Sarikonda Chalapathi
-
పిడుగులున్నారు... హై‘టేక్ కేర్’..!
సోషల్ మీడియాలో తిరుగుతోన్న ఓ జోక్ చూడండి. ఏడేళ్ల పిల్లాడు ఫొటో దిగడానికి వాళ్ల నాన్నతో కలిసి స్టూడియోకి వెళ్లాడు. పిల్లాడు కుదురుగా కూచుంటాడో లేదోనని కంగారు పడుతున్న వాళ్ల నాన్నని చూసి ఫొటోగ్రాఫర్ ‘‘మై హు“ నా.. ’’ అన్నట్టు కళ్లతో సైగ చేస్తూ.. చిరునవ్వుతో పిల్లాడితో ఇలా అన్నాడు.‘‘ఇటు చూడమ్మా.. కెమెరానే చూడాలి.. ఫ్లాష్ వస్తుంది.. కళ్లు మూయకూడదు. ఇలా అలా కదలకూడదు. చూడు కెమెరాలోంచి పిట్టలొస్తాయి....’’ తన చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెడుతూ ఏడేళ్ల్ల పిల్లాడి జవాబు ఇది.. ‘‘ఏం కతలు పడుతున్నావా.. సరిగా ఫోకస్ చెయ్యి..పోట్రెయిట్ మోడ్ యూస్ చెయ్యి. ఐఎస్ఓ 200 కంటే తక్కువ పెట్టు. హై రెజల్యూషన్ పిక్ కావాలి. ఫేస్బుక్ ప్రొఫైల్ కోసం. ముచ్చట్లాపి సరిగ్గా తియ్యి.. పిచ్చుకలెలా వస్తాయి కెమెరాలోంచి ఏం మీ అయ్యగూడు పెట్టిండా కెమెరాలోపల...’’– ఫొటోగ్రాఫర్ ఫేస్ ఫీలింగ్స్... పిల్లాడి నాన్న కళ్లలో భయం సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదుగా... పిల్లలు పిడుగులవుతున్నారు.. నిన్నటి చందమామ కథలు ఇకవారి దగ్గర నడవవు.సమస్త ప్రపంచం, టెక్నాలజీ వారి చేతిలోకి వచ్చింది.ఇలాంటి దృశ్యాలు ఇప్పుడు మామూలే.. ఓ చిన్నారి.. ఏవో చిన్నచిన్న వస్తువులతో రోబో వంటి ఆకృతిని తయారు చేసింది. సముద్రాలెన్ని, ఖండాలెన్ని, వాటి పేర్లేమిటన్న పాఠాలనూ అప్పజెప్తోంది. మరో చిన్నారి ఉన్నట్టుండి చక్కగా బొమ్మలు వేయడం మొదలుపెట్టేసింది. ఇంకో చిన్నారి పేపర్‌ను మడిచి విభిన్న ఆకృతులను (ఒరిగామి) తయారు చేస్తోంది. ఇవేవీ బడిలో చెప్పినవి కాదు. తల్లిదండ్రులు నేర్పినవీ కాదు.. మరెక్కడివి? యూట్యూబ్‌లో ఎడ్యుకేషన్ వీడియోలు చూశారు. తామూ సొంతంగా ఏదో చేయాలనుకున్నారు. అంతే.. ఇలాంటి చిన్నారులెందరో ‘టెక్నాలజీ’ గురువుకు ఏకలవ్య శిష్యులు. రోజూ మూడు గంటలు సోషల్ మీడియాలో... గత ఏడాది మన దేశంలో పిల్లల సోషల్ మీడియా అలవాట్లపై సర్వే జరిగింది. అందులో 9 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో 60 శాతం మంది రోజూ 3 గంటలకుపైనే సోషల్ మీడియాలో గడుపుతున్నట్టు తేలింది. ► 13–17 ఏళ్ల మధ్య టీనేజర్లలో 95 శాతం 8–12 మధ్య పిల్లల్లో 40 శాతం మంది సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. ► పిల్లల్లో 15 శాతం మంది రోజూ 6 గంటలకుపైగా ఫోన్ తో గడిపితే.. 46 శాతం మంది మూడు నుంచి ఆరు గంటల వరకు వాడుతున్నారు. మరో 39 శాతం మంది గంట నుంచి 3 గంటల వరకు వినియోగిస్తున్నారు. ► 18 ఏళ్లలోపువారు ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాల వినియోగించాలంటే తల్లిదండ్రుల అనుమతిని తప్పనిసరి చేయాలని 73 శాతం తల్లిదండ్రులు సర్వేలో పేర్కొనడం గమనార్హం. టెక్... కిక్... ప్రముఖ ప్యూ రీసెర్చ్ సంస్థ చేసిన ఓ అధ్యయనం ప్రకారం.. టీనేజ్ పిల్లలు తాము సాధించిన విజయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. 49 శాతం మంది తాము సాధించినది చెప్పుకొంటుంటే.. 44 శాతం మంది కుటుంబానికి సంబంధించిన పోస్టులు..విహార యాత్రలు, సంబరాలు, ఫంక్షన్లు వంటివి చేస్తున్నారు. ► 34 శాతం మంది తమ ఎమోషన్లను సోషల్‌మీడియాలో పంచుకుంటుంటే.. అందులో పర్సన ల్ విషయాలనూ ప్రస్తావిస్తున్నవారు 13 శాతం ఉన్నారు. ► మతపరమైన అంశాలపై 11 శాతం, రాజకీయ అంశాలపై 9 శాతం టీనేజర్లు పోస్టులు పెడుతున్నారు. ఇక ఎడ్యుకేషన్, సోషల్, ఎంటర్టెయిన్మెంట్ వంటి ఇతర అంశాలపై 28 శాతం మంది పోస్టులు పెడుతున్నారు. డిజిటల్ ఏజ్ తగ్గుతోంది... ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు అధ్యయనాల ప్రకారం.. పిల్లల చేతికి ‘టెక్’ అందుతున్న వయసు క్రమంగా తగ్గుతూ వస్తోంది. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లు, ఇతర ఇంటర్నెట్ ఆధారిత పరికరాల విస్తృతే దీనికి కారణం. ఆడుతూ, పాడుతూ నేర్చుకునే క్రమంలో.. ఇటు ఇళ్లలో, అటు స్కూళ్లలో కూడా డిజిటల్ పరికరాల వినియోగం బాగా పెరిగింది. నడక నేర్చుకునే కంటే ముందే.. ‘ఫోన్ ’ను ఆపరేట్ చేయడం, గేమ్స్ ఆడటం నేర్చుకుంటున్న పరిస్థితి ఉంది. కరోనా లాగా స్పీడ్‌గా... కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఏడాదికిపైగా లాక్డౌన్లు పెట్టాయి. పెద్దవాళ్లకు కాస్త వెసులుబాటు ఇచ్చినా.. పిల్లల బడులైతే ఏడాదిన్నర పాటు నడవలేదు. ఇంట్లోంచి బయటికి వెళ్లలేని పరిస్థితి. కానీ టెక్నాలజీ పుణ్యమా అని ఏదీ ఆగలేదు. ఆన్ లైన్ క్లాసులతో పిల్లల చదువులు భేషుగ్గా సాగాయి. సరికొత్త బోధన దిశగా అడుగులు పడ్డాయి. అదే సమయంలో పిల్లలు తోటివారితో వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుకోవడం, చాటింగ్ చేయడం ద్వారా ఒంటరితనాన్ని అధిగమించగలిగారు... అక్కడ నుంచి సోషల్ మీడియా వేగంగా అంటుకుంది. నిపుణుల అబ్జర్వేషన్ ఇదీ.. ► టెక్నాలజీ చిన్నారులు కొత్త విషయాలను నేర్చుకునేందుకు అద్భుత అవకాశాలను ఇస్తోంది. ఎడ్యుకేషన్ యాప్స్, వీడియోలు, ఇంటరాక్టివ్ గేమ్స్ వంటివి కొత్త, కఠినమైన అంశాలను కూడా అరటిపండు ఒలిచి నోటికి అందించినట్టుగా అతి సులువుగా, సొంతంగా నేర్చుకోగలిగిన సామర్థ్యాన్ని ఇస్తున్నాయి. ► విస్తృతమైన సమాచారం అందుబాటులో ఉండటంతో పిల్లల్లో విజ్ఞానాన్ని పెంచుతోంది. ఏదైనా ఓ అంశానికి సంబంధించిన కొత్త కొత్త సంగతులను శోధించి తెలుసుకునే అవకాశాలు ఉంటున్నాయి. ► టెక్నాలజీ పిల్లల్లో చిన్ననాటి నుంచే సృజనాత్మకతకు పదును పెడుతోంది. కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోయగలిగే సామర్థ్యాన్ని ఇస్తోంది. ► సొంతంగా కంటెంట్‌ను రూపొందించి ప్రపంచవ్యాప్తంగా ఎవరితోనైనా పంచుకోగలగడంతో పిల్లల్లో వినూత్న ఆలోచనలకు, ఆత్మవిశ్వాసం పెరగడానికి తోడ్పడుతోంది. ► పజిల్స్‌ను పరిష్కరించడం, ఎడ్యుకేషన్ సంబంధిత గేమ్స్ ఆడటం ద్వారా.. సమస్యలను పరిష్కరించే నైపుణ్యం అలవడుతోంది. ఏదైనా సమస్యకు కొత్త తరహాలో, సులువైన పరిష్కారం కనుగొనే దిశలో ఏకాగ్రత పెంపొందుతోంది. ► ఇంటర్నెట్, సోషల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా విభిన్న నేపథ్యాలున్న పిల్లలను కలిసే అవకాశంతో సామాజిక సంబంధాలపై, భిన్నమైన ప్రాంతాల్లో పరిస్థితులపై అవగాహన ఏర్పడుతోంది. విభిన్న వ్యక్తులతో ఎలా వ్యవహరించాలి, ఎలా స్నేహం చేయాలనే సామర్థ్యం సమకూరుతోంది. వారి సూచన ఇదీ... ఇదే సమయంలో కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ వంటి పరికరాల అతి వినియోగం కాస్త చేటుకూ దారితీస్తోంది. పిల్లల శారీరక, మానసిక అంశాలపై ముఖ్యంగా భావోద్వేగాలపై ప్రభావం చూపుతోంది. చిన్నవయసులోనే టెక్నాలజీ వాడకంతో దుష్ప్రభావాలపైనా చాలా అధ్యయనాలు జరిగాయి. ఇబ్బందికరమైన, తప్పుడు సమాచారం, సైబర్ బుల్లీయింగ్ వంటివి పిల్లల మానసిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావం చూపుతున్న ఘటనలూ ఉన్నాయి. రూపాయికి బొమ్మా బొరుసు రెండూ ఉన్నట్టే.. టెక్నాలజీ వెంట మంచి, చెడు రెండూ వస్తున్నాయి. తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా ఉండగలిగితే చాలు. - సరికొండ చలపతి -
‘ఓల్డ్’ నాట్ గోల్డ్.. నడిసంద్రంలో ‘నౌక’రీ..!
ఫ్లయింగ్ కిస్ ఇది మనం మాట్లాడుకునే అంశానికి సంబంధించింది కాదు... అయినా ఓసారి! మన సమాజంలో యాభై దాటితే వృద్ధులు, అరవైదాటాక రిటైర్ కావల్సిన వారు అని అంటారు కానీ రాజకీయాలకు మాత్రం ఇదే అనువైన వయస్సు. యాభైకి దగ్గరవుతున్న యువనేతలు ఫ్లయింగ్ కిస్‌లు కూడా విసరొచ్చు. దానికి తగ్గ హుషారు వయస్సే అది. వైన్ గ్లాస్... మిడిల్ ఏజ్ బ్లూస్! ఇది కూడా మన టాపిక్కు కాసింత దూరమే అయినా మిడిల్ ఏజ్ కదా సరదాగా! ఓ 80 ఏళ్ల వృద్ధుడు జనరల్ చెకప్ కోసం డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. అతని ఆరోగ్యమూ, సరదా చూసి డాక్టర్ ఆశ్చర్యపోయాడు ఆ డాక్టర్ నడివయస్సులో ఉన్నాడు. కావల్సినంత బీఎమ్ఐ, ఉన్నంతలో మాంచి బీపీతో అప్పడప్పుడే ఆరోగ్యం అలారం మోగిస్తోంది. ‘మీ ఆరోగ్య రహస్యం ఏమిటి....?’ – వృద్ధుడిని ఆసక్తిగా డాక్టర్ అడిగాడు. ‘నేను సూర్యుడు ఉదయించక ముందే లేచి సైకిల్ తొక్కడానికి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి రెండు గ్లాసుల వైన్ తాగుతాను! బహుశా ఇదే నా ‘ఆరోగ్య రహస్యం.’ ‘సరే, అయితే మీ నాన్నగారు చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎంత?’ ‘నాన్న చనిపోయారని మీకు ఎవరు చెప్పారు?’ ‘మీకే 80 ఏళ్లు, మీ నాన్న ఇంకా బతికే ఉన్నారా ..ఇంతకీ అతని వయసు ఇప్పుడు ఎంత....? – ఆశ్చర్యంగా, ఆసక్తిగా డాక్టర్. ‘అతనికి 102 సంవత్సరాలు, ఈ ఉదయం నాతో సైకిల్ తొక్కాడు, ఆపై రెండు గ్లాసుల వైన్ తీసుకున్నాడు.’ ‘దీర్ఘాయువు మీ కుటుంబ జన్యువులలో ఉందని దీని అర్థం. ఇంతకీ మీ తాత చనిపోయినప్పుడు ఆయన వయస్సు ఎంత...?‘ ‘అరే ఇప్పుడు తాతయ్యను ఎందుకు చంపు తున్నారు...?’ ‘మీకు 80 ఏళ్లు, మీ తాత ఇంకా బతికే ఉన్నారా! అతని వయసు ఎంత...?’... డాక్టర్ అయోమయం. ‘అతని వయస్సు 123 సంవత్సరాలు.’ ‘అతను కూడా ఈ ఉదయం మీతో సైకిల్ తొక్కేసి వైన్ కూడా తీసుకుని ఉంటాడని అనుకుంటున్నా.....?’ డాక్టర్ అన్నాడు. లేదు, ‘తాత ఈ ఉదయం వెళ్లలేకపోయాడు! ఎందుకంటే అతను ఈ రోజు పెళ్లి చేసుకుంటున్నాడు... రెండేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. ఆమె గర్భవతి కూడా!’ అప్పటి నుంచి డాక్టర్ రోజూ సైకిల్ తొక్కుతూ వైన్ తాగుతున్నాడు. నడివయస్సును జయించే తాపత్రయం. నడి ‘సంద్రం’ ఇది మాత్రం అచ్చంగా మన టాపిక్కే! ఈఎమ్ఐలు, బీఎమ్ఐలు పీక్స్ కొచ్చే ఏజ్ ... అదే మిడిల్ ఏజ్. మిడిల్ క్లాస్ వాళ్లకు ఓ పరీక్షా సమయం. చచ్చీ చెడీ ఏ ముప్పై ఏళ్ల బార్డర్లోనో పెళ్లైతే.. నలభై, యాభై ఏళ్ల మధ్య వయస్సులో పిల్లల చదువులు ఖర్చు భారీగా ఉంటుంది. ఇంటి ఈఎమ్ఐల నుంచి ఇంకా విముక్తి లభించదు. కారుంటే... దానిæలోన్ తీరదు. ఓ పక్క పెరిగిన బీఎమ్ఐతో ఆరోగ్యం అలారం మోగిస్తుంటుంది. ఇంకా చదువు పూర్తవ్వని కొడుకు, పెళ్లికి ఎదిగిన కూతురు... కొలువు మెడపై వేలాడుతున్న కత్తి... పింక్ స్లిప్. వెరసి నడి వయస్సు... నడిసంద్రం. దీనికి తోడు కొలువుల పరిస్థితి మారుతోంది చూడండి...సీనియారిటీ సీన్ మిస్..అప్పుడే కాలేజీ పూర్తి చేసి వస్తే.. ఫ్రెషర్స్ ఉద్యోగాలు దొరకడం కష్టం. కాస్త అనుభవముంటే ఫుల్లు డిమాండ్. కొంచెం ప్రాధాన్యత.. అదే ఇంకొంత కాలం గడిచి మధ్య వయసుకు వచ్చేసరికి పరిస్థితి తిరగబడుతోంది. మెల్లగా ప్రాధాన్యత తగ్గిపోతోంది. ఇంకొన్నేళ్లు గడిస్తే ఉద్యోగంలో ఉంచడమా, ఏదో కారణంతో పంపించేయడమా అన్నట్టుగా మారిపోతోంది. ఉద్యోగుల వయసుపై వివక్ష కనిపిస్తోంది. ...కొన్నాళ్లుగా ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న ట్రెండ్ ఇది. ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త సాంకేతికతలను, సరికొత్త పనితీరును పాత ఉద్యోగులు సరిగా అందిపుచ్చుకోలేరనే భావనే దీనికి కారణం. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. కంపెనీలకు రెవె‘న్యూ’ పేస్కేల్ సంస్థ అధ్యయనం ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో పనిచేస్తున్నవారిలో మిలీనియల్స్ (1980–96 మధ్య పుట్టినవారు) 68% నుంచి 70% వరకు ఉంటే.. జనరేషన్ జెడ్ (1996–2010 మధ్య పుట్టినవారు) 18% నుంచి 20% వరకు ఉన్నారు. అగ్రశ్రేణి కంపెనీలైన ఫేస్బుక్, లింక్డ్ ఇన్ , స్పేస్ఎక్స్ సంస్థల్లో ఉద్యోగుల సగటు వయసు కేవలం 29 ఏళ్లే. ఐబీఎం, ఒరాకిల్, హెచ్‌పీ వంటి సంస్థల్లోనూ ఇది 33 ఏళ్లే. అంటే కొత్త జనరేషన్ కు కంపెనీలు ఇస్తున్న ప్రాధాన్యం ఏమిటో అర్థమవుతుంది. ఓల్డ్... నాట్ గోల్డ్! ఉద్యోగులపై ‘వయసు వివక్ష’ మన దేశంలోనూ పెరుగుతోంది. ఏఐఎం సంస్థ అధ్యయనం ప్రకారం.. మన దేశంలోని చాలావరకు ఐటీ కంపెనీల్లో 50 ఏళ్లు పైబడిన ఉద్యోగుల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. –ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీల్లో సగానికిపైగా ఉద్యోగులు 20 నుంచి 35 ఏళ్ల మధ్యవయసువారే. మరో 40 శాతం మంది 35 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్యవారు. 50 ఏళ్లు దాటినవారిసంఖ్య 10 శాతమే. – ఐబీఎంలో మాత్రం 20–35 ఏళ్ల మధ్యవారు 45 శాతం, 35–50 ఏళ్ల మధ్యవారు 30 శాతం ఉంటే... 50 ఏళ్లు దాటినవారు 25 శాతం ఉన్నారు. –ఇక ముందూ ఈ కంపెనీల్లో ‘యంగ్’ జనరేషన్‌ను పెంచే పని జరుగుతోంది. ఒక అంచనా ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో 1.57 లక్షల మంది ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకునేందుకు కంపెనీలు ఏర్పాట్లు చేసుకున్నాయి. 33 శాతం మందికి వివక్ష జాబ్బజ్ సంస్థ చేసిన సర్వే ప్రకారం...ఇండియాలో 33 శాతం మంది ఉద్యోగులు వయసుకు సంబంధించిన వివక్షను ఎదుర్కొంటున్నారు. మధ్యవయసు దాటినవారిని ఉద్యోగంలోకి తీసుకోకపోవడం, ప్రమోషన్లు, ఇతర ప్రయోజనాలు కల్పించకపోవడం, కొన్నిసార్లు రాజీనామా చేసేలా ఒత్తిడి చేయడం వంటివి జరుగుతున్నాయి. ‘‘కొన్ని దేశాల్లో ఇలాంటి వయసు వివక్షకు వ్యతిరేకంగా కఠినచట్టాలు ఉన్నాయి. మన దేశంలోనూ అలాంటివి రావాల్సి ఉంది..’’ ఓ విశ్లేషకుడి మాట. ఇటీవల ఓ కంపెనీ అమెరికాలో పనిచేస్తున్న 80 మంది ఉద్యోగులను ‘వయసు, సీనియర్లు’ కారణంతో భారత్‌లోని కార్యాలయాలకు బదిలీ చేయడం ‘వయసు వివక్ష’ అంశంపై చర్చను రేపింది. 2018 లోనూ ఇదే కంపెనీ 40 ఏళ్లు దాటిన 20 వేల మంది ఉద్యోగులను తొలగించడం వివాదాస్పదమైంది కూడా! ప్రతిష్ఠాత్మక గూగుల్ సంస్థ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడటంతో 227 మంది కోర్టులో కేసులు వేశారు. 2019లో వారికి సుమారు రూ. 90 కోట్లు పరిహారంగా ఇచ్చి కేసుల నుంచి బయటపడింది. కంపెనీలు ఖర్చు తగ్గించుకునే క్రమంలో ప్రధానంగా సీనియర్లపైనే వేటు వేస్తున్నాయి.తక్కువ వయసున్న వారు చురుగ్గా, ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకుని సమర్థంగా పనిచేస్తారన్న భావనే దీనికి కారణం. దీనితోపాటు సీనియర్లకు ఎక్కువ జీతాలు, అలవెన్సులు ఉండటం, పరిస్థితులకు అనుగుణంగా మారలేరనే ఆలోచన కూడా కారణం. ‘ఓల్డ్’ స్టాక్! ఇది కూడా మన స్టోరీకీ సంబంధించింది కాదు.. అయినా చదవొచ్చు.పూర్వకాలంలో సౌత్‌సీ దీవుల్లో వయస్సు మళ్లిన వారిని చెట్టు పైకి ఎక్కించేవారట. వారు ఎక్కిన తర్వాత బలమైన యువకులు ఆ చెట్టును ఊపేవారట. ఆ ఊపునకు కింద పడిపోకుండా నిలబడగలిగితే విడిచిపెట్టేవారట. నిలబడక పోయిన వారిని చంపివేసే వారట... అంతే! -సరికొండ చలపతి -
...అంతా కిల్‘బిల్’పాండేలే!
కాళిదాసు కవిత్వం కొంత, మన పైత్యం కొంత అన్న సామెత ఉంది. మనం చెప్పిన దానికి కాసింత కాళిదాసు లాంటి పెద్దవాళ్ల పేరు జోడించి వారి అకౌంట్లో వేయడం జరుగుతుంటుంది. తద్వారా చెప్పిన దానికి మరింత ప్రాచుర్యం వస్తుందని.. అలాంటిదే ఒకటి చూద్దాం.. అనగనగా ఆ కాలంలో ఓ ఆకతాయి యువకుడు ఉండేవాడు. ఆ ఆకతాయి వీధిలో వెళ్తున్న ఓ అమ్మాయిని చూసి రావే.. రావే అని కామెంట్ చేశాడు.. ఆ అమ్మాయికి ఒళ్లుమండి న్యాయాధికారికి ఫిర్యాదు చేసింది. ఇప్పటిలా ఎంపీ లకైనా సమన్లు జారీ చేసి ‘ముద్దు ముచ్చట్ల’కు జవాబు చెప్పండి అని ఆదేశించే మహిళా కమిషన్లు అప్పట్లో లేవు. ఎమ్మెల్యేలు వేధిస్తున్నారని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడానికి మీడియా కూడా లేదు. పైగా ధైర్యం ఉన్న ఇప్పటి ‘నవ్య’ తరం కూడా కాదు. ఆడియో, వీడియోలు షేర్ చెయ్యడానికి సోషల్ మీడియా కూడా లేదు. అప్పట్లో న్యాయాధికారి, ఆపై మహారాజు గారే యాక్షన్ తీసుకోవాలి. న్యాయాధికారి విషయాన్ని సీరియస్‌గానే తీసుకుని విచారణకు రమ్మని ఆకతాయిని ఆదేశించాడు. ఇది తెలిసిన ఆకతాయి తండ్రి కంగారు పడిపోయాడు. ఇంట్లోనే ఆకతాయికి దేహశుద్ధి చేశాడు. కానీ, రాజదండన నుంచి ఎలా తప్పించడమో పాలు పోలేదు. ఆయనకు తెలిసిన కవి ఒకరు రాజు గారి ఆస్థానంలో ఉన్నారు. కవి గారి దగ్గరికి వెళ్లి గోడు వెళ్లబోసుకున్నాడు. కవి సాంతం విని, కొడుకును దార్లో పెట్టుకుంటానని తండ్రి వద్ద గట్టిగా మాట తీసుకుని ఓ ఐడియా చెప్పాడు. ‘‘నేను ఓ శ్లోకం చెబుతా, న్యాయవిచారణ సమయంలో మీ కొడుకును చెప్పమను..’’ అంటూ, దానితో పాటు ముందుగా బాధితురాలైన అమ్మాయి ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పండి అని సలహా ఇచ్చాడు. తండ్రి ఆయన చెప్పినట్టుగా చేసి ఆకతాయితో శ్లోకం బట్టీ పట్టించాడు. న్యాయవిచారణ జరుగుతున్నపుడు.. ‘నేను రావే రావే అని ఊరికే అనలేదు, నేను అప్పుడు చదివిన శ్లోకంలో భాగమే అది..’ అని కవి చెప్పిన శ్లోకం చదివాడు. గేహే గేహే జంగమా హేమవల్లీ వల్లా్యం వల్లా్యం పారణశ్చంద్రబింబః బింబే బింబే కోకిలా మంజురావః రావే రావే జాయతే పంచబాణః (ప్రతి ఇంట్లోనూ ఒక కదిలే బంగారు తీగ ఉంది. ప్రతి తీగలోనూ ఒక పూర్ణ చంద్రబింబం ఉంది. ప్రతీ చంద్ర బింబంలోనూ ఒక కోకిల స్వరం ఉంది. ఆ ప్రతీ ధ్వనిలోనూ మన్మథుడు ఉన్నాడు.) ఈ శ్లోకం చదువుతుండగా ఆమెకు రావే రావే అని మాత్రమే వినిపించిందని వివరణ ఇచ్చాడు. అంతకు ముందే ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పిన కారణంగా ఆ అమ్మాయి కూడా మరింత రెట్టించ లేదు. ఇప్పటి ‘నవ్య ’తరంలాగా.. ‘‘మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే తాట తీస్తా, కిరోసిన్ పోసి నిప్పంటిస్తా...’’ అని ఘాటుగా హె చ్చరించలేదు గానీ బుద్ధిగా ఉండమని సూచించింది. కథ కంచికి వెళ్లింది. అందరూ ఇంటికి వెళ్లారు. ఈ శ్లోకం రాసిచ్చిన కవి ‘కాళిదాసే’ అని ప్రచారం. ఇది కాళిదాసు కవిత్వమా, ఎవరిదైనా పైత్యమా అన్న విషయం వదిలేస్తే.. ఆ కాలం నుంచీ అమ్మాయిలంటే చులకనగా చూసే ఆకతాయిలున్నారు, విచారణలున్నాయి, క్షమాపణలున్నాయి. ఇప్పటికీ పరిస్థితేం పెద్దగా మారలేదు. మెడికోలైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా.. ఎవరయినా అంతే. పైన చెప్పుకున్న దానికి.. కింద మనం మాట్లాడుకోబోయే విషయానికి క్లోజ్ రిలేషన్ ఉందా.. బాదరాయణ సంబంధమేనా..? మీరే తేల్చుకోండి. ఈ నెలలోనే మహిళా దినోత్సవం వచ్చింది. మళ్లీ మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రస్తావనా వచ్చింది. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో మహిళా సాధికారత కోసం ఢిల్లీలో దీక్ష...దీని వెనుక వేరే కారణాలున్నాయని విమర్శలున్నాయనుకోండి. కాసింత చర్చయితే అయ్యింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆశలు సాకారమైతే, వారి సాధికారతవైపు సమాజం అడుగులు వేస్తే... మహిళలపై వివక్ష తగ్గితే.. గౌరవం పెరిగితే పైన చెప్పుకున్న సంఘటనలు లాంటివి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్న ఆశలు కనిపించాయి. కానీ, ప్రతి మహిళా దినోత్సవం రోజు అన్ని పార్టీలు, సంఘాలు, ప్రముఖులు మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రస్తావించడం. కుదిరితే కాసిన్ని దీక్షలు.. ఆ తర్వాత మరిచి పోవడం.. అంతే, ఒకటి కాదు రెండు కాదు 26 ఏళ్లుగా ఇదే తంతు. ..ఎందుకంటే పైన మనం చెప్పుకున్న కామెంట్లూ, కథలూ కంచికిపోలే.. మన మధ్యే ఉన్నాయి. ఇవి ఆకతాయిల మాటలు కాదు.. మీరే చూడండి. – ఓ రోజు మహిళా బిల్లుపై సీరియస్ చర్చ జరుగుతోంది. సమర్థించే వారు గొంతు చించుకుంటున్నారు. ఇంతలో పార్లమెంట్ బయట తిరుగుతున్న ఎంపీని ‘మహిళా రిజర్వేషన్ బిల్లుపై మీ అభిప్రాయం ఏమిటి..’ అని మీడియా అడిగితే ఆయన సమాధానం... ‘మా ఆవిడ చేస్తున్న షాపింగ్ బిల్లు మీద తప్ప నాకే బిల్లుపై ఆసక్తి, ధ్యాసా లేవు..’ అని ఆ తర్వాత ఓ రోజు..‘మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌కు ఏం తెస్తుంది..? బ్యూటీపార్లర్లకు వెళ్లే బాబ్డ్ హెయిర్ మహిళలనా...’ మహిళా బిల్లుపై లాలూప్రసాద్ రియాక్షన్. చట్టసభల్లో కూర్చుని మన రాత రాసే నేతల ధోరణి ఇలా ఉంటే.. బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ఓ టీవీ చానల్ కామన్ పీపుల్‌తో పిచ్చాపాటిగా మాట్లాడింది.. వినండి. – పార్లమెంట్లో అంత చర్చ జరుగుతోందిగా, ఈ బిల్లుపై మీ అభిప్రాయం ఏమిటని అడిగితే.. వారిలో కొందరి సమాధానాలు ఇవీ. – ‘అవునవును నేను కూడా విన్నాను. మా ఆవిడ కూడా అడిగింది. మరీ రచ్చ బాగా చేస్తున్నారు.. బిల్లు ఎక్కువ అయ్యిందా అని..’ (జోక్ ?) – ‘నాకు బిల్ క్లింటన్ మాత్రమే తెలుసు ఈ బిల్ గురించి ఐడియా లేదు..’ (లైట్?) – ఉమెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడొస్తుంది..? ‘వారికి అధికారం వచ్చేసిందిగా.. క్రెడిట్ కార్డ్‌ల రాకతో’ (వెటకారం?) – ఉమెన్ రిజర్వేషన్ వస్తుందా..? ‘లాలూ రైల్వే కోచ్‌లలో మహిళలకు కొన్ని కేటాయించా డుగా..’(సరదా?) – చట్టసభల్లో మహిళల కోటా గురించి చెప్పండి. ‘ఇప్పుడు ఇంట్లో అంతా వారి పెత్తనం.. ఇక రెండు సభల్లో వారిదే పెత్తనం అవుతుంది. దేశాన్ని వారే నడుపుతారు..’ (తేలిక భావం?) బిల్లు తేవాల్సిన చట్టసభల్లో నాయకులకూ, బయట సాధారణ ప్రజలకూ ఒకే రకమైన భావజాలం ఉన్నాక, 26 ఏళ్లే కాదు ఎన్నేళ్లయినా అలాగే ఉంటుంది. మహిళా దినోత్సవం రోజో, ఎన్నికల మేనిఫెస్టోల్లోనో, ఖాళీ దొరికినప్పుడు మాట్లాడుకోవడానికో ఓ సబ్జెక్ట్ అవుతుంది. ‘రాజ్యసభ నుంచి లోక్ సభకు నడిచి వెళ్లడానికి ఐదు నిమిషాలు పడుతుంది. కానీ, రిజర్వేషన్ బిల్లుకు మాత్రం ఇన్నేళ్లయినా (రాజ్యసభ ఆమోదించిన 2010 నుంచి) లోక్ సభకు చేరనే లేదు..’ – ఇది బృందా కారత్ ఆవేదన. పైన చెప్పుకున్నట్టుగా మన పరిస్థితి ఇలాగే ఉంటే, ఎన్నాళ్లయినా బిల్లు లోక్‌సభ వైపు నడుస్తూనే ఉంటుంది. మనమే కాదు.. అంతటా అంతే ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం తాజా నివేదిక చూడండి ప్రపంచవ్యాప్తంగా మంత్రి పదవుల్లో ఉన్న మహిళలు 22.8 శాతమే. కేవలం 13 దేశాల్లోని కేబినెట్లలో మాత్రమే 50%, ఆపైన మహిళా మంత్రులు ఉన్నారు. మహిళలు మంత్రులుగా ఉన్నా వారికి కేటాయిస్తున్న శాఖల ప్రాధాన్యత తక్కువే. ప్రజలు నేరుగా ఎన్నుకునే దిగువ సభల్లో (లోక్‌సభ తరహాలో) మహిళా పార్లమెంటేరియన్లు 26.5 శాతమే. అయితే ఇది 1995లో 11%గానే ఉండగా ప్రస్తుతం కొంత మెరుగుపడింది. దిగువ సభలో 50%, అంతకన్నా ఎక్కువ మంది ఎంపీలున్న దేశాలు ఆరు మాత్రమే. రువాండాలో 61%, క్యూబాలో 53%, నికరాగ్వాలో 52%, మెక్సికో, న్యూజిలాండ్, యూఏఈలలో 50% మహిళా ఎంపీలున్నారు. ఈ ఆరింటితోపాటు మరో 17 దేశాల్లో 40% పైన మహిళా ఎంపీలు ఉన్నారు. 22 దేశాల్లో మహిళా ఎంపీలు 10% కన్నా తక్కువే -సరికొండ చలపతి -
Union Budget 2023: సీతమ్మ వాకిట్లో... మధ్యతరగతి
బడ్జెట్ ఏమి తెస్తుందో లేదో తెలియదు కానీ, ప్రతిసారీ కావల్సినన్ని చెణుకులు, మీమ్స్ మాత్రం తెస్తోంది. .... మధ్యతరగతి ఇళ్లలో తండ్రి, కొడుకుల మధ్య తరచూ వినబడే సంభాషణట ఇది వినండి... ‘కొనడం ఎన్ని రోజులు పోస్టుపోన్ చేస్తావ్ నాన్నా, ఈ ఫోన్ చూడు.’ – ... దీనికి ఏమైందిరా? ‘నాన్నా... ఎన్ని సార్లు అడుగుతావ్? రోజుకు 50 సార్లు హ్యాంగ్ అవుతోంది, మాట్లాడుతూంటేనే కట్ అవుతోంది.’ – ...అవును, కానీ మంచి ఫోనురా... ‘మంచిదే కానీ, పాతదయిపోయింది. కొత్తది కొనాల్సిందే...’ – .. సరే, చూద్దాం... ఆ తర్వాత రోజు.. ‘ఫోన్ సంగతి ఏమైంది నాన్నా...’ – సరే ఫస్ట్‌కు చూద్దాం... ఓ నెల తర్వాత.. ‘..ఫొటోస్, ఫైల్స్ మిస్సవుతున్నాయి నాన్నా..’ – ..ఏదీ చూద్దాం.. ‘..చూడడానికి ఏముంది.. అన్నీ పోయాయి.. కొత్తఫోన్ కొను నాన్నా. – ..అలాగే చూద్దాం.. మధ్యతరగతి జీవితాల్లో చూద్దాం... అంటే వారాలు నెలలు సంవత్సరాలు.. అన్నమాట! కొడుకు తండ్రిౖ వైపు ఆశగా చూస్తూనే ఉంటాడు.. ఏదో ఒకరోజు కొనివ్వకపోతాడా...అని. విచిత్రం ఏమిటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా అంతే.. ఈసారైనా బడ్టెట్‌లో ఏదైనా ఉండకపోతుందా అని ఇలా.. కొడుకుకు దొరికిన సమాధానమే కనిపిస్తుంది.. నెక్స్ట్ బడ్జెట్లో చూద్దాం.. అని. అందుకే ప్రతి బడ్జెట్లో శాలరీ శ్లాబ్‌లు.. తాయిలాలు ఏముంటాయో చూద్దాం అని ఆశపడడం, ఊసూరుమనడం.. నెక్స్ట్ బడ్జెట్ మీద ఆశలు పెట్టుకోవడం.. ఇదీ వరుస సరే చూద్దాం.. ఈ బడ్జెట్లో ఎలా ఉంటదో. వంటింట్లో కూడా జీఎస్టీతో తిరగమోత పెట్టి, రేట్ల ఘాటు నషాళానికి అంటించిన ఆర్థిక మంత్రి సీతారామన్ మొన్నీమధ్య మాట్లాడుతూ– ..‘ నేను కూడా మధ్యతరగతి నుంచే వచ్చాను, వారి ఒత్తిళ్లు, బాధలు నాకు తెలుసు .. ’ అని చెప్పడంతో ఇప్పటిదాకా పడ్డ వాతలు, పెరిగిన గ్యాస్, పెట్రోల్, నిత్యావసరాలు..అన్నీ మరచిపోయి మధ్యతరగతి బడ్జెట్‌వైపు ఆశగా చూస్తోంది. ‘గాలి పీల్చుకోనిస్తున్నాం, నీళ్లు తాగనిస్తున్నాం, తిండి తిననిస్తున్నాం.. ఇది చాలదా, ఇంకేం కావాలి..’ –పోయిన బడ్జెట్ మధ్యతరగతికి ఏమిచ్చింది.. అంటే ఓ నెటిజన్ సరదా కామెంట్. కానీ, ఓ నెటిజన్ సీరియస్ కామెంట్ చూడండి.. ‘‘సమాజాన్ని స్టేబుల్‌గా ఉంచేదే మధ్యతరగతి. బిజినెస్ క్లాస్‌కు సేవలతో, కింది తరగతికి తన పన్నులతో సపోర్ట్ చేసేదే.. మిడిల్‌క్లాస్. గత న లభై ఏళ్లుగా మిడిల్ క్లాస్ పెరుగుతోంది. పన్నులు చెల్లించేవారు పెరుగుతున్నారు. కాగా, పెట్రోల్, కరెంట్, కూరగాయలు, నిత్యావసరాలు.. ఇలా పెరిగిన ప్రతి రేటు మధ్యతరగతి జీవితాన్ని ఎక్కడ ఉన్నవాడిని అక్కడేవుండేట్లు చేస్తోంది. బడ్జెట్లో సరైన సపోర్ట్ లేకుంటే సమాజం, ప్రభుత్వం కూడా నష్టపోతుంది...’ దీనికి సపోర్ట్‌గా మరో నెటిజన్ పొలిటికల్ అనాలసిస్ ఇదీ.. ‘‘సాధారణంగా పాలిటిక్స్‌కు, ఓటింగ్‌కు దూరంగా ఉండే మిడిల్ క్లాస్ మోదీకి దగ్గరవుతున్నారు. వీరు మోదీ ర్యాలీలకు, సభలకు హాజరవడం చూస్తున్నాం. అలా కాకపోయినా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం, మోదీ చెబుతున్న నేషనలిజాన్ని నెత్తికెత్తుకుంటూ ఆయనకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. చాలా మంది మధ్యతరగతి ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక చింతన మోదీ టీమ్ నడిపిస్తోన్న హిందుత్వాన్ని బలోపేతంచేస్తున్నాయి... దీనికితోడు మోదీ తరచుగా చెప్పే ఆధునికత్వాన్ని కూడా మధ్యతరగతే ముందుకు తీసుకెళ్తోంది... వీరి సపోర్ట్ లేకుండా మోదీ విజన్ సాధ్యం కాదు.. గతంలో కంటే మిడిల్ క్లాస్ పాపులేషన్ బాగా పెరుగుతోంది. ఇది మోదీకి అనుకూలమైన విషయమే. ఈ సెక్షన్‌ను విస్మరించడం మోదీ గవర్నమెంట్‌కు అంత మంచిది కాదు.. ఈ విషయం ఆర్థిక మంత్రికీ తెలిసే ఉండాలి..’’ విద్య, వైద్యం, దైనందిన జీవితంలో పెరిగిన రేట్లు.. ప్రతిదీ మధ్యతరగతి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తదో.. ఆర్థికంగా ఎలా ఎదగకుండా చేస్తదో చెబుతూ వీటన్నింటినీ బడ్జెట్ పరిశీలించాలంటూ తన సొంత అనుభవాన్ని ఓ నెటిజన్ ఇలా పంచుకున్నారు.. ‘‘మా నాన్న ఫ్రెండ్ ఓ స్టాక్ బ్రోకర్. ఇరవై ఏళ్ల క్రితం ఆయనిచ్చిన సలహాతో మంచి షేర్లలో పెట్టుబడి పెట్టాడు. ఇప్పటికి వాటి ధర 200 రెట్లు పెరిగింది.. మేం నిజానికి లక్షాధికారులం కావాలి.. కానీ కాలేదు. కారణం చూడండి.. కొన్న రెండు సంవత్సరాలకు రెసిషన్ వచ్చింది.. నాన్న ఉద్యోగం పోయింది. 20 శాతం షేర్లు అమ్మితే ఇల్లు గడిచింది. ఆ తర్వాత ఏదో చిన్న ఉద్యోగం సంపాదించాడనుకోండి. కానీ, మరో 20 శాతం మా తాత హార్ట్ సర్జరీ కోసం అమ్ముకున్నాం. మరికొన్ని షేర్లు నాకు, తమ్ముడి చదువులకు హరించుకుపోయాయి. కొద్ది రోజులకు మరికొన్ని అక్క పెళ్లికి హారతి.. ఇలా ఒక్కో సమస్య షేర్లను తినేసింది. నాకేం అర్థమయ్యిందంటే సమాజంలో ఏం తేడా చేసినా.. అంటే మాంద్యం వచ్చినా, ఉద్యోగాలు పోయినా, ట్యాక్సులు పెరిగినా, మెడికల్ బిల్లులు పెరిగినా, చదువుల ఖర్చు పెరిగినా, రెగ్యులర్‌గా ఉండే కరెంట్, పాలు, నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోల్.. ఇవన్నీ నిరంతర మధ్యతరగతిని ఎదగకుండా జాగ్రత్త కాపలా కాస్తుంటాయి.. పై చదువులు బాగా చదివినట్లే ఉంటుంది, శాలరీ పెరిగినట్లే ఉంటుంది.. లైఫ్‌లో రిస్క్, సమస్యలు మాత్రం అలాగే ఉంటాయి.. వీటన్నింటినీ బడ్జెట్ పరిగణనలోకి తీసుకోవాలి...’ ఇదీ ఉద్యోగుల పరిస్థితి బడ్జెట్ ప్రసంగంలో ఆదాయ పన్ను మినహాయింపు ప్రకటనపై ఉద్యోగులు ఇలా ఎదురు చూస్తున్నారంటూ చెణుకులు సరే చూద్దాం.. ఈసారి బడ్జెట్ ఎప్పటిలాగే మీమ్స్, జోక్స్ మిగులుస్తుందా.. కాసిన్ని ఆశలు మిగులుస్తుందా.. -
మోదీ చేసిన అప్పు 100 లక్షల కోట్లు.. బీఆర్ఎస్ సర్కారు అప్పు ఎంతంతే?
ఇండియన్ ‘లోన్’ మోదీకి ముందున్న 14 మంది ప్రధానులు చేసిన అప్పు రూ. 56 లక్షల కోట్లయితే, మోదీ ఎనిమిదిన్నరేళ్లలో రూ. 100 లక్షల కోట్లు అప్పు చేశారు. పుట్టబోయే ప్రతి బిడ్డపై 1.25 లక్షల రూపాయల రుణభారం మోపారు. – కేటీఆర్ కామెంట్ ....... కౌంటర్.. ‘స్టేట్’మెంట్ తెలంగాణ అప్పు రూ. 3.12 లక్షల కోట్లయ్యింది. రెండేళ్లలోనే బీఆర్ఎస్ సర్కారు రూ. 87 వేల కోట్ల అప్పును చేసింది. బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారు. మన పిల్లలకు అప్పు మిగులుస్తున్నారు. సరాసరి తలసరి రూ. 94 వేల అప్పును మోపుతున్నారు – బండి సంజయ్, కిషన్‌రెడ్డి విమర్శలు ....... అప్పుల ‘మధ్య’తరగతి.. ‘‘కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటవచ్చేమోగానీ, కళ్లు తడవకుండా జీవితాన్ని దాటలేం..’’ అంటారు. కళ్ల తడి కామన్ కానీ, ఈ రోజుల్లో అసలు అప్పు చేయకుండా జీవితం దాటనేలేం. కుటుంబాలన్నీ అప్పుల కుప్పలే. ‘ఈఎంఐ’.. అని రుణాల పేరు పోష్‌గా మారిందంతే. వాయిదాల్లేకుండా బతికేదెవ్వరు.. ఇంటికి, బండికి, చదువుకు, పెళ్లికి.. చిట్లు.. ఒక్కటేమిటి ముఖ్యంగా మధ్యతరగతి బతుకంటేనే అప్పులు కదా...! చిన్నప్పుడు ‘తీసివేతలు’ నేర్పుతున్నప్పుడు లెక్కల మాస్టారు ‘ఒకటి అప్పు తీసుకోరా ..’ అని ఎప్పటి నుంచి చెప్పారో, అప్పటినుంచి బతుకు లెక్కంతా అప్పులే. రుణాలు తీసుకుంటూనే ఉన్నాం. వడ్డీలు, కిస్తులు కడుతూనే ఉన్నాం. అప్పూ గొప్పే... రిచ్ క్లాస్‌లో ఇదేం నామోషీ కాదు. అంబానీ నుంచి అదానీ దాకా అపరకుబేరులైనా అప్పు చేయా ల్సిందే. నిజానికి ఇలాంటి వారికే ఎక్కువ అప్పు లిస్తారు కూడా. ఈ రేంజ్లో ఉన్న వారికి రెడ్ కార్పెట్ వేసి అప్పులిచ్చి గౌరవించడం, ఎగ్గొడితే ఫ్లయిట్లలో విదేశాలకు పంపడం కూడా మనకు తెలిసిందే కదా.. అప్పుకు మారుపేరైన.. ‘ఈఎంఐ’ల్లో పుట్టి (హాస్పిటల్ చార్జీలు కూడా ఈఎంఐలో కట్టేంతగా ఉంటాయి), ఈఎంఐల్లో పెరిగి, ఈఎంఐలతో చదువుకుని, ఈఎంఐల్లో పోవడమే మధ్య, పేద తరగతి జీవితం. కానీ, అప్పుల్లోనూ అంత ఖదర్‌గా బతికే బిజినెస్, రిచ్ క్లాసూ ఉంది. రుణ.. పురాణం నిజానికి ఈ అప్పు లొల్లి, అప్పుల్లోనూ పేద ధనిక తారతమ్యం పురాణాల కాలం నుంచీ ఉన్నట్టుంది. బూడిద పూసుకుని, కనీసం ఒంటిపై బ్రాండెడ్ బట్టల్లేకుండా పులి చర్మాలు, నారచీరలు ధరించి శ్మశానాల్లో తిరుగుతూ ఉండే ‘శంకరుడి’కి కుబేరు డెప్పుడయినా లోన్ ఆఫర్ చేసిన సందర్భాలు కనిపిస్తాయా..? గడ్డ కట్టుకు పోయే చలిలో హిమాలయాల్లో నివసించే శివుడు కనీసం ‘హోమ్‌లోన్’కు అప్లయి చేసుకున్న దాఖలాలూ లేవు. యుగాల తరబడి అదే నందీశ్వరుడిని యూజ్ చేశాడే కానీ, ఎవరైనా శివుడికి ‘వెహికల్ లోన్’ అరేంజ్ చేశారా..? పుష్పక విమానంలో తిరిగే కుబేరుడు ఆఫర్ చేశాడా.. ఎందుకంటే ఆయన పేద దేవుడు. పైగా ఎవరేం అడిగినా ఇచ్చేసే భోళా శంకరుడాయే.. ‘కొల్లాటరల్ సెక్యూరిటీ’ చూపే శక్తి లేదు. ప్రధానుల, ముఖ్యమంత్రుల రికమండేషన్ కూడా లేనట్టుంది. ... ఇప్పటి మన రైతులు, పేదోళ్ల పరిస్థితిలాగా! అదే, విష్ణుమూర్తిని చూడండి. ఆయన మ్యారేజీకి కుబేరుడు ఎంత డబ్బిచ్చాడు! తిరుపతి వెంకన్నఇంకా కిస్తులు కడుతూనే ఉన్నాడు. ఆయనకు ఆ అప్పెలా వచ్చింది. ఆ అప్పు ఎందుకు తప్పు కాలేదు..? ఎందుకంటే ఆయన బాగా రిచ్చి. స్వయంగా లక్ష్మీదేవియే అర్ధాంగి. దేవుళ్లలో బాగా పలుకుబడి ఉన్నవాడు. ఘనంగా అల వైకుంఠపురంలో ఆ మూల సౌధాల్లో నివసిస్తాడు. పెద్దోళ్లందరికీ కావలసినవాడు. ఇంకేం ఎంతైనా అప్పు పుట్టుద్ది... మన రిచ్ పీపుల్ లాగా. – ఇక మన ఆర్థిక మంత్రి సీతారామన్ లాంటి వాళ్లెవరైనా ఉంటే దేవుళ్లలో ఇప్పటికే వెంకన్న రుణం అంతా ‘రైటాఫ్ ’ అయిపోయేది. అప్పు.. సంపన్నం ఇది చూడండి.. మనం ఆరాధనగా చూసే అమెరికా, సింగపూర్ తలసరి అప్పులు ఎక్కువే. అక్కడ సింగపూర్‌లో ఒక్కొక్కరిపై 97.46 లక్షల రూపాయల అప్పులు ఉన్నాయి. జపాన్, కెనడా, బెల్జియం వంటి సంపన్న దేశాల వారి తలసరి అప్పులు ఎక్కువ. రిచ్‌నెస్ అలా ఉంటది మరి. అప్పుల్లోనూ.. పూర్ ఆఫ్గానిస్థాన్ , డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, బురుండి, మడగాస్కర్, లైబీరియా వంటి చిన్న దేశాల్లో తలసరి అప్పు తక్కువే. విదేశాల నుంచి అప్పులు దొరకడం కష్టం. ఆదాయమే సరిగ్గా లేని వాళ్లకు అప్పులెలా ఇస్తారు.. అదీ సంగతి ....... .. ఇంతకీ బీఆర్ఎస్కైనా, బీజేపీకైనా చెప్పొచ్చేదేమంటే.. ఎంత అప్పుంటే అంత దర్జా.. ఎంత దర్జా ఉంటే అంత అప్పు... కనుక ‘పక్కోడు చేసే అప్పులు..’ పెరుగుతున్నాయని చింతించవలదు. డబ్బున్నోడికి అప్పు ఈజీ కదా.. అంటే అప్పుంటే డబ్బు, దర్పం ఉన్నట్టే కదా! అంటే మనం బాగానే ఉన్నాం అనుకుంటే సరి. ....... కానీ, ‘...మన మీద పడే అప్పులపై ’ చింతించే మిడిల్ క్లాస్ ఒకటి ఉందండోయ్.. ‘ఇప్పటికే ఏళ్ల తరబడి ఇంటి లోన్ కడుతున్నాను, ఈ మధ్యే పిల్లాణ్ణి స్కూల్లో వేయడానికి ఓ లక్ష అప్పు చేశాను, కరోనా మింగిన నాలుగు లక్షల తాలూకు అప్పు, వడ్డీ అలాగే ఉన్నాయి. రెండో అమ్మాయి స్కూల్లో చేరడానికి రెడీ అవుతోంది. ఈ ఖర్చులిలా ఉండగా మన ‘డబుల్ ఇంజన్ సర్కార్లు’ వాళ్లు చేసిన అప్పులన్నీ మనతోనే కట్టిస్తారు.. వాళ్ల జేబు లోంచి కట్టరుగా... అని మా ఆవిడ భయంగా అడుగుతోంది..’ – కేటీఆర్, సంజయ్ ΄పోటా పోటీ ‘అప్పుల’ విమర్శలు చూసి ఓ నెటిజన్ పోస్టు ఇది. ఆలోచించదగ్గ ఆందోళనే. అక్కడిదాకా రాకుండా చూడండి. ఇప్పటికే అప్పులు కట్టలేక చస్తున్నాం. (క్లిక్ చేయండి: బయటపడిన అమెరికా డొల్లతనం) -
బాబోయ్! హ్యాండిల్ విత్ కేర్...
‘లయర్ అనే పక్షి బాగా మిమిక్రీ చేస్తుందట. దానికి వినబడే అన్ని రకాల ధ్వనులను అనుకరించేస్తుందట. ఇతర పక్షుల శబ్దాలు, కుక్కల అరుపులు, కెమెరా షటర్ శబ్దం, రంపం కోస్తున్న చప్పుడు, తుపాకీ పేలిన చప్పుడు, కారు ఇంజన్ ఇప్పుడు, కొన్ని కొన్ని మనుషుల మాటలు కూడా అనుకరించగలదట... ఎప్పటికప్పడు దాని అవసరాన్ని బట్టి అరుపులు ఉంటాయి కనుక ‘లయర్’ అంటారట అంకుల్. ’ – నైన్త్ క్లాస్ చదివే పక్కింటి కుర్రాడు రవి. ...అప్పడే టీవీలో పొలిటికల్ లీడర్ల ముచ్చట్లపై చర్చ నడుస్తోంది. నేను సీరియస్‌గా వింటున్నా. ఎవరు ఎప్పుడు ఎలా మాట మార్చారు, గతంలో ఏం చెప్పారు, ఇప్పడేం చెబుతున్నారు, ఆ పార్టీలో ఉన్నప్పడు ఏం మాట్లాడారు. ఈ పార్టీలో ఏం మాట్లాడుతున్నారు... మాటెలా మారింది... గట్రాలు. ...... రవి చదువుకోవడానికి మా ఆవిడ దగ్గరికి వస్తుంటాడు. నేనూ ఖాళీగా ఉన్నప్పడు వారి మధ్య ఇన్వాల్వ్ అవుతుంటాను. ఎప్పుడూ ఆ పిల్లాడి చేతిలో ఐఫోన్ ఉంటుంది. సోషల్ మీడియా బాగా ఫాలో అవుతుంటాడనుకుంటా... రకరకాల విషయాలు చెబుతుంటాడు. సినిమాలు, నేచర్, టెక్నాలజీ... ఇలా. ...... ‘ఎందుకోయ్ ఆ సోషల్ మీడియా ముచ్చట్లు... హాయిగా పేపర్ చదువుకోరాదూ. జనరల్ నాలెడ్జ్ వస్తుంది’ అని వాడికి చెబుతూ, ‘న్యూస్ వినడానికి, పేపర్ చదవడానికి ఎంకరేజ్ చెయ్యి , పిల్లాడు షార్ప్ గా ఉన్నాడు’... అని మా ఆవిడకూ ఓ సలహా పడేశా. మా ఆవిడ నన్ను అదోలా చూసింది. నేను ఇచ్చిన సలహాలు తరచుగా వికటిస్తాయని ఆమె ప్రగాఢ నమ్మకం. ఇందులో వికటించడానికి ఏముంది? న్యూస్ చూడమన్నా. మంచి సలహానే కదా... అన్న ధీమాతో అక్కడి నుంచి లేచిపోయా. ఇది కొద్దిరోజుల క్రితం జరిగిన విషయం. ...... ఓ ఫైన్ ఈవెనింగ్ మా ఆవిడ పక్కింటి కుర్రాడి హోం వర్క్ బుక్ నాముందు పడేసింది, చూడండి మీ నిర్వాకం అన్న అర్థం స్ఫురించేలా చూస్తూ. ఏదో తేడా జరిగిందని అర్థం అయ్యింది. ఏమైందా అని చదివా. సామెతలకు అర్థం రాయమని స్కూలు టీచర్ ఇచ్చిన అసైన్మెంట్.. – ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కింది... ఈ సామెతను వివరింపుము – టీచర్ ప్రశ్న – తెలంగాణలో బాగా పాలన చేయని కేసీఆర్... బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీ పెట్టడం. – మన వాడి సమాధానం – గూట్లో రాయి తీయలేని వాడు ఏట్లో రాయి తీస్తాడట... అర్థం ఏమిటి? – మరో ప్రశ్న – ఆంధ్రప్రదేశ్‌లో సరిగా పరిపాలన చేయలేని చంద్రబాబు మళ్లీ తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తాననడం. – ఇదీ జవాబు ...ఈ సమాధానాలు చదివి అవాక్కయ్యా. అప్పటికే మా ఆవిడ నావైపు సీరియస్‌గా చూస్తోంది. పిల్లాడిని చెడగొట్టావుగా అన్నట్టు. సీరియస్‌గా టీవీల్లో వార్తలు చూస్తున్న రవిని చూసి ఠక్కున టీవీ కట్టేసి పిలిచి పక్కన కూర్చోబెట్టి సామెతలు చూపించి అడిగా... ఇలా ఎవరు చెప్పారని. ‘మీరు వార్తలు ఫాలో అవమని చెప్పారుగా అంకుల్... అప్పటినుంచి పేపర్ చదువుతున్నా, టీవీ న్యూస్ కూడా చూస్తున్నా. చాలా విషయాలు తెలుస్తున్నాయ్. మొన్న నడ్డా తెలంగాణ వచ్చాడుగా... మొదటి సామెత ఆయన చెప్పిందే. ఆయన స్పీచ్ మొత్తం విన్నా. అందుకే సామెత అర్థం ఈజీగా రాసేశా. ఆ తర్వాత సామెత చంద్రబాబు మీద నిన్న హరీశ్‌రావు చెప్పింది... అంతకు ముందు చంద్రబాబు స్పీచ్ కూడా విన్నా. ‘కరెక్ట్‌గానే రాశానుగా అంకుల్... టీచర్ బాగా సీరియస్ అయ్యింది. ఎవరు చెడగొడుతున్నార్రా నిన్ను.. అంటూ తలంటు పోసిందనుకోండి...’ ‘...అయినా అంకుల్... అశోకుడిలా చెట్లు నాటించాం.. కాకతీయుల్లా చెరువులు తవ్వించాం. ఇళ్లకూ, పొలాలకూ నీళ్లిచ్చాం. రైతులకు సాయం చేస్తున్నాం, ఉద్యోగాలు ఇస్తున్నాం... అని కేసీఆర్ చెబుతున్నారుగా. మరి నడ్డా ఎందుకలా అంటున్నాడు అంకుల్? ఇంకా మరి చంద్రబాబేమో...’ ఇలా వాడు గడగడా మాట్లాడుతున్నాడు. నేను షాక్ లోంచి తేరుకోకముందే వాడి నోరు మూసి మా ఆవిడ తీసుకెళ్లి పోయింది. పిల్లాడి జోలికి రావద్దన్నట్టుగా... కళ్లలో కాసిని నిప్పులు. ‘తెలంగాణ ఆడబిడ్డ కళ్లల్లోంచి వచ్చేవి నిప్పులేగా.. కవితక్క మొన్న ఇదే చెప్పింది.. అంకుల్’... అని రవి అంటున్నట్టుగా అనిపించింది. వార్నీ! వీడి జనరల్ నాలెడ్జ్ తగలెయ్యా. నేను అనుకున్నదానికన్నా షార్ప్‌గా ఉన్నాడే అనుకున్నా. ఎప్పటిలాగే... మరో సలహా వికటించిందన్నమాట! ఈ సామెతలకే ఇలా నేర్చేసుకుంటే... మరి తిట్ల సంగతేమిటి? వీడు క్లాసులో, వాళ్లింట్లో మాట్లాడుతున్న భాష పరిస్థితేమిటి? కొద్ది రోజుల్లో పక్కింటి వాళ్లు నాపై దండయాత్రకు రావడం ఖాయం. కొంచెం గతుక్కుమన్న మాట వాస్తవం. అప్పటినుంచి వాళ్ల చదువు జోలికి పోకుండా నా మానాన నేను ఉంటున్నా... ...... ఆ తర్వాత రవి ఓసారి బుక్ పట్టుకొచ్చి ఓ పద్యం చూపించాడు ‘అన్న మిచ్చిన వాని ఆలి నిచ్చిన వాని అపహసించుట హాని ఓ కూనలమ్మ’ – దీని అర్థం ఏమిటి అంకుల్ అంటూ. ...అప్పుడే నా ఎదురుగా టీవీలో చంద్రబాబు ఏకధాటిగా ప్రసంగిస్తున్నాడు. నా కెందుకో వాడికి అర్థం తెలిసీ నన్ను అడుగుతున్నాడేమో అనిపించింది. వాడి రాజకీయ పరిజ్ఞానాన్ని రుచి చూపించి మా ఆవిడతో చీవాట్లు పెట్టించాడుగా. ‘మామా అల్లుళ్ల గురించేగా?... అల్లుడికి చెబుతున్న నీతే కదా అంకుల్?’ రెట్టిస్తున్నాడు, ఓ పక్క టీవీలో చంద్రబాబు ప్రసంగం వింటూనే. దగ్గర్లోనే మా ఆవిడ వుంది. వాడికి అర్థం చెప్పే ధైర్యం చెయ్యలేక పోయా. ‘నాకు తెలుగు పెద్దగా తెలియదు, ఆంటీని అడుగు...’ అని తప్పించుకుంటుండగా.. వాడు టీవీ నుంచి దృష్టి మరల్చకుండా బాబు ప్రసంగం వింటూనే, ‘అవునకుంల్... కరోనా వైరస్ మళ్లీ కొత్త వేషం మార్చుకుని వస్తోందటగా. వాటినే కొత్త వేరియంట్లంటారట... మళ్లీ మన తెలంగాణకూ వచ్చేస్తదా.. వీటి వల్ల మళ్లీ ప్రమాదం ముంచుకు వస్తదా.’ – చంద్రబాబు ప్రసంగం వింటున్న వీడి బుర్రలో కరోనా వైరస్ ప్రశ్నలేమిటా అని ఆశ్చర్యపోతూ వినీవిననట్టుగా అక్కడి నుంచి జారుకున్నా. ఏమైనా, ఈ కాలం పిల్లలను హ్యాండిల్ చెయ్యలేం! సారాంశం -సరికొండ చలపతి -
ఐటీ దాడుల్లేని అద్భుత భారతం.. ఇప్పుడందరి చూపూ 2024 వైపే
నెట్లో ట్రెండ్ అవుతున్న తండ్రీ కూతుళ్ల సంభాషణ.. పనిచేసుకుంటున్న తండ్రిని ఏడేళ్ల పాప... ‘ఏం చేస్తున్నావ్ నాన్నా...’ అని అడుగుతుంది. ‘ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నానమ్మా..’ అని సమాధానం చెప్పగా, ‘ఇన్కమ్ ట్యాక్స్ అంటే...’ ఆ పాప ప్రశ్న. కొద్దిగా ఆలోచించి, కాస్త నిట్టూర్చి. ఇలా అంటాడు. ‘... నిన్నూ, అన్నను పోషిస్తున్నట్టే రాజకీయనాయకులను, అధికారులను పోషించాల్సిన బాధ్యత నా మీద ఉందమ్మా.. వాటికి డబ్బులు తీసిపెట్టడమే ఇన్కమ్ ట్యాక్స్..’ – ఈ జవాబులో నిజం కాస్తే ఉన్నా, కడుపు మంట ఎక్కువగా కనిపిస్తుంది. సగటు మనిషి, ఉద్యోగిపై ప్రతినెలా, ప్రతి ఏడాదీ ‘ఐటీ దాడులు’ జరుగుతూనే ఉంటాయిగా... అందుకే. ► చరిత్ర చూస్తే సగటుమనిషి కడుపు మంట నుంచి విప్లవాలు, లేదా విప్లవాత్మక ఆలోచనలు పుట్టుకురావడం కనిపిస్తుంది. కానీ, సాక్షాత్తూ ఓ మంత్రి కడుపుమంట నుంచి కూడా విప్లవాత్మక ఆలోచనలు రావడం ముదావహం, ఆహ్వానించదగ్గ విషయం. మంత్రి మల్లారెడ్డి పన్నులు లేని, ఐటీ దాడుల్లేని భారతావనిని స్వప్నిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీతో అది సాధ్యమని మనలో ఆశలు కల్పిస్తున్నారు. ఆయన మాటలు చూడండి. ‘‘కేసీఆర్ స్థాపించిన భారత రాష్ట్ర సమితి 2024లో అధికారంలోకి వస్తది. ఎవరిపైనా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఉండవు. మా పాలనలో ఎవరైనా, ఎట్లయినా సంపాదించుకోవచ్చు. ఎవరికి వారే స్వచ్ఛందంగా, తమకు ఇష్టమైతేనే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే విధంగా కొత్త రూల్స్ తీసుకొస్తాం..’ – వందల కొద్దీ ఐటీ అధికారులు రెండు మూడు రోజులపాటు దాడి చేసి, నానా ప్రశ్నలు వేసి, రక రకాల డాక్యుమెంట్లు అడిగి, కాస్తో కూస్తో దొరి కిన కరెన్సీని ఎక్కడిదని ప్రశ్నించిన ఫ్రస్టేషన్లో పుట్టిందే .. ‘బీఆర్ఎస్ నాయత్వంలో పన్నులు లేని భారతదేశం’ ఐడియా అని అందరూ అపోహ పడుతున్నా, వినడానికి ఎంత బావుందో... అని అందరూ ఆనందపడ్డారు. చాయ్ వాలా... మిల్క్వాలా ‘చాయ్‌వాలా’ మోదీ మన గొంతులో బలవంతంగా పోస్తున్న జీఎస్‘టీ’ కన్నా ‘మిల్క్వాలా’ మల్లారెడ్డి మాటలే మనకు ‘బూస్ట్’నిస్తాయి. ఇలా జనాన్ని ఆనంద పెట్టడంలో, ముఖ్యంగా కుర్రకారును ఉత్సాహపరచడంలో, మోటివేట్ చెయ్యడంలో మల్లారెడ్డికి పెట్టిందిపేరు. విజయానికి తానే మోడల్ నంటూ కుండ బద్దలు కొట్టేసి, 23 మూడేళ్ల వయస్సులో సైకిల్‌పై పాలమ్మిన తాను దేశంలోని టాప్ టెన్ ‘ఎడ్యుకేషనిస్టు’గా, మంత్రిగా ఎదగడంలో తన అవిర ళ కృషిని తరచూ యువతకు గుర్తుచేస్తుంటారు. బాగా ఎదగాలని మోటివేట్ చేస్తుంటారు. షార్ట్‌కట్స్ కూడా చెబుతుంటారు. పాతికేళ్ల వయస్సులో, అదికూడా ఎవరితో పడితే వాళ్లతో ప్రేమలో పడకూడదని ముఫ్పై ఏళ్లు దాటాకా ఆ పని చేయాలని సూచిస్తుంటారు. ప్రేమ, పెళ్లి అంటే ‘ఐశ్యర్యారాయ్ అమితాబ్ కొడుకును పట్టినట్టుగా, జాక్‌పాట్ కొట్టినట్టుగా...’ ఉండాలని అమ్మాయిలకు మార్గనిర్దేశనం చేస్తారీ ఎడ్యుకేషనిస్టు. అలాగే అబ్బాయిలు ఎలా పెళ్లి చేసుకోవాలో, ఎలా ఆర్థికంగా స్థిరపడాలో హీరో రామ్‌చరణ్‌ను చూసి నేర్చుకోవాలని సరదాగా చెబుతుంటారు. అలా రిచ్‌గా ఎలా రూపొందాలో తరచూ చెప్పే మంత్రిగారు, ఇప్పడు ఆ రిచ్‌నెస్‌ను ఎలా కాపాడుకోవాలో యోచించి.. అలా కష్టపడి సంపాదించిన దానికి ట్యాక్స్ కట్టకపోవడమే మార్గంగా ఊహించి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ‘ట్యాక్స్లెస్ కంట్రీ’గా ఇండియాను రూపొందించే పనిలో పడ్డారు. ఇక్కడ పన్ను బాధలేదు.. నిజానికి పన్ను బాధలేని దేశాలు చాలానే ఉన్నాయి. కొన్ని చోట్ల కాస్తో కూస్తో కడితే చాలు. మంత్రి గారి మాటలు నిజమైతే మనమూ ఇలా హ్యాపీగా ఉండొచ్చు.. మచ్చుకు కొన్ని.. ► యూఏఈలో వ్యక్తిగత ఆదాయ పన్ను మాటే లేదు. జనం ఎంత సంపాదించుకున్నా ఎలాంటి పన్నులూ ఉండవు. పైగా విదేశాల వారూ ఇక్కడ ఆస్తులు కొనుక్కోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. అందుకే చాలామంది యూఏఈలో సెటిల్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. ► దక్షిణ అమెరికా ఖండంలో అందమైన బీచ్‌లు, కేసినోలతో అలరారే పనామా దేశం పన్ను రహిత స్వర్గంగా పేరుపొందింది. ఇక్కడి జనం ఆదాయ పన్ను కట్టే పనిలేదు. విదేశాల్లో వ్యాపారం చేసి సంపాదించిన డబ్బుకూ పన్ను కట్టనక్కర లేదు. దేశంలో చేసే వ్యాపారంపై మాత్రం, అదీ స్వల్పస్థాయిలో పన్నులు కడితే చాలు. ► బహమాస్‌లోనూ వ్యక్తిగత ఆదాయ పన్ను లేదు. అక్కడ స్థిరాస్తులు కొనుగోలు చేస్తే శాశ్వత నివాస అవకాశమూ ఉంటుంది. ► గల్ఫ్ దేశాలైన ఖతార్, కువైట్ కూడా ప్రజల నుంచి ఎలాంటి ఆదాయ పన్ను వసూలు చేయవు. వాణిజ్య కార్యకలాపాలపై మాత్రం ఖతార్‌లో పదిశాతం, కువైట్‌లో 15 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. ► మరో గల్ఫ్ దేశం ఒమన్‌లో వ్యక్తిగత ఆదాయ పన్ను మాత్రమే కాదు.. ఆస్తి పన్ను, స్థిరాస్తులపై పన్ను వంటివీ లేవు. ► ఆధునిక సదుపాయాలకు నిలయమైన బెర్ముడాలోనూ పౌరులకు ఆదాయ పన్ను లేదు. ► మొనాకో, సైమన్ ఐలాండ్స్, వనౌటు వంటి దేశాల్లోనూ ఎలాంటి వ్యక్తిగత ఆదాయ పన్ను లేదు. వనౌటు దేశం అయితే డ్యూయల్ సిటిజన్ షిప్‌ను అధికారికంగానే అంగీకరిస్తుంది. ► యూరప్‌లో ఫ్రాన్స్, స్పెయిన్‌ల మధ్య స్వతంత్ర పాలిత ప్రాంతమైన ఆండోరాలో వ్యక్తిగత ఆదాయ పన్ను కేవలం పది శాతం, అదీ గరిష్ఠంగా 40 వేల యూరోలకే పరిమితం. వారసత్వ ఆస్తులు, బహుమతులపై ఎలాంటి ట్యాక్సులూ ఉండవు. ... మొన్నటికి మొన్న బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు జరుగుతుంటే, ఆ జెండా నుంచి గులాబీ రేకుల్లాగే... సగటు, వేతన జీవుల కళ్లల్లో, ఇంకా చెప్పాలంటే ధనిక, పేద తేడా లేకుండా అందరి కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలిపడ్డాయి. కళ్ల ముందు పైన చెప్పిన పన్నులేని దేశాలు యూఏఈ, ఖతార్, కువైట్ ఇత్యాదులు అక్కడి ప్రజల ఆనందం కళ్లముందు కదలాడాయి. మల్లారెడ్డి హామీ ఇచ్చిన ‘ఐటీ దాడుల్లేని స్వప్నలోకం’ ఆవిష్కృతమైంది. ఇక ప్రతి బడ్జెట్లో ఆదాయ పన్ను శ్లాబులు మారతాయా అని కామన్ మ్యాన్ ఆశగా చూడక్కర్లేదు. డోర్ బెల్ మోగితే ఐటీ పటాలమేమోనని రిచ్‌మ్యాన్ గాబరా పడక్కర్లేదు. మన డబ్బంతా మనకే.. ... ఇప్పుడందరి చూపూ 2024 వైపే, అందరి ఆశా ఒక్కటే.. బీఆర్ఎస్ ఎర్రకోట ఎక్కాలి.. మల్లారెడ్డి ఆర్థిక మంత్రి కావాలి.. అంతే. (క్లిక్ చేయండి: పొలిటికల్ తిట్లలో పోషకాలెక్కువ...) -
పొలిటికల్ తిట్లలో పోషకాలెక్కువ...
ఇప్పుడు ఓ చందమామ కథ చెప్పుకుందాం,. అనగనగా ఓ ఊర్లో ఓ గయ్యాళి గంగమ్మ ఉండేది. ఆమె నోటికి ఊరంతా హడలిపోయేది. ఇంట్లో ఉన్న భర్తను, పిల్లలను నానా తిట్లు తిడుతుండేది. ఆమె ఇంటి ముందు నుంచి ఊరివారెవరైనా వెళ్లడానికే భయపడేవారు. ఆమె తిట్లు అంత ఘాటుగా ఉండేవి. ఆమె నోటికి దడిచి కొడుకుకు పిల్లను ఇవ్వడానికి కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరికి అతని పరిíస్థితి అర్థం చేసుకుని, ప్రేమించిన తెలివైన అమ్మాయి ఓ సాధువును ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న సాధువు గంగమ్మను మార్చాలని ఆ ఇంటికి వెళ్లాడు. ఆ ఇంటికి వెళ్లిన సాధువు ఆమె నోటితీరుకు, ఆమె తిట్లకు అవాక్కయ్యాడు. కాసింత తేరుకుని.. ఆమె మారదని నిర్ణయించుకుని, కాసింత మంత్ర జలం తీసి.. ‘‘ఇక నుంచి ఎప్పడు ఎవరు ఎవరిని తిట్టినా తిట్ల దెయ్యం ప్రత్యక్షం అవుతుంది. తిట్లు సమంజసమే అయితే ఇబ్బంది పెట్టిన వారిని, లేకుంటే అకారణంగా తిట్టిన వారిని తిట్ల దయ్యం ఏడిపిస్తుంది లేదా తినేస్తుంది’’ అని శపించి వెళ్లిపోయాడు. ఆ మరుక్షణం తిట్లభూతం ప్రత్యక్షమై గంగమ్మ ఇంట్లో వీరంగం వేసింది. గంగమ్మ నోరు మూతపడి... పిల్లల ప్రేమ పెళ్లికి వెళ్లింది... కథ కంచికి వెళ్లింది. ఇప్పుడా తిట్ల భూతాలు రాజకీయ నాయకుల ఇంటివద్ద.. పార్టీ ఆఫీసుల వద్దా తిరుగుతున్నాయట. మొన్న మునుగోడు ఎన్నికల సమయంలో వీధుల్లో వీరంగం వేసినవి కూడా ఇవేనట! ఈ మధ్య తిండిపై బాగా ధ్యాస పెరిగింది. తినేది ఆర్గానికా, కాదా... క్యాలరీ ఫుడ్డా కాదా... ఇలా తర్జన భర్జనలు బాగా పెరిగాయి. ఏంతింటే మంచిదో డైటీషియన్లను, మంతెన సత్యనారాయణ రాజు లాంటి వారిని అడగడం ఎక్కువ యింది. నిజానికి ఏం తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందో, శక్తి వస్తుందో మన ప్రధానిని అడిగితే తెలుస్తుంది. రోజూ రెండుమూడు కేజీల తిట్లు.. ‘‘మోదీజీ మీరు అలసిపోరా.. అని ఇటీవల కొంతమంది నన్ను అడిగారు. వారికి నేనిచ్చిన సమాధానం ఏమిటో తెలుసా, రోజూ నేను 2, 3 కేజీల తిట్లు తింటున్నా. అవన్నీ ప్రొటీన్‌గా మారేలా నన్ను దేవుడు ఆశీర్వదించాడు. మనను తిట్టే తిట్ల గురించి మనం పట్టించుకోవద్దు. కార్యకర్తలు మజా చెయ్యాలి. 20–22 ఏళ్లుగా రాత్రీ పగలు తేడా లేకుండా నన్ను తిడుతూనే ఉన్నారు... వాటిలో చిత్ర విచిత్రమైన తిట్లు ఉన్నాయి. వాటివల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. ’’ హైదరాబాద్‌లో సభాముఖంగా ప్రధాని చెప్పిన చిట్కా ఇది. అందరూ, ముఖ్యంగా రాజకీయ నాయకులు పాటించదగ్గది. నడక నుంచి పరుగులు.. రాహుల్ గాంధీ చలో జోడో యాత్ర అంటూ నడక మొదలు పెట్టి, దేశమంతా తిరుగుతూ మన రాష్ట్రంలోకి వచ్చే సరికి ఏకంగా పరుగులు మొదలు పెట్టారు. మిగతా వారంతా ఆయనతో పరుగెత్తలేక అలసిపోయారు. మిగతా పరుగులు మహారాష్ట్రలో చేసుకోండి అంటూ ఆయాస పడి చెతులేత్తేశారట.. అంటే మోదీ భాషలో చెప్పాలంటే రాహుల్ గాంధీకి తిట్లు బాగానే వంటబట్టినట్టున్నాయి. తనీ స్థాయికి రావడానికి చిత్రవిచిత్రమైన తిట్లే అంటున్న ప్రధాని మాటలు విన్నారా రాహుల్ జీ! తిట్లకు వెరవకండి. వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలైన తిట్లు, రకరకాల రుచుల్లో ఉంటాయి. హాయిగా తినండి. మీరు కూడా ఏనాడో ఒకనాడు మోదీ స్థాయికి చేరతారు. ప్రొటీన్ ఫార్ములా... కొద్ది నెలలుగా రాష్ట్ర రాజకీయాల్లో వేడి.. అకస్మాత్తుగా బీజేపీలో పోరాటపటిమ పెరిగాయి. దీనికి ఇంత శక్తి రావడానికి టీఆర్ఎస్ అందునా కేసీఆర్ పవర్ఫుల్ తిట్లే కార ణంగా తోస్తోంది. వీళ్ల తిట్లలో బాగా పోషకాలు ఉన్నట్టున్నాయి. రోజురోజుకూ బీజేపీ కార్యకర్తలు బలం పుంజుకుంటున్నారు. ‘‘ ..పిస్సగాడిద కొడుకు, రండ మంత్రి, చేవ లేని దద్దమ్మ, బుట్టాచోర్, కిరికిరి గాళ్లు...’’ మోదీ అన్నట్టు ఇట్లాంటి చిత్ర విచిత్ర తిట్లలో ఎన్ని పోషకాలుంటాయి మరి!.. అందుకే బీజేపీ కార్యకర్తలు బలం పుంజుకుని విజృంభించేస్తున్నారు. ఈ ప్రొటీన్ ఫార్ములా అన్ని పార్టీలకు వర్తిస్తుందని బీజేపీ నాయకులు విస్మరించి నోరు జారు తున్నట్టున్నారు. అలా నోరు జారడం వల్ల మొన్న ఓ ఎంపీ ఇంటిముందు తిట్ల భూతాలు ఎలా వీరంగం చేశాయో చూశాం కదా. పైన మనం చెప్పుకున్న కథలోలాగా తిట్ల భూతాలు తప్పెవరిదైనా వదలవు. తిట్లతో పోషకాలే కాదు. ప్రాబ్లెమ్స్ తప్పవన్న మాట. ఇక ఏం పర్లేదు అనుకుని రిలాక్సయిన టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులూ ఒక్కసారిగా మేల్కోని యాక్టివయ్యింది, బలపడుతోంది, నోరు జాడిస్తోంది... నేషనల్ లెవల్ ఇంపోర్టెడ్ తిట్లనుంచి, లోకల్ నేతల నాటు తిట్ల నుంచీ గ్రహించిన పోషకాలతోనేనని బీజేపీ నాయకులు కూడా గుర్తించి జాగ్రత్త పడాలి. ప్రజల తిట్లు మరింత పవర్ఫుల్.. ఇప్పడు ముఖ్యమంత్రి, ప్రధానితో సహా, అన్ని కేంద్ర, రాష్ట్ర మంత్రులు, నాయకుల నోటి నుంచి వస్తోన్న సేమ్ విమర్శ.. ‘ఊరికే నోరు పారేసుకోవడం, తిట్టడం తప్ప, మేం చేస్తున్న డెవలప్మెంట్ను చూసేదేలేదు...’ అని. నిజమే, రాజకీయ నాయకులు డెవలప్మెంట్ చూడరు, తిట్లు తిడతారు, తింటారు కానీ, డెవలప్మెంట్ చూసే సెక్షన్ కూడా ఉంది. వాళ్లే కామన్‌పీపుల్. ‘‘రోడ్డు వేయించే మొహాల్లేవు కానీ, ఓటు వెయ్యాలట ఓటు! ఐదొందలు, వెయ్యి చేతుల పెట్టి, సిగ్గు శరం లేదా ఓటడగడానికి. గెలిపియ్యుర్రి డబ్బులు తీసుకుని. మన బతుకులు నాశనమైతయి..’’ ‘మా గల్లీకి ఏ పార్టోల్లూ ప్రచారానికి రాకండి...మేం ఓట్లేయం. మీకు ఎప్పటికీ బుద్ది అస్తలేదు..’’ ఎలక్షన్ టైంలో ఇలాటి తిట్లు వింటుంటాం. ఇవి డెవలప్మెంట్ చూస్తున్న జనం.. నాయకులకు కంచాల నిండా పెడుతున్న తిట్లు.. తినలేనంతగా, అరిగించుకోలేనంతగా. ఈ తిట్లకూ పోషక విలువలు ఉంటాయంటారా?... మోదీ భాషలో ఉండవచ్చు కానీ, ప్రజల తిట్లతో బలం రాజకీయ నాయకులకు రాదు ప్రజాస్వామ్యానికి వస్తుంది. పైగా, పైన కథలో..సాధువు క్రియేట్ చేసిన తిట్లభూతం... న్యాయం వైపు ఉంటదని, అన్యాయం చేస్తే తింటదని చెప్పుకున్నాం కదా! ... సో తిట్లు జాగ్రత్తగా ఎంచుకొని తినండి. -సరికొండ చలపతి -
.... ఉప ఎన్నికలూ జిందాబాద్!
(ఇది కల్పితమే, కానీ అందరినీ ఉద్దేశించిందే.. – ముందస్తు డిస్‌క్లెయిమర్) నల్లధనంలా నిగనిగలాడుతున్న అమావాస్య చీకటి..అంత చీకట్లోనూ మోదీ కొత్త రెండువేల రూపాయి నోటులా తళతళలాడుతున్న ఓ ఇల్లు.. ఆ ఇంటిలోకి దూరాడో దొంగ.. ఎదురుగా నిలువెత్తు సాయిబాబా ఫొటో..దాని కింద కాస్త పెద్ద అక్షరాలతో ‘పరాయి సొమ్ము ఆశించడం పాపం..’ అని రాసి ఉంది. అది చదివి లెంప లేసుకుని, సాయిబాబాకు దండం పెట్టుకుని వెనక్కు తిరిగాడు. మన దొంగ సాయిబాబా భక్తుడు.. అంతటివాడి మాటను కాదంటాడా! వెనక్కు తిరిగి వెళ్లిపోదామనుకున్న దొంగకు గుమ్మంపైన ఆ ఇంటి ఓనరు ఫొటో కనపడింది.. కాస్త అదో రకం నవ్వుతో. వెంటనే దొంగ ఇలా అనుకున్నాడు... ‘ఇదంతా పరాయి సొమ్ము ఎలా అవుతుంది. మనసొమ్మేగా తప్పేంలేదు’ అనుకుని చేతికందింది పట్టుకు పోయాడు.. ఆ ఇంటి ఓనరెవరో మీకు తెలిసే ఉంటుంది. ...లేకుంటే చివరిలో చూద్దాం... ............ ఇక అసలు విషయానికొద్దాం.. ఈ మధ్య అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై, జనాభివృద్ధిపై, పేదరికంపై జరుగుతున్న పరిశీలనలు, చూపిస్తున్న సూచికలు విపక్షాల విమర్శల్లాగే తప్ప..సరిగ్గా లేనట్లుంది... మొన్నటికి మొన్న ఆకలి సూచిలో 107 స్థానానికి మనను నెట్టాయి. మునుగోడుకు ఆ బృందాలను పంపి పరిశీలించ మనండి. వాళ్ల అంచనాలన్నీ తలకిందులైపోవూ! ప్రజల శ్రేయస్సు కోరి నియోజకవర్గంలోనే తిరుగుతున్న రాష్ట్ర, కేంద్ర మంత్రులు... పొద్దున లేవగానే మంచి చెడుల పరామర్శలు, పనుల్లో పాలు పంచుకుంటూ వందలాది నాయకులు. (వెయ్యి ఓట్లున్న గ్రామంలో అన్ని పార్టీలు కలిపి.. 150 వాహనాలు.. నాలుగైదు వందల కార్యకర్తలు ఎప్పుడూ కనపడుతున్నారట) –ఇంతకు మించి పాలన ఏమి ఉంటుంది? తలలు తెగిపడుతున్న నాటుకోళ్లు, యాటలు... బిర్యానీ పొట్లాల పెళపెళలు... ఐదు రూపాయలకే భోజనం అని ఆహ్వానిస్తున్న హోటళ్లు – ఆకలిసూచిక పొలమారుతోంది... బస్సుల్లో తీసుకువచ్చి హైదరాబాద్‌లో కార్పొరేట్ వైద్యం చేయించడం, బంకుల్లో రెండు లీటర్ల ఫ్రీ పెట్రోల్, జనం చేసిన అప్పులు తీర్చ డానికి ఆర్థిక సాయం, 20 వేలనుంచి 30 వేల దాకా నడుస్తున్న ఓటు వేలం పాట.. – మానవాభివృద్ధి సూచిక పరిగెత్తించడానికే కదా! యాదాద్రి లాంటి గుళ్లలో ఫ్రీ దర్శనాలు (ప్రమాణానికే అనుకోండి), కాసిన్ని విందులతో ఆనంద విహారాలు, మంచింగ్లు, మందు బాటిళ్ల చప్పుళ్లు. – హ్యాపీ ఇండెక్స్ చిద్విలాసమే కదా! ఎలాగైనా జనం జేబుల్లో డబ్బు చేర్చాలని తహతహలాడే పార్టీలు‘హవాలా’ రిస్కుకూ వెనుకాడడం లేదు... నిఘా కన్ను కప్పి చెక్‌పోస్టులు దాటి... బైకుల ద్వారా... డొంకల్లోంచి... కోట్లు తీసుకువచ్చే ప్రయత్నాలు.. – ఇంతకు మించి ప్రజాసేవ ఏముంటుంది? ఆరేళ్ల కిందట నల్లధనం బయటికి తెస్తానన్న మోదీ మాట విని నవ్వుకున్న వారు ఇప్పుడు. ‘...అరే వచ్చేసిందే’ అని తెల్లబోతున్న సందర్భం. మాది ‘బంగారు తెలంగాణ’ అన్న కేసీఆర్ మాట విని వెక్కిరించిన వారి ముఖంలో ఇప్పుడు ‘నిజమే...’నన్న ఆశ్చర్యం. సంపద పంపిణీ జరగాలని అరిచి అరిచీ అలసిపోయిన వామపక్షవాదుల కళ్లలో... ఆనంద భాష్పాలు. పక్క నియోజకవర్గాలు కూడా తమ ఆనందా నికి, అభివృద్ధి కోసమై రాజీనామా చేసే ఎమ్మేల్యేల కోసం... ఉప ఎన్నికల కోసం... ఎదురు చూస్తున్న తరుణం. – ఇది కదా ప్రజాస్వామ్య ఔన్నత్యం..! ఇక్కడ కదా ఆనందాభివృద్ధి తూనికలు, కొల మానాలు, సూచికలు లెక్కగట్టాల్సింది.. ఓ ఓటరు మాట.. ప్రస్తుతం జాతర నడుస్తోంది. ఇప్పటి దాకా చేసిందేమీ లేదు, ఇక ఎవరూ గెలిచి చేసేదేమీ లేదు... వారికి ఓట్లు గావాలే మాకు డబ్బులు కావాలే... మా అవకాశం మాది... వారి అవకాశం వారిది. ఇక్కడ మాకు నచ్చింది ఒకటే... ‘...మాకు పైసలి స్తున్నరు... అంతే.’ ఇప్పడు 100 కోట్లు పెడితే తర్వాత రెండొందల కోట్లు సంపాయిస్తడు. వాళ్లకు పోయేదేముంది.. అభివృద్ది లేదు పాడూ లేదు... ఇన్నేళ్లూ లేంది ఇప్పుడయితదా! ఎవడు డబ్బులిస్తే వాడికి ఓట్లె య్యడం మంచిది... గొడవలేకుండా. – ఆహా... ఇది కదా ప్రజాస్వామ్య స్థితప్రజ్ఞత! (మన మంత్రి నిర్మలమ్మ భాషలో చెప్పాలంటే ప్రజాస్వామ్యం విలువ తగ్గట్లే... నాయకుల ‘వ్యాల్యూ’ పెరుగుతోంది అంతే... దానివల్లే ఇన్ని వెసులుబాట్లు) ‘టీ’ వాలా ఎంట్రీ.. ముళ్లపూడి వెంకటరమణ గారి కథోటి ఉంది. ఓ ఊరిలో రోటీవాలా, బేటీవాలా అని ఇద్దరు శత్రువు లుండేవారు. ఓట్లకు నోట్లు జల్లేస్తూ... వచ్చేది పది రూపాయల లాభమైనా నూర్రూపాయలు తగలే సేంత ప్రచారం చేస్తూ పోటీ పడేవారు. వీరికి పోటీగా ‘టీ’వాలా గోదాలోకి దిగడంతో∙సీన్ ఎలా మారిపోయిందో చెప్పే సరదా ఎన్నికల కథ. ఎన్నికలయి పోయాక... నెగ్గినవాడు బాగుపడ్డాడా అని ప్రశ్నిస్తే... నెగ్గినోడు వేరు, బాగుపడ్డవాడు వేరూనూ అని సమాధానం వస్తుంది. కాసిన్ని రోజులు ఆగితే ఇక్కడా మనకు తెలుస్తుంది. బేటీవాలా, రోటీవాలా, ‘టీ’ వాలాల్లో... ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, ఎవరు బాగుపడ్డారూ.. అని. నేతల ఊకదంపుళ్లు, మైకుల సౌండ్లు, వాహనాల హారన్లు, హామీ చప్పుళ్లు, కరెన్సీ పెళపెళలు, మందు బాటిళ్ల సౌండ్ల మధ్య... ఇంకా ప్రజాస్వామ్యంపై, ప్రజా శ్రేయస్సుపై ఆశ చావని మేధావులు బలహీన స్వరంతోనైనా ఓటర్లు అలియాస్ జనాన్ని ప్రశ్నిస్తున్నారు.. ‘...ఓట్లు అమ్ముకోవడం తప్పు కదా..? అని. దానికి సమాధానం మాత్రం గట్టిగానే వస్తోంది. ‘...పంచుతున్న డబ్బులన్నీ వాళ్లు కూలీనాలీ చేసి చెమటోడ్చి సంపాదించినవా? అంతా మా డబ్బే కదా ఇవ్వనివ్వండి...’ అని. – ఇది కదా ప్రజాస్వామ్యం పరిపక్వత! ............ ఇక, పైన మనం చెప్పుకున్న దొంగ ఎవరింటికి దొంగతనానికి వెళ్లాడో, ఎవరి ఫొటో చూశాడో.. ఎందుకు అది పరాయి సొమ్ము కాదను కున్నాడో.. చెప్పనక్కరలేదనుకుంటా! -
రేషన్ షాపుల్లో కాదు.. గుండెల్లో పెట్టుకుంటాం!
‘న్యాయమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రపంచం అన్నది ప్రతి ఒక్కరి హక్కు.. నిజం చెప్పాలంటే ప్రపంచం ఏమంత బాగాలేదు’.. – ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సమావేశంలో వారం క్రితం నటి ప్రియాంక చోప్రా మాట ఇది.. .... బ్రిటన్ ను దాటి ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇండియా.. కాలరెత్తుకున్న ఇండియన్ – ఓ మెట్టు ఎక్కిన ఆర్థిక భారతం. మానవాభివృద్థి సూచీలో 132వ స్థానంలో మనం.. – విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాల్లో మరో మెట్టుజారిన పేద భారతం.. .... ఈ రెండూ దాదాపు వారం తేడాతో వచ్చిన వార్తలే. కానీ పరస్పర విరుద్ధం. ఇది చూస్తే పాత జోక్ ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఓ రిచ్ స్టూడెంట్ పేదవాడిపై రాసిన వ్యాసం.. ‘వాళ్లింట్లో తల్లి, తండ్రి, పిల్లలు అంతా పేదవాళ్లే. వారి ఇంట్లో పనిమనిషి పేదవాడే, తోటమాలీ పేదవాడే.. చివరికి కారు డ్రైవరూ బాగా పేదవాడే..’ అని.. .... ఎకానమీ గణాంకాలు ఎప్పుడూ ‘ద్రవ్యోల్బణం’లా ఉంటాయి.. అర్థమైనట్టే ఉన్నా అయోమయంగా తోస్తాయి. పెరిగాయో, తగ్గాయో తెలియదు.. ఎక్కడ, ఎందుకు పెరుగుతాయో, తగ్గుతాయో సామాన్యులెవరికీ అర్థంకాదు. ... ‘ఏమంత బాగాలేదు’.. అన్న విషయం మాత్రం అనుభవంలోకి వస్తుంది.. ఏదీ సెక్యూరిటీ? విద్య, వైద్యంతో కూడిన మానవాభివృద్థి సూచీకి ప్రాధాన్యం ఎంత ఉంటుందో ఓ నెటిజెన్ షేర్ చేసిన ఈ మెసేజ్ చూస్తే తెలుస్తుంది. ‘‘.. నేను పెద్దవాళ్లు చెప్పినట్టుగా డిగ్రీ చేశా.. మంచి ఉద్యోగం సంపాదించా.. సమాజ నియమాలకు అనుగుణంగా పెళ్లి చేసుకున్నా.. ఆర్థిక నిపుణుల సూచన మేరకు నడుచుకుని పొదుపు చేసుకున్నా. రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నా.. క్రెడిట్ కార్డుల జోలికి వెళ్లనే లేదు. సర్కార్ చెప్పినట్టుగా ట్యాక్స్‌లు కట్టా.. లైఫ్ అంతా మంచి సిటిజెన్‌గా ఉన్నా.. నా భార్యకు కేన్సర్ వచ్చింది. ఇన్సూరెన్స్ పోను 20 లక్షలు ఖర్చయింది. పొదుపు చేసిందంతా పోయింది. పాతికేళ్ల కష్టం రోగం పాలైంది. ఇంటి ఈఎంఐలు ఆగిపోయాయి. పిల్లల చదువులు గందరగోళంలో పడ్డాయి. ... ఇప్పుడు చెప్పండి మీరు చెప్పే నీతులపై, ఈ ప్రభుత్వాలపై నాకు ఎందుకు గౌరవం ఉండాలి? నాకు ఏం రక్షణ ఉందని నమ్మాలి. నా పిల్లల భవిష్యత్తుకు సొసైటీ, గవర్నమెంట్ ఉపయోగపడుతుందని విశ్వసించాలా? పిల్లల్ని నాలా ఒబీడియెంట్ సిటిజెన్లా పెంచమంటారా?’’ – జీవితంపైనా.. ప్రభుత్వంపైనా సంపూర్ణంగా ఆశలు పోయిన సందర్భం ఇది ఇదీ ప్రయారిటీ.. 132వ స్థానంలో ఉన్న మనం ఇలా ఉంటే.. కొద్ది సంవత్సరాలుగా ‘మానవాభివృద్థి సూచీ’లో అందరి కన్నా ముందు ఉంటున్న నార్వే ఎలా ఉందో చూద్దాం.. చమురు, సహజ వాయువు నిక్షేపాలు నార్వేకు ప్రధాన ఆదాయ వనరు. అయితే ఇలా వచ్చిన డబ్బును ఆ దేశం ప్రజాపనులు, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై ఖర్చు చేస్తుంటుంది. నార్వే అద్భుతమైన ఆరోగ్య రంగాన్ని రూపొందించుకుంది. ఎంతలా అంటే.. ఆ దేశంలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వమే ఆరోగ్య బీమా కల్పిస్తుంది. అన్నిరకాల వైద్యం ఉచితంగా అందిస్తుంది. ప్రపంచంలో అత్యంత పరిశుభ్రమైన గాలి, నీరు లభించే ప్రాంతాల్లో ఒకటిగా నార్వే పేరు పొందింది. ప్రపంచంలో అతి ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోయేది ఆ దేశంలోనే.. కాలుష్య రహిత వాతావరణం, మంచి వైద్య సదుపాయాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మంచి ఆదాయం అన్నీ ఉన్న నార్వే ప్రజల ఆయుష్షు కూడా ఎక్కువే. అక్కడివారి సగటు జీవితకాలం 82.3 ఏళ్లు. అక్కడి ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదువు పూర్తిగా ఉచితం. విదేశీ విద్యార్థులకు కూడా ఫీజులు తీసుకోరు. నార్వే ప్రభుత్వం ఆ దేశ జీడీపీలో 6.6శాతం విద్యా రంగంపైనే ఖర్చుపెడుతుంది . విద్య, వైద్యం కోసం తమ సంపాదన అంతా ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి లేకపోవడంతో ఆ దేశంలో ధనిక, పేద అంతరం మరీ ఎక్కువగా ఉండదు. ప్రతి కుటుంబం మెల్లగా ధనిక స్థాయికి ఎదిగే వాతావరణం ఉంటుంది. ఖర్చు విషయంలో వెసులుబాటు కారణంగా.. ఇప్పటితరం తమ తాతలు, తండ్రుల కంటే ఎక్కువగా విహార యాత్రలు చేయడం, ఎంజాయ్ చేయడం పెరిగింది. నార్వేలో ఉద్యోగిత రేటు 74.4 శాతం. మిగతావారు స్వయం ఉపాధి రంగాల్లో ఉంటారు. అంటే నిరుద్యోగం అతి తక్కువ. అక్కడ టెలి కమ్యూనికేషన్స్, టెక్నాలజీ రంగాల్లో చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉంటుంటాయి. డెన్మార్క్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు కూడా నార్వే తరహాలో ఉద్యోగ, ఉపాధి కల్పనలో మెరుగ్గా ఉన్నాయి. శాంతి భద్రతల విషయంలో నార్వే ప్రజలు ఎంతో సంతృప్తితో ఉన్నామని చెప్తుంటారు. రాత్రిపూట ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లడానికి ఏమాత్రం భయం అనిపించదని 88 శాతం మంది చెప్పడం గమనార్హం. ఆ దేశంలో సంభవించే మొత్తం మరణాల్లో హత్యలు అరశాతం (0.5%) లోపే కావడం గమనార్హం. ఆ దేశంలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సుమారు నాలుగు వేల మంది మాత్రమే. అక్కడి మహిళా ఉద్యోగులు గర్భం దాల్చితే.. పూర్తి జీతంతో కూడిన 8 నెలల (35 వారాలు) సెలవు (మెటర్నిటీ లీవ్) ఇస్తారు. లేదా 80 శాతం జీతంతో పది నెలలు (45 వారాలు) సెలవు తీసుకోవచ్చు. అవసరమైతే తండ్రులు కూడా పెటర్నిటీ లీవ్ తీసుకునే అవకాశం ఉంటుంది. పిల్లలు పుట్టిన మూడేళ్లలోపు 12 వారాల పాటు వేతనంతో కూడిన సెలవు ఇస్తారు. ఇదేం చారిటీ ..! ఈ మధ్య ఓ రేషన్ షాప్ ముందు స్టాండప్ కామెడీ సీన్ ఒకటి జరిగింది. సాక్షాత్తూ దేశ ఆర్థిక మంత్రి పేదవారికి ఇచ్చే కిలో బియ్యంలో కేంద్రం, రాష్ట్రవాటాల లెక్కలేశారు. పేదవారికి పెడుతున్న తిండిలో తమ వాటా 28 రూపాయలనీ, రాష్ట్రం వాటా 4 రూపాయలనీ, ప్రజల వాటా ఒక్క రూపాయనీ తేల్చారు. తమ వాటా ఇంత ఉండగా ప్రధాని మోదీ ఫొటో ఏదని నిలదీశారు... (క్లిక్ చేయండి: సదా.. మీ ‘చెప్పు’ చేతుల్లోనే..) ‘‘.. ఓ దేశం పేదరికాన్ని దాటడమనేది ‘చారిటీ’ కాదు. సహజ న్యాయంగా జరగాలి’’ అన్న నెల్సన్ మండేలా మాట ఆ సమయంలో గుర్తుకొచ్చి ఉంటే బాగుండేది. సహజన్యాయం జరిగితే... నేతలు తమ ఫొటోలను రేషన్ షాపుల్లో వెతుక్కోనక్కర్లేదు. అందరి ఇళ్లలో, గుండెల్లో అవి కనిపిస్తాయి. మానవాభివృద్థి సూచీ దానికదే పరుగులు పెడుతుంది. (క్లిక్ చేయండి: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) -
సదా.. మీ ‘చెప్పు’ చేతుల్లోనే..
నాటకాలు బాగా ప్రదర్శిస్తున్న రోజుల్లో ఓ సరదా సంభాషణ ప్రాచుర్యంలో ఉండేది. ‘ఏమోయ్.. నాటకం బాగా రక్తి కట్టిందటగా ఏ మాత్రం కలెక్ష వచ్చిందేమిటి?’.. కొంచెం వ్యంగ్యంగా అన్న ప్రశ్నకు.. ‘మహా బాగా వచ్చాయి.. బాటా తొంభై, నాటు నలభై.. అన్నీ ఎడమ కాలివే..’ అని నిష్ఠూరపు సమాధానం. ఇప్పుడు నాటకాలు పాలిటిక్స్‌లో బాగా రక్తి కడుతుండడంతో ఆ బాటా, నాటు జోళ్ల అవసరం, ప్రస్తావన ఇక్కడ బాగా పెరిగింది.. ఏదైనా పరస్పర విరుద్ధం అని చెప్పడానికి ఉప్పు, నిప్పు అంటారు. రాజకీయాల్లో విరుద్ధమైన రెండింటికీ ‘చెప్పు’ ఒక్కటే చాలు. స్వామిభక్తిని చాటడానికైనా. నిరసన తెలప డానికైనా.. ‘చెప్పు’ చేతపడితే చాలు. ఇలారండి .. భారత రాజకీయాలు ఎలా చెప్పుచేతుల్లో ఉన్నాయో చూద్దాం.. ‘షూ’ట్ ఎట్ షార్ట్‌కట్.. నిజానికి చెప్పుల కథ ఎప్పుడు మొదలైందో చెప్పడం కష్టంగానీ.. రామ భరతుల కాలంనాటి ‘పాదుకా పట్టాభిషేకం’ మనకు ఎరుకే. ఆ తర్వాత బాగా పాపులర్ అయ్యింది.. ఎమర్జెన్సీ రోజుల్లో నాటి యూపీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ. అసలు ఏ అధికార పదవిలోనూ లేని సంజయ్ గాంధీ చెప్పులు తివారీ చేతందు కోవడం మొదలు తరచుగా నాయకులు పాదుకా స్పర్శలో ‘అమితా’నందాన్ని పొందుతూనే ఉన్నారు. నిన్నటి బండి సంజయ్ – అమిత్ షా చెప్పుల ఉదంతం చూశాం... ఎప్పుడో 2015 నాటి నారాయణసామి – రాహుల్ చెప్పుల కథను ప్రధాని మోదీ ప్రస్తావించడం.. ఇప్పుడది ట్రోల్ అవుతుండటం చూస్తున్నాం.. నాడు రాహుల్ కాళ్లకు ఎక్కడ బురద అంటుకుంటుందోనని.. కాంగ్రెస్ నేత నారా యణసామి చెప్పులు చేతబట్టుకుని మరీ కాపలా కాశారు. రాహుల్ బూట్లు అలా విప్పగానే చటుక్కున తన చెప్పులు ఆయన కాళ్ల వద్ద పెట్టి స్వామి భక్తిని ‘చెప్పు’కున్నారు. ‘రాహుల్ వంటి సీనియర్‌ను గౌరవించుకోవడం తప్పా..?’ అని కూడా ఈ 68 ఏళ్ల వయసున్న పెద్దాయన అప్పట్లో చెప్పారు. 2010లో మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి రమేశ్ బాగ్వే ముంబైకి వచ్చిన రాహుల్ గాంధీ చెప్పులను కాసేపు ‘గౌరవం’గా చేత పట్టుకున్నారు. ఇదే రాహుల్‌గాంధీ ఆమధ్య కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై ‘చెప్పు’డు విమర్శ లకు దిగారు. తాము అమిత్‌షా నివాసానికి వెళితే ఇంటి బయటే చెప్పులు విప్పించారని, లోపల అమిత్‌షా మాత్రం చెప్పులు వేసుకునే ఉన్నారని మణిపూర్ ప్రజాప్రతినిధులు తనతో చెప్పారంటూ.. అమిత్‌షా క్షమాపణ చెప్పా లంటూ డిమాండ్ చేశారు కూడా. కొన్నేళ్ల కింద బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతి.. ప్రభుత్వ అధికారులు ఉన్నది తమ చెప్పులు మోసేందుకే అన్నట్టుగా మాట్లాడారు. తర్వాత క్షమాపణలు చెప్పుకున్నా రనుకోండి ‘షూ’ట్ ఎట్ ఫైట్ ఇక యూపీలోని సంత్ కబీర్‌నగర్‌లో ఇద్దరు బీజేపీ నేతలు పబ్లిక్ ముందే చెప్పులాటకు దిగారు. శిలాఫలకంపై తన పేరు లేదన్న ఆగ్రహంతో ఊగిపోయిన బీజేపీ ఎంపీ శరద్ త్రిపాఠీ.. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ బఘేల్‌ను చెప్పుతో కొడితే.. రాకేశ్ తిరిగి లెంపకాయతో బదులిచ్చారు. ‘షూ’ట్ ఎట్ సైట్ ఎప్పుడూ భక్తి తన్మయత్వమేనా.. అప్పు డప్పుడూ నిరసనల కోపం కూడా చెప్పులను చేతబట్టించింది. ► 2009లో దైనిక్ జాగరణ్ రిపోర్టర్ జర్నైల్ సింగ్ నాటి కేంద్ర మంత్రి చిదంబరంపై విసిరిన బూటు దేశంలో కలకలం రేపింది. ► 2016లో యూపీలోని సీతాపూర్ జిల్లాలో రోడ్‌షో చేస్తున్న రాహుల్ గాంధీ వైపు హరిఓం మిశ్రా అనే సామాజిక కార్యకర్త విసిరిన నిరసన బూటు దూసుకొచ్చింది. 2012లో డెహ్రాడూన్‌లో జరిగిన ఓ రాజకీయ సభలోనూ రాహుల్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ► 2016లోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రెస్మీట్లో మాట్లాడుతుంటే.. వేద ప్రకాశ్ శర్మ అనే రాజకీయ కార్యకర్త చెప్పు విసిరి తన నిరసన చెప్పుకున్నాడు. ► విమానంలో బిజినెస్ క్లాస్ సీటు ఇవ్వలేదంటూ శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిరిండియా సిబ్బందిని చెప్పుతో కొట్టిన ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలూ వచ్చాయి. ► అప్పట్లో కర్ణాటక సీఎంగా ఉన్న యడ్యూరప్పపై చెప్పుదాడి జరగడంతో.. చెప్పుల లొల్లి చెప్పలేనంత తలనొప్పిగా మారిందని నాటి ఎలక్షన్ కమిషనర్ ఖురేషీ తల పట్టుకున్నారు. ఈ ‘ట్రెండ్’ను ఆపడానికి ఏదో ఒకటి చేయాలనీ అన్నారు. ‘షూ’ట్ ఎట్ హైట్ కొందరు రాజకీయ నేతలు చెప్పుల ఎత్తు పెంచుకుని.. కొత్త ఎత్తులకు వెళ్లారని పాశ్చాత్య మీడియా అప్పుడప్పుడూ కోడై కూస్తుంటుంది. లీడర్ల అసలు ఎత్తుకు, అధికారికంగా చెప్పే ఎత్తుకు సంబంధం ఉండదని అంటూ ఉంటుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎత్తు బూట్లు వేసుకుని ఎత్తయిన వ్యక్తిలా కనిపించే ప్రయత్నం చేస్తారని అది ఆయన విజయ రహస్యమనీ చాలాసార్లు వార్తలూ వచ్చాయి. కొన్నేళ్ల కింద అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలవడానికి వెళ్లిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎత్తు చెప్పులు వేసుకెళ్లారని గోల చేశారు కూడా. ఇక మన దీదీ మమతా బెనర్జీ హవాయి చెప్పుల ‘సింప్లిసిటీ’కి ఎంత ఇమేజ్ ఉందో తెలిసిందే కదా! నువ్వేం ‘షూ’టర్? అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జార్జ్ బుష్‌పై ఓ నిరసనకారుడు బూటు విసిరాడు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఓ జోక్.. బూటు విసిరిన వ్యక్తికి జడ్జి మూడేళ్లు జైలుశిక్ష వేశారు. ‘కేవలం బూటు విసిరితే మూడేళ్లు జైలా?’ అని నిందితుడు వాపోతే.. ‘కాదు.. విసిరినందుకు ఒక్క ఏడాదే.. అది తగలకుండా మిస్సయినందుకు మిగతా రెండేళ్లు జైలు’ అని జడ్జి ఆగ్రహం! (క్లిక్: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) ఇది ‘షూ’పర్.. పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికి మన అమ్మల చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం ‘చెప్పు’ లేనట.. ఆ భయం చూపి.. అల్లరిపిల్లలను దారిలో పెడుతున్నారని సరదా కామెంట్. ఇలా అమ్మలు వారి ఆయుధాన్ని విరివిగా వాడి పిల్లలను డిసిప్లిన్‌లో పెడితే... ముందు తరాల రాజకీయాల్లో చెప్పుల అవసరం బాగా తగ్గుతుందని ఓ నెటిజన్ ఉవాచ. -
75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!
జెండా పండుగ అయిపోయింది.. ఇక ఆ రంగు లైట్లు ఆర్పేసి ఇటు రండి.. తొమ్మిదేళ్ల దళిత విద్యార్థి ఇంద్రా మేఘ్వాల్ చిత్రపటం వద్ద పెట్టిన కొవ్వొత్తుల వెలుగులో... చీకట్లు చూద్దాం. ఒక గ్లాసుడు నీళ్లు.. పోయిన చిన్న ప్రాణం. అగ్రవర్ణం దాహార్తికి చిన్నబోయిన త్రివర్ణాలు కనిపిస్తాయి. ఇది ‘..అనుకోని సంఘ టన’ అని సర్దిచెప్పుకునే లోపే.. ‘కాదు.. అనునిత్యమే’ అన్నమాట రీసౌండ్‌లా ‘జనగణమన’కన్నా ఎక్కువ శబ్దంతో మన చెవుల్లో మారుమోగుతుంది. – ఇదీ సామాజిక భారతం రోడ్లపై వేలాది జెండాల ప్రదర్శనలు, వాట్సాప్ డీపీలు, ధగధగా మెరిసే కాంతుల అలంకరణలు, గొప్పగా సంబురాలు.. వీటన్నిటి మధ్య బిల్కిస్ బానో సామూహిక అత్యాచార దోషులకు స్వాతంత్య్ర దినోత్సవం ఇచ్చిన స్వేచ్ఛా వాయువులు. వారి మెడలో పూలదండలు, పంచుకున్న మిఠాయిలు.. అమృతోత్సవాలను చేదెక్కించ లేదూ! – ఇదీ రాజకీయ భారతం ‘కలకత్తా ఫుట్‌పాత్‌లపై ఎందరో గాలివానల్లో తడుస్తున్నారు వాళ్లను అడగండి పదిహేను ఆగస్టు గురించి ఏమంటారో..’ .. 1947లో స్వాతంత్య్రం వచ్చిన రోజున మాజీ ప్రధాని వాజ్‌పేయి రాసుకున్న కవిత ఇది.. ఉత్సవాలు జరిగిన మరునాడే (ఆగస్టు 16న) వాజ్‌పేయి వర్ధంతి జరిపినవారిలో ఎవరైనా.. ఆయన గుర్తుగానైనా.. ఫుట్‌పాత్‌లపై ఉన్న వారిని అడిగి ఉంటారా ‘..ఆగస్టు 15 గురించి ఏమంటారూ’ అని.. – వృద్ధిరేటు 75 ఏళ్లుగా పెరిగీ పెరిగీ హైరైజ్ భవనాల్లో చిక్కుకునిపోయిందని, అక్కడి నుంచి ఫుట్‌పాత్ దాకా రాలేదని తెలిసేది కదా! – ఇదీ ఆర్థిక భారతం ‘..దేశభక్తి, అఖండత అని ఒకటే అంటున్నారు.. మేం దేశభక్తి ఎలా చాటుకోవాలి? మా ఇంటిపై జెండా ఎగురవేసే కదా..? మరి జెండా ఎగురవేయడానికి మాకు ఇల్లు ఏది?..’ ..ఇది ఏ సామాన్యుడో అన్నది కాదు.. గరీబోళ్ల సీఎం టంగుటూరి అంజయ్య 1970లో అన్నమాట! మరి ‘ఇంటింటికీ జెండా పండుగ’.. అంటూ జెండాలు పంచిన నాయకులకు ఈ ప్రశ్న ఏమైనా ఎదురై ఉంటుందా.. బధిర శంఖారావంలా! – ఇదీ నేటి జన భారతం హుందాతనం, ఆత్మగౌరవం, సమన్యాయం.. చైతన్యం, సమున్నత మానవ విలువలు, సామాజిక న్యాయం, లౌకిక భావన, సౌభ్రాతృత్వం.. ఆదా యాల్లో, అంతస్థుల్లో, అవకాశాల్లో, సౌకర్యాల్లో.. సమానత్వం తెచ్చుకుందాం అని 75 ఏళ్ల క్రితం రాసుకున్న రాతలు రాజ్యాంగం పుస్తకాన్ని దాటి బయటికి రానట్టున్నాయ్.. – ఇదీ గణతంత్ర భారతం ... వీటన్నింటినీ అంబేద్కర్‌కు వదిలేసి మన నేతలు ఏం చేస్తున్నారో చూడండి. ► గాంధీ, గాడ్సేల ఎత్తును భారతీయత స్కేలుతో కొలిచి.. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువని తేల్చు కునే పనిలో తీరిక లేకుండా మునిగిపోయారు. ► ఇన్నేళ్లూ నెహ్రూ, గాంధీల పాలనలోనే భారతావని నడిచినా.. ఇప్పుడు క్విట్ ఇండియా స్ఫూర్తిగా దేశాన్ని ఏకం చేస్తామంటూ అదే గాంధీలు కొత్తగా ‘జోడో యాత్రలు’ చేస్తున్నారు. ► గాంధీ, నెహ్రూలపై విద్వేషం చిమ్ముతూ కొందరు.. నెహ్రూ కూడళ్లలో జనగణమన పాడుతూ గాంధీకి వెకిలి మకిలి పూస్తే జాగ్రత అని హెచ్చరిస్తూ మరికొందరు.. 75 ఏళ్ల తర్వాత కూడా అవే పేర్లు, అదే స్మరణ, అదే రాజకీయం.. ► 75 ఏళ్ల క్రితం గీసిన విభజన రేఖలు.. ఇప్పుడా దూరాన్ని మరింత పెంచాయి. రెండు వర్గాల మధ్య అపనమ్మకాన్ని, అగాధాన్ని ఎగదోస్తూ.. ‘లౌకికం’ అన్న మాటను ఫక్తు రాజకీయం చేశాయి. మన మట్టి మీదే పుట్టి పెరిగినా.. త్రివర్ణ పతాకం చేతపట్టి మేమూ భారతీయులమే అని చెప్పుకోవాల్సిన దుఃస్థితికి తెచ్చాయి. ► దేశ విభజన నాటి హింసాకాండ, విధ్వంసాలు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. మానిపోతున్న గాయాలను కెలుకుతూ విభే దాలకు ఆజ్యం పోస్తూనే ఉన్నాయి. నాటి దాష్టీకాన్ని నేటికీ అంటగడుతూ.. విచ్ఛిన్నకర శక్తులంటూ పాత కాలపు చర్చను లేవదీస్తూనే ఉన్నాయి. .. ఇదీ 75 ఏళ్ల భారతం.. స్వేచ్ఛ వచ్చిందనుకున్న తొలిరోజున ఉన్నకాడే.. ఇప్పటికీ ఉన్నామని చెప్పకనే చెబుతున్న తీరు.. ఇది స్వప్నం.. స్వాతంత్య్రోత్సవాల సందర్భంగా సోషల్ మీడియాలో యువతతో నడిచిన ఓ చిట్‌ఛాట్ ఇది. ‘..నేను పుణెలో చదివా, నాలుగేళ్లు బెంగళూరులో, ఇప్పుడు తిరువనంతపురంలో ఉద్యోగం. రేపు ఎక్కడికి వెళ్తానో తెలియదు. నన్ను ఏ ప్రాంతం వాడని అడక్కండి..’ ‘..ఇదిగో వీడు అబ్దుల్లా.. అమెరికా నుంచి ఈమధ్యే దిగుమతి అయ్యాడు, ఢిల్లీ వాడే అనుకోండి. ఈ అమ్మాయి సారిక, వీడి ఫియాన్సీ. వాళ్లు రాజు, అభిషేక్, శ్రవణ్.. మేమంతా హాస్టల్ మేట్స్.. మమ్మల్ని ఏ కులం, ఏ మతం అని ప్రశ్నించకండి. అవన్నీ పాలిటిక్స్ కోసమే.. మేం భారతీయులం..’ ... కెరీర్ గోలలో కొట్టుకుపోతూ దేశం గురించి పట్టించుకోవడం లేదని యువతపై వేస్తున్న అపవాదు నిజం కాదనిపిస్తోంది. వీరిని చూస్తుంటే.. కులం, ప్రాంతం, మతం హద్దులు చెరిపేసుకుని.. అన్ని వర్ణాలనూ త్రివర్ణంలో కలుపుకొని పోతారనే ఆశలు ఇంకా మిణుకుమిణుకుమంటున్నాయి. ఇది నిజం... అట్టడుగు వర్గాలను అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టి ఆనందపడ్డా, వారి పరిస్థితి ఉన్నకాడే ఉన్నదనడానికి ఇదొక్క ‘చిత్రం’ చాలదా!