
బయాజిద్ బిస్తామి ఓ సూఫీ. ఆయనను ‘జ్ఞానవాదుల రాజు‘ అని పిలిచేవారు. ఒకరోజు ఎక్కువసేపు మసీదులో గడిపి ఇంటికి బయలు దేరారు. మార్గమధ్యంలో ఓ తాగుబోతు ఎదురు పడ్డాడు. అతని చేతిలో ఓ సంగీత వాద్యం ఉంది. నోటికొచ్చి నట్టల్లా ఏదో పాడుకుంటూ వస్తు న్నాడు. ఆ దారిన వచ్చిపోతున్న వారిని తిడు తున్నాడు. అదే దారిలో బిస్తామీ వెళుతూ అతని స్థితిని చూసి బాధపడ్డారు. అతని దగ్గరకు వెళ్ళి ‘ఎందుకిలా ఉన్నావు?’ అని జాలిగా అడిగారు. బయటకు వచ్చిన ప్పుడు ఎలా ఉండాలో నాలుగు మంచి మాటలు చెప్పసాగారు. అయితే తాగుబోతుకి కోపం వచ్చింది. అతను తన చేతిలో ఉన్న సంగీత వాద్యంతో బిస్తామీ తల మీద కొట్టాడు. ఆయన తలకు గాయమైంది. రక్తం కారింది. అంతేకాదు, తాగుబోతు దగ్గరున్న వాద్యం కూడా విరిగింది. ఇంత జరిగినా సూఫీ జ్ఞాని అతనిని ఏమీ అనలేదు. ఆయన ఇంటికి దగ్గర్లోనే ఉంటాడా తాగుబోతు. మరుసటి రోజు ఆయన తీపి పదార్థాలను, కాస్తంత డబ్బు, ఒక ఉత్తరం ఒకరికి ఇచ్చి తాగుబోతు వద్దకు పంపించారు. తాగుబోతు ఆ ఉత్తరం చదివాడు. అందులో ఇలా ఉంది.
‘మీ సంగీత వాద్యం ముక్కలైంది. అందుకు కారణం నా తలే. అందుకు నేను ఎంతో బాధపడుతున్నాను. కనుక నేను మీకిస్తున్న డబ్బుతోవాద్యం కొనుక్కోండి. అన్నట్టు మరొక విషయం. మీరు నిన్న రాత్రి నాతో మాట్లాడుతున్నప్పుడు మీ నోటంట అనేక చేదు మాటలు దొర్లాయనిపించింది. కనుక మీకు పంపిన తీపి పదార్థాలు తినండి. లోపల ఉన్న చేదు పోతుంది. అప్పుడు మీ మాటలు తీయగా ఉంటాయి’.
తాగుబోతు ఈ సంఘటన తర్వాత తాగుడు మానేశాడు. బిస్తామీ వద్దకు వెళ్ళి తన తప్పును క్షమించ మన్నాడు. ఇంకెప్పుడూ అలా చేయనని హామీ ఇచ్చాడు. ‘మీ సహనం, మీ మంచి మాటలు నా కళ్ళు తెరిపించాయ’న్నాడు.
– యామిజాల జగదీశ్
Comments
Please login to add a commentAdd a comment