పాదముద్రలను పరిశీలిస్తున్న అటవీ, పోలీసుశాఖ అధికారులు
సాక్షి, నల్గొండ: దామరచర్ల మండలం ఇర్కిగూడెంలోని కృష్ణా పరీవాహక ప్రాంతంలో చిరుత పులి పిల్లలవిగా భావిస్తున్న పాదముద్రలు కలకలం రేపాయి. స్థాని కులు ఫారెస్ట్, పోలీసు శాఖల అధికారులకు సమాచారం ఇవ్వడంతో శనివారం ఇర్కిగూడెం అటవీ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అద్దంకి– నార్కట్‌పల్లి రహదారి పక్కన కృష్ణానది సమీపంలో రెండు చిరుతపులి పిల్లలు తిరుగుతున్నాయని కొందరు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
దీంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, పోలీసు అధికారులు పరిసర ప్రాంతాలను గాలించారు. పాదముద్రలను పరిశీలించి ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అవి చిరుత పిల్లలు కావని అడవి పిల్లికి చెందిన పాదముద్రలుగా ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. రాత్రి వేళ అటవీ సిబ్బందిని నిఘా ఉంచామని, అవి పులి పిల్లలా, అడవిపిల్లులా అనేది నిర్ధారణ అవుతుందన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఓ ఆనంద్‌రెడ్డి, మిర్యాలగూడ సీఐ సత్యనారాయణ, వాడపల్లి ఎస్‌ఐ రవికుమార్, బీట్ ఆఫీసర్ ముఖేష్, బీట్ ఆఫీసర్లు ప్రవీణ్‌కుమార్, ఆజం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment