ఇస్లామాబాద్:పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం దేశ ప్రజలను వణికిస్తోంది. ఒక పూట తింటే మరో పూటకు లేక, పిల్లల్ని బడికి పంపించే దారిలేక నానా అవస్థలు పడుతున్నారు. దేశాన్ని ముంచెత్తిన వరదలు, రోజురోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి వరదలకు గోధుమ పంట మొత్తం నాశనం కావడంతో తీవ్రమైన ఆహార సంక్షోభం తలెత్తింది. దీనికితోడు ప్రభుత్వ పన్నుల భారం పిడుగులా తాకింది
డాన్ వార్తాపత్రిక కథనం ప్రకారం దీంతో ఒకప్పుడు మూడు పూటలా తినేవాళ్లం, కానీ ఇప్పుడు... ఒక్కసారే వండుకుని మూడు పూట్లకు సర్దుకుంటున్నామని అక్కడి ప్రజలు వాపోతున్నారు. ఒక్క పూట మాత్రమే తింటున్నామని.. పిల్లల్ని స్కూళ్లకు పంప లేక పోతున్నామని ఆవేదన చెందుతున్నారు. చివరికి ఆహారాన్ని తగ్గించు కోవడమే కాదు మండుతున్న పెట్రోల్ ధరలతో, రెట్టింపైన టికెట్ల రేట్లతో ప్రయాణఖర్చుల్ని భరించలేక, ప్రయాణాల్నిమానివేసి కుటుంబాలకు దూరంగా జీవిస్తున్నారు.
ఇళ్లల్లో పనులు చేసినందుకు గతంలో ఇంటికి 3 నుంచి 4 వేలు సంపాదించేది రుక్సానా బీబీ. కానీ ఇపుడదే నెల మొత్తం ఆదాయంగా వస్తోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఖర్చులు రెట్టింపైతే, ఆదాయం మాత్రం భారీగా పడిపోయింది. గోధుమ పిండి దొరక్క నానా అగచాట్లు పడుతున్నారు. ఒక బస్తా గోధుమ పిండి కోసం రోజుల తరబడి పిల్లలు లైన్‌లో నిలబడాల్సి వస్తోంది.
ఒక వస్తువు కొంటే మరొకటి కొనలేకపోతున్నామని మరో సామాన్యుడి ఆవేదన ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ గత మూడేళ్లుగా తన ఆదాయంలో మార్పు రాలేదని ఇక పిల్లలను బడికి పంపే స్థోమత ఎక్కడదని వాపోయాడు.ద్రవ్యోల్బణం కారణంగా తన బిజినెస్ దెబ్బతిందని ఒక చిన్న దుకాణదారుడు నదీం ఉద్దీన్ సిద్దిఖీ చెప్పాడు. వారానికి రూ.50వేలయ్యే పెట్టుబడి కాస్తా లక్షకు పెరిగింది. మాలో మేం కుంచించుకు పోతున్నాం. ఇంతకుముందు నాలుగు కప్పుల టీ తాగితే, ఇప్పుడు ఒకటి తాగడమే కష్టంగా ఉందంటూ విచారం వ్యక్తంచేశారు. మరోవైపు పాక్‌స్తాన్ వీక్లీ ఇన్‌ప్లేషన్ 40శాతానికి పైగా ఎగిసింది.
Comments
Please login to add a commentAdd a comment