
పలిత కేశ సందేశం
ఓ పురాణ కథ ప్రకారం రాజ్య వర్ధనుడనే రాజు తన రాజ్యాన్ని 70 వేలసంవత్సరాలు ధర్మబద్ధంగా పాలించాడు. అతని పాలనలో ప్రజలు అనారోగ్యాలు, అనావృష్టులు లేని జీవనం గడిపారు. ఒకరోజు రాజపత్ని, రాజు గారి తలలో తెల్ల వెంట్రుకను చూసి కన్నీరు పెట్టింది. రాజు ఎందుకు ఏడుస్తున్నావని అడిగినా చెప్పకుండా దుఃఖిస్తూనే ఉంది. రాజు ఒత్తిడి చేయడంతో ఆయన తలలో తెల్ల వెంట్రుకను చూసి దుఃఖిస్తున్నానంటుంది. అందుకు రాజు: ‘దీనికై బాధ పడకూడదు. ఇన్ని సంవత్సరాలు జీవించాను. ఎన్నో శుభకార్యాలు చేశాను. తెల్ల వెంట్రుకలు వచ్చినా, దేహం ముడతలు పడినా విచారించనవసరం లేదు. ఈ పలిత కేశం వృద్ధాప్యానికి గుర్తు. నేనింక వనాలకు వెళ్ళవలసి ఉంది. ఇన్నాళ్లు లౌకిక సుఖాలు అనుభవించాను. ఇప్పుడు తపస్సు చేసుకుంటాను. కుమారునికి రాజ్యాభిషేకం చేసి వెళతాను’ అన్నాడు.
పలిత కేశం వ్యక్తులు ఇంకా నిర్వహించవలసిన మిగిలిపోయిన బాధ్యతలను గురించి హెచ్చరిస్తుంది. కుటుంబ బాధ్యతలు తీరిపోతే, దైవ సన్నిధిలో, ఆధ్యాత్మిక మార్గంలో జీవించమని హితవు చెబుతుంది. తలలో నెరసిన వెంట్రుకలను చూసి, వయసై పోతోందే అని వ్యధ చెందనవసరం లేదు. లౌకిక జీవన పోరాటంలో కొట్టుమిట్టాడుతున్న వారికి ముక్తి మార్గాన్ని చూపే హితైషి పలిత కేశం. వయసుతోపాటు శరీరంలో వచ్చే సహజ పరిణా మాలను గుర్తు చేసే సత్య బోధిని పలిత కేశం.
అయితే పై కథలో రాజును విడిచి ఉండలేని ప్రజలు, ఇంకా పదివేల ఏళ్ళు రాజు, స్థిర యవ్వనం, అందమైన కేశాలు కలిగి ఉండి తమనుపాలించాలని సూర్య దేవుని ప్రార్థించి వరం పొందారు. రాజు, ఆ ప్రజలు లేకుండా తాను వర ప్రభావంతో జీవించి ఉండలేనని, తన కోసం ప్రార్థించిన వారి కోసం తనున్నాళ్ళు వారు జీవించేట్లు వరం ఇమ్మని సూర్యదేవుని ప్రార్థించి వరం పొందాడు. ప్రజలను చక్కగా పాలించాడు. ఈ కథ మార్కండేయ పురాణం లోనిది.ఎప్పటికైనా వృద్ధాప్యం (పలిత కేశం) రావడం అనివార్యం అనే వాస్త వాన్ని గ్రహించి తదనుగుణంగా (భగవచ్చింతనతో) మెలగాలి.
– డా. చెంగల్వ రామలక్ష్మి
ఇదీ చదవడి: World Cancer Day 2025 : లక్షలాదిమంది బిడ్డలు అనాథలుగా; ముందుగా గుర్తిస్తే!