
ఒక ఊరిలో జలాలుద్దీన్ అని ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి కుటుంబం పెద్దది కావడంతో ఇల్లు ఏమాత్రం సరిపోయేది కాదు. చివరికి ఒకరోజు మసీదులో ఉన్న ధార్మిక గురువు దగ్గరికెళ్ళి ఉపాయం చెప్పమని ప్రాధేయపడ్డాడు. సావధానంగా విన్న గురువు.. ‘నువ్వొక కోడిని తీసుకువెళ్ళి మీతోపాటే ఇంట్లో ఉంచుకో. నీ సమస్య తీరిపోతుంది.’ అన్నాడు.
ఆ వ్యక్తి కోడిని కొనుక్కొని వెళ్ళాడు. తమతోపాటే దాన్ని ఇంట్లో ఉంచాడు. అలా వారం గడిచింది. కాని పరిస్థితిలో మార్పు రాలేదు. పైగా సమస్య పెరిగిందే తప్ప తగ్గలేదు. ఆ వ్యక్తి మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళాడు. ‘‘అయ్యా.. మరికాస్త ఇబ్బంది ఎక్కువైంది’’ అని మొర పెట్టుకున్నాడు. ‘‘ఈసారి ఒక మేకను తీసుకువెళ్ళు. దాన్నీ మీతోపాటే ఇంట్లో ఉంచు. మళ్ళీ వారం తరువాత వచ్చి కలువు’ అన్నాడు గురువు.
ఆ వ్యక్తి మేకను కొనుక్కొని తీసుకువెళ్ళాడు. ఈసారి సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది. గురువు దగ్గరికి వెళ్ళి గోడు వెళ్ళబోసుకున్నాడు. అతను చెప్పినదంతా విని.. ‘ఇప్పుడు నువ్వు ఒక గాడిదను తీసుకు వెళ్ళు.. దాన్నీ మీతోనే ఇంట్లోనే ఉంచు. నీకు శుభం కలుగుతుంది’ అన్నాడు. గురువు మాటమీద గాడిదను తెచ్చిన తరువాత ఇల్లు నరకం అయిపోయింది. ఇంట్లో వాళ్ళకే కాదు, ఆ వీధి వీధంతా అల్లకల్లోలం మొదలైంది. ఏడవరోజు గాడిదతో పడిన నరక బాధను చెప్పుకొని కన్నీరు మున్నీరయ్యాడు. అప్పుడు గురువు ‘సరే.. నువ్వు ఇంటికెళ్ళి కోడిని కోసి వండుకొని తిను. వారం తరువాత వచ్చి కలువు.’ అని చెప్పాడు. ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి ఆరోజు కోడి కూర వండాడు. వారం తరువాత వెళ్ళి గురువుని కలిశాడు.
‘అయ్యా.. సమస్య అయితే తీరలేదు కాని, కాస్తంత పరవాలేదు.’ అన్నాడు. ‘ఈసారి మేకను కోసి విందు చేసుకోండి. మీ వీధి వారిని కూడా విందుకు పిలవండి.’ అని పురమాయించాడు. ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి గురువు చెప్పినట్టే చేసి వారం తర్వాత సంతోషంగా.. ‘‘ఇప్పుడు పరిస్థితి మెరుగు పడింది.’ అని చెప్పాడు. అప్పుడు గురువు, ‘‘నువ్వు గాడిదను సంతలో అమ్మెయ్ ..’ అని సలహా ఇచ్చారు. ఆ వ్యక్తి గాడిదను సంతలో అమ్మేసి ఇంటికి వెళ్ళాడు. వారం ప్రశాంతంగా గడిచింది. గురువు చేసిన ఉపదేశాల్లోని మర్మం అర్థమైంది. ‘అంతా అల్లాహ్ అనుగ్రహం గురువు గారూ..ఇప్పుడు పరమ సంతోషంగా ఉంది. ఇల్లు విశాలమై పోయింది.’ చెప్పాడు పరమానందంగా..!
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్