రేషన్‌ షాపుల్లో కాదు.. గుండెల్లో పెట్టుకుంటాం! | Sarikona Chalapathi Write on Political Leader Photos in Ration Shops | Sakshi
Sakshi News home page

రేషన్‌ షాపుల్లో కాదు.. గుండెల్లో పెట్టుకుంటాం!

Published Fri, Sep 30 2022 2:02 PM | Last Updated on Fri, Sep 30 2022 2:05 PM

Sarikona Chalapathi Write on Political Leader Photos in Ration Shops - Sakshi

‘న్యాయమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రపంచం అన్నది ప్రతి ఒక్కరి హక్కు.. నిజం చెప్పాలంటే ప్రపంచం ఏమంత బాగాలేదు’..
– ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సమావేశంలో వారం క్రితం నటి ప్రియాంక చోప్రా మాట ఇది..
....
బ్రిటన్‌ ను దాటి ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇండియా.. కాలరెత్తుకున్న ఇండియన్‌ 
– ఓ మెట్టు ఎక్కిన ఆర్థిక భారతం.
మానవాభివృద్థి సూచీలో 132వ స్థానంలో మనం.. 
– విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాల్లో మరో మెట్టుజారిన పేద భారతం..
....
ఈ రెండూ దాదాపు వారం తేడాతో వచ్చిన వార్తలే. కానీ పరస్పర విరుద్ధం. 
ఇది చూస్తే పాత జోక్‌ ఒకటి జ్ఞాపకం వస్తుంది.
ఓ రిచ్‌ స్టూడెంట్‌ పేదవాడిపై రాసిన వ్యాసం..
‘వాళ్లింట్లో తల్లి, తండ్రి, పిల్లలు అంతా పేదవాళ్లే.
వారి ఇంట్లో పనిమనిషి పేదవాడే, తోటమాలీ పేదవాడే.. చివరికి కారు డ్రైవరూ బాగా పేదవాడే..’ అని..
....
ఎకానమీ గణాంకాలు ఎప్పుడూ ‘ద్రవ్యోల్బణం’లా ఉంటాయి.. అర్థమైనట్టే ఉన్నా అయోమయంగా తోస్తాయి. పెరిగాయో, తగ్గాయో తెలియదు.. ఎక్కడ, ఎందుకు పెరుగుతాయో, తగ్గుతాయో సామాన్యులెవరికీ అర్థంకాదు.
... ‘ఏమంత బాగాలేదు’.. అన్న విషయం మాత్రం అనుభవంలోకి వస్తుంది..

ఏదీ సెక్యూరిటీ?
విద్య, వైద్యంతో కూడిన మానవాభివృద్థి సూచీకి ప్రాధాన్యం ఎంత ఉంటుందో ఓ నెటిజెన్‌  షేర్‌ చేసిన ఈ మెసేజ్‌ చూస్తే తెలుస్తుంది.
‘‘.. నేను పెద్దవాళ్లు చెప్పినట్టుగా డిగ్రీ చేశా.. మంచి ఉద్యోగం సంపాదించా.. సమాజ నియమాలకు అనుగుణంగా పెళ్లి చేసుకున్నా.. ఆర్థిక నిపుణుల సూచన మేరకు నడుచుకుని పొదుపు చేసుకున్నా. రిటైర్‌మెంట్‌ ప్లాన్‌ చేసుకున్నా.. క్రెడిట్‌ కార్డుల జోలికి వెళ్లనే లేదు. సర్కార్‌ చెప్పినట్టుగా ట్యాక్స్‌లు కట్టా.. లైఫ్‌ అంతా మంచి సిటిజెన్‌గా ఉన్నా..

నా భార్యకు కేన్సర్‌ వచ్చింది. ఇన్సూరెన్స్‌ పోను 20 లక్షలు ఖర్చయింది. పొదుపు చేసిందంతా పోయింది. పాతికేళ్ల కష్టం రోగం పాలైంది. ఇంటి ఈఎంఐలు ఆగిపోయాయి. పిల్లల చదువులు గందరగోళంలో పడ్డాయి.

... ఇప్పుడు చెప్పండి మీరు చెప్పే నీతులపై, ఈ ప్రభుత్వాలపై నాకు ఎందుకు గౌరవం ఉండాలి? నాకు ఏం రక్షణ ఉందని నమ్మాలి. నా పిల్లల భవిష్యత్తుకు సొసైటీ, గవర్నమెంట్‌ ఉపయోగపడుతుందని విశ్వసించాలా? పిల్లల్ని నాలా ఒబీడియెంట్‌ సిటిజెన్‌లా పెంచమంటారా?’’
– జీవితంపైనా.. ప్రభుత్వంపైనా సంపూర్ణంగా ఆశలు పోయిన సందర్భం ఇది

ఇదీ ప్రయారిటీ..
132వ స్థానంలో ఉన్న మనం ఇలా ఉంటే.. కొద్ది సంవత్సరాలుగా  ‘మానవాభివృద్థి సూచీ’లో అందరి కన్నా ముందు ఉంటున్న నార్వే ఎలా ఉందో చూద్దాం..

చమురు, సహజ వాయువు నిక్షేపాలు నార్వేకు ప్రధాన ఆదాయ వనరు. అయితే ఇలా వచ్చిన డబ్బును ఆ దేశం ప్రజాపనులు, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై ఖర్చు చేస్తుంటుంది. నార్వే అద్భుతమైన ఆరోగ్య రంగాన్ని రూపొందించుకుంది. ఎంతలా అంటే.. ఆ దేశంలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వమే ఆరోగ్య బీమా కల్పిస్తుంది. అన్నిరకాల వైద్యం ఉచితంగా అందిస్తుంది.
     
ప్రపంచంలో అత్యంత పరిశుభ్రమైన గాలి, నీరు లభించే ప్రాంతాల్లో ఒకటిగా నార్వే పేరు పొందింది. ప్రపంచంలో అతి ఎక్కువగా ఎలక్ట్రిక్‌ వాహనాలు అమ్ముడుపోయేది ఆ దేశంలోనే.. కాలుష్య రహిత వాతావరణం, మంచి వైద్య సదుపాయాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మంచి ఆదాయం అన్నీ ఉన్న నార్వే ప్రజల ఆయుష్షు కూడా ఎక్కువే. అక్కడివారి సగటు జీవితకాలం 82.3 ఏళ్లు.
     
అక్కడి ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదువు పూర్తిగా ఉచితం. విదేశీ విద్యార్థులకు కూడా ఫీజులు తీసుకోరు. నార్వే ప్రభుత్వం ఆ దేశ జీడీపీలో 6.6శాతం విద్యా రంగంపైనే ఖర్చుపెడుతుంది .
     
విద్య, వైద్యం కోసం తమ సంపాదన అంతా ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి లేకపోవడంతో ఆ దేశంలో ధనిక, పేద అంతరం మరీ ఎక్కువగా ఉండదు. ప్రతి కుటుంబం మెల్లగా ధనిక స్థాయికి ఎదిగే వాతావరణం ఉంటుంది. ఖర్చు విషయంలో వెసులుబాటు కారణంగా.. ఇప్పటితరం తమ తాతలు, తండ్రుల కంటే ఎక్కువగా విహార యాత్రలు చేయడం, ఎంజాయ్‌ చేయడం పెరిగింది.
     
నార్వేలో ఉద్యోగిత రేటు 74.4 శాతం. మిగతావారు స్వయం ఉపాధి రంగాల్లో ఉంటారు. అంటే నిరుద్యోగం అతి తక్కువ. అక్కడ టెలి కమ్యూనికేషన్స్‌, టెక్నాలజీ రంగాల్లో చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉంటుంటాయి. డెన్మార్క్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్‌ వంటి దేశాలు కూడా నార్వే తరహాలో ఉద్యోగ, ఉపాధి కల్పనలో మెరుగ్గా ఉన్నాయి.
     
శాంతి భద్రతల విషయంలో నార్వే ప్రజలు ఎంతో సంతృప్తితో ఉన్నామని చెప్తుంటారు. రాత్రిపూట ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లడానికి ఏమాత్రం భయం అనిపించదని 88 శాతం మంది చెప్పడం గమనార్హం. ఆ దేశంలో సంభవించే మొత్తం మరణాల్లో హత్యలు అరశాతం (0.5%) లోపే కావడం గమనార్హం. ఆ దేశంలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సుమారు నాలుగు వేల మంది మాత్రమే.
     
అక్కడి మహిళా ఉద్యోగులు గర్భం దాల్చితే.. పూర్తి జీతంతో కూడిన 8 నెలల (35 వారాలు) సెలవు (మెటర్నిటీ లీవ్‌) ఇస్తారు. లేదా 80 శాతం జీతంతో పది నెలలు (45 వారాలు) సెలవు తీసుకోవచ్చు. అవసరమైతే తండ్రులు కూడా పెటర్నిటీ లీవ్‌ తీసుకునే అవకాశం ఉంటుంది. పిల్లలు పుట్టిన మూడేళ్లలోపు 12 వారాల పాటు వేతనంతో కూడిన సెలవు ఇస్తారు.


ఇదేం చారిటీ ..!

ఈ మధ్య ఓ రేషన్‌ షాప్‌ ముందు స్టాండప్‌ కామెడీ సీన్‌  ఒకటి జరిగింది. సాక్షాత్తూ దేశ ఆర్థిక మంత్రి పేదవారికి ఇచ్చే కిలో బియ్యంలో కేంద్రం, రాష్ట్రవాటాల లెక్కలేశారు. పేదవారికి పెడుతున్న తిండిలో తమ వాటా 28 రూపాయలనీ, రాష్ట్రం వాటా 4 రూపాయలనీ, ప్రజల వాటా ఒక్క రూపాయనీ తేల్చారు. తమ వాటా ఇంత ఉండగా ప్రధాని మోదీ ఫొటో  ఏదని నిలదీశారు... (క్లిక్ చేయండి: సదా.. మీ ‘చెప్పు’ చేతుల్లోనే..)


‘‘.. ఓ దేశం పేదరికాన్ని దాటడమనేది ‘చారిటీ’ కాదు. సహజ న్యాయంగా జరగాలి’’ అన్న నెల్సన్‌  మండేలా మాట  ఆ సమయంలో  గుర్తుకొచ్చి ఉంటే బాగుండేది.  
సహజన్యాయం జరిగితే... నేతలు తమ ఫొటోలను రేషన్‌  షాపుల్లో వెతుక్కోనక్కర్లేదు. అందరి ఇళ్లలో, గుండెల్లో అవి కనిపిస్తాయి. మానవాభివృద్థి సూచీ దానికదే పరుగులు పెడుతుంది. (క్లిక్ చేయండి: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement