mahaveer
-
వైభవంగా మహావీర్ జయంత్యుత్సవం
రాజమహేంద్రవరంలో భారీ ఊరేగింపు ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం రూరల్) : భగవాన్ శ్రీ మహావీర్ స్వామీజీ 2616వ జయంతి ఉత్సవాన్ని రాజమహేంద్రవరం సమస్త రాజస్థానీసంఘ్ ఆధ్వర్యంలో ఆదివారం వైభవంగా నిర్వహించారు. స్థానికు గుండువారివీధిలోని జైన మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భగవాన్ మహావీర్ విగ్రహం పల్లకీలో వేలాదిమంది వెంట రాగా మెయిన్ రోడ్, డీలక్స్సెంటర్ మీదుగా ట్రైనింగ్ కళాశాలకు చేరుకుంది. జైనులు అతిథుల నుదుట తిలకం దిద్ది ఆప్యాయంగా ఆహ్వానించారు. నిర్వాహకులు మహావీర్ ఎం.జైన్ మాట్లాడుతూ అహింసను మించిన ధర్మం లేదని, సాటి మనుషులనే కాదు, ఏ ప్రాణినీ నొప్పించరాదని అన్నారు. 2616 ఏళ్ళ తర్వాత కూడా భగవాన్ మహవీర్ బోధనల ప్రాధాన్యం తగ్గలేదన్నారు. రాజస్థాన్ ప్రాంతానికి చెంది, రాజమహేంద్రవరంలో స్థిరపడిన 36 ఉపకులాల వారందరినీ ఒకతాటిపైకి తీసుకువచ్చి సోదరభావాన్ని పెంపొందించడం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. నగర ఎమ్మెల్యే డాక్టర్ ఆకులసత్యనారాయణ, మేయర్ పంతం రజనీ శేషసాయి, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, నగర కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, నగరపాలకసంస్థలో ఆ పార్టీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, సీసీసీ ఛానల్ ఎండీ పంతం కొండలరావు, అర్బన్ క్రైం డీఎస్పీ త్రినాథరావు, నగర బీజేపీ అధ్యక్షుడు బొమ్ములదత్తు, ఆర్యాపురం అర్బన్ బ్యాంకుౖ వైస్ చైర్మన్ అయ్యల గోపి, డైరెక్టర్ యెనుముల రంగబాబు, కార్పొరేటర్లు కురగంటి ఈశ్వరి, మాటూరి రంగారావు, ఇన్నమూరి శ్రీరామచంద్రమూర్తి, మాజీ కార్పొరేటర్లు వాకచర్ల కృష్ణ, చోడిశెట్టి సత్యవాణి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బూర్లగడ్డ వెంకటసుబ్బారాయుడు, ఎస్వీజీ మార్కెట్ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్.నాగేశ్వరరావు, రాష్ట్ర టీడీపీ కార్య నిర్వాహకకార్యదర్శి గన్ని కృష్ణ, చల్లా శ్రీనివాస్, తోట సుబ్బారావు, మార్గాని భరత్, కాశి నవీన్ కుమార్ తదితరులను శాలువాలతో సత్కరించారు. మోహన్ లాల్జైన్, అశోక్‌కుమార్‌జైన్, జైన్, భేరూలాల్జైన్, హంసకుమార్జైన్, లక్ష్మీనారాయణజవ్వార్, నారాయణసింగ్, నందుజైన్, బాబూ సింగ్, అధికసంఖ్యలో జైనులు పాల్గొన్నారు. -
మహావీరుడు ఏమి జయించాడు?
ఏప్రిల్ 20 మహావీర్ జయంతి జైన సంప్రదాయానికి మూలమైన సిద్ధాంతాన్ని ఆత్మవాదమని అనేకాంత వాదమని అంటారు. బాహ్యాభ్యంతరాలైన (అంటే బయటవీ, లోపలివీ) వికారాలను... అంటే క్రోధం, కామం, ఈర్ష్య, అసూయ మొదలైన వాటిని జయించినవానికి జిన, జినుడు అని పేరు. ‘జినుడు’ అన్నమాట నుంచి వచ్చిన పదం జైనం. జినుడు అంటే జయించినవాడు అని అర్థం. జినుడు అయిన వ్యక్తి స్థాపించిన మతం కనుక దీనిని జైన సంప్రదాయం అంటారు. ఈ సంప్రదాయంలో 24 తీర్థంకరులు ఉన్నారు. తీర్థంకరులంటే పూర్ణ పురుషులు. జీవన ప్రవాహాన్ని దాటడానికి వారధి నిర్మించినవారు. ఇరవై నాలుగవ మరియు ఆఖరి తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. మహావీరుడు బీహార్‌లోని వైశాలీ నగరం సమీపంలోని కుందల్‌పూర్‌లో జన్మించాడు. తండ్రి సిద్ధార్థుడు కాశ్యప గోత్రానికి చెందిన క్షత్రియుడు. తల్లి... వజ్జీ రాజ్యాధిపతి, ఇక్ష్వాకు వంశ క్షత్రియుడైన చేతకుని కుమార్తె ప్రియకరణి లేక త్రిశల. బాల్యం నుంచీ రాజకుమారునిగా సకల సౌఖ్యాలూ అందుబాటులో ఉన్నప్పటికీ నిర్లిప్తుడుగా ఉండేవాడు మహావీరుడు. శ్వేతాంబర సంప్రదాయానికి చెందిన అచరంగ సూత్ర అనే గ్రంథం ద్వితీయ అధ్యాయంలో వర్ధమానుని తల్లిదండ్రులు పార్శ్వనాథుని భక్తులని ఉంటుంది. వర్ధమానుని వివాహ విషయంలో శ్వేతాంబర, దిగంబర సంప్రదాయాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాటిని అనుసరించి వర్ధమానుడు వివాహం చేసుకోకుండానే ఉండిపోయాడని దిగంబర సంప్రదాయం చెబుతుంటే శ్వేతాంబర సంప్రదాయానుసారం వర్ధమానునికి వివాహం అయ్యింది. భార్య పేరు యశోద. వీరికి ‘ప్రియదర్శి’ అనే పుత్రిక ఉండేది. వర్ధమానుని మేనల్లుడు జామాలిని వివాహమాడింది. పాఠశాల, అధ్యాపకుల అవసరం తనకు లేదన్న వివేకాన్ని వర్ధమానుడు మనసులోనే నెల కొల్పుకున్నాడు. మహావీరుని అసలు పేరు వర్ధ మానుడు. జ్ఞానోదయమైన తరువాత ‘మహా వీరుడు’ అని పేరు పొందాడు. ఈ సార్థకనామం అతనికి ఎలా వచ్చిందనేందుకు ఒక కథ ఉంది. ఒకరోజు తన స్నేహితులతో కలిసి ఆటలాడు తున్నప్పుడు, ఒక నల్లని పాము పడగ పైన తన పాదం మోపి దాన్ని అణచివేశాడు. ఈ విధంగా మోహం అనే సర్పాన్ని అణచటం జరిగింది. బుద్ధునిలాగే మహావీరుడు కూడా ప్రపంచ పరిత్యాగం చేయాలనే ఆశతో కొట్టుమిట్టాడాడు. కుటుంబంతో కలిసి 28 ఏళ్ల వయసు వరకు గడి పాడు. ఆ సమయంలోనే అతని తల్లిదండ్రులు కాలధర్మం చెందారు. ఇక తాను సర్వసంగ పరి త్యాగం చేయాలని, యోగ్యమైన, ఉపయోగకరమైన కార్యం నెరవేర్చాలని భావించాడు. సంపదను పేదలకు పంచాడు. కుటుంబాన్ని విడనాడిన రోజే రాజ్యాన్ని సోదరునికప్పగించాడు. అప్పుడు ముప్పది ఏళ్ల వయసులో ఉన్నాడు. తపస్సు, ప్రార్థనలతో నిండిన జీవితంలోకి ప్రవేశించాడు. గృహస్థ జీవితాన్ని త్యజించి, కఠినమైన తపస్సు చేశాడు. ఆరు సంవత్సరాలు మక్కలి గోశాలుడి వద్ద శిష్యునిగా ఉన్నాడు. ఆ తరువాత జృంబిక గ్రామం దగ్గర పన్నెండు సంవత్సరాల ధ్యానం, తపస్సుల తర్వాత మహావీరునికి వెలుగు కనిపించింది, ఆత్మ వివేకం (జ్ఞానం) కలిగింది. తీర్థంకరుడయ్యాడు. ఈ స్థితిని కైవల్యం అనీ ఈ స్థితిని పొందినవారిని కేవలి అనీ అంటారు. తదనంతరం వర్ధమానుడు తన తత్వాన్ని ప్రచారం చేశాడు. ఆనందానికి సంతోషానికి సంబంధించిన తన గొప్ప శుభ సందేశాన్ని ప్రబోధించాడు. వర్ధమానుని బోధనల్లో ప్రధానమైనవి అహింస, సత్యం, అపరిగ్రహం, అస్తేయం, బ్రహ్మచర్యం. వీటిని పంచ వ్రతాలు అంటారు. బ్రహ్మచర్యం పాటిస్తూ హింస చేయకుండా, అబద్ధమాడకుండా, ఇతరుల ఆస్తిని కబళించకుండా, దొంగతనం చేయకుండా ఉండాలి. జైన మతానుసారం సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ జీవనం అనే మోక్ష మార్గాలను త్రిరత్నాలంటారు. వీటిని పాటిస్తూ పంచవ్రతాలతో జీవించేవారికి కైవల్యం లభిస్తుందని మహావీరుడు బోధించేవాడు. అవే జైనులకు మార్గదర్శకాలు. సన్యాసి అయినవాడు శాకాహారాన్ని తీసుకోవాలి. అహింసను తప్పనిసరిగా పాటించాలి. ప్రతి ప్రాణికి, వస్తువుకి, నిర్జీవులు అయినవాటికి కూడా చైతన్యం వుంటుందని వాటికి గాయాలైతే అవి బాధపడతాయని అంటారు. చివరికి భూమిలో ఉండే వానపాములు చనిపోతాయని భూమినే దున్నొద్దు అంటారు. అందుకే చాలామంది జైనులు వ్యాపారాల్లో స్థిరపడ్డారు. గాలి పీలిస్తే గాల్లోని సూక్ష్మజీవులు చచ్చిపోతాయని మూతికి గుడ్డ కట్టుకుని తిరుగుతారు. నీళ్లు వడకట్టుకుని తాగుతారు. అడుగు తీసి అడుగు వేసేటప్పుడు కాలి కింద పడి సూక్ష్మజీవులు చచ్చిపోతాయని నెమలీకలతో చేసిన చీపురుతో నేలను ఊడుస్తారు. నేల కింద పండే దుంపలు, ఉల్లి, వెల్లుల్లి, మసూర్ గింజలు వంటివి కూడా తినరు. తన సిద్ధాంతాలను ప్రబోధించేందుకు ఆయన ఒకచోటి నుండి మరోచోటికి నిరంతరమూ ప్రయాణం చేశాడు. ఎందరో అతణ్ని పరిహసించారు. సమావేశాలు జరుగు తున్నప్పుడు ఆయన్ని కలతబెట్టి బాధించేవారు, అవమానపర్చేవారు. ఒక అడవిలో ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఒక ముఠా మనుషులు అతణ్ని కొట్టారు కూడా. అయినా మౌనంగానే ఉన్నాడు. ఆయన మహావీరుడు. గొప్ప విజేత. చివరికి తన 72వ యేట దీపావళి రోజున కాలధర్మం చెందాడు వర్ధమాన మహావీరుడు. ఆయన మోక్షాన్ని పొందిన చోట నేడు జలమందిరం పేరుతో జైన మందిరం ఉంది. దేశమంతా ఆయన పేరు మీద మహిళా విద్యాలయాలు, ఆసుపత్రులు, సంక్షేమ పథకాలు వెలిశాయి. ఆయన నిజంగానే వీరుడు. యుద్ధాల్లో గెలిచిన క్షత్రియ వీరుడు కాదు. సకల సౌకర్యాలనూ వదిలి సామాన్యునిగా జీవించిన వీరుడు. అరిషడ్వర్గాలనీ జయించిన వీరుడు. ప్రతి ఒక్కరి హృదయాలయంలో కొలువైన దేవుడు! - ఆర్ఏఎస్ శాస్త్రి -
అమీర్ ఖాన్ మరో ప్రయోగం!
అతను ఏం చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు. కొత్తతరహా కథలతో వస్తాడు. అందుకే అతడిని మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు. అసాధ్యాలను కూడా సుసాధ్యాలు చేటయం అతనికి అలవాటు. అసాధారణ కథలే అతనికి ఆయుధాలు. గతంలో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలలో నటించిన అమీర్ ఖాన్ ఇప్పుడు ముగ్గురు బిడ్డల తండ్రిగా కనిపించబోతున్నాడు. బాలీవుడ్లో ప్రస్తుతం బయోపిక్స్ హవా నడుస్తోంది. అమీర్ ఖాన్ కూడా అటువంటి కథతో ముందుకు వస్తున్నాడు. మహావీర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న దంగల్ మూవీలో అమీర్ విజృంభించబోతున్నాడు. పీకే లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత అమీర్ చేస్తున్న చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మూవీలో మహావీర్ సింగ్ కూతుళ్లు గీత, బబిత, సంగీతల పాత్రలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఆ పాత్రల ఎంపిక కోసం ఎన్ని ఆడిషన్స్ జరిపినా ఇంతవరకూ ఎవ్వరూ ఎంపిక కాలేదు. ఈ మూవీ కోసం అమీర్ తన లుక్‌ని పూర్తిగా మార్చేశాడు. 22 కేజీల బరువు కూడా తగ్గి, మహావీర్ పాత్రలో పరకాయ ప్రవేశం చేయబోతున్నాడు. ఈ చిత్రంలో మల్లికా షెరావత్ అమార్ ఖాన్ సరసన నటించనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో బయోపిక్స్ వెల్లువ ఎక్కువైంది. అమీర్ లాంటి స్టార్ కూడా దాన్ని అందిపుచ్చుకుంటున్నాడు. సినిమా అంటే ప్రాణం పెట్టే అమీర్, మహావీర్ పాత్రను అద్భుతంగా పండిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. నితీష్ తివారీ డైరెక్ట్ చేస్తోన్న దంగల్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతుంది. మొత్తానికి ముగ్గురు టీనేజ్ గర్ల్స్‌కు తండ్రిగా నటించడానికి సిద్ధమైన అమీర్ మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నాడు.