Is Anti India Attitude Reason For Pakistan Economic Crisis: Opinion - Sakshi
Sakshi News home page

Pakistan: భారత్‌ పట్ల వ్యతిరేకతే కొంప ముంచిందా?

Published Tue, Jan 24 2023 2:36 PM | Last Updated on Tue, Jan 24 2023 2:52 PM

Is Anti India Attitude Reason for Pakistan Economic Crisis: Opinion - Sakshi

దాయాది దేశం పాకిస్తాన్‌లో స్వాతంత్య్రానంతరం రాజ్యం, పాలనా వ్యవస్థా, ప్రజాస్వామ్య స్ఫూర్తీ నిర్వీర్యం అవుతూ వచ్చాయి. భారత్‌ వ్యతిరేక విధానమే అక్కడి రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికీ, వచ్చిన ప్రభుత్వం స్థిరంగా నిలబడక పోవటానికీ ప్రాతిపదికగా ఉంది. అందుకే భారత్‌లో మత, ప్రాంతీయ విద్వేషాలను రగిలిస్తోంది. ఉగ్రవాదుల్ని తయారుచేసి సరిహద్దులు దాటిస్తోంది. భారత్‌పై మూడుసార్లు యుద్ధం చేసింది. అవకాశం దొరికిన ప్రతిసారీ భారత్‌ను ఛిన్నాభిన్నం చేయాలనేది దాని ప్రధాన ధ్యేయం. ఇందుకోసం పెంచిపోషించిన ఉగ్రవాదులే ఆ దేశానికి ఇప్పుడు ప్రమాదకరంగా తయారయ్యారు. పాక్‌ ప్రస్తుతం ఎదుర్కొంటున్న దురవస్థకు నేపథ్యం ఇదే.

పొరుగు దేశాన్ని అస్థిర పరచడంలో ఉన్న శ్రద్ధ సొంత ప్రజల బాగోగులపై లేకపోవడంతో చివరికి పాక్‌ మును పెన్నడూ లేని తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుంది. ప్రకృతి శక్తులు ఈ స్థితిని మరింత దిగజారుస్తున్నాయి. దీంతో ప్రస్తుతం అక్కడ బియ్యం, గోధుమలు, వంటగ్యాస్‌ వంటి కనీస అవసరాల కోసం ప్రజలు అర్రులు చాచాల్సి వస్తోంది. గత సంవత్సరంతో పోల్చి చూస్తే... గ్యాస్‌ సిలిండర్‌ ధర అప్పుడు రూ. 2,373 ఉండగా, ఇప్పుడు రూ. 2,680కి చేరింది. పెసర పప్పు కిలో రూ. 172 ఉండగా నేడు రూ. 260గా ఉంది. అలాగే కేజీ చికెన్‌  రూ. 203 ఉండగా, ఈ ఏడాది రూ. 366కు పెరిగింది. 20 కిలోల గోధుమ పిండి ధర రూ.1,112 ఉండగా, ఈ ఏడాదికి రూ.1,812కు చేరింది. పరిస్థితి తీవ్రతకు ఈ ధరవరలు అద్దం పడుతున్నాయి.

ప్రస్తుతం విదేశీ మారకం నిల్వలు 4.5 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు చేరడంతో మూడు వారాలకు సరిపడా దిగుమతులకు మాత్రమే అవకాశం ఉంది. దీంతో ఆ దేశం ఆర్థిక సహాయం కోసం యూఏఈ, సౌదీ అరేబియా లాంటి దేశాల వైపు చూస్తోంది. పాకిస్తాన్‌లో 2010 నుంచి 2020 వరకు ఎకనామిక్‌ గ్రోత్‌ కేవలం 1.5 శాతం మాత్రంగానే ఉంది.  ద్రవ్యోల్బణం రేటు 28.7 శాతంగా ఉంది. అప్పులు కూడా పుట్టడం లేదు. తమది చెప్పుకోవడానికి అణ్వస్త్ర దేశమైనా అప్పుల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్వయంగా పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ వాపోయారు. గత 70 ఏళ్ల కాలంలో ప్రభుత్వాలు ఆర్థిక పరమైన సవాళ్లను ఎదుర్కోలేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. 

పాకిస్తాన్‌ స్వయంగా పెంచి పోషించిన ‘తెహ్రీక్‌ ఇ తాలిబాన్‌’ పాకిస్తాన్‌కు కొత్త తలనొప్పిగా మారింది. తాలిబన్లు పాకిస్తాన్‌కు అత్యంత కీలక ప్రాంతాలైన ఖైబర్‌ఫక్తున్‌ఖ్వా, బెలూచిస్తాన్, పంజాబ్‌ లాంటి ప్రదేశాల్లో.. సైన్యం, పోలీ స్‌లు టార్గెట్‌గా పనిచేస్తూ అనేక ఉగ్రవాద సంస్థలను తమలో కలుపుకొని పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇక్కడ చెప్పవలసిన మరో అంశం ఏంటంటే పాకిస్తాన్‌లోని ‘బెలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ’ని తాలిబన్లు తమ సంస్థలో విలీనం చేసుకున్నట్లు కూడా పాకిస్తాన్‌ నిఘా వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్తాన్‌ యువకులనూ తాలిబన్లు సైన్యంలో చేర్చుకుంటూ, ఆయుధ శిక్షణ కూడా అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకవేళ తాలిబన్ల మీద పాకిస్తాన్‌ యుద్ధం చేయాల్సి వస్తే ఎదుర్కోలేని దుస్థితి ప్రస్తుతం నెలకొంది. అఫ్ఘానిస్తాన్‌ను వదిలి వెళ్లేటప్పుడు నాటో దళాలు సుమారు 22,000 వాహనాలు, 64,000 మిషన్‌గన్స్‌ను అక్కడే వదిలి వెళ్లాయి. ఎమ్‌ 16, ఏకే 47 రకానికి చెందిన ఆయుధాలు సుమారుగా మూడు లక్షలకు పైగా అక్కడ ఉన్నట్లుగా సమాచారం. కాబట్టి ఇంత ఆధునికమైన ఆయుధాలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థ కలిగిన తాలిబన్ల మీద పాకిస్తాన్‌ సైన్యం ఏ విధంగా విజయం సాధించగలదు? తినడానికి తిండి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాలిబన్లను ఎదిరించగలరా? అనే ప్రశ్న తలెత్తుతోంది. 

గణాంకాల ప్రకారం పాక్‌లో కేవలం 68 శాతం మంది పిల్లలు మాత్రమే ప్రాథమిక విద్యను పూర్తిచేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. వీటితో పాటుగా ప్రపంచంలోనే అతి తక్కువగా అక్షరాస్యత కలిగిన దేశాల్లో ఒకటిగా తయారయింది. అక్కడ  34.8 శాతం యువత తీవ్రవాదం వైపు ఆకర్షితులు అవుతున్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో పొరుగున ఉన్న భారత్‌తో సత్సంబంధాలు ఏర్పరచుకోవటమే పాకిస్తాన్‌కు మంచిదని రక్షణ నిపుణులు పాక్‌కు  సలహా ఇస్తున్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందనీ, అక్కడి మీడియా కూడా ప్రశంసిస్తోంది. మోదీ నాయకత్వంలో భారత్‌ అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసుకుంటోందని పాకిస్తాన్‌ దినపత్రిక ‘ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌’ కీర్తించింది. అమెరికా, రష్యాలు కూడా భారత్‌తో బలమైన సంబంధాలు కోరుకుంటున్నాయని పేర్కొంది.

స్వాతంత్య్ర కాలం నుంచి కశ్మీర్‌ పాకిస్తాన్‌దే అంటూ నానాయాగీ చేసిన పాకిస్తాన్‌... కశ్మీర్‌ అంశంపైన సామరస్య పూర్వకంగా ఒక నిర్ణయానికి రావాలనీ, తద్వారా రెండు దేశాలూ అభివృద్ధి సాధిస్తాయనీ పాక్‌ కొత్త హితవచనం అందుకుంది. భారత్‌తో మూడు యుద్ధాల్లో తలపడటం వల్ల కష్టాలూ, పేదరికం, నిరుద్యోగం మిగిలాయి. మూడు యుద్ధాలతో ఇప్పుడు తాము పాఠాలు నేర్చుకున్నాం అంటున్నారు పాక్‌ నాయకులు. ఇప్పుడు శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నామనీ, కశ్మీర్‌ వంటి సమస్యలపై భారత ప్రధాని మోదీతో నిజాయతీగా చర్చలు జరపాలనీ పాక్‌ ప్రధాని పిలుపునిచ్చారు. నిజంగా ఈ పిలుపు సాకారమైతే కేవలం పాక్‌ మాత్రమే కాదు... ఇండియా కూడా లాభపడుతుంది. (క్లిక్‌ చేయండి: హేతువాదమే మౌఢ్యానికి విరుగుడు)


- డాక్టర్‌ ఎ. కుమార స్వామి 
పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫ్యాకల్టీ, నిజాం కాలేజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement