Allah
-
విపత్కర పరిస్థితులలో వేడుకోవాలి
మహనీయ ముహమ్మద్ (సఅసం) ప్రవచనం: పీడలు, విపత్కర పరిస్థితుల బాధనుంచి, దౌర్భాగ్యకర స్థితి దాపురించడం నుంచి, దురదృష్టకర జాతకం నుంచి, శత్రువులు పరిహాసం చేయటం నుంచి అల్లాహ్ శరణు వేడుకోండి.వివరణ: ఈ హదీసులో స్థూలంగా నాలుగు విషయాల నుండి రక్షణ కోరమని చెప్పినట్లుగా ఉంది. కానీ వాస్తవానికి ఈ నాలుగు విషయాలలోనే ఇహ పరాలకు సంబంధించిన అన్ని చెడుగులు కఠిన పరీక్షలు, కష్టాలు కడగండ్లు వచ్చేశాయి. వాటిలో మొదటిది (జిహాదిల్ బలా) అంటే ఏదైనా ఆపద లేక పీడన వల్ల కలిగే యాతన. మనిషిని శారీరకంగా బాధించి మానసిక క్షోభకు గురి చేసే ప్రతిదీ అతని పాలిట పీడే. ఈ విపత్కర స్థితి ప్రాపంచికమైనదీ కావచ్చు. ఈ ఒక్క పదంలోనే అన్నిరకాల ఆపదలు, విపత్తులు, పీడలు, పరీక్షలు చేరి ఉన్నాయి. రెండవ మూడవ అంశాలు: నిజానికి ఏ దాసునికైతే దౌర్భాగ్యకర స్థితి నుంచి, దురదృష్టం నుంచి దేవుని తరపున రక్షణ లభించిందో అతనికి సర్వస్వం ప్రార్థించినట్లే.నాలుగవ అంశం: షమాతతుల్ ఆదాయి అంటే మనకు కలిగిన ఏదేని కష్టంపై ఎదురైన గడ్డు పరిస్థితిపై మన శత్రువు నవ్వటం, దెప్పి ΄÷డవడం, ఎగతాళి చేయడం, సంకట స్థితిలో శత్రువు చేసే పరిహాసం తీవ్ర వ్యాకులతకు గురిచేస్తుంది. అందుకే ప్రత్యేకంగా దీని నుంచి కూడా దేవుని శరణు వేడమని ఉపదేశం.ప్రవక్త (స) వారి ఈ ఉపదేశాన్ని పాటిస్తూ, ఈ నాలుగింటి నుండి శరణు వేడే సరైన తీరు ఇది: (2) ఓ అల్లాహ్ గండం వల్ల కలిగే బాధనుండి, దౌర్భాగ్యకర స్థితి నెలకొనడం నుండి, శత్రువులు నవ్విపోవడం దురదృష్టకర జాతకం జాతకం నుండి నేను నీ శరణు వేడుతున్నాను. (3) ఓ అల్లాహ్! విచారం, దుఃఖం నుండి, అధైర్యం నుండి, సోమరితనం నుండి, పిరికితనం నుండి, పిసినారితనం నుండి, జనుల ఒత్తిడి నుండి నేను నీ శరణు వేడుతున్నాను.ఈ (దువా) వేడుకోలులో 8 విషయాల రక్షణ కోరబడింది. ఈ ఎనిమిది విషయాలలో నాలుగు మరీ ముఖ్యమైనవి అవి: విచారం, దుఃఖం, రుణభారం, ప్రజల శత్రువుల ప్రాబల్యం, ఒత్తిడి ఈ నాలుగు విషయాలకు లోనైన మనిషి సున్నిత మనస్కుడై ఉంటే అతని బతుకు దుర్భరమైపోతుంది. తత్కారణంగా అతనిలోని తెలివితేటలు, శక్తియుక్తులు చచ్చుబడి పోతాయి. ఫలితంగా ఇహపరాలలోని ఎన్నో విజయ శిఖరాలను అందుకోలేక పోతాడు. అధైర్యం, సోమరితనం, పిసినారితనం, పిరికితనం... ఈ నాలుగు బలహీనతలకు లోనైనా మనిషిలో సంకల్పబలం ధైర్యం తెగువ క్షీణిస్తాయి. అందుకే మహనీయ ముహమ్మద్ (సల్లం) ఈ అంశాలన్నిటి నుంచి అల్లాహ్ శరణు వేడుకోవడమే కాకుండా ఈ విధంగా ్ర΄ార్థిస్తూ ఉండమని తన అనుయాయులకు కూడా నొక్కి చెప్పారు.– మొహమ్మద్ అబ్దుల్ రషీద్∙ -
దానధర్మాలపై ఖురాన్ ఏం చెబుతోంది?
తమ సంపదను దైవ మార్గంలో ఖర్చు చేసే వారి ఉపమానం ఇలా ఉంటుంది: ఒక్క విత్తనాన్ని నాటితే అది మొలిచి ఏడు వెన్నులను ఈనుతుంది. ప్రతి వెన్నుకూ నూరేసి గింజలు ఉంటాయి. ఇదేవిధంగా అల్లాహ్ తాను కోరిన వారి సత్కార్యాన్ని వికసింప జేస్తాడు. అల్లాహ్ అమితంగా ఇచ్చేవాడూ, అన్నీ తెలిసినవాడూను. అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని వ్యయం చేసి ఆ తర్వాత తమ దాతృత్వాన్ని మాటిమాటికి చాటుతూ గ్రహీతల మనస్సును గాయపరచని వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంది. వారికి ఏ విధమైన భయం కానీ ఖేదం కాని ఉండవు. మనసును గాయపరిచే దానం కంటే మృదుభాషణం. క్షమాగుణం ఎంతో మేలైనవి. అల్లాహ్ అన్నింటికి అతీతుడు, అత్యంత సహనశీలుడూను. విశ్వసించిన ఓ ప్రజలారా! కేవలం పరుల మెప్పును పొందడానికే తమ ధనం ఖర్చు చేసే వాని మాదిరిగా..... మీరు దెప్పి పొడిచి గ్రహీత మనస్సును గాయ పరిచి మీ దానధర్మాలను మట్టిలో కలపకండి. అతడు చేసిన ధనవ్యయాన్ని ఈ విధంగా పోల్చవచ్చు: ఒక కొండ రాతిపై ఒక మట్టి పొర ఏర్పడి ఉంది. భారీ వర్షం దానిపై కురవగా ఆ మట్టి కాస్త కొట్టుకు΄ోయింది. చివరకు మిగిలింది ఉత్త కొండ రాయి మాత్రమే. ఇలాంటివారు తాము దానం చేస్తున్నామని భావించి చేసే పుణ్యకార్యం వల్ల వారికి ఏ ప్రయోజనమూ కలుగదు. (నిస్సహాయతలోనూ.. దేవుని వైపే)(దివ్య ఖుర్ఆన్: 2:261–264)వివరణ: మనం ఎవరికైనా దానం ఇచ్చి దెప్పి పొడవడం సరైన పద్ధతి కాదు. కుడి చేతితో దానం చేసిన విషయం ఎడమ చేతికి తెలియకూడదు అంటారు పెద్దలు. కాబట్టి మనం చాటుమాటుగా దానం చేయాలి. అది దేవుని ప్రీతి కోసం మాత్రమే చేయాలి. ప్రదర్శన బుద్ధి కోసమో పేరు ప్రఖ్యాతల కోసమో చేయకూడదు. మీరు చేసిన దానం దేవుడికి తెలుసు తీసుకున్న వాడికి తెలుసు అంతే కానీ మూడో వ్యక్తికి తెలియకుండా ఉండడమే దైవ భక్తికి నిదర్శనం. – మొహమ్మద్ అబ్దుల్ రషీద్ -
Allah Comments: ఆర్థిక మంత్రిని తిట్టిపోస్తున్న పాక్ ప్రజలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం(పెను) కొనసాగుతున్న దరిమిలా.. ఆ దేశ ఆర్థిక శాఖ మంత్రి ఇషాఖ్ దార్ చేసిన వ్యాఖ్యలు జనాలకు మంట పుట్టించాయి. పాక్‌ను అల్లానే సృష్టించాడని, కాబట్టి దేశాన్ని బాగు చేయడం కూడా ఆయనే చూసుకుంటాడని వ్యాఖ్యానించారు. దీనిపై పాక్ ప్రజలు మండిపడుతున్నారు. అధికారంలో ఉండి కూడా చేతకాని దద్దమ్మలా మాట్లాడొద్దంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం పాక్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం, ఆహార కొరత కొనసాగుతున్నాయి. ఎంత ప్రయత్నించినా.. పరిస్థితి దిగజారుతోందే తప్ప కొలిక్కి రావడం లేదు. ఈ తరుణంలో ఓ రైల్వే లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన దార్ మాట్లాడుతూ.. ఇస్లాం పేరిట ఈ గడ్డను(పాక్) అల్లానే సృష్టించాడు. కాబట్టి, దేశాన్ని సుభిక్షంగా మార్చే బాధ్యత కూడా ఆయనదే. అందుకే దేశం మళ్లీ అభివృద్ధి దిశగా ప్రయాణిస్తుందనే నమ్మకం ఉంది అని వ్యాఖ్యానించారు. ఒకవేళ అల్లానే గనుక పాకిస్థాన్‌ను సృష్టించి ఉంటే.. ఆయనే రక్షిస్తారు. ఆయనే అభివృద్ధి చేశారు. బాగోగులు కూడా ఆయనే చూసుకుంటారు అని దార్ వ్యాఖ్యానించారు. ప్రధాని షెహ్బాజ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ ప్రభుత్వం పరిస్థితిని బాగు చేసేందుకు తీవ్రంగా యత్నిస్తోందని పేర్కొన్నారాయన. ప్రస్తుత సంక్షోభ పరిస్థితికి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని గత ప్రభుత్వమే కారణమని, ప్రభుత్వం రాత్రింబవలు కృషి చేసి పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నిస్తున్నా కొన్ని ప్రతిబంధకాలు ఎదురు అవుతున్నాయని పేర్కొన్నారు. అయితే దార్ కామెంట్లపై ప్రతిపక్షాలు, మేధావులు సహా పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రభుత్వంలో ఉండికూడా.. పరిస్థితిని చక్కదిద్దకుండా చేతకానీ దద్దమ్మలా మాట్లాడారంటూ అని మండిపడుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగి.. నెలలు గడుస్తున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని, పైగా తీవ్ర సంక్షోభం దిశగా పాక్ అడుగులు వేసిందని కొందరు గుర్తు చేస్తున్నారు. ఎన్నికల్లో పాక్ ప్రజలు గట్టి బుద్ధి చెప్తారంటూ కామెంట్లు చేస్తున్నారు. -
షాకింగ్ : అల్లాకోసం కన్న కొడుకు ‘బలి’
తిరువనంతపురం : మూర్ఖత్వానికి పరాకాష్టగా నిలిచిన చిత్తూరు జిల్లా మదనపల్లె అమానుష ఘటనను పోలిన తాజా ఉదంతమొకటి కలకలం రేపుతోంది. అల్లా దయ కోసం కన్నబిడ్డనే బలి ఇచ్చిన ఘటన కేరళ పాలక్కాడ్ జిల్లాలోని పులక్కాడ్‌లో వెలుగు చూసింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం 30 ఏళ్ల షాహిదా, తన ఆరేళ్ల కుమారుడు అమీల్ ను అల్లా కోసం గోంతు కోసి మరీ హత్య చేసింది. శనివారం రాత్రి సులేమాన్ పెద్ద పిల్లలు ఇద్దరితో ఒక గదిలో పడుకోగా, చిన్నవాడైన ఆదిల్‌తో మరో గదిలో పడుకుంది షాహినా. ఇంతలో ఏమైందో ఏమోగానీ, తెల్లవారుజామున పిల్లవాడిని బాత్ రూం లోకి తీసుకెళ్లి కాళ్లు చేతులు కట్టేసి పదునైన కత్తితో గొంతుకోసి హతమార్చింది. ఆ తరువాత అల్లా కోసమే తన కుమారుడిని చంపానంటూ స్వయంగా పోలీసులకు సమాచారం అందించింది. తాము వచ్చేదాకా ఆమె గేటు దగ్గర నిలబడి ఎదురు చూస్తోందని పోలీసులు తెలిపారు. దీనికి తోడు పోలీస్ స్టేషన్ నంబర్‌ను సంఘటనకు ముందురోజే పొరుగువారి నుంచి షాహిదా సేకరించినట్టు కూడా విచారణలో వెల్లడైందన్నారు. షాహిదా చేతికి గాయం కావడంతో పాటు ఈ హత్య విషయం పక్క గదిలోనే ఉన్న సులేమాన్‌కు తెలియకపోవడం అనుమానానికి దారితీస్తోందన్నారు. సమగ్ర దర్యాప్తు తర్వాత మాత్రమే నిజానిజాలను నిర్ధారించగలమని పాలక్కాడ్ పోలీసు సూపరింటెండెంట్, విశ్వనాధ్ చెప్పారు. ఆమెను అదుపులోకి తీసుకుని, హత్య కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసును మానసిక కోణంలో కూడా విచారిస్తున్నామన్నారు. కాగా పాలక్కాడ్‌కు చెందిన సులేమాన్, షాహీద్ భార్యా భర్తలు. గతంలో గల్ఫ్‌లో పనిచేసిన ప్రస్తుతం సులేమాన్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. షాహిదా దగ్గర్లోని మదర్సాలో టీచర్‌గా పనిచేస్తోంది. వీరికి ముగ్గురు సంతానం. అమీల్ మూడవ వాడు. ప్రస్తుతం షాహిదా మూడు నెలల గర్భవతి. -
నాడు ఒక్క ఒంటె...నేడు ముప్ఫై ఒంటెలు
ఒకసారి ప్రవక్త మహనీయులు (స) తన శిష్యుడైన ఉబై బిన్ కాబ్ (రజి) ను సంపన్న ముస్లిముల నుంచి జకాత్ వసూలు చేసే పని అప్పజెప్పారు. ఆయన మదీనా పరిసర ప్రాంతాలు తిరిగి సంపన్న ముస్లిముల నుంచి జకాత్ వసూలు చేసేవారు. ఇలా సేకరించిన సామూహిక జకాత్ ను పేద ప్రజలకు పంపిణీ చేసేవారు. ఒకసారి ఆయన జకాత్ సేకరించేందుకు వెళ్లారు. అక్కడ ఒక వ్యక్తి దగ్గర కొన్ని ఒంటెలు ఉన్నాయి. అన్నింటినీ లెక్కవేసి చూడగా ఏడాది వయస్సున్న ఒక చిన్న ఒంటె పిల్లను జకాత్ గా నిర్ణయించారు. ‘‘ఈ ఒంటె ప్రయాణానికీ పనికి రాదు, పాలుకూడా ఇవ్వదు. మొదటిసారి దేనికీ పనికిరాని ఈ చిన్న ఒంటె పిల్లను అల్లాహ్ మార్గంలో దానం చేయడం నాకు ఇష్టం లేదు. శ్రేష్టమైన దానిని జకాత్‌గా ఇవ్వదలుచుకున్నాను; పాలిచ్చే ఈ బలిసిన ఈ ఒంటెను తీసుకెళ్లండి. ’ అని ఆ ఒంటెల యజమాని ఉబై (రజి) ను ప్రాధేయపడ్డాడు. ‘‘ఎక్కువ ఇవ్వదలుచుకుంటే మదీనాలో ప్రవక్త (స) మహనీయుల వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.‘ అని అతనికి చెప్పి వెళ్లిపోయారాయన. ‘‘దైవ ప్రవక్తా; నా జీవితంలో ఇంతవరకూ నేను జకాత్ చెల్లించలేదు. ఇప్పుడు జకాత్ చెల్లించేంతటి స్థోమతకు చేరుకున్నాను. నా ఒంటెలన్నీ లెక్కగట్టగా ఏడాది వయస్సున్న చిన్న ఒంటె పిల్ల జకాత్ గా నిర్ణయమైంది. దానికి బదులుగా బలిష్టమైన ఈ ఒంటెను స్వీకరించండి’’ అని ప్రవక్త (స)కు మొరపెట్టుకున్నాడు. ‘‘ఇష్ట పూర్వకంగా ఎక్కువ మొత్తంలో జకాత్ ఇవ్వాలనుకుంటే ఎలాంటి సంకోచం లేకుండా స్వీకరిస్తాను. దీనికి తగ్గ ప్రతిఫలం అల్లాహ్ తప్పకుండా ఇస్తాడు. ‘‘ అని ప్రవక్త (స) అతని వ్యాపారాభివృద్ధికోసం అల్లాహ్‌ను ప్రార్థించారు. కొన్ని సంవత్సరాల తరువాత ఉబై బిన్ కాబ్ (రజి) ఆ జాతి వద్దనుంచి వెళుతుండగా ఆ వ్యక్తి వృద్ధాప్యంలో కనపడ్డాడు. పదుల సంఖ్యలో ఉండే అతని ఒంటెలు వందల సంఖ్యలో పెరిగిపోయాయి. ఏటా ఒక్క ఒంటెతో జకాత్ ప్రారంభించిన అతను దానిని పెంచుకుంటూ పోయి 30 బలిష్టమైన ఒంటెలను ఇప్పుడు జకాత్ రూపంలో దానం చేస్తున్నాడు. దాన ధర్మాల వల్ల సంపద వృద్ధి చెందుతుందన్నది ఖుర్ ఆన్ బోధన. దైవమార్గంలో ఖర్చుపెట్టే ఒక్కో రూపాయికి ఎన్నో వందలు లెక్కకట్టి తిరిగి మనకు అందుతుందన్నది ఈ గాథ తెలియజేస్తుంది. – అబ్దుల్ మాజిద్ -
స్వర్గంలో తోడు
ప్రవక్త మూసా (అస) అల్లాహ్ తో ‘‘ఓ అల్లాహ్.. స్వర్గంలో నాతోపాటు ఎవరుంటారు?’’ అని అడిగారు. ‘‘ఫలానా కసాయి స్వర్గంలో నీతోపాటు ఉంటాడు’’ అని అల్లాహ్ బదులిచ్చాడు. ప్రవక్త ముహమ్మద్ (స)కు పూర్వపు ప్రవక్తలలో మూసా ఒకరు. ప్రవక్త మూసా (అలై) ఆ కసాయి ఎలా ఉంటాడో అని చూసేందుకు వెళ్లారు. కసాయి అప్పుడే మాంసాన్ని అమ్మి మిగిలిన మాంసపు ముద్దను సంచిలో వేసుకుంటున్నాడు. అతన్ని చూసి మూసా ‘ఈ కసాయి నాతో స్వర్గంలో ఉంటాడా’ అని ఆశ్చర్యపోయారు. మూసా (అలై) ఆ కసాయిని వెంబడించారు. కసాయి ఇంటికి చేరుకోగానే ప్రవక్త మూసా కసాయి అనుమతి తీసుకుని ఇంట్లోకి వెళ్లారు. ఆ కసాయి స్వర్గానికి అర్హత సాధించేంత గొప్ప పనులేమి చేశాడో చూద్దామనే ఆత్రుతతో ఉన్నారు. అంతలోనే కసాయి తన సంచిలో నుంచి మాంసం ముద్ద తీశాడు. ముక్కలుగా కోసి కూర తయారు చేశాడు. గోధుమపిండిని బాగా కలిపి వేడి వేడి రొట్టెలు సిద్ధం చేశాడు. రొట్టెలను పళ్లెంలో వేసుకుని కూరను గిన్నెలో వేసుకున్నాడు. పక్కనే మంచంలో మూలుగుతున్న వృద్ధురాలిని ఎంతో ఆప్యాయంగా లేపి కూర్చోబెట్టాడు. తన ఒళ్లో కూర్చోబెట్టుకుని రొట్టెను ముక్కలు చేసి ఆమెకు తినిపించసాగాడు. కడుపారా తినిపించి మూతిని శుభ్రం చేసి నీళ్లు తాగించి తిరిగి నిద్రపుచ్చబోయేసరికి ఆ ముసలామె ఏవో మాటలు చెప్పింది. ఆ వృద్ధురాలు చెప్పిన మాటలు ప్రవక్త మూసా (అలై)కు వినిపించలేదు. మూసా ఎంతో ఆత్రుతతో ‘‘ఈమె ఎవరు, ఏదో చెబుతుంది ఏమిటి?’’ అని అడిగారు. ‘‘నేను ఒక కసాయిని. ఈమె నా కన్నతల్లి. రోజూ బయటికెళ్లేముందు అమ్మకు అన్నిసేవలు చేసి వెళతాను. తిరిగి ఇంటికి వచ్చాక అమ్మ అవసరాలన్నీ తీరాకే నా పిల్లల, నా అవసరాలు తీర్చుకుంటాను.‘‘ అని కసాయి చెప్పాడు. ‘‘మీ అమ్మ నీ చెవిలో ఏమి చెప్పింది?’’ అనడిగారు. ‘‘రోజూ చెప్పేదే అది. ‘‘అల్లాహ్ నిన్ను స్వర్గంలో మూసా (అలై) వెంట ఉంచుగాక‘‘ అని రోజూ దీవిస్తుంటుంది. అయినా నేనొక చిన్న కసాయిని. నేనెక్కడా, ప్రవక్త మూసా (అలై) ఎక్కడా! ఇది అయ్యే పనేనా’’ అని నవ్వుకున్నాడు. ‘‘నీ తల్లి దీవెనను అల్లాహ్ నిజం చేశాడు’’. అంటూ ప్రవక్త మూసా (అలై) కళ్లలో నీళ్లు తుడుచుకున్నారు. -
సేవకుడి తప్పు
ఖలీఫా ఉమర్ (రజి) కు చేపలంటే ఎంతో ఇష్టం. చేపలు తినాలన్న కోరికను తన సేవకుడి ముందుంచేవారు. సేవకుడు చేపలు తెస్తానని బయల్దేరితే మాత్రం ‘‘చేపలకోసం ఎనిమిది మైళ్ల దూరం వెళ్లాల్సి వస్తుంది’’ అని చెప్పి వారించేవారు. కానీ ఆరోజు సేవకుడు మాత్రం ఈ రోజెలాగైనా ఖలీఫాకు చేపలు వండి పెట్టాల్సిందేనని నిర్ణయించుకున్నాడు. ఖలీఫా నమాజుకు వెళ్లడం చూసి రాజ్యంలోని మేలుజాతి గుర్రాన్ని ఒక్క దౌడు తీయించాడు. ఎనిమిది మైళ్ల దూరం ప్రయాణించి ఆరోజు చేపల గంపను తీసుకుని వచ్చాడు సేవకుడు. ఎనిమిది మైళ్ల దూరం వెళ్లి చేపలు తెచ్చాననే విషయం ఖలీఫాకు తెలిస్తే తన పని అయిపోయినట్లేననే భయంతో అనుమానం రాకుండా అశ్వానికి స్నానాల శాలలో స్నానం చేయించాడు. గుర్రం సేదతీరేందుకు నీడన కట్టేశాడు. సాయంత్రం ఖలీఫా ఉమర్ ఇంటికొచ్చాక సంతోషంతో చేపల గంపను ఆయన ముందుంచాడు. ‘‘కాసేపట్లో రుచికరమైన చేపల కూరను మీముందుంచుతాను’’ అని ఎంతో ఆతృతతో చెప్పాడు. ఈ మాటలు విన్న ఖలీఫా వెంటనే గుర్రం దగ్గరకెళ్లి తన చేయిని గుర్రంపై నిమిరారు. కాళ్లకు మర్దన చేశారు. ఆ తరువాత గుర్రం చెవులను పరిశీలనగా చూశారు. గుర్రం చెవుల కింద చెమటలు పట్టి ఉన్నాయి. ‘‘గుర్రాన్ని చక్కగా స్నానం చేయించావు బావుంది కానీ గుర్రం చెవుల వెనుక పట్టిన చెమటను తుడవడం మర్చిపోయావు’’ అని సేవకుడిని సున్నితంగా మందలిస్తూ చెప్పారు. ఆ మరుక్షణమే ఖలీఫా ఉమర్ (రజి) తన మోకాళ్లను నేలపై ఆనించి తన సేవకుడితో ‘‘ప్రళయం రోజున ‘ఓ అల్లాహ్ ఉమర్ చేపలు తినే కోరికను తీర్చుకునేందుకు నోరులేని నన్ను పదహారు మైళ్లు పరుగెత్తించాడు’ అని ఈ గుర్రం అల్లాహ్ కు ఫిర్యాదు చేస్తే నేనేం సమాధానం చెప్పుకోవాలి’’ అని సేవకుడిని నిలదీశారు. ‘‘మా నాన్న చనిపోయినప్పుడు కూడా నాకింత దుఖం కలగలేదు. ఈ రోజు నా దుఃఖానికి అంతులేకుండా పోయిందం’’టూ వెక్కి వెక్కి ఏడ్చారు. సేవకుడు చేసిన తప్పుకు దండించకుండా ఆ తప్పును తానే చేసినట్లు పశ్చాత్తాపం చెందారు. సేవకుడితో ‘‘గుర్రానికి ఈరోజు ఎక్కువ మేత పెట్టు. తెచ్చిన ఈ చేపల గంపను తీసుకెళ్లి పేద కుటుంబానికి ఇచ్చి ఉమర్ (రజి)కి క్షమాభిక్ష పెట్టమని అల్లాహ్‌ను వేడుకోమని చెప్పు’’ అని చెప్పారు. ఖలీఫా ఉమర్ (రజి) దైవభక్తికి, దైవ భీతికి మచ్చుతునక ఈ సంఘటన. – ముహమ్మద్ ముజాహిద్ -
అమ్మానాన్నలను ఆదరిస్తే అల్లాను ఆరాధించినట్లే!
అల్లాహ్ తరువాత మానవులకు అత్యంత ఆదరణీయులు, గౌరవనీయులు తల్లిదండ్రులే. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, సేవాభావం లేని మానవజన్మ నిరర్ధకం అంటున్నది ఖురాన్. కాని దురదృష్టవశాత్తు ఈనాడు తల్లిదండ్రుల్ని సంతానం పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు తరచు వినబడుతున్నాయి. అంతేకాదు, సంతానం తమను చూడడం లేదని తల్లిదండ్రులు న్యాయస్థానాల మెట్లెక్కుతున్న దృష్టాంతాలను కూడా చూడవలసిన పరిస్థితులు దాపురించాయి. ఒక ఐఏఎస్ అధికారి తన తల్లిని గుర్తుతెలియని అనాథ అని చెప్పి వృద్ధాశ్రమంలో చేర్పించినట్లు ఒక ఆశ్రమ నిర్వాహకుడు ఇటీవల జరిగిన ఒక టీవీ చర్చలో వెల్లడించారు. తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడేవారి బాగోగులు చూసుకుంటూ, వారికి సేవలు చేసి వారి ప్రేమను పొందాలి. వారి జీవితకాలంలో ఆప్యాయంగా ప్రేమగా చూసుకోకుండా తదనంతరం ఎన్ని చేసినా వ్యర్థమే. తల్లిదండ్రుల్ని పట్టించుకోని వారిని సమాజమూ ఆదరించదు, దైవమూ మెచ్చుకోడు. పైగా అలాంటి వారిని దైవం శిక్షిస్తాడు. ఇహలోకంలోనూ పరాభవం పాలు చేస్తాడు, పరలోకంలోనూ నరక శిక్షకు గురిచేస్తాడు. అందుకే మమతలమూర్తి ముహమ్మద్ స.సల్లం ‘తల్లిపాదాల చెంత స్వర్గమున్నదని, తండ్రి స్వర్గానికి సింహద్వారమని, వారిసేవ చేసి వారి ప్రేమను, ఆశీర్వాదాలనుపొంది, వారిని ప్రసన్నం చేసుకోకపోతే స్వర్గప్రవేశం అసాధ్యమని’ ఉపదేశించారు. కాబట్టి బాల్యంలో వారు మనల్ని ఎంత ప్రేమతో, కరుణతో, వాత్సల్యంతో పెంచి పోషించారో, వారి వృద్ధాప్యంలో మనం వారికి అంతకంటే ఎక్కువ ప్రేమానురాగాలతో సేవలు చేయాలి. పసితనంలో వారు ఒక్క క్షణం నిర్లక్ష్యం చేసి ఉంటే, పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. కనుక వారి బాగోగుల్ని, వారి ఆరోగ్యాన్ని, వారి మానసిక స్థితిగతుల్ని పట్టించుకోవాలి. వారిని ఎప్పుడూ ఆనందంగా ఉంచడానికి ప్రయత్నించాలి. వారు నొచ్చుకునే విధంగా, వారి మనసుకు కష్టం కలిగే విధంగా ప్రవర్తించకూడదు. కసురుకోకూడదు. ఇంటిదగ్గర ఉన్న తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా దేశాన్ని ఉద్ధరించడానికి బయలుదేరడం అజ్ఞానం, అవివేకమే తప్ప మరేమీ కాదు. అల్లాహ్ మనందరికీ తల్లిదండ్రుల సేవ చేసి, వారి ఆశీర్వాదాలు పొంది తన కృపకు పాత్రులయ్యే భాగ్యం ప్రసాదించాలని కోరుకుందాం. – ఎండీ. ఉస్మాన్ ఖాన్ -
అక్కరకు రాని సంపద
పూర్వం ఒకరాజు ఉండేవాడు. అతడు ప్రజలను పీడించి, పిప్పిచేసి చాలా సంపద కూడబెట్టాడు. దాన్ని ఊరికి దూరంగా ఒక రహస్య గుహలో దాచి పెట్టాడు. గుహ తాళం చెవులు ఒకటి తనదగ్గర, మరొకటి తనకు బాగా నమ్మకస్తుడైన ఒక మంత్రి దగ్గర ఉంచాడు. అప్పుడప్పుడూ ఆ గుహ దగ్గరకు వెళ్ళి సంపదను చూసుకొని వస్తుండేవాడు. ఒకరోజు రాజు సంపదను చూసుకోడానికి గుహకు వెళ్ళాడు. తాళం తీసుకొని లోపలికి ప్రవేశించాడు. వెండీ, బంగారం, వజ్రవైఢూర్యాలు రాసులు రాసులుగా గుహ లోపల ఉన్నాయి. రాజు వాటిని తనివితీరా చూసుకుంటున్నాడు. అంతలో మంత్రి అటుగా వెళుతూ, గుహ తెరిచి ఉండడం గమనించాడు. బహుశా నిన్న తాను గుహను పరిశీలించి వెళుతూ తాళం వేయడం మరిచి పోయానని భావించి, బయటినుండి తాళంవేసి వెళ్ళిపోయాడు. రాజు గుహలో చాలాసేపటివరకు తను సంపాదించిన సంపదనంతా చూసుకొని పరమానందభరితుడై వెనుదిరిగాడు. తీరా ద్వారం వద్దకు వచ్చేసరికి తలుపు వేసి ఉంది. ఎంతబాదినా తలుపులు తెరుచుకోలేదు. ఎంత అరిచి గీపెట్టినా ఫలితం లేకపోయింది. గుహంతా కలియతిరుగుతూ, రాసులుగా పేర్చిన వజ్రవైఢూర్యాలను, మరకత మాణిక్యాలను మరోసారి చూసుకొని మళ్ళీ తలుపు దగ్గరికొచ్చాడు. సమయం గడుస్తున్నకొద్దీ రాజుకు ఆకలివేయ వేయసాగింది. ఎంత సంపద పోగుపడి ఉన్నా రాజు అన్నం మెతుకుకోసం గింజుకులాడసాగాడు. దాహంతో నాలుక పిడచ కట్టుకుపోతోంది. గుక్కెడునీళ్ళ కోసం రాజు తన్నుకులాడసాగాడు. శరీరంలో సత్తువ సన్నగిల్లింది. కాళ్ళూచేతులు సహకరించడంలేదు. తను సంపాదించిన సంపదవైపు చూస్తూ, ఇంతసంపద కనీసం నాలుక తడుపుకోడానికి సైతం పనికి రావడం లేదని బాధపడసాగాడు. చివరికి శరీరంలోని శక్తినంతా కూడగట్టుకొని, వజ్రవైఢూర్యాలూ, మరకతమాణిక్యాలన్నిటినీ ద్వారం వద్దకుచేర్చి, వరుసగా పేర్చాడు. నిస్సహాయంగా వాటిపై వాలిపోయాడు. ఇంతటి అపారమైన సంపద ఉండికూడా ఎందుకూ కొరగాకుండా పోయింది. గుక్కెడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేని ఈ సంపద దేనికీ? అని రెండు రక్తాక్షరాలు లిఖించి ప్రాణం వదిలాడు. అటు రాజు కనబడడం లేదని రాజ్యమంతా గాలించడం ప్రారంభించారు. మూడురోజులు గడిచి పోయాయి. నాలుగవరోజు మంత్రి గుహవద్దకు వెళ్ళివద్దామని బయలు దేరాడు. తాళంతెరిచి చూసి మంత్రి అవాక్కయ్యాడు. రాజు శవం పక్కన చిన్న కాగితం ముక్కదొరికింది.’ఇంతటి అపారమైన సంపద గుక్కెడు మంచినీళ్ళను కూడా ప్రసాదించలేక పోయింది’ అని రాసి ఉంది అందులో.. అందుకే ఇస్లామీ ధర్మశాస్త్రం, ధనవ్యామోహానికి దూరంగా ఉండాలని, ధనాశ మనిషిని నీచమైన స్థాయికి దిగజారుస్తుందని హితవు చెబుతుంది. అధర్మంగా సంపాదించిన ధనసంపదలు ఏవిధంగానూ ఉపకరించవని, ఇహలోకంలో, పరలోకంలో పరాభవం పాలు చేస్తాయని హెచ్చరిస్తుంది. అల్లాహ్ మనందరికీ ధర్మబద్దమైన జీవితం గడిపే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
జోథ్‌పూర్‌లో ఘోరాతిఘోరం
సాక్షి, రాజస్తాన్: మూఢ నమ్మకాలతో మనుషుల్లో ఉన్నమతిపోతుంది. రంజాన్ మాసంలో కూతురిని బలిస్తే, తనకు కుమారుడు పుట్టేందుకు అల్లా తనను కరుణిస్తాడని భావించి ఓ వ్యక్తి తన కూతురిని ఘోరాతిఘోరంగా చంపాడు. కసాయివాడు జంతువు గొంతు కోసినట్లు కూతురి గొంతు కోసి చంపాడు. ఈ దారుణమైన సంఘటన రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో శుక్రవారం వేకువజామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జోథ్‌పూర్ నగరంలో నవాబ్ అలీ ఖురేషీ, ఆయన భార్య, కూతురు రిజ్వానాలు, అలీ భార్య తరపు బంధువుల ఇంట్లో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. నవాబ్ అలీ పై అంతస్తులో ఉంటుండగా..భార్య తరపు బంధువులు కింద పోర్షన్లో ఉంటున్నారు. నవాబ్ అలీ ఖురేషీకి నాలుగేళ్ల రిజ్వాన్ అనే కూతురు ఉంది. శుక్రవారం వేకువజామున రెండున్నర గంటల సమయంలో అలీ తన స్వహస్తాలతో కూతురిని గొంతు కోసి బలి ఇచ్చి, అల్లాకు కానుకగా సమర్పించాడు. అనంతరం తాను ఏమీ ఎరగనట్లు వచ్చి భార్య పక్కన పడుకున్నాడు. కూతురు రిజ్వానా కనపడకపోవడంతో తల్లి కిందకు వెళ్లి చూసింది. రక్తపుమడుగులో పడి ఉండటం చూసి హతాశురాలైంది. అలీ భార్య కేకలు విని బంధువులు బయటకు వచ్చారు. జరిగిన విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. సుమారు 3 గంటలకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆధారాలు సేకరించేందుకు డాగ్ స్క్వాడ్‌ను హుటాహుటిన రప్పించిన పోలీసులు ఇళ్లంతా పరిశీలించారు. కుటుంబసభ్యులందరినీ శుక్రవారం, శనివారం అంతా పోలీసులు విచారించారు. విచారణలో కన్న తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. అల్లా కోసమే కూతురిని బలిచ్చానని విచారణలో నవాబ్ అలీ ఒప్పుకున్నాడు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పిపడ్ నగర ఆసుపత్రికి తరలించారు. మూర్ఖపు తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. -
వెలుగుబాట వరాల మూట
పవిత్ర రమజాన్ మరోసారి రానే వచ్చింది. వసంతమాసంలా వచ్చి, మనసులు దోచే మరుమల్లెల పరిమళ గుబాళింపులా శుభసుగంధాలు వెదజల్లుతోంది. మానవసహజ లోపాలను సరిదిద్దుకోవాలనుకునే వారు, పాపపంకిలమైన జీవితాలను పునీతం చేసుకోవాలనుకునేవారు, దుర్లక్షణాలకు దూరంగా మానవీయ సుగుణాలను పెంపొందించుకోవాలనుకునే సత్కార్యాభిలాషులైన సచ్ఛీలురు ఈ పవిత్రమాసపు విలువల పరీమళాన్ని తనివితీరా ఆఘ్రాణించవచ్చు. ఈ కారణంగానే శుభాలు కురిసే వరాల వసంతాన్ని అత్యంత శ్రద్ధాసక్తులతో స్వాగతం పలకాలని మమతలమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం ఉపదేశించారు. అల్లాహ్ ప్రత్యేక అనుగ్రహం పవిత్రరమజాన్లో ఆరాధనల పట్ల ప్రత్యేక శ్రద్ధను, ప్రేమను పెంపొందించుకొని ఫర్జ్, సున్నత్ , నఫిల్లతోపాటు, ప్రత్యేకంగా ‘తరావీహ్ ‘నమాజులు ఆచరిస్తూ, ఎక్కువగా సత్కార్యాలు చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే, సమస్త మానవజాతికి మార్గదర్శక గ్రంథమైన ఖురాన్ రమజాన్‌లోనే అవతరించింది. మానవుల మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి మహత్తరంగా ఉపకరించే ఉపవాస వ్రతం ఈ మాసంలోనే విధిగా ప్రకటించబడింది. వెయ్యిమాసాలకన్నా విలువైన రాత్రి అని చెప్పబడిన ‘లైలతుల్ ఖద్ర్’ కూడా ఈ మాసంలోనే ఉంది. అందుకే దీనికి ఇంతటిపవిత్రత, ఘనత, గౌరవం. అల్లాహ్‌తో సంబంధాన్ని పటిష్టపరచుకోవాలి. ఈ మాసంలో ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఆరాధనలపట్ల శ్రద్ధవహించాలి. నమాజులను చిత్తశుద్ధితో నెరవేర్చాలి. ఆరాధనల ప్రభావం పూర్తి జీవితంపై పడేలా ఉండాలి. దానధర్మాలు అధికంగా చెయ్యాలి. పేదసాదలు, అనాథలు అభాగ్యులు, వితంతువులు, వికలాంగులు, అగత్యపరులను ఆదరించాలి. శక్తిమేర వారిని ఆదుకోవాలి. సమాజం పట్ల బాధ్యతను గుర్తెరగాలి. ప్రవక్తమహనీయులు రమజాన్‌ను ‘సానుభూతులమాసం’ అన్నారు. కనుక సాటిమానవులతోపాటు, సృష్టిలోని సమస్తజీవరాసులపట్ల ప్రేమ, దయ, జాలి, కరుణ, సానుభూతి కలిగి ఉండాలి. ఇతర రోజులు, ఇతరనెలలతో పోల్చుకుంటే రమజాన్ లో దానధర్మాలు, సత్కార్యాలు అధికంగా చెయ్యాలని మనకు దీనిద్వారా తెలుస్తోంది. రమజాన్ వచ్చిందంటే చాలు, ప్రవక్తవారి ముఖకవళికలు మారిపొయ్యేవి. ఆరాధనలు అధికమయ్యేవి. అభ్యర్ధన, వేడుకోలు, దుఆలలో వినయ వినమ్రతలు ఉట్టిపడేవి. హదీసులో ఇలా ఉంది: ’రమజాన్ నెలలో, దేవుడు సింహాసనం మోసే దైవదూతలతో, మీరు మీసేవలు, ఆరాధనలు అన్నీ ఆపేసి ఉపవాసం పాటిస్తున్న వారి దువాలకు ఆమీన్ పలకండి’ అని ఆదేశిస్తాడు. ఎవరికి మినహాయింపు? మానవుల బలహీనతలను, వారికష్టసుఖాలను బాగా తెలిసినటువంటి దేవుడు, రమజాన్ రోజాలను విధిగా నిర్ణయించినప్పటికీ, కొందరికి కొన్నిమినహాయింపులు కూడా ప్రసాదించాడు. చిన్నపిల్లలు, బాటసారులు, వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, గర్భవతులు, బాలింతలు, మతిస్థిమితం లేనివాళ్ళు, రుతుచక్రంలో ఉన్న స్త్రీలు – ఇలాంటివారికి రోజానుండి మినహాయింపు ఉంది. మానవులపట్ల దేవుని ప్రేమకు ఇదికూడా ఒక నిదర్శనమే. ‘రోజా’ ఎలా ఉండాలి? ఇస్లామీ ధర్మశాస్త్రం ప్రకారం, రోజా పాటించాలనుకునేవారు ఉషోదయానికి ముందే, అంటే తెల్లవారుజామున అన్నపానీయాలు సేవించాలి. ఆకలిగా లేకపోయినా కొద్దిగానైనా తినాలి. లేదా కనీసం మంచినీళ్ళయినా తాగాలి. దీన్నే ‘సహెరి’ అంటారు. తరువాత సూర్యాస్తమయం వరకు పచ్చిమంచినీళ్ళు కూడా ముట్టకూడదు. సూర్యాస్తమయం కాగానే రోజా విరమించాలి. దీన్ని ‘ఇఫ్తార్ ’ అంటారు. అబద్ధాలు, చాడీలు, అపనిందలు, అసభ్య పదజాలప్రయోగం అన్ని వేళలా అధర్మమే, నిషిధ్ధమే. అయితే ఉపవాసకాలంలో మరీ అప్రమత్తంగా ఉండాలి. నిజానికి ఉపవాసం అబద్ధం, అసభ్యం, అశ్లీలతలనుండి, సమస్త దుర్వ్యసనాలనుండి కాపాడే రక్షణకవచం. కనుక ఎవరైనా అజ్ఞానంతోనో, అహంకారంతోనో తిట్టినా, కయ్యానికి కాలుదువ్వినా తాము మాత్రం వ్రతం పాటిస్తున్నామని, తమకిలాంటి చేష్టలు శోభించవని గుర్తించాలి. ఇతరులు రెచ్చగొట్టినా సహనం వహించాలి. పవిత్రఖురాన్ను వీలైనంత ఎక్కువగా పారాయణం చేయడానికి, అర్ధం చేసుకోడానికి ప్రయత్నించాలి. ‘అల్లాహ్’ పవిత్రనామాన్ని స్మరిస్తూ ఉండాలి. కబుర్లకు దూరంగా ఉంటూ, సత్కార్యాల్లో లీనమైపోవాలి. ‘కలిమా ‘వచనంతోపాటు, దురూదెషరీఫ్ పఠిస్తూ ఉండాలి. అల్లాహ్ అందరికీ రమజాన్ శుభాలను సమృద్ధిగా ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
అదే స్థితప్రజ్ఞత
జీవితం విభిన్న స్థితుల సంగమం. ఇక్కడ సుఖమూ ఉంది, దుఃఖమూ ఉంది. సంతోషమూ ఉంది, బాధా ఉంది. ఆనందమూ ఉంది, విచారమూ ఉంది. తీపీ ఉంది, చేదూ ఉంది. శీతలమూ ఉంది, ఉష్ణమూ ఉంది. సంతృప్తీ అసంతృప్తీ రెండూ ఉన్నాయి. శాంతి, అశాంతీ కూడా ఉన్నాయి. ఇదంతా దైవాభీష్టం, దేవుని ఆదేశానుసారం, ఆయన నిర్ణయం మేరకే. అందుకని కష్టాలొచ్చినప్పుడు కుంగిపోకూడదు, నిరాశా నిస్పృహలకు లోను కాకూడదు. ఇవన్నీ దేవుని తరఫునే అని భావిస్తూ, ఆ కరుణామయుడే వీటినుండి విముక్తి కలిగిస్తాడని నమ్మాలి. ఇదేవిధంగా కష్టాలు దూరమై, పరిస్థితులు మెరుగు పడి, అంతా సజావుగా జరిగిపోతూ, సుఖసంతోషాలు ప్రాప్తమైతే తమ గొప్పదనమేనని, తమ రెక్కల కష్టార్జిత ఫలితమేనని భావించి విర్రవీగకూడదు.ఇదంతా అల్లాహ్ అనుగ్రహమని, ఆ కరుణామయుని ప్రసాదితమన్న విశ్వాసం హృదయంలో జనించాలి. ఆయన ఎప్పుడు కోరితే అప్పుడు తాను ప్రసాదించిన అనుగ్రహాలను తిరిగి లాక్కోగలడు. కాబట్టి ప్రతి అనుగ్రహానికీ ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి. ముహమ్మద్ ప్రవక్త(స)ప్రవచనం ఇలా ఉంది: ‘ఎవరైతే ధన, ప్రాణ నష్టాల్లో కూరుకుపోయి, ఆ విషయం ఎవరి ముందూ బహిర్గతం చేయకుండా, ప్రజలతో ఫిర్యాదు చేయకుండా ఉంటాడో అతణ్ణి క్షమించడం అల్లాహ్ బాధ్యత.’ విశ్వాసుల వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రతి వ్యవహారంలో, ప్రతిస్థితిలోనూ వారికి శుభాలే శుభాలు. వారికి శాంతి, సుఖ సంతోషాలు ప్రాప్తమైతే దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఇది వారి పాలిట శుభాలపంట. ఒకవేళ వారికి దుఖ విచారాలు కలిగితే, ఇదీదైవ నిర్ణయమేనని భావిస్తూ సహనం వహిస్తారు. ఈ సహనం వహించడం కూడా వారిపాలిట శుభాల పంటే అవుతుంది. ప్రాపంచిక జీవితంలో కష్టనష్టాలు, సుఖ సంతోషాలు చాలా సహజ విషయాలు. వీటిద్వారా దైవప్రసన్నత, ఆయన సామీప్యం పొందడానికి శక్తివంచనలేని ప్రయత్నం చేయాలి. సుఖ సంతోషాలు, శాంతి సంతృప్తులు ప్రాప్తమైనప్పుడు అల్లాహ్ కు కృతజ్ఞతలు సమర్పించుకోవాలి. కష్టాలు, కడగండ్లు ఎదురైతే, జరగరాని సంఘటనలు ఏమైనా జరిగి కష్టనష్టాలు, బాధలు సంభవిస్తే దాస్య ఔన్నత్యానికి ప్రతిరూపంగా అనన్యసామాన్యమైన సహనం వహించాలి. హృదయం కృతజ్ఞతతో నిండి ఉండాలి. అంటే, అన్ని స్థితులనూ సమానంగా ఆస్వాదించగలగాలి. దీన్నే ‘స్థితప్రజ్ఞత’ అంటారు. ఇలాంటి వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. తన కారుణ్య ఛాయలో చోటు కల్పిస్తాడు. స్వర్గసీమను అనుగ్రహిస్తాడు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
‘అల్లా’ అంటే.. ఉగ్రవాది అయిపోతాడా..?
టెక్సాస్: అమెరికాలోని ఓ పాఠశాల తరగతి గదిలో ఆరేళ్ల ముస్లిం బాలుడు ‘అల్లా బూమ్’ అని అరవడంతో అదే క్లాస్‌లో పాఠాలు చెబుతున్న టీచర్ పోలీసులకు కాల్ చేశారు. ఈ సంఘటన టెక్సాస్‌లోని పియర్లాండ్ ఎలిమెంటరీ స్కూల్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బుద్ది మాంద్యంతో బాధపడుతున్న మహ్మద్ సులేమాన్ తరగతి గదిలో ఆకస్మాత్తుగా అల్లా బూమ్ అని గట్టిగా అరిచాడు. దీంతో భయాందోళనకు గురైన టీచర్ ఆ బాలుడ్ని ఉగ్రవాదిగా భావించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే బాలుడి తండ్రి మాత్రం తన కొడుకు బుద్ధి మాంద్యంతో బాధపడుతున్నాడని, సరిగ్గా మాట్లడలేడని తెలిపారు. ఈ విషయం రోజు వచ్చే టీచర్‌కు తెలుసని. ఆ రోజు వేరే టీచర్ రావడంతోనే ఇలా జరిగిందన్నారు. అయినా ఓ చిన్నారిపై ఉగ్రవాది అని ముద్రవేయడం ఏమిటని, ఇది ముమ్మాటికే జాతి వివక్షేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని పియర్లాండ్ పోలీసులు తెలిపారు. -
దైవ నిర్ణయం
మూసా అలైహిస్సలాం గొప్ప దైవప్రవక్త. ఆయన నేరుగా అల్లాహ్‌తో సంభాషించేవారు. ఒకసారి అల్లాహ్ ఆదేశం మేరకు ఆయన జ్ఞానసముపార్జన కోసం హ.ఖిజర్ అనే ఆ పండితుని వద్దకు వెళ్లి, తాను జ్ఞాన సముపార్జనకోసం వచ్చానని, మీదగ్గర శిష్యరికం చేస్తానని, దైవం మీకు ప్రసాదించిన దివ్యజ్ఞానం నాక్కూడా నేర్పండని అభ్యర్థించారు. ‘మీరు నా శిష్యరికం చేయాలంటే, ఏ విషయమైనా స్వయంగా నేను చెప్పనంత వరకు నన్నడగవద్దు. నేనేం చేసినా చూస్తూ ఉండాలి తప్ప ప్రశ్నించకూడదు’. అన్నారు ఖిజర్ . మూసా ఈ షరతును అంగీకరించారు. తరువాత ఇద్దరూ కలిసి బయలుదేరారు. కొంతదూరం వెళ్ళి ఓ పడవ ఎక్కారు. అంతలో ఓ చిన్నపక్షి వచ్చి పడవ అంచున వాలి, నదిలో నీటిని ఒక చుక్క పీల్చుకుంది. అప్పుడు ఖిజర్, ‘నీకు, నాకు లభించిన జ్ఞానం దైవానికున్న జ్ఞానంతో పోల్చితే ఈ పక్షి సముద్రంలోంచి నీటిని తన ముక్కుతో పీల్చుకున్నంత కూడా లేదు’. అన్నారు. అలా కొంతదూరం వెళ్ళాక హ.ఖిజర్ పడవ అడుగున ఒక రంధ్రం వేశారు. అది చూసి హ.మూసా, ‘అయ్యయ్యో ఏమిటీ.. పడవకు కన్నం వేశారు. అందర్నీ ముంచేస్తారా ఏమిటీ.. ఈ పనేం బాగాలేదు.’ అన్నారు. ‘నేను ముందే చెప్పాను. మీరు సహనంగా ఉండలేరని.’ అన్నారు ఖిజర్ ‘సరే సరే, మరిచి పోయాను వదిలేయండి’ అన్నారు మూసా.మరికొంతదూరం వెళ్ళిన తరువాత, వారికి ఒక బాలుడు కనిపించాడు. ఖిజర్ ఆ బాలుణ్ణి చంపేశారు.‘అయ్యయ్యో.. నిష్కారణంగా ఒక అమాయకుణ్ణి చంపేశారే.. అతనేం పాపం చేశాడు?’ అన్నారు మూసా. ‘నేను ముందే చెప్పాను. నేనేం చేసినా చూసూ ్తఉండాలని’. ‘సరే సరే.. పొరపాటైంది. ఇకనుండి ఏమీ మాట్లాడను. ఈసారి అలా చేస్తే నన్ను వదిలేయండి.’ అన్నారు మూసా. అలా మరికొంత దూరం వెళ్ళి ఓ ఊరికి చేరుకున్నారు. అక్కడ పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఓ గోడను చూసి, హ.ఖిజర్ వెంటనే దాన్ని బాగుచేశారు. పడిపోకుండా పటిష్టంగా నిలబెట్టారు. అప్పుడు హ.మూసా(అ), ‘కావాలనుకుంటే, ఈ పని చేసినందుకు ప్రతిఫలం కూడా తీసుకోవచ్చుకదా..!’ అన్నారు. ‘ఇక చాలు. నావల్లకాదు. నీ శిష్యరికం ఇంతటితో ముగిసిపోయింది. ఇప్పటివరకూ నువ్వు సహనం వహించలేకపోయిన విషయాలను గురించి చెబుతా విను. ముందుగా పడవ సంగతి: అదికొందరు పేదవాళ్ళది. వాళ్ళు పొట్టకూటికోసం నదిలో పడవ నడుపుకుంటున్నారు. నది అవతల దౌర్జన్యంగా పడవలను స్వాధీనం చేసుకుంటున్న రాజొకడున్నాడు. అతడు మంచి మంచి పడవల్ని దోచుకుంటాడు. అందుకే నేను ఆ పడవకు లోపం కలిగించాను. ఇక ఆ బాలుడి విషయం: అతడి తల్లిదండ్రులు విశ్వాసులు, దైవభక్తిపరాయణులు. ఇతడేమో పెద్దవాడై, తిరస్కారం, దుర్మార్గం, తలబిరుసుతనంతో ప్రవర్తిస్తూ వారిని వేధించే రకం. అతనివల్ల మునుముందు సమాజానికి హాని కలిగే అవకాశం ఉంది. ఇక గోడ వ్యవహారం... అది ఇద్దరు అనాథ పిల్లలది. దానికింద వారికోసం ఒక నిధి దాచిపెట్టి ఉంది. వారి తండ్రి గొప్ప పుణ్యాత్ముడు. అందుకని పిల్లలిద్దరూ పెద్దయిన తరువాత ఆ నిధిని పొందాలని దైవం నిర్ణయించాడు. నువ్వు సహించలేకపోయిన విషయాల మర్మహేతువు ఇదే’. అన్నారు ఖిజర్. అందుకని, మనకు తెలియని విషయాల్లో తలదూర్చడం, అన్నీ తమకే తెలుసన్న భావన ఎంతమాత్రం సరికాదు. కొన్ని విషయాల మర్మం కేవలం దైవానికి మాత్రమే తెలుసు. తాడెక్కేవాడుంటే తలదన్నేవాడు కూడా ఉంటాడు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
దైవాగ్రహానికి అతీతులు కారెవ్వరూ!
హజ్రత్ నూహ్ అలైహిస్సలాం గొప్ప దైవప్రవక్త. ఆయన 950 సంవత్సరాలు జీవించారు. అప్పటి జాతి సృష్టికర్తను విస్మరించి అనేక దేవుళ్ళను పూజించేది. నూహ్ జాతి ప్రజలు వద్, సువా, యగూస్, యఊఖ్, నస్ర్ అనే ఐదుగురు దేవుళ్ళను పూజించేవారు. ఈ ఐదుగురూ సత్పురుషులు, గొప్ప సంస్కర్తలు. వీరి మరణం తరువాత ప్రజలు వీరి జ్ఞాపకార్థం గౌరవ సూచకంగా విగ్రహాలను ప్రతిష్టించారు. తరువాత రెండవ తరం ప్రజలు ఆ విగ్రహాలకు మరికాస్త పవిత్రత ఆపాదించారు. వారి తరువాత మూడవ తరం ప్రజలు మరికాస్త ముందుకెళ్ళి ఆ విగ్రహాలను పూజించడం మొదలు పెట్టారు. ఈవిధంగా విగ్రహారాధన ప్రారంభమైంది. నిజానికి ప్రారంభ కాలంలో విగ్రహారాధనకాని, బహుదైవారాధనకాని లేదు. వలీలు, సంస్కర్తలు, దైవభక్తుల పట్ల గౌరవభావం మితిమీరి ఆరాధనా స్థాయికి చేరుకోవడంతోనే విగ్రహారాధన ప్రారంభమైంది. హజ్రత్ నూహ్ అలైహిస్సలాం ప్రజలను అల్లాహ్ వైపుకు పిలిచారు. ఈ అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించిన పరమ ప్రభువును మాత్రమే ఆరాధించాలని హితవు చెప్పారు. సత్కర్మలు ఆచరించాలని, సత్యం, ధర్మం, న్యాయాలను పాటించాలని సూచించారు. కాని అతి కొద్దిమంది మాత్రమే ఆయన్ని విశ్వసించారు. అత్యధిక శాతం ప్రజలు ఆయన మాటను తిరస్కరించారు. విశ్వసించిన వారు చాలా సామాన్య ప్రజలు. గొప్ప వారు, సంపన్నులు నూహ్ ప్రవక్తను, ఆయన సందేశాన్ని ఎగతాళి చేశారు. అయినప్పటికీ ఆయన ఏమాత్రం నిరాశ చెందకుండా, సుదీర్ఘకాలంపాటు ధర్మసందేశ ప్రచారం చేశారు. కాని కేవలం 80 మంది మాత్రమే ఆయన మాటవిని ఏకైక దైవాన్ని విశ్వసించారు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన నూహ్ ప్రవక్త, సకల ప్రయత్నాలూ విఫలమైన నేపథ్యంలో వీరికి తగిన బుద్ధి చెప్పవలసిందంటూ దైవాన్ని వేడుకున్నారు. ప్రవక్త ప్రార్థన దైవం ఆలకించకుండా ఉంటాడా? వెంటనే దైవాజ్ఞ అవతరించింది. దైవాదేశం మేరకు నూహ్ ప్రవక్త(అ) ఒక ఓడను తయారు చేయడం మొదలు పెట్టారు. ఇది చూసి ప్రజలు ఎగతాళి చేయసాగారు. కాని నూహ్ ప్రవక్త ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పొయ్యారు. కొన్నాళ్ళకు ఓడ తయారైంది. ఓడ నిర్మాణం పూర్తవ్వగానే దైవాజ్ఞ వచ్చేసింది. ఆకాశానికి చిల్లుపడ్డట్లు వర్షభీభత్సం మొదలైంది. అప్పుడు అల్లాహ్ నూహ్ ప్రవక్తను ఇలా ఆదేశించాడు. ‘ప్రతి జాతి నుండి ఒక్కొక్క జంటను పడవలో ఎక్కించు. – ఇదివరకే సూచించబడిన వ్యక్తులు తప్ప – మిగిలిన నీ కుటుంబ సభ్యుల్ని, ఇంకా విశ్వాసులను కూడా ఓడలో ఎక్కించుకో.. ఓడలో ఉన్నవాళ్ళు మాత్రమే దైవశిక్షనుండి తప్పించుకోగలుగుతారు.’ అన్నట్లుగానే భయంకర జలప్రళయం జనావాసాలను ముంచిపారేసింది. కాని నూహ్ ప్రవక్త ఓడమాత్రం నీటి ప్రవాహపు అలలలో చక్కగా తేలియాడుతూ జూదీ పర్వతశిఖరంపై సురక్షితంగా ఆగింది. ఆ భయంకర జల ప్రళయంలో కొడుకు ఎక్కడ మునిగి పోతాడోనని, పితృప్రేమ కొద్దీ తనయుణ్ని ఎలుగెత్తి పిలిచారు. ‘బాబూ..! మాతోపాటు ఓడను ఎక్కెయ్యి. అవిశ్వాసులతో ఉండకు అని.’ కాని, దురదృష్టవంతుడైన ఆ కొడుకు తండ్రి మాట వినలేదు. దేవుని ఆగ్రహపు చక్రబంధంలో చిక్కుకొని కూడా, ‘నేను ఇప్పుడే ఎత్తైన కొండను ఎక్కుతాను. అది నన్ను నీటి ప్రవాహం నుండి కాపాడుతుంది.’అని పలికాడు. ఇంతలోనే ఒక కెరటం వారిద్దరి మధ్య అడ్డుగా వచ్చింది. తన ఒడిలో లుంగచుట్టుకొని తిరిగిరాని తీరాలకు తీసుకు పోయింది. దైవాన్ని విశ్వసించి, సత్కర్మలు ఆచరించకపోతే ఎంతటివారైనా దైవశిక్షను ఎదుర్కోవలసిందే. సత్య సందేశాన్ని తిరస్కరించే జాతి ఎన్నటికీ సాఫల్యం పొందలేదు. నూహ్ ప్రవక్త జాతే దీనికి ప్రబల నిదర్శనం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
విశ్వాస సాఫల్యం
పూర్వం ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి భార్య, ఒక కూతురు. తల్లి జబ్బుపడడంతో ఇంటిపని, వంట పనులన్నీ కూతురే చక్కబెట్టేది. వారికి పాలు పోయడానికి ఓ వ్యకి ్తవచ్చేవాడు. ప్రతిరోజూ పాలు పోసే క్రమంలో అతను ‘బిస్మిల్లాహ్’అని పలికి పోసేవాడు. బిస్మిల్లాహ్ అంటే, ‘అల్లాహ్ పేర’, లేక ‘దైవ నామమున’ అని అర్థం. రోజూ వినీ వినీ ఆ అమ్మాయికి కూడా అలవాటైపోయింది. తరువాత అర్థం తెలుసుకొని నమ్మకం పెంచుకుంది. ఈ విషయం నాస్తికుడైన ఆమె తండ్రికి తెలిసి అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. నయానా భయానా చెప్పి చూశాడు. కాని ఆ అమ్మాయి ప్రతి పనికీ ‘బిస్మిల్లాహ్’ అనడం మాత్రం మానలేదు. ఇక లాభం లేదనుకొని ఒక ఉపాయం ఆలోచించాడు. ఒకరోజు కూతురు అంట్లు తోముతున్నప్పుడు వచ్చి ఒక ఉంగరం ఇస్తూ, ‘దీన్ని జాగ్రత్తగా ఉంచు. తరువాత తీసుకుంటాను’ అన్నాడు.‘బిస్మిల్లాహ్’ అని ఉంగరం అందుకుంది అమ్మాయి. చేతులు శుభ్రంగా లేకపోవడంతో వేలికి పెట్టుకోకుండా అక్కడే పైన గూట్లో పెట్టింది. కాని మరచి పోయింది. ఈలోపు అతను చిన్నగా ఉంగరం తీసి జేబులో వేసుకున్నాడు. ‘అమ్మా.. నేనలా బజారు కెళ్ళొస్తా వంట తొందరగా కానియ్’. అని తండ్రి బయటికి వెళ్ళిపోయాడు. కూతురు వంటపనిలో పడి ఉంగరాన్ని మరిచి పోయింది. బజారుకు వెళ్ళినట్లు వెళ్ళిన తండ్రి ఉంగరాన్ని చెరువులో పడేసి వచ్చాడు. తండ్రి భోజనం చేసి వెళ్ళిన తరువాత ఎప్పటికో ఉంగరం గుర్తొచ్చింది. ఎంత వెదికినా ఎక్కడా దొరకలేదు. చాలా భయపడింది. కన్నీటితో దైవాన్ని వేడుకుంది. చివరికి చేసేదేమీ లేక దైవంపై భారంవేసి ఊరకుండి పోయింది. అలా ఒక రోజు గడిచింది. రెండవ రోజు తండ్రి ఉంగరం అడిగాడు. నేను అంట్లుతోముతూ ఫలానా చోట పెట్టాను. కాని తరువాత ఎంతవెదికినా దొరకలేదంటూ ఉన్నదున్నట్లు చెప్పింది కూతురు. దీంతో బాగా కోప్పడ్డాడు తండ్రి. ‘ప్రతి దానికీ ‘బిస్మిల్లాహ్’ అని జపిస్తావుగా.. ఇప్పుడేమైంది..? ఇప్పటికైనా ఆ పదం పలకడం మానుకో.. రెండురోజుల్లో ఉంగరం దొరక్కపోతే అప్పుడు చెబుతా..’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. తన పథకం ఫలించిందన్న ఆశతో లోలోన సంబర పడుతూ, పైకిమాత్రం కోపం నటిస్తూ ఆరోజంతా మాట్లాడలేదు. మరునాడు ఉదయం కూరగాయల కోసం బజారుకెళ్ళిన పెద్దమనిషి, అప్పుడే తాజాచేపలు అమ్మకానికి రావడంతో ఒక పెద్దచేపను కొనుగోలు చేశాడు. ఇంటికి తీసుకొచ్చి, త్వరగా వండమని పురమాయించాడు. కూతురు యధాప్రకారం ‘బిస్మిల్లాహ్’ అని పలికి చేప పొట్టను కోసింది. ఆశ్చర్యకరంగా అందులోంచి ఉంగరం బయట పడింది. అదే ఉంగరం. తండ్రి దాయమని ఇచ్చిన ఉంగరం. ఆనందం, ఆశ్చర్యాల భావోద్వేగాలతో దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వేలికి తొడుక్కుంది. సంతోషంతో చేపల పులుసు తయారు చేసింది. తండ్రి బయటినుండి రాగానే భోజనం వడ్డించింది. భోజనం తరువాత ‘ఉంగరం దొరికిందా?’ అంటూ గర్జించాడు తండ్రి. ‘..ఆ..ఆ..దొరికింది నాన్నా..!’అంటూ సంతోషంగా తన చేతికున్న ఉంగరం తీసి తండ్రికిచ్చింది కూతురు. ఉంగరాన్ని చేతిలోకి తీసుకున్న తండ్రి తన కళ్ళను తానే నమ్మలేక పోయాడు. పదే పదే అటూ ఇటూ తిప్పితిప్పి, మార్చి మార్చిచూశాడు. సందేహం లేదు అదే ఉంగరం. తన ఉంగరమే. కాని ఎలా సాధ్యం? స్వయంగా తానే తన స్వహస్తాలతో చెరువులో పారేసి వచ్చాడు. తీవ్ర ఆలోచనలో, మానసిక సంఘర్షణలో పడిపోయాడు. అది దేవుడి పవిత్రనామంలో ఉన్న శుభం. ఆ శుభం వల్ల చెరువులో పడేసిన ఉంగరాన్ని చేప మింగడం, ఆ చేప జాలరి వలకు చిక్కడం, అదే చేపను ఈ వ్యక్తి కొనుగోలు చేయడం, ఇవన్నీ యాదృచ్ఛికంగానే జరిగినా, నిజంగా ఆ అమ్మాయి విశ్వాస పటిష్టతకు నిదర్శనం. మనసా, వాచా, కర్మణా సృష్టికర్తను నమ్మి, ఆ దేవుని పవిత్రనామంతో ప్రతి పనినీ ప్రారంభించే వారికి దైవం ఇలాగే సహాయం చేస్తాడు. ఇహ పర లోకాల సాఫల్యం ప్రసాదిస్తాడు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ధర్మ సంస్థాపనార్థం...
‘ముహర్రం’ ఒక ప్రత్యేక ప్రాముఖ్యత కలిగినటువంటి మాసం. ఇస్లామీ క్యాలండరు ప్రకారం ముహర్రం మాసంతోనే ఇస్లామీయ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. రమజాన్ రోజాల తరువాత అత్యంత శుభప్రదమైన రోజా ఆషూరా రోజానే. అంటే ముహర్రం పదవ తేదీన పాటించబడే రోజా అన్నమాట. రమజాన్ రోజాలు విధిగా (ఫర్జ్ గా) నిర్ణయించబడక పూర్వం ఆషూరా రోజాయే ఫర్జ్ రోజా. రమజాన్ రోజాలు నిర్ణయించబడిన తరువాత ఆషూరా రోజా నఫిల్ గా మారిపోయింది. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (ర) ప్రకారం, ఒకసారి ప్రవక్త మహనీయులు మదీనాకు వెళ్ళారు. ఆరోజు అక్కడి యూదులు రోజా పాటిస్తున్నారు. అది ముహర్రం పదవ తేదీ. వారిని ప్రవక్త అడిగారు ఏమిటి ఈరోజు విశేషం? అని.దానికి వారు,‘ఇదిచాలా గొప్పరోజు. ఈరోజే అల్లాహ్ మూసా(అ)ను,ఆయన జాతిని ఫిరౌన్ బారినుండి రక్షించాడు. ఫిరౌన్ ను, అతడి సైన్యాన్ని సముద్రంలో ముంచిపారేశాడు. అప్పుడు మూసా ప్రవక్త, దేవునికి కృతజ్ఞతగా రోజా పాటించారు. కనుక ఆయన అనుసరణలో ఈరోజు రోజా పాటిస్తాం’ అని చెప్పారు. అప్పుడు ప్రవక్త మహనీయులు, మూసా ప్రవక్త అనుసరణలో రోజా పాటించడానికి మీకంటే మేమే ఎక్కువ హక్కుదారులమని చెప్పి, రోజా పాటించమని అనుచరులకు ఉపదేశించారు. ఆషూరా రోజా యూదులే కాదు క్రైస్తవులూ పాటించేవారు. ఈ ఇరువర్గాలూ ముహర్రం పదవ తేదీన రోజా పాటించేవి. కాని ప్రవక్తవారు, మీరు రెండురోజులు పాటించమని తన సహచరులకు బోధించారు. అంటే ముహర్రం మాసం 9,10 కాని, లేక 10,11 కాని రెండురోజులు రోజా పాటించాలి. ముహర్రం మాసమంతా శుభకార్యాలూ నిర్వహించక పోవడం సరికాదు. సత్యం, న్యాయం, ధర్మం, హక్కులకోసం, ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హజ్రత్ ఇమామె హుసైన్ (ర)అమరగతి పొందారు. ధర్మయుద్ధంలో అమరుడు కావడం విషాదం కాదు. ‘ఎవరైతే అల్లాహ్ మార్గంలో అమరులయ్యారో వారిని మృతులు అనకండి. వారు సజీవంగా ఉన్నారు. తమ ప్రభువువద్ద ఆహారం కూడా పొందుతున్నారు.’ అంటోంది పవిత్రఖురాన్. అమరులు అల్లాహ్‌కు సన్నిహితులు. ఇదీ షహీదుల స్థాయి, వారి గౌరవం. వారి ఘనత. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
అల్లా అన్నందుకు ఫ్లైట్ దించేశారు!
పారిస్: పారిస్, ఇతర ఉగ్రదాడుల నేపథ్యంలో ఇటీవల 'ఇస్లామోఫోబియా' పెరిగిపోయింది. ముఖ్యంగా విమానప్రయాణాల్లో ఇది ఒకింత ఎక్కువైందనే చెప్పాలి. తాజాగా పారిస్ నుంచి అమెరికాలోని సిన్సినాటీకి వెళ్తున్న ఓ పాకిస్తానీ-అమెరికన్ జంటకు ఇదే తరహాలో చేదు అనుభవం ఎదురైంది. తమ పదో పెళ్లిరోజు సందర్భంగా పారిస్‌లో సంతోషంగా గడిపి తిరిగి అమెరికా వెళ్తుండగా.. అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్‌లైన్స్ సిబ్బంది వారిని ఫ్లైట్ దించేశారు. బాధితులు నజియా మీడియాతో తెలిపిన వివరాల ప్రకారం.. తన భర్త ఫైజల్లో ఆమె పారిస్ నుంచి సిన్సినాటీ వెళ్లే విమానంలో ప్రయాణానికి సిద్ధంగా ఉంది. ఫ్లైట్ మరికాసేపట్లో బయలుదేరుతుందనగా.. హిజాబ్ ధరించిన ఆమెపై విమాన సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. దీనికి తోడు ఫైజల్‌కు చెమట రావడం గమనించిన విమానసిబ్బంది వారిపై మరింత అనుమానంతో పైలట్‌కు ఈ విషయాన్ని తెలిపినట్లు ఆమె వెల్లడించింది. దీంతో.. మీరు లగేజీతో పాటు విమానం నుంచి బయటకు వెళ్లాలని సిబ్బంది కోరారని ఆమె వెల్లడించింది. తాము 'అల్లా' అనడం వల్లనే విమానసిబ్బంది ఫ్లైట్ నుంచి దించేశారని ఆమె ఆరోపించింది. ఈ చర్యను కేవలం ఇస్లమోఫోబియాగా నజియా వెల్లడించింది. అనంతరం వారిని ఫ్రెంచ్ పోలీస్ అధికారి విచారించాడని, వారి పారిస్ టూర్ గురించి ప్రశ్నించిన అధికారి.. ఎలాంటి సమస్యా లేదని తెలిపినట్లు నజియా పేర్కొంది. ఈ చర్యపై ముస్లిం సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. డెల్టా ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై కౌన్సిల్ ఆన్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్(సీఏఐఆర్) సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే.. దీనిపై డెల్టా ఎయిర్‌లైన్స్ సమాధానమిస్తూ.. 'తమ సంస్థలో ప్రయాణికులపట్ల ఎలాంటి వివక్షతకు తావు లేదు' అని ప్రకటించింది. -
అలా అరిచినందుకే.. శిక్షపడింది..!
లండన్ః పాకిస్తాన్ సంతతికి చెందిన ఓ వ్యక్తి ''అల్లాహ్ -ఒ-అక్బర్'', ''బూమ్'' అంటూ విమానంలో అరవడం, ప్రయాణీకులను భయభ్రాంతులకు గురిచేయడంతో అతడికి పది వారాల జైలు శిక్ష పడింది. అతడు వాడిన పదాలు తప్పు కాకపోయినప్పటికీ విమానంలో అలా ప్రవర్తించడాన్ని కోర్టు తప్పుబట్టింది. షెహరాజ్ సర్వార్ అనే వ్యక్తి విమానంలో అల్లకల్లోలం సృష్టించడంతో అతడికి లండన్ కోర్టు ఏడు వారాల జైలు శిక్ష విధించింది. ఫిబ్రవరి నెలలో దుబాయ్ నుంచి బర్మింగ్ హామ్ వెడుతున్న ఎమిరేట్స్ బోయింగ్ 777 విమానంలో ప్రయాణించినప్పుడు అతడు చేసిన హడావుడికి ప్రయాణీకులను హడలి పోయేలా చేసింది. కాసేపు ఏం జరుగుతోందో తెలియక అంతా ఖిన్నులైపోయారు. అల్లాహ్-ఒ-అక్బర్ అంటూ అతి పెద్ద గొంతుతో, భీకరంగా పదే పదే అరుస్తూ ప్రయాణీకుల గుండెల్లో విమానాలు పరిగెత్తిచాడు. చివరికి విమానం ల్యాండ్ అయిన తర్వాత కూడ 'బూమ్' అంటూ గట్టిగా అరిచి అందర్నీ భయపెట్టినట్లు బర్మింగ్ హామ్ క్రౌన్ కోర్టు ప్రాసిక్యూటర్ అలెక్స్ వారెన్ తెలిపారు. క్యాబిన్ సిబ్బంది కూర్చోమని చెప్పినా వినకుండా సదరు వ్యక్తి అరుస్తూనే ఉండటంతో కొందరు ప్రయాణీకులు ఆగ్రహంతో పోలీసులకు ఫిర్యాదు చేశారని, అనంతరం అతడ్ని అరెస్టు చేసినట్లు అలెక్స్ వారెన్ కోర్టుకు తెలిపారు. సర్వార్ హింసాత్మక ప్రవర్తనపై ప్రయాణీకులనుంచి వెల్లువెత్తిన నేరారోపణలను ఆయన కోర్టుకు వివరించారు. ప్రాసిక్యూషన్ వాదనలు విన్న న్యాయమూర్తి ఫ్రాన్సిస్ లయర్డ్ .. విమానంలో 38 ఏళ్ళ సర్వార్ విపరీత ధోరణితో ప్రవర్థించినట్లుగా నిర్ధారించారు. శిక్షించకుండా వదిలేస్తే మరోసారి విమానాల్లో ప్రయాణీకులను భయపెట్టే ఇటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశం ఉండటంతో నిందితుడు సర్వార్ కు 10 వారాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. నిందితుడికి జైలు శిక్ష ముగిసిన తర్వాత 12 నెలల పర్యవేక్షణ ఆర్డర్ తో విడుదల చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. సర్వార్.. పాకిస్తాన్ లోని తన అమ్మమ్మ అంత్యక్రియలకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఇటువంటి ఘటన జరిగిందని, అతడు కలత చెంది ఉండటంతోనే ఇలా జరిగి ఉండొచ్చని వాదించిన నిందితుడి తరపు న్యాయవాది బల్బీర్ సింగ్ సైతం తన క్లైంట్ ప్రవర్తన అవివేకంతోనే జరిగిందని ఒప్పుకున్నారు. ప్రయాణీకులను భయపెట్టే విధంగా అల్లాహ్-ఒ-అగ్బర్ అంటూ అరవడం మూర్ఖత్వమే అయినప్పటికీ, దేవుడా నీవు ఎంతో గొప్పవాడవు అంటూ ప్రార్థించడమేనని, అతడి చర్యలు ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది కలిగినందుకు క్షమించమంటూ సింగ్ కోర్టుకు విన్నవించారు. -
ఆర్మీపై ధిక్కారం ప్రకటించిన ప్రధాని
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో శక్తిమంతమైన ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్, ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మధ్య ఘర్షణ తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే ఆర్మీపై బహిరంగ ధిక్కారం ప్రకటిస్తూ ప్రధాని నవాజ్ షరీఫ్ శుక్రవారం టీవీ చానెళ్లలో దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరగుతున్నదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అత్యంత నాటకీయంగా సాగిన ఈ ప్రసంగంలో నవాజ్ మాట్లాడుతూ తాను అల్లాకు, ప్రజలకు మాత్రమే జవాబుదారీ అని, మరెవరికీ కాదని స్పష్టం చేశారు. పనామా పత్రాల్లో తనకు, తన కుటుంబానికి విదేశాల్లో అక్రమ ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై దర్యాప్తుకు సైతం తాను సిద్ధమని స్పష్టం చేశారు. పనామా పత్రాల్లో ప్రధాని షరీఫ్ పేరు వెలువడిన నాటినుంచి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న ఆర్మీ చీఫ్ రహీల్ తాజాగా శుక్రవారం అవినీతికి పాల్పడిన ఆరుగురు టాప్ ఆర్మీ అధికారులపై వేటు వేశారు. అతినీతిని మూలాల నుంచి నిర్మూలిస్తే తప్ప ఉగ్రవాదంపై పోరులో దేశం విజయం సాధించబోదని ఆయన పేర్కొన్నారు. షరీఫ్‌ను ఇరకాటంలో నెట్టేందుకే ఆయన ఈ చర్యలు తీసుకున్నట్టు, వ్యాఖ్యలు చేసినట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని షరీఫ్ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం గమనార్హం. గతంలో షరీఫ్ ప్రభుత్వాన్ని అప్పటి సైనిక నియంత పర్వేజ్ ముషార్రఫ్ పడగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే దిశగా అడుగులు పడుతున్నాయన్న సంకేతాల నేపథ్యంలో ఈసారి తాను అంత సులువుగా ప్రధాని పదవిని వదులుకోబోనని తన ప్రసంగంలో షరీఫ్ స్పష్టం చేశారు. పనామా పత్రాల నేపథ్యంలో తన రాజీనామాకు డిమాండ్ చేస్తున్న ప్రత్యర్థి పార్టీలపైనా ఆయన మండిపడ్డారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఆధారాలతో సహా రుజువు చేస్తే వెంటనే ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని షరీఫ్ సవాల్ విసిరారు. -
మరోసారి నోటి తీట తీర్చుకున్న అజాంఖాన్
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తలలో ఉండే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మైనారటీ వ్యవహారాల శాఖ మంత్రి మహ్మద్ అజాం ఖాన్ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తన నోటి తీట తీర్చుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బిజనోర్లో ఎన్నిక ప్రచారంలో భాగంగా అజాంఖాన్ మాట్లాడుతూ.... భారతదేశ దివంగత ప్రధాని ఇందిరా గాంధీ ఇద్దరు కుమారులు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, చిన్న కుమారుడు సంజయ్ గాంధీలు... వారి చేసిన పాపాలకు అల్లా ఆగ్రహానికి గురయ్యారని... అందుకే వారి జీవితం విషాదాంతంగా ముగిసిందని వెల్లడించారు. అందుకే రాజీవ్ 1991లో మానవబాంబు దాడిలో మరణించాగా, సంజయ్ 1980లో విమాన ప్రమాదంలో మృతి చెందారని చెప్పారు. ఇందిరా గాంధీ ఎమర్జన్సీ విధించినప్పుడు సంజయ్ గాంధీ అడింది ఆట పాడింది పాటగా సాగిందని... ఆ సమయంలో దేశ యువతకు బలవంతంగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేసిన సంగతిని అజాం ఖాన్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. అలాగే రాజీవ్ గాంధీ చేసిన పనులు కూడా అల్లా ఆగ్రహానికి గురైయ్యారని అజాం ఖాన్ ఆరోపించారు. అందుకే వారు అల్లా ఆగ్రహానికి గురై మరణించారని అజాం ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అజాంఖాన్, అమిషాలు బహిరంగ సభలలో ప్రసంగించ వద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇటీవల కార్గిల్ యుద్దంపై తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేసిన అజాంఖాన్‌పై శనివారం యూపీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
ఔన్నత్యానికి అనుగుణంగా నడచుకుంటేనే అల్లాహ్ అనుగ్రహం
అల్లాహ్ అమిత దయాళువు. ఆయన కరుణ, దయ అపారం. అనంతం. మొత్తం సృష్టిని, సృష్టిలోని సమస్తాన్నీ ఆయన కారుణ్యం పరివేష్టించి ఉంది. ఆయన దయానుగ్రహాలు అనునిత్యం సృష్టిలోని సమస్త జీవ, నిర్జీవ, వస్తు, ప్రాణి, పదార్థాలపై అనంతంగా వర్షిస్తున్నాయి. అందుకే ఈ విశ్వవ్యవస్థ ఎంతో సమతుల్యతతో, ప్రశాంతతతో ప్రణాళికాబద్ధంగా మనుగడ సాగిస్తోంది. ఇంతటి సమగ్ర పథకంతో సర్వాంగ సుంద రంగా తీర్చిదిద్దబడిన ఈ సృష్టివ్యవస్థకు మానవుడు కథానాయకుడు. మానవుడు లేని సృష్టి ఆత్మ లేని దేహం లాంటిది. ఎందుకంటే, అత్యద్భుతమైన, అనుపమానమైన ఈ సృష్టిలో వేనవేల సృష్టిరాశులు, జీవరాశులు వున్నప్పటికీ ఒక్క మానవుడు కనుక లేకపోయినట్లయితే, ఈ సృష్టికి ఒక అర్థం కాని, విలువగాని ఉండేది కాదు. వాస్తవం ఏమిటంటే, దైవం ఈ సృష్టినంతటినీ మానవుడికోసమే సృజించాడంటే అతిశయోక్తి కాదు. ఇతర మరే ప్రాణికీ ప్రాప్తం కానటువంటి ఇంత గొప్ప గౌరవం, ఔన్నత్యం, ఆదరణ ఒక్క మానవుడికే దక్కిందంటే తప్పకుండా అతనిలో ఒక ప్రత్యేకత ఉండి తీరాలి. అదే బుద్ధిబలం. మంచీ చెడుల విచక్షణాజ్ఞానం. అందుకే మానవుడికి ఇంతటి ప్రత్యేకత, ప్రాముఖ్యత. అల్లాహ్ తన అపార కరుణాకటాక్షాలతో మానవుడిపై ఇంతటి దయను, మమతానురాగాలను, కరుణానుగ్రహాలను కురిపిస్తే, మరి మానవుడు కూడా ఆ ప్రత్యేకతను, గౌరవాన్ని కాపాడుకుంటూ, హోదాకు తగినట్లు బాధ్యతగా మసలుకోవాలి. ఒకరకంగా ఇది అతనికి పరీక్ష. దీనిపైనే మానవ శ్రేష్ఠత, జీవన సాఫల్యం ఆధారపడి ఉన్నాయి. నిజానికి కారుణ్యగుణమన్నది అల్లాహ్‌కు మాత్రమే ప్రత్యేకం. కాని ఆయన సృష్టి ప్రారంభం నాడే కారుణ్యాన్ని నూరుభాగాల్లో విభజించి కేవలం ఒకే ఒక్క భాగాన్ని సమస్త సృష్టిపై చిలకరించాడు. ఆ గుణ ప్రభావం కారణంగానే సృష్టిలోని జీవజాలంలో ప్రేమానురాగాలు, దయ, కరుణ కనిపిస్తున్నాయి. క్రూరమృగాలు, విషసర్పాల్లో కూడా మనం ఈ ప్రేమ, కరుణ, దయాగుణాలను గమనించవచ్చు. ఇతర జీవరాసులతో పోల్చుకుంటే మానవుడికి ఉన్నటువంటి ప్రత్యేకత దృష్ట్యా ఈ సుగుణం అతనిలో విశాలంగా, విస్తారంగా ఉండాలి. అందుకే ప్రేమ, దయ, జాలి, కరుణ, సానుభూతి ఉండదో అలాంటివారిని అల్లాహ్ తన ప్రత్యేక కరుణకు దూరంగా ఉంచుతాడని కూడా ప్రవక్త మహనీయులు హెచ్చరించారు. ‘సృష్టి సమస్తం దేవుని కుటుంబం. కనుక మానవులంతా పరస్పర ప్రేమానురాగాలతో, కరుణ, వాత్సల్యాలతో, సహన, సానుభూతులతో వ్యవహరిస్తూ, సృష్టిలోని ఇతర జీవరాశులన్నిటి పట్లా దయతో, ప్రేమతో, బాధ్యతతో మసలుకోండి’ అని ఉపదేశించారు. అంటే అల్లాహ్ తన అపార కరుణతో మానవుడికి ప్రసాదించిన ప్రత్యేకత దృష్ట్యా తనలాంటి ఇతర మానవులందరినీ సమానంగా చూస్తూ, నిర్మల మనసుతో ప్రేమిస్తూ, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ, భువిపై నివసించే అన్ని రకాల జంతుజాలం, పశుపక్ష్యాదుల పట్ల కూడా దయ, కరుణ, సానుభూతి ప్రదర్శించాలి అని అర్థం. కనుక మానవుడు దైవచింతనకు అనుగ్రహించిన స్థాయిని, ప్రత్యేకతను, శ్రేష్టతను కాపాడుకుంటూ దైవోపదేశాలకు, ప్రవక్త హితోపదేశాలకు అనుగుణంగా మనుగడ సాగిస్తే ఇహలోకంతోపాటు పరలోకంలోనూ శాంతి సాఫల్యాలను సొంతం చేసుకోవచ్చు. - యండీ ఉస్మాన్‌ఖాన్