Worries
-
తెల్లవెంట్రుకలను చూసి చింతించాల్సిన అవసరం లేదు! ఇంట్రస్టింగ్ స్టోరీ
ఓ పురాణ కథ ప్రకారం రాజ్య వర్ధనుడనే రాజు తన రాజ్యాన్ని 70 వేలసంవత్సరాలు ధర్మబద్ధంగా పాలించాడు. అతని పాలనలో ప్రజలు అనారోగ్యాలు, అనావృష్టులు లేని జీవనం గడిపారు. ఒకరోజు రాజపత్ని, రాజు గారి తలలో తెల్ల వెంట్రుకను చూసి కన్నీరు పెట్టింది. రాజు ఎందుకు ఏడుస్తున్నావని అడిగినా చెప్పకుండా దుఃఖిస్తూనే ఉంది. రాజు ఒత్తిడి చేయడంతో ఆయన తలలో తెల్ల వెంట్రుకను చూసి దుఃఖిస్తున్నానంటుంది. అందుకు రాజు: ‘దీనికై బాధ పడకూడదు. ఇన్ని సంవత్సరాలు జీవించాను. ఎన్నో శుభకార్యాలు చేశాను. తెల్ల వెంట్రుకలు వచ్చినా, దేహం ముడతలు పడినా విచారించనవసరం లేదు. ఈ పలిత కేశం వృద్ధాప్యానికి గుర్తు. నేనింక వనాలకు వెళ్ళవలసి ఉంది. ఇన్నాళ్లు లౌకిక సుఖాలు అనుభవించాను. ఇప్పుడు తపస్సు చేసుకుంటాను. కుమారునికి రాజ్యాభిషేకం చేసి వెళతాను’ అన్నాడు.పలిత కేశం వ్యక్తులు ఇంకా నిర్వహించవలసిన మిగిలిపోయిన బాధ్యతలను గురించి హెచ్చరిస్తుంది. కుటుంబ బాధ్యతలు తీరిపోతే, దైవ సన్నిధిలో, ఆధ్యాత్మిక మార్గంలో జీవించమని హితవు చెబుతుంది. తలలో నెరసిన వెంట్రుకలను చూసి, వయసై పోతోందే అని వ్యధ చెందనవసరం లేదు. లౌకిక జీవన పోరాటంలో కొట్టుమిట్టాడుతున్న వారికి ముక్తి మార్గాన్ని చూపే హితైషి పలిత కేశం. వయసుతోపాటు శరీరంలో వచ్చే సహజ పరిణా మాలను గుర్తు చేసే సత్య బోధిని పలిత కేశం.అయితే పై కథలో రాజును విడిచి ఉండలేని ప్రజలు, ఇంకా పదివేల ఏళ్ళు రాజు, స్థిర యవ్వనం, అందమైన కేశాలు కలిగి ఉండి తమనుపాలించాలని సూర్య దేవుని ప్రార్థించి వరం పొందారు. రాజు, ఆ ప్రజలు లేకుండా తాను వర ప్రభావంతో జీవించి ఉండలేనని, తన కోసం ప్రార్థించిన వారి కోసం తనున్నాళ్ళు వారు జీవించేట్లు వరం ఇమ్మని సూర్యదేవుని ప్రార్థించి వరం పొందాడు. ప్రజలను చక్కగా పాలించాడు. ఈ కథ మార్కండేయ పురాణం లోనిది.ఎప్పటికైనా వృద్ధాప్యం (పలిత కేశం) రావడం అనివార్యం అనే వాస్త వాన్ని గ్రహించి తదనుగుణంగా (భగవచ్చింతనతో) మెలగాలి. – డా. చెంగల్వ రామలక్ష్మి ఇదీ చదవడి: World Cancer Day 2025 : లక్షలాదిమంది బిడ్డలు అనాథలుగా; ముందుగా గుర్తిస్తే! -
PakistanCrisis ‘ఓన్లీ వన్ మీల్...నో స్కూల్’ అల్లాడుతున్న జనం
ఇస్లామాబాద్:పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం దేశ ప్రజలను వణికిస్తోంది. ఒక పూట తింటే మరో పూటకు లేక, పిల్లల్ని బడికి పంపించే దారిలేక నానా అవస్థలు పడుతున్నారు. దేశాన్ని ముంచెత్తిన వరదలు, రోజురోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి వరదలకు గోధుమ పంట మొత్తం నాశనం కావడంతో తీవ్రమైన ఆహార సంక్షోభం తలెత్తింది. దీనికితోడు ప్రభుత్వ పన్నుల భారం పిడుగులా తాకింది డాన్ వార్తాపత్రిక కథనం ప్రకారం దీంతో ఒకప్పుడు మూడు పూటలా తినేవాళ్లం, కానీ ఇప్పుడు... ఒక్కసారే వండుకుని మూడు పూట్లకు సర్దుకుంటున్నామని అక్కడి ప్రజలు వాపోతున్నారు. ఒక్క పూట మాత్రమే తింటున్నామని.. పిల్లల్ని స్కూళ్లకు పంప లేక పోతున్నామని ఆవేదన చెందుతున్నారు. చివరికి ఆహారాన్ని తగ్గించు కోవడమే కాదు మండుతున్న పెట్రోల్ ధరలతో, రెట్టింపైన టికెట్ల రేట్లతో ప్రయాణఖర్చుల్ని భరించలేక, ప్రయాణాల్నిమానివేసి కుటుంబాలకు దూరంగా జీవిస్తున్నారు. ఇళ్లల్లో పనులు చేసినందుకు గతంలో ఇంటికి 3 నుంచి 4 వేలు సంపాదించేది రుక్సానా బీబీ. కానీ ఇపుడదే నెల మొత్తం ఆదాయంగా వస్తోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఖర్చులు రెట్టింపైతే, ఆదాయం మాత్రం భారీగా పడిపోయింది. గోధుమ పిండి దొరక్క నానా అగచాట్లు పడుతున్నారు. ఒక బస్తా గోధుమ పిండి కోసం రోజుల తరబడి పిల్లలు లైన్లో నిలబడాల్సి వస్తోంది. ఒక వస్తువు కొంటే మరొకటి కొనలేకపోతున్నామని మరో సామాన్యుడి ఆవేదన ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ గత మూడేళ్లుగా తన ఆదాయంలో మార్పు రాలేదని ఇక పిల్లలను బడికి పంపే స్థోమత ఎక్కడదని వాపోయాడు.ద్రవ్యోల్బణం కారణంగా తన బిజినెస్ దెబ్బతిందని ఒక చిన్న దుకాణదారుడు నదీం ఉద్దీన్ సిద్దిఖీ చెప్పాడు. వారానికి రూ.50వేలయ్యే పెట్టుబడి కాస్తా లక్షకు పెరిగింది. మాలో మేం కుంచించుకు పోతున్నాం. ఇంతకుముందు నాలుగు కప్పుల టీ తాగితే, ఇప్పుడు ఒకటి తాగడమే కష్టంగా ఉందంటూ విచారం వ్యక్తంచేశారు. మరోవైపు పాక్స్తాన్ వీక్లీ ఇన్‌ప్లేషన్ 40శాతానికి పైగా ఎగిసింది. -
కంపెనీలకే దడ పుట్టిస్తున్న ఫేక్ యాక్సెసరీస్.. ఆశపడ్డారో.. అంతే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పోర్టబుల్ ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌కు దేశంలో బలమైన డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇదే ఇప్పుడు బ్రాండెడ్ ఉత్పత్తుల తయారీ కంపెనీలకు ఆందోళన కలిగిస్తోంది. బ్రాండెడ్ ఉత్పత్తులతో సమాంతరంగా నకిలీలు, దొంగిలించిన, చట్ట విరుద్ధంగా దిగుమతి చేసుకున్న ప్రొడక్ట్స్‌తో ఆఫ్‌లైన్, ఆన్లైన్ మార్కెట్ వృద్ధి చెందడం ఇందుకు కారణం. నకిలీలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోకపోవడం, చైనా నుండి తక్కువ ధరలకు పెద్దమొత్తంలో ఉత్పత్తులు వెల్లువెత్తుతుండడం కంపెనీలకు కునుకు లేకుండా చేస్తోంది. ఒకవైపు తమ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై దృష్టిసారిస్తూనే మరోవైపు నకిలీలకు అడ్డుకట్ట వేసేందుకు ఆహోరాత్రులూ శ్రమించాల్సిన పరిస్థితి బ్రాండెడ్ కంపెనీలది. 2019 సెప్టెంబర్‌లో ఫిక్కీ విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్‌తో సహా అయిదు రంగాల్లో నకిలీ ఉత్పత్తులు, అక్రమ రవాణా కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ఏటా రూ.1.17 లక్షల కోట్లు నష్టపోతోంది. పట్టుపడుతూనే ఉన్నాయి.. ఈ ఏడాది జనవరి-జూన్ కాలంలో ఇయర్‌ఫోన్స్, చార్జర్స్, అడాప్టర్స్, యూఎస్బీ కేబుల్స్ వంటి రూ.73.8 లక్షల విలువైన 9 వేల పైచిలుకు నకిలీ ఉత్పత్తులను సీజ్ చేసినట్టు షావొమీ ప్రకటించింది. 2020లో కంపెనీ రూ.33.3 లక్షల విలువైన సుమారు 3 వేల ఉత్పత్తులను సీజ్ చేసింది. దీనినిబట్టి చూస్తే నకిలీలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో కొన్ని ప్రాంతాలు ప్రత్యేకంగా ఈ నకిలీ ఉత్పత్తులను పెద్ద ఎత్తున విక్రయిస్తున్నాయని షావొమీ అంటోంది. కోవిడ్ రాకతో ఈ ఉత్పత్తులను ఏకంగా ఆన్లైన్ వేదిక ద్వారా విక్రయిస్తున్నారని వెల్లడించింది. జేబీఎల్, ఇన్ఫినిటీ బ్రాండ్ నకిలీ ఉత్పత్తులను ఢిల్లీలో ఇటీవలే స్వాధీనం చేసుకున్నట్టు శాంసంగ్ అనుబంధ కంపెనీ హర్మాన్ తెలిపింది. కాగా, ఐడీసీ గణాంకాల ప్రకారం భారత మార్కెట్లో 2022 జనవరి-జూన్ కాలంలో 3.8 కోట్ల యూనిట్ల వేరబుల్స్ అమ్ముడయ్యాయి. నియంత్రణ లేక.. చిన్న గ్యాడ్జెట్స్‌లో నకిలీలను సులువుగా తయారు చేయవచ్చని, వీటిని చైనా నుంచి సులభంగా తీసుకు రావొచ్చని టెక్ఆర్క్ ఫౌండర్ ఫైజల్ కవూసా తెలిపారు. ‘ఆఫ్‌లైన్ మార్కెట్లు ప్రధాన విక్రయ కేంద్రంగా ఉన్నప్పటికీ.. ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్‌లో కఠినమైన తనిఖీలు లేకపోవడం వల్ల నకిలీ ఉత్పత్తుల చెలామణి పెరిగింది. ఆన్లైన్లో ఎవరైనా ఉత్పత్తులను నమోదు (లిస్ట్) చేసి విక్రయించవచ్చు. ఇది నకిలీలను విక్రయించడాన్ని సులభతరం చేసింది’ అని వివరించారు. ఐఎంఈఐ నంబర్‌తో స్మార్ట్ఫోన్లను ట్రాక్ చేయడానికి, గుర్తింపునకు ఆస్కారం ఉంది. యాక్సెసరీస్‌కు ఇటువంటి సౌకర్యం లేదు. యాపిల్‌ఎయిర్‌పాడ్స్‌ను ఫోన్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. -
ఇల్లు పీకి పందిరేసి! హైదరాబాద్‌లో బెంబేలెత్తిస్తున్న కోతులు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో వివిధ ప్రాంతాల్లో కోతుల బెడదతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడపాల్సి వస్తోంది. ముఖ్యంగా ఈస్ట్ మారేడ్‌పల్లి, వెస్ట్‌మారేడ్‌పల్లి, పద్మారావునగర్, సికింద్రాబాద్, అల్వాల్, ఉప్పల్, తార్నాక, అమీర్‌పేట, కాప్రా తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి వస్తున్న కోతులతో ప్రజలు.. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు భయంతో వణికిపోతున్నారు. జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగంలో కుక్కలను పట్టుకునేందుకు తగిన నైపుణ్యం ఉన్న కారి్మకులున్నప్పటికీ, కోతులను పట్టుకునేందుకు నైపుణ్యం ఉన్న సిబ్బంది లేదు. దీంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల నుంచి ఫిర్యాదుల ధాటికి తట్టుకోలేక సంప్రదాయ విధానాలతోనే, తమకు తెలిసిన పద్ధతిలోనే ఏటా అయిదారు కోతులకు మించి పట్టుకోవడం లేదు. చాలా ప్రాంతాల్లో ప్రజలే తమ పాట్లేవో తాము పడుతున్నారు. ఈ నేపథ్యంలో కోతులను పట్టుకునేందుకు తగిన నైపుణ్యం, సామగ్రి కలిగిన ఏజెన్సీలను ఆహా్వనిస్తూ టెండర్లు పిలిచారు. ► గ్రేటర్ పరిధిలోని ఆరు జోన్లకుగాను కూకట్పల్లి, సికింద్రాబాద్ జోన్లకు మాత్రం ఒక్కో టెండరు దాఖలైనట్లు వెటర్నరీ అధికారులు తెలిపారు. శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, కూకట్పల్లి, చారి్మనార్ జోన్లకు ఒక్క టెండరు కూడా దాఖలు కాలేదు. దీంతో ఏం చేయాలో తెలియక రీటెండర్లకు సిద్ధమయ్యారు. అయినా కాంట్రాక్టు ఏజెన్సీలు వస్తాయో, లేదో తెలియని పరిస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీలో పనులు చేసేందుకు ఇటీవలి కాలంలో కాంట్రాక్టర్ల నుంచి తగిన స్పందన కనిపించడం లేదు. ఓవైపు పెరుగుతున్న ఎండలతోపాటు మరోవైపు అడవుల్లోనూ ఆహారం దొరక్క, నగరానికి చేరుతున్న కోతులు ఇళ్లలో చొరబడుతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాలు కోతుల ఆవాసాలుగా ఉన్నాయి. నగరంలో వేల సంఖ్యలో ఉన్న కోతులు బహిరంగ ప్రదేశాల్లోనూ బీభత్సం సృష్టిస్తున్నాయి. ► ఢిల్లీ తదితర మెట్రో నగరాల్లో కోతులను పట్టుకునే నైపుణ్యమున్న ఏజెన్సీలకు ఒక్కో కోతికి రూ.5వేల నుంచి రూ.6 వేల వరకు చెల్లిస్తున్నారు. జీహెచ్ఎంసీ గరిష్టంగా రూ.1800 చెల్లించేందుకు మాత్రమే టెండర్లు ఆహ్వానించింది. ఈ ధర కోతులను పట్టుకోవడం వరకే కాదు.. వాటిని తిరిగి ఆదిలాబాద్ తదితర జిల్లాల్లోని అటవీప్రాంతంలో విడిచి పెట్టి రావాలి. ఆమేరకు, సంబంధిత అటవీశాఖ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం పొందాలి. ► ఈ పనులతోపాటు కోతులను తరలించేందుకయ్యే రవాణా ఖర్చులు కూడా కాంట్రాక్టు ఏజెన్సీవే. దీంతో కాంట్రాక్టర్లు ముందుకు రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టు పొందిన ఏజెన్సీ ప్రజల నుంచి ఫిర్యాదులకనుగుణంగా జీహెచ్ఎంసీ అధికారులు చెప్పిన ప్రాంతాలకు వెళ్లి కోతుల్ని పట్టుకోవాలి. ► కోతుల్ని పట్టుకున్నాక, వాటిని సంబంధిత అటవీ ప్రాంతంలో వదిలేంతవరకు వాటికి ఎలాంటి గాయాలు కాకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్ని అవస్థలున్నందున కాంట్రాక్టు ఏజెన్సీలు ముందుకు రావడంలేదు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కోతి చేష్టలు ఇలా.. ► తలుపులు తెరిచినప్పుడు, కిటికీల ద్వారా ఇళ్లలోకి చేరుతున్నాయి. గదుల్లోని సామగ్రిని చిందరవందర చేస్తున్నాయి. ► కోతులు వంట గదుల్లోని పప్పులు, చక్కెర తదితర డబ్బాలను పడవేస్తున్నాయి. దేవాలయాల వద్ద కొబ్బరిచిప్పలు, అరటిపండ్ల వంటి వాటికోసం పైకి ఎగబడుతున్నాయి. వీటిని చూసి భయంతో కిందపడి గాయాలపాలైన ఘటనలున్నాయి. ► ఇళ్లలోకి ప్రవేశించిన కోతులతో జడుసుకొని పరుగుపెట్టి పడిపోయి దెబ్బలు తగిలిన వారున్నారు. పార్కుల్లో, రోడ్ల పక్కన పాదచారులపైకి లంఘిస్తూ, రక్కిన ఘటనలు కూడా ఉన్నాయి. ► కోతులు వాటికి నచి్చన వాటిని నోట పట్టుకెళ్తూ, మిగతా వాటిని ఇల్లంతా వెదజల్లుతున్నాయని పద్మారావునగర్‌కు చెందిన శ్రీవల్లి చెప్పారు. అవి బయటకు వెళ్లేవరకూ బిక్కు బిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. కోతుల బారినుంచి కాపాడాలి అమీర్‌పేట డివిజన్ శివ్‌బాగ్‌లో కోతులు బెడద ఎక్కువగా ఉంది. పగటి పూట ఎక్కడి నుంచో గుంపులు గుంపులుగా వచ్చి హాస్టళ్ల ముందు సంచరిస్తున్నాయి. ఒంటరిగా వచ్చే వారి వెంటపడుతున్నాయి. చేతిలో ఏది ఉంటే అది ఎత్తుకుపోతున్నాయి. – గౌతమ్, అమీర్‌పేట మీదపడి కరుస్తున్నాయి.. కోతుల బెడదతో ఇబ్బంది పడుతున్నాం. ఎప్పుడు ఎక్కడ ఏమి చేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా ఇళ్లపై దాడి చేసి బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు భయంతో వణికిపొతున్నారు. రోడ్లపై వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా మీదపడి దాడి చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో మీద పడి కరుస్తున్నాయి. – కె. అనిత, పద్మారావునగర్ ఆహార పదార్థాలను చిందరవందర చేస్తున్నాయి.. చిలకలగూడ, సీతాఫల్మండి, నామాలగుండు, శ్రీనివాసనగర్ తదితర ప్రాంతాల్లో గుంపులుగా సంచరిస్తున్న వానరాలతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నాం. ఇళ్లలోకి చొరబడి నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలను చెల్లాచెదురు చేసి, దొరికిన వస్తువులను విసిరి కొట్టి, పూలమొక్కలు, కుండీలు ధ్వంసం చేస్తున్నాయి. గట్టిగా అదిలిస్తే మీదపడి గోళ్లతో గీరుతున్నాయి. పళ్లతో కొరికి గాయాలు చేస్తున్నాయి. సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన స్పందించలేదు. – మార్పెల్లి రవి, చిలకలగూడ -
మన బుర్రలను ప్రశాంతంగా ఉంచుకునేందుకు..
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి 20 రోజులు గడిచిపోయాయి. పార్టీల అనుభూతులిప్పటికే కరిగిపోయి ఉంటాయి. అంతా బాగుండాలని.. మనవాళ్లందరికీ మేలే జరగాలని ఎన్నో అనుకుంటాం. కానీ, అనుకున్నామని అన్నీ జరిగిపోతాయా? అన్న ఓ శంక కూడా ఎక్కడో ఓ మూల మనల్ని పట్టిపీడిస్తూనే ఉంటుంది. కాదంటారా? అక్షరాలా నిజమే అంటారు శాస్త్రవేత్తలు. మన మెదళ్లు ఎప్పుడూ భవిష్యత్తులో మన అవసరాలేమిటి? వాటిని సాధించుకునే మార్గంలో ఎలాంటి అడ్డంకులు ఉంటాయి? అన్న అంశాలపై నిత్యం ఆలోచిస్తూనే ఉంటాయట. ఇంకోలా చెప్పాలంటే.. చింత అనేది మనకు పుట్టుకతో వచ్చే సహజ లక్షణమన్నది శాస్త్రవేత్తల అంచనా. జేమ్స్ కార్మోడీ అనే శాస్త్రవేత్త ఏం చెబుతారంటే.. నిత్యం మనల్ని వెంటాడే చింతలను ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదూ అని!. వైద్యశాస్త్రాన్ని బోధించే అధ్యాపకుడిగా తాను అటు వైద్యులకు, ఇటు రోగులకూ ఈ టెక్నిక్కులు నేర్పించానని ఆయన అంటున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ టెక్నిక్కులు కొందరికి ఒక్కసారికే వంటబడితే.. మిగిలిన వాళ్లకు ఎంతకీ అర్థం కావు. చింతను మరిపించే పని.. చింత తాలూకు ప్రభావాలూ అన్నీఇన్నీ కావు. టెన్షన్.. నిద్రలేమి, ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండటం మచ్చుకు కొన్నే. కాకపోతే వీటన్నింటి నుంచి మన బుర్రలను ప్రశాంతంగా ఉంచుకునేందుకూ మార్గాలున్నాయి. చేసే పనిలో పూర్తిగా నిమగ్నమైన సందర్భాలను గమనించండి.. ఆ క్షణాల్లో మీరు కచ్చితంగా ఆనందంగానే ఉండి ఉంటారు. ఇలా ఒక అంశంపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా మన చింతలకు కొంత దూరం అయ్యేందుకు అవకాశముందన్నమాట. పరిశోధనలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. చేసే పనిపై శ్రద్ధ పెడితే సంతోషం వస్తుందని తెలిసినా.. మనలో చాలామంది ఎందుకు ఆ పని చేయలేకపోతుంటారు? మన మెదడు పనితీరు దీనికి కారణమని అంటారు జేమ్స్. మనకు తక్కువగా ఉండే వనరుల, ఎదురుకాగల ముప్పుల గురించి ఆలోచిస్తుండటం మెదడు స్వతఃసిద్ధంగా చేసే పనని ఆయన వివరిస్తారు. మన ఆలోచనలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ మైండ్‌ఫుల్‌నెస్‌తో ఉండటం ద్వారా టెన్షన్లను మరికొంత తగ్గించుకోవచ్చునని జేమ్స్ చెబుతారు. ఈ అంశంపై కేవలం రెండు మూడు వారాల శిక్షణ పొందితే చాలు.. ఏ అంశంపైనైనా దృష్టి కేంద్రీకరించే సామర్థ్యం పెరగడంతోపాటు, జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుందని, చంచలమైన ఆలోచనలను ఎప్పటికప్పుడు గుర్తించవచ్చునని ఇప్పటికే పలు పరిశోధనలు చెబుతున్నాయని జేమ్స్ వివరించారు. మరెందుకు ఆలస్యం.. ఈ కొత్త ఏడాది ఎంచక్కా మైండ్‌ఫుల్‌నెస్‌తో సంతోషంగా ఉండేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టండి మరి!. -
సెంటర్ ఎటెట్టా
సాక్షి, బద్వేలు : టెట్ పరీక్ష అభ్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. పరీక్షా కేంద్రాలు ఏర్పాటులో ప్రభుత్వ నిర్లక్ష్యం అభ్యర్థులకు శ్రమతో పాటు ఆర్థికంగా ఇబ్బందులు పడేలా చేస్తోంది. జిల్లాలోని అభ్యర్థులకు సరిపోయే స్థాయిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దాదాపు మూడు వేల మంది ఇతర జిల్లాలకు వెళ్లి పరీక్ష రాయాల్సిన ఆగత్యం ఏర్పడింది. ఈ నెల 10 నుంచి 19 వరకు జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష ... జిల్లావ్యాప్తంగా 25 వేల మంది టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి సరిపోయే స్థాయిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. మొదట దరఖాస్తు అనంతరం గత నెల 25 నుంచి 29 వరకు పరీక్షా కేంద్రాల ఎంపికకు అవకాశం కల్పించారు. మొదటి రోజు మధ్యాహ్నం లోపే డీఎడ్ అభ్యర్థులకు జిల్లాలో కేటాయిం చిన పరీక్షా కేంద్రాలన్నీ భర్తీ అయ్యాయి. సాయంత్రానికి మిగిలిన స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను తప్పని సరి పరిస్థితుల్లో ఇతర జిల్లా పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిం ది. కేంద్రాల మార్పునకు అవకాశం కల్పిస్తారని ఆశించినా వారి ఆశలపై అధికారులు నీళ్లు జల్లారు. గతంలో మాదిరే... టెట్–2017లో దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్షా కేంద్రాల కేటాయింపులో ప్రభుత్వం చుక్కలు చూపింది. వారు కోరుకున్న కేంద్రాలను ఇవ్వకుండా చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. ప్రస్తుత టెట్‌లో అలాంటి పరిస్థితి రాదని చెప్పిన అధికారులు తీరా దగ్గరికి వచ్చేసరికి చెతులేత్తాశారు. మరోసారి అలాంటి పరిస్థితే కల్పించి నిరుద్యోగులతో చెలగాటం అడుతున్నారు. జిల్లాలో పది కేంద్రాలే... జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, రాజంపేట పట్టణాలలో పది కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. గత నెల 29వ తేదీ తరువాత పరీక్షా కేంద్రాల మార్పునకు అవకాశం కల్పిస్తారని ఆశిం చినా మీడియం, సబ్జెక్టు మార్పునకు మాత్రమే అవకాశం కల్పించారు. దీంతో అభ్యర్థులు తీవ్రనిరాశకు గురవుతున్నారు. ∙పరీక్షా కేంద్రం మార్పు చేయాలంటూ ఫిర్యాదులు పెరుగుతుండటంతో ఈ అంశం తమ పరిధిలో లేదంటూ అధికారులు తప్పించుకుంటున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో పేపరు–1 ఎస్జీటీకి 13 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ పేపరు–2కు ఎనిమిది వేల మంది, భాష పండిత పరీక్షకు మూడు వేల మంది, పీఈటీకి 1500 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు మంగళవారం నుంచి హాల్‌టిక్కెట్ డౌన్లోడు చేసుకోవచ్చు. ఆందోళనలో గర్భిణులు, దివ్యాంగులు.. టెట్ దరఖాస్తు చేసుకున్న వారిలో గర్భిణులు, దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని కేంద్రాలు ఆన్లైన్లో మొదటి రోజే పూర్తి కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర జిల్లా కేంద్రాలను ఎంపిక చేసుకున్నారు. రెండో రోజు నుంచి చిత్తూరు, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై పట్టణాలలోని కేంద్రాలు మాత్రమే కనిపించాయి. తరువాతైనా కేంద్రాల మార్పునకు అవకాశం ఇస్తారని భావించినా ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు మాత్రం కనిపించడం లేదు. వందల కిలోమీటర్లు ప్రయాణించి పరీక్ష రాయాలంటే ఎలా అని గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు. ఇతర జిల్లాలకు వెళ్లాలంటే రూ.వేలలో ఖర్చు ప్రస్తుతం ఇతర జిల్లా కేంద్రాలకు వెళ్లి పరీక్ష రాయాలంటే రూ.వేలల్లో ఖర్చు పెట్టుకోవాల్సిందే. కేటాయించిన కేంద్రాలు కనీసం రెండు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ముందురోజే వెళ్లాలి. బస్సుచార్జీలకు కనీసం రూ.వెయ్యి వెచ్చించాల్సిందే. అక్కడ వసతి, భోజనాలు, ఆటో ఖర్చులకు మరో రూ.వెయ్యికి పైగా కావాలి. గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులకు మరోకరు తోడు ఉండాలి. వీరికి కనీసం రూ.5 వేలు కావాల్సిన పరిస్థితి. -
మోదీ ప్రభుత్వానికి చమురు సెగ?
సాక్షి, న్యూఢిల్లీ: ఆకాశన్నంటుతున్న చమురు ధరలు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ప్రతికూలంగా మారనున్నాయా? వివిధ సంస్కరణలతో ప్రజలకు ఆకట్టుకుంటూ.. 2019 ఎన్నికలకు సిద్ధమవుతున్న మోదీ సర్కార్‌కు చమురు ధరల సెగ తాకనుందా? అంటే అవుననే సంకేతాలనిస్తున్నారు మార్కెట్ విశ్లేషకులు. ముఖ్యంగా మరికొన్ని రోజుల్లో చివరి ఆర్థిక బడ్జెట్( ఫిబ్రవరి , 1) పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పెరుగుతున్న ఇంధన ధరలు కేంద్రానికి పెద్ద తలనొప్పేనని భావిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలలో చమురు ధరల తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వానికి సాయపడినప్పటికీ..ఇపుడు అప్రతిహతంగా పెరుగుతున్న ధరలు మోదీ సర్కార్‌కు ప్రమాదమే అంటున్నారు. పన్ను సంస్కరణలను హేతుబద్ధం చేయడం, 2019 లో సాధారణ ఎన్నికల ముందు డ్యూటీ రేట్లను తగ్గించడం వంటి ప్రధాన సంస్కరణలతో ఆదరణ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 70 డాలర్లు దాటితే మరిన్ని కష్టాలు తప్పవని నిపుణుల విశ్లేషణ. అటు గత వారం చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తారా అని ప్రశ్నించినపుడు.. ఆ మాట ముందు రాష్ట్ర ప్రభుత్వాలను అడిగాలన్నారు. గత సంవత్సరం అక్టోబర్‌లో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాం..రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను తగ్గించాలని సమాధానమివ్వడం గమనార్హం. ఎక్సైజ్ సుంకం తగ్గింపు కారణంగా డీజిల్ ధరలు అక్టోబరు 4, 2017 నాటికి రూ.56.89 స్థాయికి చేరింది. అయితే ఆ తరువాత పుంజుకున్న చమురు ధర ఎక్కడా వెనక్కి తగ్గకుండా పైపైకి దూసుకపోతోంది. మరోవైపు అంతర్జాతీయ చమురు ధరలు ర్యాలీకి కొనసాగుతోంది. సోమవారం డీజిల్ ధర లీటరుకు రూ.61.88 గా రికార్డ్ స్థాయి నమోదు కాగా పెట్రోలు ధర రూ.71 దాటేసింది. ఢిల్లీలో లీటరుధ ర రూ. 72 గా ఉంది. డిసెంబరు 12, 2017 తరువాత ధరలు పెరుగుతుండగా, ఆ రోజునాటికి ఢిల్లీలో డీజిల్ ధర రూ. 58.34 గా ఉంది. గడచిన నెలలో రూ. 3.54 పెరిగింది. గత వారం బ్రెంట్ టర్నోవర్ 70.05 డాలర్లుగా నిలిచింది. డబ్ల్యుటిఐ 64.77 డాలర్లకు చేరుకుంది. -
అప్పుల బాధలు తాళలేక..
వ్యక్తి ఆత్మహత్య గుంటూరు రూరల్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక, కొడుకు పట్టించుకోకపోవటంతో మనస్తాపానికి గురైన వ్యక్తి నగర శివారులోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సంగడిగుంట హిడాంబినగర్ 6వలైనుకు చెందిన కల్లూరి శివశంకరరావు(47) వడ్రంగం పనిచేస్తుంటాడు. ఆతను మూడు వివాహాలు చేసుకోగా వివాదాల నేపథ్యంలో ప్రస్తుతం తన తల్లి, కొడుకుతో కలిసి జీవిస్తున్నాడు. ఈ క్రమంలో గత ఆరు నెలల క్రితం నగర శివారుల్లో అప్పు చేసి ఒక స్థలం కొనుగోలు చేశాడు. అప్పులవాళ్ళు రుణం చెల్లించాలని వత్తిడి చేయడం, దీనికి తోడు తల్లి, కొడుకు తనను సరిగా పట్టించుకోవటలేదని శివశంకరరావు మానసిక వత్తిడికి గురయ్యాడు. దీంతో గురువారం ఉదయం 5 గంటలప్రాంతంలో ఇంటినుంచి బయటకు వచ్చి నగర శివారుల్లో సాయిట్రస్ట్ సమీపంలోగల ప్లాట్లలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన నల్లపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుని పరిశీలించగా మృతుని ప్యాంటు జేబులో సూసైడ్ నోట్ దొరికింది. ఆర్థిక ఇబ్బందులు, తన తల్లి, కొడుకు పట్టించుకోవక పోవటంతో మానసిక వత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డానని, తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్లో రాశాడని పోలీసులు తెలిపారు. సంఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
చినుకు పడినా చింతే
పంటలను ఆదుకునే పరిస్థితి లేదు.. జల్లులతో పెరగని భూగర్భ జలాలు ఈ నెలలో బాగా తగ్గిన వర్షపాతం ఖమ్మం వ్యవసాయం : జిల్లాలో కురుస్తున్న వర్షాలు పంటలను ఆదుకునేలా లేవు. భూగర్భ జలాల పెంపునకు ఎటువంటి ఉపయోగం లేకుండా ఉన్నాయి. జూన్‌లో వర్షాలు ఆశాజనకంగా ఉండగా.. ఆ తరువాత నెలల్లో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి కొంత మేరకు ముందుగానే చేరి.. జూన్‌లో ఆశించిన మేరకు వర్షాలు కురిశాయి. జూన్‌లో జిల్లా సాధారణ వర్షపాతం 127 మి.మీలు కాగా.. 337.1 మి.మీ వర్షపాతం నమోదైంది అంటే 164.4 మి.మీ వర్షపాతం సాధారణం కన్నా అధికంగా నమోదైంది. జూలై నెల సాధారణ వర్షపాతం 309.0 మి.మీలు కాగా.. 185.8 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే –39.8 మి.మీ లోటు వర్షపాతం నమోదైంది. ఆగస్టు నెల కూడా అదే పరిస్థితి నెలకొంది. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 276 మి.మీలు కాగా.. 29వ తేదీ నాటికి 117.4 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే –54 మి.మీ లోటు వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ పంటల సాగుకు జూలై, ఆగస్టు నెలల్లో కురిసే వర్షాలు, వర్షపాతమే కీలకం. ఈ రెండు నెలల్లో అనుకూలంగా వర్షాలు కురిస్తే ప్రాజెక్టుల్లోకి నీరు చేరి.. సాగు విస్తీర్ణం పెరుగుతుంది. కానీ.. ఈ ఏడాది దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. వరి సాగు ఈ రెండు నెలల్లో మాత్రమే బాగా ఉంటుంది. ప్రస్తుతం ఆశించిన మేర వర్షాలు లేకపోవటంతో వరి పంట బాగా వెనుకబడింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 1,25990 హెక్టార్లు కాగా.. ఆగస్టు చివరి నాటికి కేవలం 49,902 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో కొంత మేరకు ప్రాజెక్టుల్లోకి, పెద్ద చెరువుల్లోకి నీరు చేరటంతో వరి సాగు చేస్తున్నారు. ప్రధానంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి నీరు చేరకపోవటంతో జిల్లాలో దాదాపు 1.05లక్షల హెక్టార్లలో వరి పంట దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఆగస్టు ఆరంభంలో 4వ తేదీ వరకు వర్షాలు అనుకూలంగా కురిశాయి. అప్పటి వరకు జిల్లా సాధారణ వర్షపాతం 35.6 మి.మీలు కాగా.. అంతకుమించి 53.9 మి.మీ వర్షపాతం నమోదైంది. అంటే అప్పటికి సాధారణాన్ని మించి 51.2 మి.మీ వర్షపాతం అధికంగా నమోదైంది. ఇక అప్పటి నుంచి వర్షాలు ముఖం చాటేశాయి. వరుసగా 20 రోజులపాటు అంటే 24వ తేదీ వరకు వర్షాలు కురవలేదు. పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా 24వ తేదీ నుంచి అడపా దడపా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 5 రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆశించిన మేరకు మాత్రం వర్షపాతం నమోదు కావటం లేదు. 29వ తేదీ నాటికి 258.4 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. కేవలం 117.4 మి.మీల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఆగస్టు ఆరంభంలో మొదటి 4 రోజులు కురిసిన వర్షపాతం 50 మి.మీలకు పైగా ఉండగా.. ఇదే నెల చివరి వారంలో కేవలం మరో 50 మి.మీ వర్షపాతం నమోదైంది. అంటే 25 రోజుల కాలంలో 260 మి.మీల మేరకు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 67 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. ఆగస్టు 29న 6.3 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. తిరుమలాయపాలెం మండలంలో అధికంగా 6.68 సెం.మీ వర్షపాతం నమోదుకాగా.. 3–6 సెం.మీ మధ్య ముదిగొండ, ఖమ్మం అర్బన్, బయ్యారం మండలాల్లో వర్షం కురిసింది. మరో 3 మండలాల్లో 1–3 సెం.మీ మధ్య వర్షపాతం నమోదైంది. రెండు మండలాల్లో 1 సెం.మీ లోపు వర్షపాతం నమోదైంది. పైర్లకు అంతంత మాత్రమే.. ఆగస్టులో వరుసగా వర్షాలు లేకపోవటంతో పెసర, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. పెసర 2వేల హెక్టార్లకు పైగా ఎండిపోయింది. మొక్కజొన్న కూడా దాదాపు 4వేల హెక్టార్లలో ఎండిపోయింది. ఇక పత్తి ఎదుగుదల లోపించింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వడబడ్డ పత్తి కొంత మేరకు ప్రాణం పోసుకున్నా ఆశించిన స్థాయిలో ఎదుగుదల లేదు. పూత, కాత కూడా కుచించుకుపోయింది. నల్లరేగడి నేలల్లో పత్తి ఆశాజనకంగా ఉన్నా.. ఎర్ర, దుబ్బ నేలల్లో మాత్రం బాగా దెబ్బతిన్నది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రైతులు పైరు ఎదుగుదలకు, పూత, కాత వచ్చేందుకు ఎరువులు వేస్తున్నారు. వర్షాలు కూడా ఆశించిన స్థాయిలో పడటం లేదని, పాటు చేసే వర్షాలు కూడా పడటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెసర కొంత మేరకు చేతికి అందగా, ఆలస్యంగా వేసిన పెసర మాత్రం ఎండిపోయిందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కూడా పెసరకు ఉపయోగం లేదని అంటున్నారు. మొక్కజొన్న వర్షాధారంగా ప్రధానంగా వేసిన బయ్యారం, ఇల్లెందు, టేకులపల్లి, గుండాల వంటి ప్రాంతాల్లో అనుకూలమైన సమయాల్లో వర్షలు పడకపోవటంతో కంకి పాలుపోసుకునే దశలో ఎండిపోయిందని, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఈ పైరుకు ఎంత మాత్రం ఉపయోగపడవని రైతులు వాపోతున్నారు. వరి పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం వల్ల వరి ఆశించిన మేరకు ఎదుగుదల లేదని రైతులు చెబుతున్నారు. ఇక రైతులు మిర్చిపై మాత్రం ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే జిల్లాలో 16వేల హెక్టార్లలో మిర్చి పంటను రైతులు వేశారు. మరో 10వేల హెక్టార్లలో పంట సాగు చేసే అవకాశం ఉంది. అయితే రైతులు ఈ పంటకు కూడా వర్షాలు కురుస్తాయని, భూగర్భ జలాలు పెరుగుతాయని ఆశలు పెట్టుకున్నారు. -
ప్లీజ్ వర్రీ... బీ హెల్దీ...
కలత.. దిగులు.. వ్యాకులత.. చింత.. సాదాసీదా పామర భాషలో చెప్పాలంటే వర్రీ... ఎవరికి లేవండీ వర్రీస్..? పెతోడికీ సవాలచ్చ వర్రీస్ ఉంటాయి... వర్రీలు మనుషులకు కాకుండా, మానూ మాకులకు ఉంటాయా..? అని ప్రశ్నిస్తారా..? అయితే, ఓకే! ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా కాస్త స్థాయీ భేదాలతో మనుషులందరికీ చింతలు ఉంటాయి. పాలుతాగే పసితనంలో పెద్దగా తెలియదు గానీ, బడికి వెళ్లడం ప్రారంభించిన చిన్నారులు మొదలుకొని, కాటికి కాళ్లు చాపుకున్న పండు ముసలివాళ్లకు సైతం ఏదో ఒక చింత ఉండనే ఉంటుంది. చితి.. చచ్చాకనే మనిషిని దహిస్తుంది. చింత బతికుండగానే మనిషిని కాల్చేస్తుందని పెద్దలు చెబుతుంటారు. నిరంతర చింతాక్రాంతులకు షడ్రసోపేత భోజనమైననూ రుచించదు. హంసతూలికా తల్పమునైననూ నిద్రపట్టదు. ఏ పనియందూ మనసు లగ్నము కాదు. వేళ మీరిన తర్వాత ఎప్పటికో కలత నిద్ర పట్టినా, పీడకలలు పీడిస్తాయి. జీవితంలో ఇలాంటి స్థితి ఎక్కువకాలం కొనసాగడం ఆరోగ్యానికే కాదు, దీర్ఘకాలికంగా చూసుకుంటే ఆయుర్దాయానికీ మంచిది కాదు. అలాగని, ఏదీ పట్టించుకోకుండా, చీకూ చింతాలేని ధిలాసా కులాసా జీవితం గడిపితే, అది అస్సలు మంచిది కాదు. అందువల్ల మరీ వర్రీ కాకుండా, వర్రీస్ గురించి కొంచెం తెలుసుకోండి... చింతా పురాణం.. ‘బతుకంతా చింతే జీవికి..’ అనే కీర్తనలో పురందరదాసు లోకంలోని చింతలన్నింటినీ ఏకరువు పెట్టాడు. ‘మదిలో చింతలు మైలలు మణుగులు..’ అంటూ చింతా భారాన్ని తూకం వేశాడు అన్నమయ్య. పురాణాల్లో చింతాక్రాంతులు చాలామందే ఉన్నారు. వారిలో మచ్చుకు కొందరి గురించి చెప్పుకుందాం.. కురుక్షేత్రంలో కౌరవ, పాండవ సైన్యాలు రెండు వైపులా మోహరించి ఉన్న తరుణాన సోదరులను, బంధువులను చంపడానికా ఈ యుద్ధం చేయడం అంటూ అర్జునుడు చింతాక్రాంతుడవుతాడు. తన రథానికి సారథ్యం వహిస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముడు గీతోపదేశం చేసిన తర్వాత యుద్ధోన్ముఖుడవుతాడు. యుద్ధం మొదలవక ముందు అర్జునుడు చింతాక్రాంతుడైతే, యుద్ధం మొదలయ్యాక ధృతరాష్ట్రుడు చింతాక్రాంతుడవుతాడు. సంజయుడి ద్వారా ఎప్పటికప్పుడు యుద్ధ విశేషాలను తెలుసుకుంటూ, యుద్ధభూమిలో ఒక్కొక్కరుగా మరణిస్తున్న తన కొడుకుల దుస్థితిని తలచుకుంటూ వగచి వగచి విలపిస్తాడు. యుద్ధానికి ముందే చింతించిన అర్జునుడు విజేతగా నిలిస్తే, యుద్ధం మొదలయ్యాక చింతించిన ధృతరాష్ట్రుడు వంశనాశనాన్ని చవిచూశాడు. వర్రీస్ ఆర్ వెరీ కామన్.. రాజకీయాల్లో తిరుగుతున్న పెతోడూ దేస్సేవ చేసేయాలని తెగ వర్రీ అయిపోతుంటాడు. దేశాన్ని యమ బీభత్సంగా ఎలా అభివృద్ధి చేయాలా అని ప్రభుత్వాలు, వచ్చే ఎన్నికల నాటికి బలం పుంజుకుని ఎలా అధికారంలోకి రావాలా అని ప్రతిపక్షాలు వర్రీ అయిపోతుంటాయి. రిలీజు కాబోయే సినిమా కలెక్షన్ల గురించి నిర్మాతలు, బయ్యర్లు వర్రీ అయిపోతుంటారు. తమ అభిమాన హీరోల సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్టవుతాయా, ఫట్టవుతాయా అనే ఆలోచనతో వీరాభిమానులు వర్రీ అయిపోతుంటారు. రాబోయే పరీక్షలను తలచుకుని విద్యార్థులు, చదువుసంధ్యలు పూర్తయ్యాక వాళ్ల భవిష్యత్తు ఎలా తగలడుతుందా అని తల్లిదండ్రులు ఓ.. తెగ వర్రీ అయిపోతుంటారు. తమ వంక కనీసం కన్నెత్తి చూడనైనా చూడని అమ్మాయిల గురించి అబ్బాయిలు, అదే పనిగా తమను ఓరచూపులు చూసే అబ్బాయిల గురించి అమ్మాయిలు మరీ మరీ వర్రీ అవుతుంటారు. ధరల దూకుడు గురించి, పెరగని జీతభత్యాల గురించి ఉద్యోగులు వర్రీ అవుతుంటారు. ఆఫీసులో అడుగుపెట్టాక బాసు మూడ్ ఎప్పుడెలా ఉంటుందోననే వర్రీ కూడా సగటు ఉద్యోగులను పీడిస్తుంటుంది. ఆఫీసు నుంచి ఇంటికెళ్లాక ఇంటావిడ సాధింపుల నుంచి విముక్తి ఎప్పుడు దొరుకుతుందిరా భగవంతుడా అని కుటుంబరావులు వర్రీ అవుతుంటారు. ఇంటాయన బుద్ధిగా ఇంటికొచ్చి షాపింగుకు తీసుకెళతాడా, లేకపోతే ఆఫీసు నుంచి ఏకంగా మందు పార్టీకి చెక్కేస్తాడా అని గృహిణీమణులు వర్రీ అవుతుంటారు. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఏం తినాలా అనే దగ్గర నుంచి రాత్రి పొద్దుపోయాక బెడ్‌పైకి వెళ్లేలోగా ఏమేం చేయాలా అనే విషయాల గురించి చాలామందికి చాలా రకాల వర్రీస్ ఉంటాయి. నిగనిగలాడే కేశసంపదతో అలరారే మాడు పలచబడటం గురించి, సింహేంద్రమధ్యమంలాంటి నాజూకైన నడుము నానాటికీ పూర్ణకుంభాకారం దాల్చుతుండటం గురించి, శరీరంలో పేరుకుపోతున్న చక్కెర గురించి, నిత్యావసరాల ధరలకు మించిన వేగంతో ఎగసిపడుతున్న రక్తపోటు గురించి, సిలిండర్‌లో ఉండాల్సిన గ్యాస్ కడుపులో గడబిడ చేస్తుండటం గురించి మాజీ యువకులు చాలా తెగ వర్రీ అవుతుంటారు. ఇలాంటి వర్రీస్ గురించి ఎన్నయినా చెప్పవచ్చు. ఎవరైనా వీటి జాబితాను తయారు చేస్తే, అది కచ్చితంగా కొండవీటి చాంతాడు కంటే పొడవుగా తయారవుతుంది. ఒకసారి ఒకే వర్రీ బాధిస్తుందనుకోవద్దు. కాలం ఖర్మం కలసిరాకపోతే ఒకేసారి నానా వర్రీస్ చుట్టాల్లా చుట్టుముట్టొచ్చు. ఇలాంటి వర్రీస్‌లో ఒకటో, రెండో.. ముప్పయిరెండో వర్రీస్ మీకూ ఉండే ఉంటాయి. ఇలాంటి వర్రీస్ ఉన్నందుకు బాధపడటం మాని, కొంచెం ఆనందించండి. అలాగని, ధిలాసాగా ఉండకుండా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్యలపై కొంచెం కొంచెం వర్రీ అవుతూ ఉండండి. ఎందుకంటారా..? అయితే, చిత్తగించండి.. చిగురంత చింత మంచిదే.. చింత.. అనగా, తింత్రిణీఫలము అలియాస్ చింతపండు కాదిక్కడ. అయినా, ప్రస్తావన వచ్చింది గనుక కొంచెం చెప్పుకుందాం. మోతాదుగా చింతపండు వాడితే వంటకాలకు రుచి అబ్బుతుంది. వంటకాలకు రుచినిచ్చే చింతపండు సంగతి సరే, మరి నిద్రపట్టకుండా చేసే చింత.. అదే, వర్రీ సంగతేమిటంటారా..? కర్రీకి చింతపండులాగానే, మనిషనే వాడికి జీవితంలో వర్రీస్ కూడా మంచివేనని శాస్త్రవేత్తలు సెలవిస్తున్నారు. ఆషామాషీగా వాళ్లు ఈ మాట చెప్పడం లేదు. పాపం, వర్రీ గురించి తెగ వర్రీ అవుతూ బోలెడన్ని పరిశోధనలు కూడా చేశారు. ఇంట్లో బిందెలు అడుగంటిన వేళ కొళాయిలో నీళ్లు రానందుకు, టీవీలో అభిమాన సీరియల్ చూస్తున్నప్పుడు చెప్పాపెట్టకుండా కరెంటు సరఫరా నిలిచిపోయినందుకు, పిల్లాడు చెప్పిన మాట వినకుండా హఠం చేసినందుకు, రెయిన్‌కోటు లేకుండా బయలుదేరిన వేళ ట్రాఫిక్ నడిమధ్యలో ఉన్నప్పుడు భోరున వర్షం కురిసినందుకు.. ఇలాంటి చిన్న చిన్న కారణాలకు సైతం మీరు వర్రీ అవుతుంటారా..? మరేం ఫర్వాలేదు. కచ్చితంగా మీరు చాలా తెలివైన వాళ్లు! మీ ఐక్యూ ఐన్‌స్టీన్‌కు కాస్త అటూ ఇటుగా ఉండొచ్చు. చిన్నా చితకా విషయాలకు కూడా తెగ వర్రీ అయ్యే అలవాటున్న వాళ్లకు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని న్యూయార్క్‌లోని సనీ డౌన్‌స్టేట్ మెడికల్ సెంటర్‌కు చెందిన మానసిక వైద్య నిపుణుడు ప్రొఫెసర్ జెరెమీ కోప్లాన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఒక తాజా పరిశోధనలో నిగ్గు తేల్చింది. వర్రీ అయ్యే లక్షణం వల్లనే ప్రమాదాలను నివారించుకోగల తెలివితేటలు మనుషుల్లో అభివృద్ధి చెందాయని శాస్త్రవేత్తల ఉవాచ. వర్రీ అయ్యే లక్షణం ఉన్నవాళ్లు ప్రమాదాలకు, ఉపద్రవాలకు ఎలాంటి అవకాశం లేకుండా, ప్రణాళికాబద్ధంగా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారని వారు చెబుతున్నారు. వర్రీ అయ్యే లక్షణానికి, తెలివితేటలకు అవినాభావ అనులోమానుపాత సంబంధం ఉన్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని వివరిస్తున్నారు. అందువల్ల మీ మీ భూత భవిష్యత్ వర్తమాన సమస్యలన్నింటిపైనా బేఫికర్‌గా వర్రీ అవ్వండి.. ఈ పాడు జీవితం కాస్తంతైనా సార్థకం కావాలంటే, చిగురంత చింత ఉండాల్సిందే! - సాక్షి ఫ్యామిలీ వర్రీస్.. ఫ్లాష్‌బ్యాక్.. నిరంతరం వర్రీ కావడాన్ని ఇదివరకు ఒక రుగ్మతగానే పరిగణించేవారు. వయసు మళ్లడం వల్ల తలెత్తే నానా లక్షణాల్లో వర్రీకావడం కూడా ఒకటి అని శతాబ్దం కిందట వైద్యనిపుణులు సైతం చెప్పేవాళ్లు. ‘వర్రీ అండ్ హౌ టు అవాయిడ్ ఇట్’ అని హేడన్ బ్రౌన్ అనే వైద్య నిపుణుడు 1900 సంవత్సరంలో ఓ పుస్తకాన్ని రాస్తే, అమెరికన్ మానసిక వైద్య నిపుణుడు విలియమ్ ఎస్ సాడ్లర్ 1914లో ‘వర్రీ అండ్ నెర్వస్నెస్’ అనే పుస్తకం రాశాడు. అంటే, వర్రీస్ని కాకపోయినా, వర్రీ అయ్యే లక్షణాన్ని సమూలంగా నిర్మూలించడాన్నే అప్పటి వైద్య నిపుణులు తమ తక్షణ కర్తవ్యంగా తలచారు. ఆ దిశగానే వారు కృషి చేశారు. మనుషుల్లో వర్రీ అయ్యే లక్షణాన్ని ఎలా రూపుమాపాలా అంటూ వారంతా తెగ వర్రీ అయ్యేవారు. పాపం.. అమాయకులు. వర్రీస్ వల్ల కలిగే మేలును అప్పట్లో గుర్తించలేకపోయారు వాళ్లు. -
రియల్టర్ల ఆందోళన
-
నిరంతరం... నిశ్చింతగా..!
చింత లేని వ్యక్తి ఈ లోకంలో ఉండడు. ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఏదో ఒక విషయానికి చింతిస్తూ ఉంటారు. చింతలు మనల్ని మానసికంగా దిగజార్చుతాయి. మన జీవితంలో అధిక భాగం చింతించడానికే సరిపోతుంది. నిజానికి మన అనారోగ్యానికి ఈ చింతలే కారణం. చింతలకు కారణం అవిశ్వాసం! అయితే దేవుడిపై విశ్వాసం ఉన్నవారి దరికి ఏ చింతా చేరలేదని మనం గ్రహించాలి. విశ్వాసం దేవునికి అత్యంత ప్రీతికరమైన గుణం. విశ్వాసం లేకుండా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడం అసాధ్యం. దేవునిపై విశ్వాసం గలవారు దేవుని కోసం నిరీక్షిస్తారు. అంతేకాదు, విశ్వాసంలో సానుకూల అలోచనా ధోరణి మనల్ని నడిపిస్తుంది. అందుకే విశ్వాసి తలపెట్టిన కార్యాలన్నీ సఫలం అవుతాయి. ఇందుకు భిన్నంగా అవిశ్వాసి వ్యతిరేక ఆలోచనా ధోరణితో, అపసవ్య ప్రవృత్తితో ఉంటాడు. అందుకే అతడు ప్రతి క్షణం సమస్యలతో, సందేహాలతో, చింతలతో సతమతం అవుతూ ఉంటాడు. సానుకూలతా? వ్యతిరేకతా? మనం ఎటువైపు ఉండాలన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. మనం దేని వైపు ఉంటే, దానికి తగిన ఫలితమే మనకు చేకూరుతుంది. ‘నమ్మడం నీ వల్ల సాధ్యం అయితే సమస్తం నీకు సాధ్యమే’ అంటారు ఆధ్యాత్మిక గురువులు. భగవంతునిపై నమ్మకం ఉంచినప్పుడు జీవితంలో అద్భుతాలు జరిగిపోతుంటాయి. కనుక వ్యతిరేక దిశలో ఆలోచించండం మాని సవ్యదిశలో, ఆశావహ దృక్పథంలో ప్రతి ఒక్కరం జీవనయానం సాగించాలి. సృష్టికర్త అయిన దైవాన్ని మనం హృదయపూర్వకంగా ప్రేమించి, విశ్వసించినప్పుడు మన భారం మొత్తం ఆయన మీద మోపినప్పుడు మనం ఏ విషయానికీ చింతించనవసరం లేదు. దేవునికి ఇష్టులముగా నిశ్చింతగా నిరంతరం జీవించవచ్చు. - యస్.విజయ భాస్కర్