
వర్ధమాన మహావీరుని కాలంలోనే మక్కలి గోశాల్, అజిత్ కేశకంబల్, సంజయ్ విలేతిపుత్ర అనే ప్రముఖులూ ఉండేవారు. వారంతా మహామేధావులు, పండితులు, చక్కటి సంభాషణా చతురత గల వారు. ఒక్కొక్కరికీ వేలమంది శిష్యులుండేవారు. వారు వారి గురువు లను ‘తీర్థంకరుడు’ అనే గౌరవానికి అర్హులుగానే భావించేవారు. కానీ మహావీరుడు ‘తీర్థంకరుడై’ వేల ఏండ్లుగా జనంచే పూజింపబడుతున్నాడు. కానీ వారేమో చక్కటి వాగ్ధాటి, పాండిత్యం ఉన్న వారైనా కనుమరుగై కాలగర్భంలో కలిసి పోయారు.
ఎక్కువ కాలం మౌనంగా ఉండి, ఎపుడో నాలుగు మాటలు చెప్పిన మహావీరుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. కారణం ఏమై ఉంటుంది? మహావీరుని జ్ఞానం స్వాను భవంతో వచ్చినది, ఇతరులది కేవలం శాస్త్ర పాండిత్యం. అంతరంగంలోని కరుణ నుండి వెలువడిన వాక్కులు మహావీరునివి! వారి వేమో మెదడు నుండి బయల్పడినవి. మహావీరుని మాట కాదు... ఆయన ఉనికే చుట్టూ వున్న వారిపై గణనీయమైన ప్రభావం చూపి వారిలో సమూల మార్పు తెచ్చేది.
ఆనాడు దొంగతనం చేసి కుటుంబ పోషణ చేసే ఒక గజదొంగ తన అంత్యదశలో తన కుమారుడికి ఇచ్చిన సలహా: ‘నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ మహావీరుడున్న ప్రాంతానికి వెళ్ళవద్దు. ఈ ఊరికి ఆయన వచ్చాడని తెలిస్తే వెంటనే నీవు పొరుగూరికి పారిపో. పొరబాటున కూడా ఆయన చెప్పే ఒక్క మాట కూడా నీ చెవిలో పడకుండా జాగ్రత్త పడు. ఒక్క మాట విన్నా నీవు మన వృత్తిని కొనసాగించలేవు, కుటుంబ పోషణ చేయలేవు జాగ్రత్త.’ దీన్ని బట్టి మహావీరుని మాట ఎంతటి ప్రభావం చూపగలదో అర్థం చేసుకోవచ్చు. (27-35 పుటలు: హిడెన్ మిస్టరీస్–ఓషో) పుణ్య పురుషుల సాన్నిధ్యంలో క్రూరమృగాలు సాధు జంతువులవుతాయి, దుర్మార్గులు సన్మార్గులవుతారు.
– రాచమడుగు శ్రీనివాసులు