 గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రతి సమస్యకు కాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదన్న విషయం స్పష్టమవుతుంది. ఉదాహరణకు గ్రాఫ్ తరహా ప్రశ్నను తీసుకుంటే.. గ్రాఫ్‌ను ఒక్కసారి పరిశీలించడం ద్వారా సమాధానాన్ని గుర్తించవచ్చు. ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా సుదీర్ఘ కాలిక్యులేషన్ అవసరమా లేదా అనే అంశంపై స్పష్టత వస్తుంది. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ఒక్కోసారి  గెస్ వర్క్ కూడా పనికి వస్తుంది. ఈ విషయాన్ని గమనించాలి. దీని ద్వారా సమయం కూడా కలిసొస్తుంది.
 
 మొదటి దశ ఇలా:
 క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ విభాగంలో మెరుగైన స్కోర్ చేయాలంటే వేగం, కచ్చితత్వమే కీలక సాధనాలు.  ఈ విభాగాన్ని ముందుగా డేటా ఇంటర్‌ప్రిటేషన్‌తో ప్రారంభించడం మంచిది. ఎందుకంటే స్కోరింగ్‌కు అవకాశం ఉన్న విభాగం. కాబట్టి దీన్ని సాధించడానికి చివరి వరకు వేచి చూడడం సహేతుకం కాదు. ఈ విభాగాన్ని సాధించడానికి 20-25 నిమిషాల సమయం సరిపోతుంది. తర్వాత క్వాంటిటేటీవ్ ఎబిలిటీ విభాగంపై దృష్టి సారించండి. ఈ విభాగంలో ముందుగా ఒకే తరహాలో ఉండే ప్రశ్నలను (కేస్‌లెట్స్)ను మొదట సాధించడానికి ప్రయత్నించాలి.

 

ఒక కేస్‌లెట్‌ను అవగాహన చేసుకోవడానికి నాలుగు నిమిషాలకు మించి సమయాన్ని కేటాయించవద్దు. నాలుగు నిమిషాల్లో ఎటువంటి అవగాహన రాకుంటే ఆ ప్రశ్నను వదిలి వేయడం ఉత్తమం. అంతేకాకుండా నెగిటివ్ మార్కింగ్ కారణంగా ఈ విభాగానికి సంబంధించి గెస్ వర్క్‌కు దూరంగా ఉండడమే మంచిది. క్వాంటిటేటివ్ ఎబిలిటీలో కొన్ని ప్రశ్నలను వాటికి ఇచ్చి ఆప్షన్ల ఆధారంగా సాధించాల్సి వస్తుంది. సమయ స్ఫూర్తి, తార్కిక వివేచనతో మిగిలిన ఆప్షన్లను స్కిప్ చేస్తూ సమాధానాన్ని కనుక్కోవాలి. ఈ విభాగం కోసం కేటాయించిన 70 నిమిషాల సమయాన్ని 35, 30 నిమిషాలుగా విభజించుకోవాలి.

 

మొదటి 35 నిమిషాలను సులువైన ప్రశ్నలను సాధించేందుకు కేటాయించాలి. అంటే ఒకటి నుంచి ఒకటిన్నర నిమిషం పట్టే ప్రశ్నలు. ఈ దశలో సమాధానం కోసం ఒకటిన్నర నిమిషం కంటే ఎక్కువ సమయం కేటాయించవద్దు. ప్రశ్నను చదవడానికి 30 సెకన్ల సమయం వెచ్చించాలి. రెండో దశ 30 నిమిషాల్లో  క్లిష్టంగా భావించి వదిలివేసిన ప్రశ్నలు సాధించండి. ఈ సందర్భంలో ప్రతి ప్రశ్నకు రెండు నుంచి రెండున్నర నిమిషాల సమయం కేటాయించవచ్చు.  ఈ విభాగంలో ప్రతి 10 ప్రశ్నల్లో కనీసం ఎనిమిది ప్రశ్నలను 90 శాతం కచ్చితత్వంతో సాధించడానికి ప్రయత్నించాలి.
 
 లాజికల్‌తో:
 వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ విభాగం అభ్యర్థిలోని తార్కిక సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించింది. లాజికల్ రీజనింగ్‌తో ఈ విభాగాన్ని ప్రారంభించడం మంచిది.  ఇందులో ముందుగా బాగా తెలిసిన ప్రశ్నలకు సమాధానం గుర్తించడం మంచిది.  రీడింగ్ కాంప్రెహెన్షన్‌లో ప్రశ్నల అవగాహనకు  ఐదు నిమిషాలు వెచ్చించాలి. లాజికల్ రీజనింగ్‌లో కూడా ఇదే తరహా వ్యూహాన్ని అనుసరించాలి. ప్రశ్నను అవగాహన చేసుకోవడంలో ఐదు నిమిషాలకు మించి ఎక్కువ సమయం పడితే దాన్ని విడిచి వేరే ప్రశ్నపై దృష్టి సారించాలి.

రీడింగ్ కాంప్రెహెన్షన్ లేదా డేటా ఇంటర్‌ప్రిటేషన్ విభాగంలోని ప్రశ్నలకు ఎనిమిది నిమిషాలకు మించి సమయాన్ని కేటాయించకపోవడం మంచిది. ఈ విభాగానికి కేటాయించిన  70 నిమిషాల సమయాన్ని మూడు భాగాలుగా విభజించుకోవాలి. ఈ క్రమంలో వెర్బ ల్ ఎబిలిటీకి 20 నిమిషాలు, రీడింగ్ కాంప్రెహెన్షన్‌కు 30 నిమిషాలు, లాజికల్ రీజనింగ్‌కు 15 నిమిషాల సమయం కేటాయించాలి. ఈ విభాగానికి సంబంధించి ముఖ్యంగా గ్రామర్ అంశాల్లో ఎటువంటి గెస్ వర్క్‌ను ఎంచుకోకపోవడమే ఉత్తమం. ఈ విభాగంలో ప్రతి 10 ప్రశ్నల్లో కనీసం ఏడు సరైనవిగా ఉండే విధంగా చూసుకోవాలి.
 
 టైమ్ మేనేజ్‌మెంట్:
 ప్రతి విభాగానికి 70 నిమిషాల చొప్పున మొత్తం 140 నిమిషాల సమయాన్ని సమాధానాలను గుర్తించడానికి కేటాయించారు. ప్రతి సెక్షన్లో 30 ప్రశ్నలకు సమాధానం రాయాలి. మధ్యలో 15 నిమిషాలు ట్యుటోరియల్ ఉంటుంది. ప్రతి విభాగంలో సమాధానాలను గుర్తించడానికి 60 నిమిషాలు కేటాయించాలి. 10 నిమిషాలు సమయాన్ని బాఫర్‌గా వినియోగించుకోవాలి. 

 

ఎందుకంటే ప్రారంభంలో ప్రశ్నలను చదవడానికి, అవగాహన చేసుకోవడానికి ఈ సమయం సరిపోతుంది. రివ్యూ సిస్టమ్ ద్వారా సెక్షనల్ కటాఫ్ సాధించేందుకు అవసరమైన ప్రశ్నలను సాధించామా? లేదా? అనే అంశాన్ని కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఎన్ని ప్రశ్నలు సాధించాం? ఎన్ని మిగిలి ఉన్నాయి? అనే అంశంపై కూడా అవగాహన పొందొచ్చు. మార్కింగ్ ఆప్షన్ ఉపయోగించి తర్వాత సాధించాలనుకున్న ప్రశ్నలను మార్క్ చేసుకోవచ్చు.
 
 సిట్టర్స్:
 ప్రతి విభాగంలో కొన్ని సులువైన ప్రశ్నలు, నేరుగా (డెరైక్ట్) ఇచ్చిన ప్రశ్నలు ఉంటాయి (వీటిని సిట్టర్స్‌గా వ్యవహరిస్తారు). ముందుగా సిట్టర్స్‌ను గుర్తించే ప్రయత్నం చేయాలి. తద్వారా ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. చాలా మంది విద్యార్థులు ప్రశ్నలను ఇచ్చిన క్రమంలోనే సాధించడానికి ప్రయత్నిస్తుంటారు. అది సరికాదు. తక్కువ సమయం ద్వారా సాధించే సిట్టర్స్ తరహా ప్రశ్నలకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక దానితో ఒకటి ముడిపడి ఉండే లింక్డ్ ప్రశ్నలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి వీటికి తర్వాతి ప్రాధాన్యం ఇవ్వాలి.


 కీలకం:
 క్యాట్ విజయంలో ప్రిపరేషన్‌తోపాటు రెండు అంశాలు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. అవి.. ప్రశ్నల ఎంపిక, కచ్చితమైన సమాధానాలు ఇవ్వడం. ప్రశ్నల ఎంపికలో.. మొదట ప్రతి విభాగంలోని సులభమైన ప్రశ్నలను సాధించాలి. తర్వాత సమయాన్ని పరిగణనలోకి తీసుకుని క్లిష్టమైన ప్రశ్నలను ఎంచుకోవాలి. ‘సులభమైన ఏ ప్రశ్నను వదిలి వేయకూడదు, అన్ని ప్రశ్నలను క్షుణ్నంగా చదవాలి’ అనే మౌలిక సూత్రాన్ని క్యాట్‌లో విధిగా పాటించాలి.

 

ప్రశ్నల ఎంపికలో మరో కీల కాంశం.. ప్రశ్నలను చదివేటప్పుడే.. వాటిపై ఒక అంచనాకు రావడం. ఎందుకంటే ఒకే ప్రశ్నను ఒకసారి చదివి తిరిగి మరోసారి చదవడం వల్ల.. పునరుక్తితోపాటు సమయం వృథా అవుతుంది. అంతేకాకుండా మొదటిసారి చదివినప్పుడు సదరు ప్రశ్నపై ఉండే స్పష్టత రెండోసారి ఉండకపోవచ్చు.  ప్రశ్నల ఎంపిక విషయంలో డేటాఇంటర్‌ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్ విభాగంలో ఎటువంటి తార్కికత ఉండదు.  వాటిని చదివి సాల్వ్ చేసుకుంటూ పోవాల్సిందే.

 

క్వాంటిటేటివ్ ఎబిలిటీ, వెర్బల్ ఎబిలిటీలలో మాత్రం ప్రశ్నల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వీటిలో ప్రశ్నలను చదువుతున్నప్పుడే వాటిపై ఒక అవగాహన వస్తుంది. కాబట్టి  ప్రశ్నను చదివినప్పుడే సమాధానం గుర్తించగలమా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. సమాధానం తెలియని ప్రశ్నలు వదిలివేయడం ఉత్తమం. ఎందుకంటే జేఈఈ ఇతర పరీక్షల కంటే భిన్నమైన నెగిటివ్ మార్కింగ్ విధానాన్ని క్యాట్‌లో అనుసరిస్తారు. దాంతో మీరు నష్టపోవడమే కాకుండా ఇతరులు లాభం పొందుతారు.
 
 ట్యుటోరియల్:
 పరీక్ష ప్రారంభానికి ముందు.. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సమయంలో ఎలా వ్యవహరించాలి అనే విషయంలో అభ్యర్థులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో సూచనలు, సలహాలతో కూడిన 15 నిమిషాల ట్యుటోరియల్ అందుబాటులో ఉంటుంది. ఈ విభాగాన్ని త్వరితగతిన ముగించే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఎన్ని మాక్ టెస్ట్‌లు రాసినప్పటికీ.. రియల్ టైమ్‌లో పరీక్ష నిర్వహణ విధానంపై అవగాహన ఏర్పర్చుకోవడానికి ఈ ఒక్క అంశమే ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విభాగాన్ని నిర్లక్ష్యం చేయకుండా తగినంత ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. మొదటిసారి క్యాట్‌కు హాజరవుతున్న వారు ఈ అంశాన్ని గమనించాలి. ప్రతి సెక్షన్‌కు మధ్య మూడు నిమిషాల విరామం ఉంటుంది. దీన్ని రిలాక్స్ కావడానికి ఉపయోగించుకోవాలి.
 
 ఒత్తిడికి దూరంగా
 పరీక్షకు ముందు రోజు మంచి ఆహారం తీసుకుంటూ, చక్క ని నిద్రతో ప్రశాంతంగా గడపండి. చదవడం, మాక్ టెస్ట్‌లు రాయడం వంటి అంశాలకు దూరంగా ఉండడం మంచిది. దాంతో ఎటువంటి ఒత్తిడి లేకుండా పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు  బాగా నేర్చుకున్న అంశాలనే కొన్ని సూచనలు పాటిస్తూ పరీక్షలో సాధించాలి. పరీక్ష రాసేటప్పుడు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత చిత్తంతో సమాధానాలు గుర్తించడంపై దృష్టి సారించాలి. దీన్ని కూడా ఒక మాక్ టెస్ట్‌గానే పరిగణించాలి.
 
 ఓపెన్ మైండ్:
 పరీక్షకు ఓపెన్ మైండ్‌తో హాజరు కావాలి. ప్రశ్నలను వేగంగా చదివి అవగాహన చేసుకోవాలి. అన్నీ తెలిసిన అంశాలు వస్తాయనేకాకుండా తెలియని అంశాలు కూడా రావచ్చు అనే ఆలోచనా విధానంతో ఉండడం మంచిది. ముందుగా పరీక్షలో బాగా తెలిసిన విభాగం నుంచే సమాధానాలను గుర్తించడం ప్రారంభించాలి. క్లిష్టంగా భావించే విభాగానికి మధ్యలో సమయం కేటాయించాలి. అంతేకాకుండా పరీక్ష హాల్లో మీ చుట్టు పక్కల చూసే ప్రయత్నం చేయకండి. తద్వారా సమయం వృథాతోపాటు ఏకాగ్రత కూడా దెబ్బతినే అవకాశం ఉంది. పరీక్ష చాలా రోజులపాటు పలు సెషన్లుగా జరుగుతుంది. కాబట్టి ఒక సెషన్‌లో సులభమైన ప్రశ్నలు వస్తే మరో సెషన్‌లో కష్టమైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉండొచ్చు అనే వాదనలను పట్టించుకోవద్దు.
 
 
 మాక్ టెస్ట్‌గానే
 నిర్దేశించిన సమయం కంటే ముందుగానే పరీక్ష కేంద్రానికి వెళ్లే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ తదితర అంశాలకు ఎక్కువ సమయం వెచ్చించాల్సి ఉంటుంది. పరీక్షకు ముందు ఒక సమస్యను సాధించడం లేదా కొత్త కాన్సెప్ట్‌ను నేర్చుకోవడం వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. దీన్ని కూడా ఒక మాక్ టెస్ట్‌గానే భావించాలి. అదేవిధంగా ఇప్పటి వరకు పలు మాక్ టెస్ట్‌లు రాయడం ప్రశ్నల సాధనలో ఒక రకమైన పద్ధతి అలవడుతుంది.
 
 కాబట్టి దీనికి భిన్నంగా పరీక్షలో ప్రశ్నలను సాధించడానికి ప్రయత్నించకండి. ప్రతి ప్రశ్నను చదవడానికి ప్రయత్నించాలి. మెరుగైన స్కోర్ సాధనలో వేగం కీలకమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వేగం, కచ్చితత్వం ఆధారంగా సమాధానాలను గుర్తించే అంశంపై దృష్టి సారించండి. ప్రశ్నను పూర్తిగా చదవకుండా, ఆప్షన్లను చూడకుండా సమాధానాలను గుర్తించడం సరైన వ్యూహం కాదు. మానిటర్‌కు దగ్గరగా కాకుండా కొద్ది దూరంలో కూర్చోండి. ప్రతి సెక్షన్‌కు మధ్య మూడు నిమిషాల విరామం ఉంటుంది. దీన్ని రిలాక్స్ కావడానికి ఉపయోగించుకోవాలి. మొదటి విభాగంలో డేటా ఇంటర్‌ప్రిటేషన్, రెండో విభాగంలో లాజికల్ రీజనింగ్ పార్ట్‌తో ప్రారంభించడం మంచిది.  చాలా మంది అభ్యర్థులు కేటాయించిన సమయం కంటే ముందే పరీక్షను పూర్తి చేస్తారు. అందరూ రాసిన తర్వాతే బయటికి పంపిస్తారు. కాబట్టి పూర్తి సమయాన్ని వినియోగించుకోవడం మంచిది.
 -పల్లా రవితేజ, ఐఐఎం-కోల్‌కతా..
 
 తప్పనిసరి
 క్యాట్-2013 అడ్మిట్ కార్డు
 ఫోటో గుర్తింపు కార్డు (డ్రైవింగ్ లెసైన్స్/ పాస్‌పోర్ట్/ పాన్‌కార్డు/ ఓటర్ ఐడీ కార్డు/ కాలేజీ ఐడీ కార్డు-దీన్ని నిరూపించే విధంగా పేరున్న ఏటీఎం కార్డు/డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు/ ఆధార్ కార్డు/ ఎంప్లాయి
 ఐడెంటిఫికేషన్ కార్డు/ నోటరైజ్డ్ ఆఫిడవిట్)
 అడ్మిట్ కార్డు, ఫోటో గుర్తింపు కార్డు లేకుంటే పరీక్షకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.
 ఏవైనా కారణాలతో పేరు మార్పు చెందితే దాన్ని నిరూపించే పత్రాలను కూడా చూపించాలి.
 ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలు
 డీఏ అభ్యర్థులకు స్క్రైబ్ కోసం ప్రొమెట్రిక్ సెంటర్ నుంచి ఆథరైజ్డ్ లెటర్, స్క్రైబ్ ఫోటో గుర్తింపు కార్డు
 నిర్దేశించిన సమయం కంటే గంటన్నర ముందు పరీక్ష హాలుకు చేరుకోవడం ఉత్తమం. తద్వారా సెక్యూరిటీ చెక్, గుర్తింపు పత్రాల తనిఖీ వంటి అంశాల్లో సమయం కలిసొస్తుంది.
 వివరాలకు: http://cat2013.iimidr.ac.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement