75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే! | Chalapathi Sarikonda Write on Present Situation in India | Sakshi
Sakshi News home page

75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!

Published Tue, Aug 23 2022 12:55 PM | Last Updated on Tue, Aug 23 2022 12:55 PM

Chalapathi Sarikonda Write on Present Situation in India - Sakshi

ఇంద్ర మేఘ్వాల్‌పై దాడిని నిరసిస్తూ లోయర్‌ ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆందోళన చేస్తున్న దృశ్యం (ఫైల్‌)

జెండా పండుగ అయిపోయింది.. 
ఇక ఆ రంగు లైట్లు ఆర్పేసి ఇటు రండి.. 
తొమ్మిదేళ్ల దళిత విద్యార్థి ఇంద్రా మేఘ్వాల్‌ చిత్రపటం వద్ద పెట్టిన కొవ్వొత్తుల వెలుగులో...  చీకట్లు చూద్దాం. ఒక గ్లాసుడు నీళ్లు.. పోయిన చిన్న ప్రాణం. అగ్రవర్ణం దాహార్తికి చిన్నబోయిన త్రివర్ణాలు కనిపిస్తాయి. ఇది ‘..అనుకోని సంఘ టన’ అని సర్దిచెప్పుకునే లోపే.. ‘కాదు.. అనునిత్యమే’ అన్నమాట రీసౌండ్‌లా ‘జనగణమన’కన్నా ఎక్కువ శబ్దంతో మన చెవుల్లో మారుమోగుతుంది.     
– ఇదీ సామాజిక భారతం 

రోడ్లపై వేలాది జెండాల ప్రదర్శనలు, వాట్సాప్‌ డీపీలు, ధగధగా మెరిసే కాంతుల అలంకరణలు, గొప్పగా సంబురాలు.. వీటన్నిటి మధ్య బిల్కిస్‌ బానో సామూహిక అత్యాచార దోషులకు స్వాతంత్య్ర దినోత్సవం ఇచ్చిన స్వేచ్ఛా వాయువులు. వారి మెడలో పూలదండలు, పంచుకున్న మిఠాయిలు.. అమృతోత్సవాలను చేదెక్కించ లేదూ!     
– ఇదీ రాజకీయ భారతం 

‘కలకత్తా ఫుట్‌పాత్‌లపై  
ఎందరో గాలివానల్లో తడుస్తున్నారు  
వాళ్లను అడగండి పదిహేను ఆగస్టు 
గురించి ఏమంటారో..’ 
.. 1947లో స్వాతంత్య్రం వచ్చిన రోజున మాజీ ప్రధాని వాజ్‌పేయి రాసుకున్న కవిత ఇది.. 
ఉత్సవాలు జరిగిన మరునాడే (ఆగస్టు 16న) వాజ్‌పేయి వర్ధంతి జరిపినవారిలో ఎవరైనా.. ఆయన గుర్తుగానైనా.. ఫుట్‌పాత్‌లపై ఉన్న వారిని అడిగి ఉంటారా ‘..ఆగస్టు 15 గురించి ఏమంటారూ’ అని.. 
–    వృద్ధిరేటు 75 ఏళ్లుగా పెరిగీ పెరిగీ హైరైజ్‌  భవనాల్లో చిక్కుకునిపోయిందని, అక్కడి నుంచి ఫుట్‌పాత్‌ దాకా రాలేదని  తెలిసేది కదా! 
– ఇదీ ఆర్థిక భారతం 

‘..దేశభక్తి, అఖండత అని ఒకటే అంటున్నారు.. 
మేం దేశభక్తి ఎలా చాటుకోవాలి? 
మా ఇంటిపై జెండా ఎగురవేసే కదా..?  
మరి జెండా ఎగురవేయడానికి మాకు ఇల్లు ఏది?..’ 
..ఇది ఏ సామాన్యుడో అన్నది కాదు.. గరీబోళ్ల సీఎం టంగుటూరి అంజయ్య 1970లో అన్నమాట! 
మరి ‘ఇంటింటికీ జెండా పండుగ’.. అంటూ జెండాలు పంచిన నాయకులకు ఈ ప్రశ్న ఏమైనా ఎదురై ఉంటుందా.. బధిర శంఖారావంలా!  
– ఇదీ నేటి జన భారతం 

హుందాతనం, ఆత్మగౌరవం, సమన్యాయం..
చైతన్యం, సమున్నత మానవ విలువలు, సామాజిక న్యాయం, లౌకిక భావన, సౌభ్రాతృత్వం.. ఆదా యాల్లో,  అంతస్థుల్లో, అవకాశాల్లో,  సౌకర్యాల్లో.. సమానత్వం తెచ్చుకుందాం అని 75 ఏళ్ల  క్రితం రాసుకున్న రాతలు రాజ్యాంగం పుస్తకాన్ని దాటి బయటికి రానట్టున్నాయ్‌.. 
– ఇదీ గణతంత్ర  భారతం 
... వీటన్నింటినీ అంబేద్కర్‌కు వదిలేసి మన నేతలు ఏం చేస్తున్నారో చూడండి. 

► గాంధీ, గాడ్సేల ఎత్తును భారతీయత స్కేలుతో కొలిచి.. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువని తేల్చు కునే పనిలో తీరిక లేకుండా మునిగిపోయారు. 

► ఇన్నేళ్లూ నెహ్రూ, గాంధీల పాలనలోనే భారతావని నడిచినా.. ఇప్పుడు క్విట్‌ ఇండియా స్ఫూర్తిగా దేశాన్ని ఏకం చేస్తామంటూ అదే 
గాంధీలు కొత్తగా ‘జోడో యాత్రలు’ చేస్తున్నారు.

► గాంధీ, నెహ్రూలపై విద్వేషం చిమ్ముతూ కొందరు.. నెహ్రూ కూడళ్లలో జనగణమన పాడుతూ గాంధీకి వెకిలి మకిలి పూస్తే జాగ్రత అని హెచ్చరిస్తూ మరికొందరు.. 75 ఏళ్ల తర్వాత కూడా అవే పేర్లు, అదే స్మరణ, అదే రాజకీయం..

► 75 ఏళ్ల క్రితం గీసిన విభజన రేఖలు.. ఇప్పుడా దూరాన్ని మరింత పెంచాయి. రెండు వర్గాల మధ్య అపనమ్మకాన్ని, అగాధాన్ని ఎగదోస్తూ.. ‘లౌకికం’ అన్న మాటను ఫక్తు రాజకీయం చేశాయి. మన మట్టి మీదే పుట్టి పెరిగినా.. త్రివర్ణ పతాకం చేతపట్టి మేమూ భారతీయులమే అని చెప్పుకోవాల్సిన దుఃస్థితికి తెచ్చాయి.

► దేశ విభజన నాటి హింసాకాండ, విధ్వంసాలు వాట్సాప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. మానిపోతున్న గాయాలను కెలుకుతూ విభే దాలకు ఆజ్యం పోస్తూనే ఉన్నాయి. నాటి దాష్టీకాన్ని నేటికీ అంటగడుతూ.. విచ్ఛిన్నకర శక్తులంటూ పాత కాలపు చర్చను లేవదీస్తూనే ఉన్నాయి. 
.. ఇదీ 75 ఏళ్ల భారతం.. స్వేచ్ఛ వచ్చిందనుకున్న తొలిరోజున ఉన్నకాడే.. ఇప్పటికీ ఉన్నామని చెప్పకనే చెబుతున్న తీరు.. 
 
ఇది స్వప్నం.. 
స్వాతంత్య్రోత్సవాల సందర్భంగా సోషల్‌ మీడియాలో యువతతో నడిచిన ఓ చిట్‌ఛాట్‌ ఇది. 
‘..నేను పుణెలో చదివా, నాలుగేళ్లు బెంగళూరులో, ఇప్పుడు తిరువనంతపురంలో ఉద్యోగం. రేపు ఎక్కడికి వెళ్తానో తెలియదు. నన్ను ఏ ప్రాంతం వాడని అడక్కండి..’ 
‘..ఇదిగో వీడు అబ్దుల్లా.. అమెరికా నుంచి ఈమధ్యే దిగుమతి అయ్యాడు, ఢిల్లీ వాడే అనుకోండి. ఈ అమ్మాయి సారిక, వీడి  ఫియాన్సీ. వాళ్లు రాజు, అభిషేక్, శ్రవణ్‌.. మేమంతా హాస్టల్‌ మేట్స్‌.. మమ్మల్ని ఏ కులం, ఏ మతం అని ప్రశ్నించకండి. అవన్నీ పాలిటిక్స్‌ కోసమే.. మేం భారతీయులం..’ 
... కెరీర్‌ గోలలో కొట్టుకుపోతూ దేశం గురించి పట్టించుకోవడం లేదని యువతపై వేస్తున్న అపవాదు నిజం కాదనిపిస్తోంది. వీరిని చూస్తుంటే.. కులం, ప్రాంతం, మతం హద్దులు చెరిపేసుకుని.. అన్ని వర్ణాలనూ త్రివర్ణంలో కలుపుకొని పోతారనే ఆశలు ఇంకా  మిణుకుమిణుకుమంటున్నాయి.


ఇది నిజం..
.
అట్టడుగు వర్గాలను అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టి ఆనందపడ్డా, వారి పరిస్థితి ఉన్నకాడే ఉన్నదనడానికి ఇదొక్క ‘చిత్రం’ చాలదా!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement